మూడో స్థానమొస్తే పార్టీకి మూడినట్టే! హస్తంలో దుబ్బాక టెన్షన్
posted on Oct 15, 2020 @ 3:51PM
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్న హస్తం పార్టీ భవిష్యత్ ను దుబ్బాక బైపోల్ డిసైడ్ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ కొత్త ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ కూడా పార్టీ నేతలకు ఇదే చెప్పారట. అందుకే పీసీసీ, సీఎల్పీ నేతలంతా దుబ్బాక నియోజకవర్గంలోనే మకాం వేశారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దుబ్బాకలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్ గా కాంగ్రెస్ నేతలు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా.. బీజేపీ ఇటీవల దూకుడు పెంచింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది. కేసీఆర్ సర్కార్ పై పోరాటంలోనూ కాంగ్రెస్ కంటే స్పీడుగా ఉన్నారు కమలనాధులు. దుబ్బాక ఉపఎన్నికలోనూ ప్రచారంలో ముందున్నారు. రఘునందన్ రావు. ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. ఎందుకంటే దుబ్బాకలో బీజేపీ గెలిచినా... సెకండ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ కు గండమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది మరింత బలపేతం అయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం కలగానే మిగిలిపోతుందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి తీరాలి. ఒకవేళ ఓడినా కనీసం రెండో స్థానంలోనైనా నిలవాలి.. లేదంటే తమకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచినా తమకు పెద్ద నష్టం ఉండదని హస్తం పార్టీ భావన. ఎందుకంటే కారు పార్టీ గెలిచినా అధికారంతో పాటు సెంటిమెంట్ తో గెలిచిందని చెప్పుకోవచ్చు. అదే తమ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. అందుకే బీజేపీ లక్ష్యంగానే దుబ్బాకలో కాంగ్రెస్ ప్రచారం సాగుతున్నట్లు కనిపిస్తోంది. గెలవడం లేదంటే రెండో స్థానం సాధించడం కోసం హస్తం నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోంది కాంగ్రెస్. గ్రామగ్రామాన ప్రచారంతో హోరెత్తిస్తోంది. నియోజకవర్గంలోని 146 గ్రామాలకు టీపీసీసీలోని 146 మంది ముఖ్యనాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. పీసీసీ నియమించిన విలేజ్ ఇన్‌ఛార్జిలు ఆ గ్రామ పార్టీ నాయకులతో ప్రచారం కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలతో కలిసి వారు బూత్‌ల వారీగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార గడువు ముగిసే వరకు దుబ్బాక నుంచి నేతలెవరు రావొద్దని మాణికం ఠాగూర్ ఆదేశించారని చెబుతున్నారు. గ్రామాల వారీగా ఫలితాలను విశ్లేషించి మంచి ఫలితాలు తెచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారని తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్ నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని చేర్చుకుని దుబ్బాక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ముఖ్యనేతలంతా ప్రచారం చేస్తుండటంతో గెలుపుపై ఆశలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ కనిపిస్తుందని.. ఇదే జోష్ లో ప్రచారం చేస్తే గెలుపు ఖాయమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గెలవకపోయినా బీజేపీ కంటే ముందుండడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా చెబుతున్నారు.