సీనియర్ ఐఏఎస్ కు షాక్.. ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్..!
posted on Oct 15, 2020 @ 6:00PM
ఏపీ ప్రభుత్వం సీనీయర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ ను ఆకస్మాత్తుగా బదిలీ చేసింది. 1987 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం సీసీఎల్‌ఎ కమిషనర్ పదవితో పాటు అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ గా కూడా పని చేస్తున్నారు. అంతేకాకుండా అయన గతంలో ఇంచార్జి సీఎస్ గా కూడా పనిచేశారు. దీంతో ఈయనే నెక్స్ట్ సీఎస్ అన్న ప్రచారం కూడా ఇప్పటి వరకు ఉంది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న పేరున్న ఆయనను తాజాగా ప్రభుత్వం బదిలీ చేస్తూ, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఎడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా కొత్త సీసీఎల్ఏగా 1987 బ్యాచ్ కు చెందిన సీనీయర్ ఐఏఎస్ అధికారి ఆదిత్య నాథ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు నీరబ్ కుమార్ నిర్వహిస్తున్న ఇతర శాఖల బాధ్యతలను కూడా ఆయనకు అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనీయర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యానాథ్ దాస్ ను త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం.. హఠాత్తుగా బుధవారం రాత్రి చేసిన బదిలీలే నిదర్శనం అని అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదిత్యనాథ్ దాస్ అత్యంత కీలకమైన భారీ నీటి పారుదల శాఖ నిర్వహించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఆయనపై ఉన్న అభియోగాలపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. ఈ ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు దీనిపై ఆదిత్యనాథ్ దాస్‌కు నోటీసులు కూడా జారీ చేసింది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని పదవీకాలం ఎప్పుడో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆమెకు ఇప్పటికే రెండు సార్లు పదవీకాలాన్ని పొడిగించారు. అయితే ఆమె పదవీకాలం ఇక కేంద్రం పొడిగించే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని కోరలేదు. దీంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమౌతోంది.