తెలంగాణకు బాక్సులు.. ఏపీలో లోకల్ ఫైట్ ఇప్పట్లో లేనట్టే!
posted on Oct 9, 2020 @ 11:34AM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగడం కష్టమే. లోకల్ బాడీ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి తెప్పించిన బ్యాలెట్ బాక్సులు తిరిగి వెళుతున్నాయి. డిసెంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరపాలని భావిస్తున్న తెలంగాణ ఎన్నికల సంఘం.. గతంలో ఏపీకి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులను తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో ఏపీ ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను తెలంగాణకు పంపించేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. బ్యాలెట్ పద్దతిలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల పోలింగ్ కోసం తెలంగాణ నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి 30వేల బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడినా.. బ్యాలెట్ బాక్సులు ఏపీలోనే ఉండిపోయాయి. తెలంగాణ అధికారులు కోరడంతో ఇప్పుడు వాటిని తిరిగి పంపిస్తున్నారు. ఇప్పటికే ఏడు జిల్లాల్లో భద్రపరిచిన 17 వేల 366 బ్యాలెట్ బాక్స్‌లు రిటర్న్ పంపించారు. మిగిలిన 12,366 బ్యాలెట్ బాక్సులను కూడా హైదరాబాద్ పంపించేందుకు ఏపీ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో అన్ని బ్యాలెట్ బాక్సులు పంపించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నిర్వహించే బ్యాలెట్ బాక్సులు.. ఫలితాల తర్వాత కొన్ని నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ఇప్పట్లో బ్యాలెట్ బాక్సులు తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావడం సాధ్యం కాదు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జరపాలంటే బ్యాలెట్ బాక్సులు అవసరం. ఇందుకోసం తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఇంకా ఎన్నికల అధికారులు మొదలు పెట్టలేదు. ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేసినా.. బాక్సులు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీలో నిర్వహించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీహార్ అసెంబ్లీతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు నవంబర్ లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఏపీలోనూ వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్ లో నిర్వహించాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల కోసం తెప్పించిన బ్యాలెట్ బాక్సులను తిరిగి తెలంగాణకు పంపించడంతో.. ప్రభుత్వం భావిస్తున్న డిసెంబర్ లో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహించడం దాదాపు అసాధ్యమని ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే.. ఇతర రాష్ట్రాల నుంచి ఆగమేఘాల మీద బ్యాలెట్ బాక్సులు తెప్పించాల్సి ఉంటుంది. ఏపీ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టర్మ్ వచ్చే ఏప్రిల్ తో ముగియనుంది. అప్పటివరకు ఎన్నికలు జరగపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.