ఉద్యోగులను పులులుగా మార్చకండి! కేసీఆర్ పై TNGO నేత హాట్ కామెంట్స్
posted on Oct 9, 2020 @ 8:22PM
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు TNGO రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్. తెలంగాణ పాలనలో కుడితిలో పడ్డ ఎలుకల్లా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారిందన్నారు. ఏ ఒక్క ఉద్యోగి ముఖంలో నవ్వు లేదన్నారు మామిండ్ల రాజేందర్. తెలంగాణ వచ్చాక నష్టపోయింది ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పారు. పీఆర్సీ కమిటీ ఉద్యోగుల కాళ్లు కట్టేసిందన్నారు. వరంగల్ లో జరిగిన TNGO సమావేశంలో రాజేందర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులను ఇంట్లో పిల్లుల మాదిరి ఉంచడమే ప్రభుత్వానికి మంచిదని.. పులులను చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలతో నామమాత్ర చర్చలే జరుపుతున్నారని రాజేందర్ తేల్చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు వినతి పత్రాల దగ్గరే ఉంటే.. ఆంధ్రాలో మాత్రం స్పీడుగా జీవో వరకు వెళుతోందన్నారు రాజేందర్.
కండువాల్లేని టీఆరెఎస్ కార్యకర్తలా పని చేశామన్నారు మామిడ్ల రాజేందర్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ పార్టీ కార్యకర్తల్లా ఉద్యోగులు పని చేస్తారని చెప్పారు. జిందాబాద్.. ముర్ధాబద్ అంటే పనులు కావన్న రాజేందర్.. ఆర్టీసి సమ్మె మాదిరి ఆగమాగం చేయబోమని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు చేపించాలని ఉద్యోగులకు సూచించారు. TNGO నాయకునికి టికెట్ అడిగితే తప్పేంటన్నారు. కారం రవీందర్ మరో బాధ్యతలతో మన ముందుకు వస్తారని నమ్మకం ఉందని వరంగల్ ఉద్యోగులతో చెప్పారు మామిండ్ల రాజేందర్.