ప్రభుత్వాన్ని విమర్శించిన మరుసటి రోజే జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ పై కేసు..
posted on Oct 10, 2020 @ 7:36PM
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మైనింగ్ విషయంలో తాజాగా ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదని తెలిపారు. మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో జరగాల్సిన మైనింగ్ పనులు అలా జరగడం లేదని.. దీంతో నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఈ రెండు క్వారీల్లో నిబంధనలు ఉల్లంఘన జరిగిందని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీ రమణారావు వ్యాఖ్యానించారు.
అయితే చాలాకాలం తరువాత నిన్న జేసీ దివాకర్ రెడ్డి గనుల కార్యాలయానికి చేరుకుని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొద్దిరోజుల క్రితం వరకు తన సోదరుడిని టార్గెట్ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు తనను టార్గెట్ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జేసీ దివాకర్ రెడ్డి అటు ప్రభుత్వం ఇటు అధికారులపై విమర్శలు చేసిన మరుసటి రోజే... ఆయనకు నోటీసులు జారీ కావడం గమనార్హం.