హైదరాబాద్ కు దగ్గరలో తీవ్ర వాయుగుండం.. మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
posted on Oct 14, 2020 @ 12:32PM
నిన్నటి నుండి కురుస్తున్న అతి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది. తాజాగా తీవ్ర వాయుగుండం హైదరాబాద్ కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో వచ్చే 12 గంటలలో ఇది తీవ్ర అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని వాతావరణ శాఖ చెపుతోంది. దీని ప్రభావంతో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి . కొన్ని చోట్ల అపార్ట్మెంట్ సెల్లార్లు నీటితో నిండిపోగా… మరి కొన్ని చోట్ల నాలాలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నిన్న ఒక్క రోజులో 32సెం.మీ వర్షపాతం నమోదవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో.. వరద పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఈరోజు, రేపు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది. తప్పనిసరి సేవలు మినహా అన్ని రకాల కార్యకలాపాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.