వేల కోట్లు లూటీ చేసి, చిప్పకూడు తిన్న జగన్ గారిది విజన్ అంటారా.. బుద్ధా ఫైర్
posted on Oct 10, 2020 @ 2:17PM
ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన తీవ్ర విమర్శలతో మొదలైన ఈ ఫైట్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ తో మరింత వేడెక్కింది. ముందుగా విజయసాయిరెడ్డి బాబును టార్గెట్ చేస్తూ.. "రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా? మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడు అదే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు.. తేడా తెలుస్తోందా?" అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
అంతేకాకుండా "పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ దీక్షలకు మరో 300 కోట్ల రూపాయలు ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్ల రూపాయలు. ఏది విజన్ ? ఏది దుబారా?" అని విజయసాయిరెడ్డి చంద్రబాబును నిలదీశారు.
అయితే విజయసాయిరెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. "43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా?" అంటూ ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా "పోలవరం యాత్రకు ధనం వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా? పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల. 70 శాతం చంద్రబాబు గారు పూర్తి చేసారు కాబట్టి, కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారు. మీ లాగా ఢిల్లీ వాళ్లకు 'ఫుట్ మసాజ్' చేయకుండా, రాష్ట్ర సమస్యల పై కేంద్రంతో పోరాడారు. ఖర్చుల్లో తేడా ఉంటే, ఏమి పీక్కుంటావో పీక్కో" అంటూ మండిపడ్డారు.
అసలు "స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి,సాక్స్ లకు కూడా వైకాపా రంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా? అంటూ విజయ్ సాయి రెడ్డిని ఎద్దేవా చేశారు. 4 వేల కోట్ల తో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా? తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు, నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు, సిబిఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతీ వారం 60 లక్షలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్లు, మీ అవినీతి పత్రికకు వందల కోట్లు, మీరు చేసే వేల కోట్ల దందాలు మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని" అన్నారు.
ఇదే అంశం పై స్పందించిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు "పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన జగన్ రెడ్డి రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు. మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు" అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.