హత్య చేసి డబ్బుల కోసం డ్రామా! ఇంత కిరాతకమా? 

దారుణం.. అమానుషం.. కిరాతకం. మహబూబా బాద్ లో కిడ్నాపై దారుణహత్యకు గురైన బాలుడి ఘటనపై చెప్పడానికి ఈ పదాలు కూడా తక్కువే. డబ్బుల కోసం ఆశపడి అభం శుభం తెలియని తొమ్మిదేండ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన అందరిని కలిచివేస్తోంది. మానవత్వానికి మచ్చగా , పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలుస్తోంది. బాలుడి తండ్రికి తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడటం మరింత ఆందోళన కల్గిస్తోంది. మహబూబాబాద్ ఘటనతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదోనన్న భయాందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.    మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో ఆదివారం అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని కిడ్నాపర్ దారుణంగా హత్య చేశాడని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బాలుడి కిడ్నాప్ జరిగినప్పటి నుంచి మృతదేహం లభ్యంతో పాటు  కిడ్నాపర్ ను పట్టుకున్న వివరాలను ఆయన వివరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో రంజిత్ రెడ్డి పెద్ద కుమారుడు దీక్షిత్ ను మెకానిక్ మందసాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి.. రెండు గంటల్లోనే హత్య చేశాడని తెలిపారు.    నాలుగో తరగతి చదువుతున్న దీక్షిత్ రెడ్డిని తొందరగా డబ్బులు సంపాదించాలన్న దురాశతోనే మందసాగర్ కిడ్నాప్‌ చేశాడని ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. కిడ్నాపర్ తెలిసిన వ్యక్తి కావడం వల్లే బాలుడు పిలవగానే వెళ్లాడని, ముందస్తు ప్రణాళిక ప్రకారం సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచే బాలుడిని తీసుకెళ్లాడని తెలిపారు. దానవయ్య గుట్టకు బాలుడిని తీసుకెళ్లిన మందసాగర్‌కు అతడిని అక్కడ ఉంచడం కష్టంగా మారిందని, దీంతో తనకు పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పవని భావించి, వదిలేసినా బాలుడు తన వివరాలు బయటపెడతాడని భావించి, అతడిని కిడ్నాప్ చేసిన గంట, గంటన్నరలోనే బాలుడిని గొంతునులిమి చంపేశాడని వివరించారు.   తమకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం అతడు ఒక్కడే బాలుడి ఇంటి సమీపంలోకి వచ్చి దీక్షిత్ ను తీసుకెళ్లాడని మదబూబా బాద్ ఎస్పీ తెలిపారు.  మంద సాగర్ కు ఓ బైక్‌ ఉందని, దానికి ఫేక్‌ నంబరు తగిలించి బాలుడిని కిడ్నాప్ చేశాడన్నారు. కిడ్నాప్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా ఒకటి తమకు లభించిందని వివరించారు. ఆదివారం సాయంత్రం  మహబూబాబాద్ శివారులోని గుట్టలపైకి బాలుడిని తీసుకెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత బాలుడిని విడిచి పెట్టేందుకు రూ.45 లక్షలు డిమాండ్ చేశాడని వివరించారు.   బాలుడిని చంపేసిన రెండు రోజుల తర్వాత కూడా డబ్బు కోసం మందసాగర్ ఫోన్లు చేస్తూనే ఉన్నాడని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నామని సాయంత్రంలోపు పూర్తి స్పష్టత వస్తుందని కోటిరెడ్డి అన్నారు. ఈ కేసులో ఇతర నిందితుల గురించి కూడా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత సాయంతోనే తాము నిందితుడిని పట్టుకుననమని ఎస్పీ చెప్పారు. నిందితుడు ఇంటర్నెట్ కాల్స్ చేసినప్పటికీ తాము హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ సాయంతో పట్టుకున్నామని చెప్పారు.    ఆదివారం కిడ్నాపై దారుణ హత్యకు గురైన బాలుడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ కుమారుడు క్షేమంగా వస్తాడని నాలుగు రోజులుగా ఎదురుచూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ బాలుడి కోసం మొత్తం ఆస్తిని ఇవ్వడానికి సిద్ధమైనా చంపేశారంటూ వారు విలపిస్తుండటం అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది.  డబ్బుల కోసం బాలుడిని ఇంత కిరాతకంగా హత్య చేస్తారా అంటూ స్థానికులు బోరుమంటున్నారు. అభం శుభం తెలియని బాలుడిని హత్య చేసిన కిడ్నాపర్లను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడం తో ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోమటిరెడ్డి కోరారు.   ఇక తెలంగాణ‌లో కొత్తగా 1,456 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 1,292 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580 కి చేరింది. కరోనా మరణాల సంఖ్య మొత్తం 1,292 కి చేరింది. ప్రస్తుతం 20,183 యాక్టివ్ కేసులున్నాయి.

ఉచితంగా కరోనా వ్యాక్సిన్! బీహార్ బీజేపీ మేనిఫెస్టో

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజల జీవన విధానమే మారిపోయింది. అన్ని రంగాల్లో సమూల మార్పులు వచ్చాయి. రాజకీయాలపైనా కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది.  పార్టీల మెనిఫెస్టోల్లోనూ ఇప్పుడు కరోనానే కీలకంగా మారుతోంది. ఎన్నికల సమయంలో నేతలు ప్రజలకిచ్చే హామీల్లో వైరస్ చేరిపోయింది. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ.. కరోనానే కీలక అంశంగా ప్రస్తావించింది. తమకు అధికారం ఇస్తే రాష్ట్రంలోని ప్రజలందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపింది. బీజేపీ బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్నే ప్రముఖంగా చెప్పారు. బీహార్‌లో ప్ర‌తి ఒక ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది  మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అన్నారు నిర్మలా సీతారామన్.    ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఇచ్చిన హామీల కంటే అధిక హామీలను గుప్పిస్తూ బీజేపీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఎన్డీఏను రాష్ట్ర ప్రజలు గెలిపించాల‌ని కోరింది. బీహార్‌లో మ‌రో 5 సంవత్సరాల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటార‌ని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాల‌న‌లోనే బీహార్ ఉత్త‌మ రాష్ట్రంగా  అభివృద్ధి చెందుతుంద‌ని చెప్పుకొచ్చారు. బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేయడం, 30 లక్షల మందికి పక్కా ఇళ్లు,  9 తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు వంటి అంశాలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది. తమ ప్రభుత్వ పాలనలో బీహార్లో 15 ఏళ్లలో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారమన్ తెలిపారు.     బీహార్‌లోని 243 శాసనసభ స్థానాలకు ఈ నెల 28న తొలిదశ, నవంబరు 3, 7 తేదీల్లో రెండో, మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను నవంబరు 10న విడుదల చేస్తారు. బీహార్ లో అధికారం కోసం ఎన్డీఏ, యూపీఏ కూటములు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా నితీశ్ కుమార్ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. యూపీఏ విజయం కోసం తేజస్వి యాదవ్ శ్రమిస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ యువ నేత రాహుల్ కూడా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

దీక్షిత్ ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కిడ్నాపర్లు.. ఈజీ మని కోసమే అంటున్న పోలీసులు

మహబూబాబాద్ లో ఐదుగురు రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ కథ విషాదాంతమైంది. కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆ బాలుడిని హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టినట్లుగా తెలుస్తోంది. కేసముద్రం మండలం అన్నారం శివారు ప్రాంతాల్లోని గుట్టలో దీక్షిత్‌‌ను హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసినట్టు పోలీసులు గుర్తించారు.   ఈ కిడ్నాప్.. హత్య కేసును చేధించిన పోలీసులు సంచ‌ల‌న విష‌యాలను వెల్ల‌డించారు. ఐదు రోజుల క్రితం దీక్షిత్ ను మంద సాగ‌ర్ అనే వ్య‌క్తి కిడ్నాప్ చేసిన‌ట్లు తెలిపారు. ఈజీ మ‌నీ కోస‌మే అతడు ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడని, కిడ్నాప్ కు ముందు ప‌లుసార్లు రెక్కీ నిర్వ‌హించిన‌ట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్ల‌డించారు. కిడ్నాప్ అలాగే హ‌త్య చేసింది అంతా ఒక్క‌రేన‌న్న ఎస్పీ‌… కిడ్నాప్ చేసిన గంట‌లోపే ఆ బాలుడిని అతి కిరాత‌కంగా చంపేశాడ‌ని తెలిపారు. శ‌నిగ‌పురం గ్రామానికి చెందిన కిడ్నాప‌ర్ మెకానిక్ గా ప‌నిచేస్తున్నాడ‌ని, డ‌బ్బు మీద అతి ఆశ‌తోనే బాలున్ని కిడ్నాప్ చేసి త‌ళాసుప‌ల్లి ప్రాంతానికి తీసుకెళ్లాడ‌న్నారు. అయితే కేవ‌లం డ‌బ్బుల కోసం మాత్ర‌మే కిడ్నాప్ కు చేసినప్పటికి, ఎక్క‌డ దొరికిపోతాన‌న్న భ‌యంతోనే బాలున్ని హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. అయితే నిందితుడిని ఇంకా విచారిస్తే మ‌రిన్ని వివరాలు తెలిసే అవ‌కాశం ఉందని ఎస్పీ తెలిపారు.

నాయిని నిర్లక్ష్యానికి గురయ్యారా! అనుచరులు ఏమంటున్నారు? 

కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ కెరటం, తెలంగాణ తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి మరణం విషాదం నింపింది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన  మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాయిని మృతిపై పార్టీలకతీతంగా నేతలు సంతాపం చెబుతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసురుకుంటున్నారు. కార్మిక నేతగా కార్మికుల సంక్షేమం కోసం నాయిని చేసిన కృషి, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తు చేసుకుంటూ కన్నీరు కార్చుతున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయిని నర్సింహరెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆరోపణలు ఆయన అనుచరుల నుంచి వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడిన నాయినికి పార్టీలోనే అవమానాలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.    కేసీఆర్ రెండో టర్మ్ ముఖ్యమంత్రి అయ్యాకా నాయిని నర్సింహరెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మొదటి టర్మ్ లో హోంశాఖ మంత్రిగా పనిచేసిన నాయినిని కేబినెట్ నుంచి తప్పించడం తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ కోసం ఎంతో చేసిన నాయినిని కేబినెట్ లోకి తీసుకోకుండా కేసీఆర్ అవమానించారనే ఆరోపణలు అప్పడు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. ఆ తర్వాత నుంచి నాయిని పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని చెబుతున్నారు.  పార్టీలో వరుసగా అవమానాలు జరుగుతూనే  ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు నాయిని ఆసక్తి చూపినా ఏజ్ వంకతో ఇవ్వలేదు. తనకు కాకుంటే అల్లుడికైనా ఇవ్వాలని నాయిని కోరినా కేసీఆర్ పట్టించుకోలేదనే చర్చ టీఆర్ఎస్ లో ఉంది.    అసెంబ్లీ ఎన్నికల్లో నాయినికి టికెట్ ఇవ్వని కేసీఆర్.. ఆయన్ను రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని మండలికి పంపిస్తానని కూడా టీఆర్ఎస్ అధినేత చెప్పినట్లు చెప్పుకున్నారు. కాని రెండేండ్లు కావస్తున్నా నాయినిని రాజ్యసభకు పంపలేదు గులాబీ బాస్. గతంలో మూడు రాజ్యసీట్లను భర్తీ చేసినా నాయినికి ఛాన్స్ ఇవ్వలేదు. కేసీఆర్ తీరుతో చాలా రోజులుగా నాయిని అసంతృప్తిగా ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదని చెబుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంతో పాటు గ్రేటర్ పరిధిలోని తన అనుచరులతో మాత్రమే ఆయన టచ్ లో ఉన్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. గత జూన్ లోనే నాయిని ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తైంది. అయితే రెన్యూవల్ మాత్రం ఇవ్వలేదు. నాయినికి మరోసారి మండలి అవకాశం కూడా ఉండకపోవచ్చనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జరిగింది. నాయిని అల్లుడికి కూడా కష్టమేనని కారు పార్టీ నేతలే చెప్పారు.    తనను కేబినెట్ నుంచి తప్పించినప్పటి నుంచి పార్టీలో అసంతృప్తిగానే ఉంటున్న నాయిని ఇటీవల పరిణామాలతో మరింత నొచ్చుకున్నారని చెబుతున్నారు. తనను రాజ్యసభకు పంపక పోవడం,  అల్లుడికి ఇస్తానన్న ఎమ్మెల్సీ హామీ నెరవేరకపోవడం, తమ పదవులపై కేసీఆర్ ఎటూ తేల్చకపోవడం, ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై మీడియాలో వస్తున్న వార్తలతో నాయిని నర్సింహరెడ్డి అసహనానికి గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక  ఇటీవల మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ చేసినన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఉద్యమంలో ముందున్న నేతలకు అన్యాయం జరుగుతుందని స్వామిగౌడ్ ఆరోపించారు. చాలా కాలంగా నాయిని కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని సార్లు తన అసంతృప్తిని ఓపెన్ గానే బయటపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే ఆయన తీవ్ర నిర్ణయం తీసుకోవచ్చని, టీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా జరిగింది.    తెలంగాణ ఉద్యమంలో ముందున్న నాయిని నర్సింహరెడ్డికి రాష్ట్రం ఏర్పడ్డాకా దక్కాల్సిన గౌరవం దక్కలేదనే ఆరోపణలే అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ కొన్ని ఒడిదిడుకులు ఎదుర్కొంది. పార్టీని నడపలేని పరిస్థితికి కూడా కేసీఆర్ వచ్చారంటారు. అలాంటి సమయంలో నాయిని కేసీఆర్ కు అండగా నిలిచారని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టారని నాయిని అనుచరులు చెబుతున్నారు. వైఎస్సార్ టైమ్ లోనే కొందరు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరారు. కాని నాయిని మాత్రం కేసీఆర్ తోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వైఎస్సార్ నుంచి ఒత్తిడి వచ్చినా, భారీ ఆఫర్లు ఇచ్చినా నాయిని వెళ్లలేదని, కేసీఆర్ తోనే ఉన్నారని చెబుతున్నారు. పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న నాయినిని కేసీఆర్ నిర్లక్ష్యం చేయడం సరికాదనే విమర్శలు టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా వస్తున్నాయి. మొత్తంగా ఉద్యమంలో కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న నాయినికి ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఆయన అనుచరులు తట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

ఊరి కోసం...నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది! సాహో జయలక్ష్మి

పైసా ఖర్చు లేకుండా అమెరికా వెళ్లే అవకాశం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ఎగిరిగంతేస్తారు కదా.. కానీ 17  ఏళ్ల జయలక్ష్మి మాత్రం తనకొచ్చిన అవకాశాన్ని కాదనుకుంది. తన ఊరి కోసం ప్రతిష్టాత్మక నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది. అమెరికా వెళ్లేందుకు అయ్యే డబ్బులను తమ గ్రామ సమస్యల్ని తీర్చడానికే వినియోగించింది. గ్రామ సమ్యసలు పరిష్కరించి  శభాష్ అనిపించుకుని అందరికి ఆదర్శంగా నిలిచింది ఆ పదిహేండ్ల బాలిక.    తమిళనాడులోని ఆదనకోట్టై గ్రామానికి చెందిన జయలక్ష్మి చిన్నప్పటి నుంచే కష్టాలు పడింది. ఆమె చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత తల్లి అళగువల్లి మతి స్థిమితం కోల్పోయింది. తల్లితోపాటు తమ్ముడి బాధ్యతా తీసుకుని తొమ్మిదో ఏట నుంచే కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది జయలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే సెలవు రోజుల్లో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న ఆమె గతేడాది నాసా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొంది. జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించి నాసా పర్యటనకు ఆహ్వానాన్ని అందుకుంది. ఆమె అమెరికా వెళ్లేందుకు అవసరమైన విమాన ఛార్జీలు రూ.1.6 లక్షలు ఇవ్వడానికి ‘స్వర్గా ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ  సిద్ధమయ్యింది.    నాసా సంస్థ ఆహ్వానం వస్తే ఇంకెవరైనా అయితే  ఎంచక్కా అమెరికా వెళ్లొస్తారు కదా. కానీ జయలక్ష్మి మాత్రం తన ఊరి కోసం ఆలోచించింది. ఆ డబ్బుని మా ఊరికోసం ఖర్చు చేయండని ఆ స్వచ్ఛంద సంస్థని కోరింది జయలక్ష్మి. ‘మా ఊళ్లో 125 కుటుంబాలుంటే ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం లేదు. చిన్నప్పట్నుంచి బహిర్భూమికి వెళ్లాలంటే భయం. రాత్రిపూట ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాలి. ఈ సమస్యని పరిష్కరించాలంటే చాలా ఖర్చవుతుందన్నారు. నేను అమెరికా వెళ్లడం కన్నా ఆ డబ్బుతో గ్రామ సమస్యని పరిష్కరించడమే ముఖ్యం అనుకున్నా.. అందుకే . ఆ నగదును మా ఊళ్లో టాయిలెట్ల నిర్మాణానికి అందించమని ఎన్జీవోను కోరానని చెబుతోంది జయలక్ష్మి.    జయలక్ష్మి నిర్ణయాన్ని స్వాగతించిన స్వర్గా ఫౌండేషన్‌.. బాలిక కోరిక మేరకు ఆ డబ్బును గ్రామంలోనే ఖర్చు పెట్టింది. ఊళ్లోని 125 ఇళ్లకూ రూ.20వేలు చొప్పున నగదు సహాయాన్ని అందించింది. ఆ మొత్తంతో యువత సాయం తీసుకుని గ్రామస్తులే సొంతంగా నిర్మాణాలను చేపట్టారు. అలా జులైలో ప్రారంభించిన టాయిలెట్ల నిర్మాణం ఇటీవలే పూర్తయింది.    జయలక్ష్మి  విషయం తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చి ఆమెను అభినందించారు.  జయలక్ష్మి గురించి తెలుసుకున్న మరో ఎన్జీవో సంస్థ ఆమెకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చింది. అమెరికా ప్రయాణానికి అయ్యే ఖర్చులను ఏర్పాటు చేసింది. అయితే కొవిడ్‌ వల్ల వచ్చే ఏడాదికి జయలక్ష్మి  ప్రయాణం వాయిదాపడింది. ఊరి కోసం నాసా ఆహ్వానాన్ని వద్దనుకున్న జయలక్ష్మిపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇక పెద్దయ్యాక కలెక్టరై గ్రామాభివృద్ధికి కృషి చేస్తానంటోంది జయలక్ష్మి. ఊరి అభివృద్ధి కోసం ఎంతో గొప్ప పని చేసిన జయలక్ష్మికి మనమూ హాట్సాప్ చెప్పేద్దాం..

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో అపశృతి.. వాలంటీర్ మృతి..

కరోనా వైసర్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి నుండి ప్రపంచాన్ని బయట పడేయడం కోసం పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తీసుకురావడానికి కాలంతో పోటీ పడుతూ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అస్ట్రాజెనె‌కాతో కలిసి సిద్ధం చేసిన వ్యాక్సిన్ పై ప్రపంచంలోని పలు దేశాలలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే మొదటి, రెండోదశ ట్రయల్స్ లో భాగంగా ఇటీవల బ్రిటన్‌లో ఈ టీకాను తీసుకున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసి మళ్లీ పరీక్షలను ప్రారంభించారు. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఒక అపశృతి చోటుచేసుకుంది. బ్రెజిల్ లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ ఒకరు మృతిచెందాడు.   వ్యాక్సిన్ మొదటి, రెండో దశ పరీక్షల సందర్భగా అనారోగ్యానికి గురై అతను మరణించినట్టుగా బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన డేటా అందిందని.. దీనిపై దర్యాప్తు చేపట్టామని చెప్పింది. అయితే వాలంటీర్ మృతిచెందిన తర్వాత కూడా వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది. బ్రెజిల్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్న ఫెడరల్ యూనివర్సిటీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిచింది. అయితే ట్రయల్స్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి అని తెలిపింది. అయితే చనిపోయిన వాలంటీర్.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మరణించాడా?, లేక మరేదైనా అనారోగ్య కారణలతో మృతిచెందాడా? అనేదానిపై ఇంకా స్ఫష్టత రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ భద్రతపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆక్స్‌ఫర్డ్ తాజాగా స్పష్టం చేసింది.

దేవతకు ఓ న్యాయం.. నేతలకు మరో న్యాయమా?

దుర్గామాత విగ్రహానికి నో పర్మిషన్   పోలీసులే నిమజ్జనం చేసిన వైనం   కరోనాయే కారణమట   మరి మంత్రుల ర్యాలీల మాటేమిటి?   శివమెత్తిన శివస్వామి   కనిపించని కమలం పార్టీ నేతలు   కరోనా నిబంధనలు ఇంకా అమలులోనే ఉన్నాయి. లాక్‌డౌన్ తొలగించినప్పటికీ, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనయితే అమలులోనే ఉంది. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉన్న రూలు. ఆ ప్రకారంగా ఎవరూ పెద్ద సంఖ్యలో గుమికూడకూడదు. ఇది మంత్రులు-ఎమ్మెల్యేలు-రాజకీయ పార్టీల నాయకులకూ వర్తించే సూత్రం. కానీ ఏపీలో అధికార పార్టీ నాయకులెవరూ ఆ నిబంధనలు పాటించడం లేదు. జనంతో జాతరలు, విజయోత్సవాలు చేసుకుంటున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు. అప్పుడు మాత్రం అధికారులకు, కరోనా నిబంధనలు గుర్తుకురావు. కానీ దసరా సందర్భంగా.. గ్రామస్తులు అమ్మవారు విగ్రహం ఏర్పాటుచేసుకుంటే మాత్రం, కరోనా నిబంధనలు-అనుమతులూ గుర్తుకు వస్తాయి. దానితో పోలీసులే రంగంలోకి దిగి, పండుగకు ముందే అమ్మవారి విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తారు. ఇదీ ఆంధ్రాలో కనిపిస్తున్న పక్షపాతం.   దసరా సందర్భంగా కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం, లక్ష్మీపురం గ్రామస్తులు.. దుర్గాదేవి విగ్రహం ఏర్పాటుచేసుకున్నారు. నవరాత్రులు పూజలు నిర్వహించిన తర్వాత, విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఆ మేరకు వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, హటాత్తుగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లి నదిలో నిమజ్జనం చేశారు. దీనితో మనోభావాలు దెబ్బతిన గ్రామస్తులు, ఆందోళన నిర్వహించారు. ఇది తెలిసిన శివస్వామి అక్కడికి వెళ్లి, గ్రామస్తుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.   నిజానికి లక్ష్మీపురం అనే గ్రామంలో, ఇప్పటిదాకా మతకలహాలు జరిగిన ఘటనలు లేవు. అది నందిగామకు దూరంగానే ఉంటుంది. పోనీ ఆ విగ్రహ ఏర్పాటుపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా అంటే, అదీ లేదు. అయినా కరోనా ఉన్నందున, భక్తులు వస్తే ప్రమాదం కాబట్టి, పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించి విగ్రహాన్ని ముందుగానే నిమజ్జనం చేశారు. ఇది విశ్వహిందూపరిషత్, ఇతర హిందూ సంఘాలకు ఆగ్రహం కలిగించింది. ‘మసీదుల్లో గుంపులు గుంపులుగా వెళుతుంటే ఆపడం లేదు. చర్చిలకు గుంపులు గుంపులుగా వెళుతుంటే ఎవరూ ఆపరు. మంత్రుల కార్యక్రమాలకు గుంపులుగా వెళుతుంటే, కరోనా నిబంధనలు గుర్తుకు రావు. కానీ అమ్మవారి విగ్రహ ఏర్పాటులోనే మీకు నిబంధనలు గుర్తుకు వస్తాయా? ఇది అసలు హిందూదేశమేనా? హిందువులంతా ఇంకో దేశంలో ఉన్నారా? దీనికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాల’ని శివస్వామి డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా ఆయన పోలీసులపై కురిపించిన ప్రశ్నల వర్షానికి వారి నుంచి జవాబు లేదు.   రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులపై పక్షపాతం- దేవుళ్లకు-ఆలయాలకు భద్రత లేకుండా పోయిందనడానికి.. చందర్లపాడు ఘటనే నిదర్శనమని, హిందూ మహాసభ ఏపీ చీఫ్ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ విరుచుకుపడ్డారు. ఇదేవిధంగా పోలీసులు చర్చిలు, మసీదుల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించే ధైర్యం ఉందా, అని ఆయన ప్రశ్నించారు. గత 17 నెలల నుంచి రాష్ట్రంలో, దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన నిందితులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. హిందువులపై జరిగే దాడులను, హిందూ మహాసభ చూస్తూ ఊరుకోదని వెలగపూడి హెచ్చరించారు.   సీన్ కట్ చేస్తే... జగన్ సర్కారు, భారీ సంఖ్యలో బీసీ కార్పొరేషన్లు ప్రకటించింది. మంచిదే. దానిపై బీసీలంతా సంతోషం వ్యక్తం చేశారు. తటస్థులు కూడా జగన్ చర్యను అభినందించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, వైసీపీ నాయకులంతా రాష్ట్రంలో దానిని ఒక పండుగలా నిర్వహించారు. వాటికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయి, వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఒకరు కాదు. ఇద్దరు కాదు. డజన్లు, వందల సంఖ్యలో క్యూలు కట్టి, సామాజిక దూరం పాటించకుండా పోటీలు పడి, తోసుకుని వెళ్లి మరీ వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఫొటోలు మీడియాలోనూ దర్శనమిచ్చాయి. ఈ విషయంలో మంత్రులు-ఎమ్మెల్యేలు-అధికార పార్టీ నాయకులే కోవిడ్ నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘించారు. అయినా ఒక్కరిపైనా కేసులు పెట్టిన దాఖలాలు లేవు. చివరకు ముఖ్యమంత్రి జగన్.. విజయవాడ కనకదుర్గ ఆలయంలో, పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడూ, నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూడా మాస్కు లేకుండానే, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు మరి. మాస్కు లేకపోతే, చలాన్లు వేస్తున్న పోలీసుల అత్యుత్సాహం.. అధికార పార్టీ వారి ముందు మాత్రం, ఎందుకో కనిపించడంలేదు మరి!   అధికార పార్టీ నేతలు ... కోవిడ్ నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్న దృశ్యాలు, కళ్లకు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా వాటికి లేని అభ్యంతరాలు-ప్రమాదం, ఒక్క దేవతా విగ్రహాల ఏర్పాటులోనే ఎందుకు కనిపిస్తున్నాయన్నది, హిందూ సంఘాల ప్రశ్న. చందర్లపాడు వద్ద అమ్మవారి విగ్రహం తొలగింపు అంశంపై అంత రాద్ధాంతం జరిగినా, అక్కడికి ఒక్క బీజేపీ నాయకుడు కూడా వెళ్లకపోవడం మరో ఆశ్చర్యం. స్థానికులే చొరవ తీసుకుని, శివస్వామికి సమాచారం ఇచ్చారు. పోనీ తర్వాతయినా ఈ ఘటనపై, బీజేపీ ఆందోళన నిర్వహించిందా అంటే అదీ లేదు.   వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేయాలంటే, బహుశా.. ముందు, సోము వీర్రాజు- విష్ణువర్దన్‌రెడ్డి అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉంది కామోసు. అందుకే టీటీడీ నిధుల మళ్లింపు, బ్యాంకు డిపాజిట్ల వ్యవహారంపై కమలదళాలు మౌనంగా ఉన్నట్లున్నాయి. మంత్రి కొడాలి నాని, బీజేపీని కరోనాతో పోల్చినా గమ్మున కూర్చున్న తమ పార్టీ నాయకత్వం నుంచి, అంతకుమించిన స్పందన ఆశించడం కూడా అత్యాశేన న్నది ఆ పార్టీ వారి అంతరంగం. అయినా.. జగనన్న పాలనలో దేవుళ్లు కూడా.. తాము వైసీపీ నేతలుగా ఎందుకు పుట్టలేదా? అని, చందర్లపాడు ఘటన చూసిన తర్వాత వాపోయే పరిస్థితి. ఓ మై గాడ్!  -మార్తి సుబ్రహ్మణ్యం

తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి కన్నుమూత 

తెలంగాణ తొలి హోం శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత, కార్మిక నాయకుడు నాయిని నర్సింహరెడ్డి నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గతనెల 28న కరోనా సోకడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అయితే అయన కరోనా నుండి కోలుకున్నా కూడా... కరోనా వల్ల ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డ నాయిని అపోలోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలతో పాటు న్యూమోనియా కూడా సోకినట్టు వైద్యులు తేల్చారు. దీంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ... ఆయన ప్రాణాలు దక్కలేదు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు నాయినిని అపోలో ఆసుపత్రిలో పరామర్శించిన సంగతి తెలిసందే. బుధవారం సాయంత్రమే సీఎం కేసీఆర్ నాయినిని ఆసుపత్రిలో పరామర్శించారు. నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

హరీష్ సవాలుకు సంజయ్ జవాబేదీ?

కేసీఆర్‌ను చర్చకు రమ్మన్న అరుణక్క   దుబ్బాక ఉప ఎన్నిక కేంద్రంగా, టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఆ దశ కూడా దాటి సవాళ్ల స్థాయికి చేరింది. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై, ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనిపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ప్రచార సారథి హరీష్ విసిరిన సవాల్ చర్చనీయాంశమయింది.   రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలున్నా, ఒక్కరు కూడా తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని హరీష్ విరుచుకుపడుతున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్‌రూము, రైతుబంధు వంటి పథకాలు.. బీజేపీ పాత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే చూపించాలని, హరీష్‌రావు చేస్తున్న సవాళ్లకు బీజేపీ నుంచి ఎక్కడా సమాధానం వినిపించడం లేదు. తాజాగా కేంద్ర నిధులపై చర్చించేందుకు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను, పాత బస్టాండు వద్దకు రావాలన్న హరీష్ సవాల్ ఆసక్తి రేపుతోంది.   కేంద్రం ఏం ఇవ్వలేదో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తాను చెప్పినది అబద్ధమని రుజువుచేస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న సవాల్, ఎన్నిక ప్రచారంలో సంచలనం సృష్టింస్తోంది. రుజువు చేయకపోతే సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ప్రధానంగా బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో 1600 రూపాయలు కేంద్రమే ఇస్తోందన్న సంజయ్ మాటలపై హరీష్  ఈ సవాల్ విసిరారు. మోదీ సొంత రాష్ట్రంలో 500 రూపాయలు మాత్రమే పించను ఇస్తున్నారని వెల్లడించారు.   అయితే, సంజయ్ నుంచి ఇప్పటివరకూ దానికి సంబంధించి జవాబు రాలేదు. నిజానికి గత కొన్ని నెలల నుంచి ఆయన, కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు ఖర్చు పెట్టడం లేదని ఆరోపించడం ద్వారా, మీడియాను ఆకర్షిస్తున్నారు. తాజాగా హరీష్ సవాల్‌పై జవాబు లేని సంజయ్ స్థానంలో, ఆ పార్టీ జాతీయ నే డి.కె.అరుణ తెరపైకి వచ్చారు. కేంద్ర నిధులపై చర్చించేందుకు, సంజయ్‌తో సీఎంకేసీఆర్ చర్చకు రావాలన్న కొత్త సవాల్ విసిరారు. అంటే, సంజయ్‌ది ...కేసీఆర్ స్థాయి అని చెప్పడం, అరుణక్క ఉద్దేశంలా కనిపిస్తోంది.   దీన్నిబట్టి.. ఈ సవాళ్లన్నీ మీడియా ద్వారా ప్రజలను ఆకట్టుకునేందుకే తప్ప, అసలు ఎవరూ చర్చించేందుకు ముందుకు రానన్నది, మెడ మీద తల ఉన్న ఎవరికయినా స్పష్టమవుతుంది. సంజయ్‌కు హరీష్ సవాల్ చేస్తే.. ఆయన జవాబివ్వకుండా, అరుణక్క సమాధానం ఇవ్వడమే విచిత్రం. పోనీ, చర్చకు వచ్చే ఆలోచన అధ్యక్షుడికి లేకపోతే, కనీసం ఏయే పథకాలకు.. ఎన్ని నిధులిచ్చారన్న జాబితా అయినా విడుదల చేసి ఉంటే బాగుండేది. ప్రధానంగా.. హరీష్‌రావు ప్రస్తావిస్తున్న  అంశానికి సంబంధించిన నిధుల వివరాలను, కేంద్రం ద్వారానే విడుదల చేయించి ఉంటే, హరీష్‌కు గట్టి జవాబు ఇచ్చినట్లయ్యేది.   ఇవేమీ కాకుండా.. కేసీఆర్  తమతో చర్చకు రావాలని  ప్రతిసవాల్ విసరడం ద్వారా.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంగానే జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే, సంజయ్ తన వ ద్ద ఉన్న సమాచారాన్ని చర్చలో బయటపెట్టడం ద్వారా, టీఆర్‌ఎస్‌ను ఇరికించే అశకాశం కోల్పోయారు. నిజంగా హరీష్ ఆరోపణ అబద్ధమని సంజయ్ దుబ్బాకలో నిరూపించి ఉంటే, అది బీజేపీ అభ్యర్ధి విజయానికి సైతం దోహదపడి ఉండేదని బీజేపీ వర్గాలు అభిప్రాయపడతున్నాయి.   రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య.. చర్చల సవాళ్ల పేరిట, ఇలాంటి కామెడీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ అవి ఎప్పుడూ జరగవన్నది అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో కొత్తపల్లి సుబ్బారాయుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, విద్యుత్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్యకు సవాల్ విసిరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్ చేశారు. అందుకు రోశయ్య కూడా సై అన్నారు. ఈ సవాళ్ల వార్తలు పత్రికల్లో రావడంతో, బాబు .. మంత్రి సుబ్బారాయుడును పిలిపించి, రోశయ్యతో పెట్టుకోవద్దని మందలించారు. దానితో ఆ సవాళ్ల చర్చలకు తెరపడింది. ఆ తర్వాత తలసాని శ్రీనివాసయదవ్ కూడా, అప్పటి కాంగ్రెస్ నేత దివంగత పిజెఆర్‌పై సవాల్ విసిరారు. కానీ పిజెఆర్ అక్కడికి రాలేదు. కాబట్టి.. ఈ సవాళ్లు- ప్రతి సవాళ్లన్నీ పత్రికల్లో చదవడానికీ, టీవీల్లో చూడ్డానికే బాగుంటాయి.  -మార్తి సుబ్రహ్మణ్యం

ఆయన చీర అమ్మకు ఇష్టం లేదా? కొండచరియల సంకేతం అదేనా? 

విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సీఎం వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మకు జగన్ పట్టు వస్త్రాలు సమర్పించడంపై కొన్ని హిందూ సంఘాలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్రిస్టియన్ అయిన జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మంచిది కాదని కొందరు స్వామిజీలు కూడా హెచ్చరించారు. అయినా  అవేమి పట్టించుకోకుండా ఇంద్రకీలాద్రికి వెళ్లాలని జగన్ నిర్ణయించారు. సీఎం కోసం దుర్గగుడి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం జగన్ కొండపైకి మరో అర గంటలో వస్తారనగా.. ఒక్కసారిగా కొండపై నుంచి కొండ చరియలు విరిగిపడటం ఇప్పుడు చర్చగా మారింది.    సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి రావడానికి కొన్ని నిమిషాల ముందు కొండ చరియలు విరిగిపడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రజల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుంచి బెజవాడ దుర్గమ్మ భక్తులు భయపడుతున్నట్లే జరిగిందా? ఇంద్రకీలాద్రిపై సాంప్రదాయాలకు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయా? జగన్ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆ అమ్మకు కూడా ఇష్టం లేదా? అన్న ప్రచారం  మొదలైంది.  విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనాల్లో ఇప్పుడు దీనిపైనే  చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.   జగన్ వస్తారనగా కొండ చరియలు విరిగిపడటం వైసీపీని కలవరానికి గురి చేసింది. మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రతినిధులు కొండపై  కంగారు పడుతూ కనిపించారు. విరిగిపడిన కొండ చరియలను తొలగించడంతో పాటు సీఎం జగన్ రాక ఏర్పాట్లలో హడావుడి చేశారు. ఇక జగన్ దుర్గగుడి పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూసిన వైసీపీ నేతలను ఈ ఘటన నిరాశకు గురి చేసింది. మరోవైపు జగన్ ఇంద్రకీలాద్రికి రావడం దుర్గమ్మకు ఇష్టం లేదోమోనని కొందరు భక్తులు లేవనెత్తుతున్న అనుమానాలు ప్రజల్లోకి వెళితే మరిన్ని ఇబ్బందులు వస్తాయని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. అందుకే కొండ చరియలు విరిగిపడిన ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారు. వర్షాకాలంలో ఇలాంటివి మామూలేనని, తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు.    ప్రమాదాన్ని చిన్నది చూపే ప్రయత్నాల్లో భాగంగానే స్పాట్ దగ్గరకు ఎవరిని వెళ్లనీయలేదని చెబుతున్నారు.  పెద్ద బండరాళ్లు పడిపోవడంతో చాలా మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కనపడుతోంది. కొండచరియలు విరిగిపడటంపై మీడియా ప్రతినిధులు హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోకుండా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ఆస్కారముందని దుర్గ గుడి అధికారులను మీడియా ప్రతినిధులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం దసరా తర్వాత చూస్తామని నిర్లక్ష్యంగా బదులిచ్చినట్లు సమాచారం.

చెరువులు తెగొచ్చు.. బీ రెడీ! కేసీఆర్ గ్రేటర్ అలర్ట్ 

కుండపోత వానలు, వరదలతో వణికిపోతున్న హైదరాబాద్ ఇంకా ముంపు గండం నుంచి బయటపడలేదు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ప్రభుత్వంతో పాటు నగర ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని చెరువులకు గండ్లు పడవచ్చని, తెగే అవకాశం ఉందన్న ప్రచారం  మరింత భయపెడుతోంది.  వర్షాలు, వరదల పై సమీక్ష నిర్వహించిన  సీఎం కేసీఆర్ కూడా అధికారులను చెరువులపై అలర్ట్ చేశారు. దీంతో ముంపు భయంతో లోతట్టు ప్రాంత ప్రజలు, బస్తీవాసులు, మూసి పరివాహక జనాలు, చెరువులకు కింది భాగంలో  ఉన్న కాలనీ ప్రజలు  బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు  ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో నరకం అనుభవిస్తున్నారు.    హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని అధికారుల సమావేశంలో కేసీఆర్  చెప్పారు. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని, హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలోని చెరువుల ద్వారా కూడా చాలా నీరు వచ్చి చేరడంతో నగరంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ఇప్పటికే నిండుగా ఉన్న చెరువుల్లోకి మరింత వరద వస్తే.. వాటికి  గండి పడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలున్నాయని  అధికారులను అలర్ట్ చేశారు సీఎం కేసీఆర్. నగర పరిధిలోని చెరువులకు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ను  సీఎం కేసీఆర్ ఆదేశించారు.    ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందన్న సీఎం.. అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ సూచనలతో నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో  15 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చెరువుల కట్టలు తెగే లేదా గండ్లు పడే అవకాశం ఉన్న చోట వెంటనే మరమ్మత్తులు చేయడానికి ఈ బృందాలను రెడీగా ఉంచుతున్నారు. వరద నీటి ముంపు ప్రమాదమున్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక  బృందాలను ఉపయోగించనున్నారు.    ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హైదరాబాదీలు క్షణమెక యుగంలా గడుపుతున్నారు. ఆకాశంలో మేఘాలు కనిపించినా, కారు మబ్బులు ఉన్నా ఉలిక్కిపడుతున్నారు. తుఫానులు, వాయుగుండాలు వచ్చిన సమయంలో సముద్ర తీర వాసులు తమను కాపాడాలని గంగమ్మకు పూజలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి సీన్లు హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. వరుణుడా ఇక శాంతించు అంటూ సిటీ జనాలు  ప్రార్ధనలు చేస్తున్నారు. కాపాడు తల్లి అంటూ అమ్మవార్లను మొక్కుతున్నారు.

వైద్యశాఖను వదలరా! వైసీపీ నేతల తీరుతో జనాల్లో ఆందోళన

వైద్య వృత్తిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. డాక్టర్లను దేవుళ్లుగా కొలుస్తుంటారు. అలాంటి వైద్య వృత్తిలో చీడ పరుగులు చేరితే సమాజానికే అనర్థం. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు వైద్యశాఖకు కళంకం తెచ్చే పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అన్ని రంగాలు, శాఖలను భ్రష్టు పట్టించిన వైసీపీ నేతలు.. పవిత్రంగా భావించే వైద్యశాఖను వదలడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    పీజీ వైద్య పరీక్షలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు బ్లూటూత్ తో కాపీయింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా.. ఆ విద్యార్థిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకురావడం కలకలం రేపుతోంది. విద్యార్థి కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని.. అధికార పార్టీ నేతల కోసం హెల్త్ వర్శిటీ ఉన్నతాధికారులు హెచ్చరించడం, ఎమ్మెల్యే కొడుక్కి క్లీన్ చిట్ ఇవ్వాలని ఆదేశించడం ఆందోళన కల్గిస్తోంది. వైసీపీ నేతల తీరు, వర్శిటీ అధికారుల చర్యలపై వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.    గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో హెల్త్‌ వర్సిటీ గతనెలలో మెడికల్‌ పీజీ వార్షిక పరీక్షలు నిర్వహించింది. సెప్టెంబరు 24న జరిగిన పరీక్షలో ఓ విద్యార్థి దర్జాగా చెవిలో బ్లూటూత్‌ పెట్టుకొని సమాధానాలు వింటూ పరీక్ష రాస్తున్నాడు. వర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్‌ ఆ విద్యార్థిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, జవాబు పత్రాలు తీసుకొన్నారు. కాపీయింగ్‌ చేస్తున్నట్లు కేసు బుక్‌ చేశారు. అదేరోజు హెల్త్‌ వర్సిటీకి ఈ-మెయిల్‌లో సమాచారం ఇచ్చారు.సాధారణంగా ఇలాంటివి జరిగితే ఆ విద్యార్థిని మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తారు. కానీ పట్టుబడిన విద్యార్థి గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుత్రరత్నం కావడంతో హెల్త్‌ వర్సిటీకి ఫోన్ల మీద ఫోన్లు వెళ్లాయి. ఆ మెడికల్‌ కళాశాల యాజమాన్యంపై వర్సిటీ ఉన్నతాధికారి కూడా ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వరే‌ పట్టుకున్నారని... విద్యార్థి బ్లూటూత్‌ పెట్టుకున్న వైనం అంతా సీసీ టీవీలో రికార్డయిందని   యాజమాన్యం చెప్పినా సదరు అధికారి శాంతించలేదు. వైసీపీ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లకు లొంగిపోయిన వర్సిటీ ఉన్నతాధికారులు కాపీయింగ్‌ చేసిన విద్యార్థికి  క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.     ఎమ్మెల్యే కొడుకు మాస్ కాపీయింగ్ ఘటన వివాదాస్పదం కావడంతో హెల్త్ వర్శిటీ వీసీ నలుగురితో కమిటి వేశారు. ఆ కమిటి ఈ నెల 22న సదరు విద్యార్థిని  విచారించనుంది. అయితే ఆ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడలేదని, క్లీన్‌చిట్‌ ఇవ్వాలని కమిటీ సభ్యులు అందరికీ ముందుగానే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. విద్యార్థిని పట్టుకున్న మహిళా వైద్యురాలు సిద్ధార్థ కళాశాలకు చెందిన ఆప్తమాలజిస్ట్‌. ఆమె భర్త వర్సిటీ రిజిస్ర్టార్‌గా పని చేస్తున్నారు. స్వయంగా వర్సిటీ అబ్జర్వర్‌ పట్టుకున్న కేసును నీరుగార్చి కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థికి క్లీన్‌చిట్‌ ఇస్తే భవిష్యత్తులో ఇది ఎటువంటి చెడు సంప్రదాయాలకు తెర తీస్తుందో అని వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.    వైద్యశాఖను భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల తీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాస్ కాపీయింగ్ తో పాసై డాక్టర్లుగా వైద్య వృత్తిలోకి వస్తే సమాజానికే నష్టమని చెబుతున్నారు. అయినా వైద్య పరీక్షలో కాపీయింగ్ చేసిన వ్యక్తిని శిక్షించాలని కోరకుండా.. క్లీన్ చిట్ ఇవ్వాలని  కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో మళ్లీ జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే వైద్యశాఖ ప్రతిష్టకే భంగం కలిగే అవకాశం ఉందని, ఇది తీవ్ర పరిమాణాలకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. చిల్లర పనులకు దిగుతున్న వైసీపీ నేతలపై ఆ పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

నిమ్మగడ్డ పిటిషన్‌ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఈసీకి సహకరించాలని ప్రభుత్వానికి సూచన

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది.   స్ధానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది.    విచారణలో ఎన్నికల సంఘం వాదనలు తప్పుబట్టిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. ఇప్పటికే 39 లక్షల నిధులకు ప్రభుత్వం విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు. ఇక, ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరగా.. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం సంప్రదించలేదని అన్నారు. అయితే, ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం సంప్రదించాలన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యలను.. హైకోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా? అని ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ ను ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

'ఏసయ్యా మరియ తనయా..' అని పాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది

ఏ ప్రభుత్వమైనా కేవలం ఒక మతాన్ని ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఒక మతాన్ని పోత్సహిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ తరహా ట్రెండ్ ను పునాది దశలోనే అరికట్టకపోతే హిందువులకు కష్టాలు తప్పవని పేర్కొన్నారు. క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోకపోతే.. హిందూ ధర్మానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.    రామరాజ్యాన్ని క్రైస్తవ రాజ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మనం గుళ్లలో ఉదయాన్నే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన "కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే" అని సుప్రభాతం వింటుంటాం. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ను అరికట్టకపోతే.. "ఏసయ్యా మరియ తనయా పూర్వా సంధ్యా ప్రవర్తతే" అని పాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.   అన్ని మతాలను గౌరవించాల్సిందే.. అందులో తప్పేంలేదు. కానీ, ఒక మతాన్నే ప్రభుత్వ సొమ్ముతో ప్రోత్సహిస్తుండడం బాధాకరమన్నారు. హిందూ స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. "మన డబ్బులు పాస్టర్లకు ఇస్తున్నారు, మన డబ్బులతో చర్చిలు నిర్మిస్తున్నారు. రాజ్యాంగంలో పరమత సహనం ఉండాలని చెప్పారు. ఒక మతాన్నే ప్రోత్సహించడం సబబు కాదు. దీన్ని అందరూ ఖండించాలి" అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

సీఎం పర్యటనకు ముందు ప్రమాదం.. ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు

విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.    గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలకు బాగా నానిపోవడంతో మట్టి కరిగిపోయి పెద్ద బండరాళ్లు, మట్టి కిందికి పడ్డాయి. సీఎం జగన్ ఈ సాయంత్రం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా, దానికి కొన్ని గంటల ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టు సమాచారం.   కాగా, ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కనపడుతోంది. కొండచరియలు విరిగిపడటంపై మీడియా ప్రతినిధులు హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోకుండా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టినట్లు తెలుస్తోంది. సీఎం రాక కోసం మీడియా ప్రతినిధులు ఎదురు చూస్తున్న సమయంలో.. మీడియా పాయింట్ కు సమీపంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. అంతకుముందే, కొండ సగానికి సగం బీటలు వేసింది, ప్రమాదానికి ఆస్కారముందని దుర్గ గుడి అధికారులను మీడియా ప్రతినిధులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం దసరా తర్వాత చూస్తామని నిర్లక్ష్యంగా బదులిచ్చినట్లు సమాచారం. 

సీఎం జగన్‌ కేసుల విచారణ మళ్లీ వాయిదా

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉన్నారు. దానికితోడు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు.    ఇక, మెట్రోపాలిటన్‌ సెషన్‌ జడ్జి పరిధిలో ఉన్న ఈడీ కేసుపై విచారణ నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. కాగా, జగన్‌ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈ కేసును కూడా బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆ పిటిషన్ పై విచారణ నవంబరు 5 కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు.

జగన్‌ సర్కారుపై నిమ్మగడ్డ మరో పోరు.. హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్‌ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదని, ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్‌ కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని అన్నారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను చేర్చారు.   కాగా, జగన్ సర్కార్ కి నిమ్మగడ్డకి నడుమ పెద్ద యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేయగా.. జగన్ సర్కార్ ఆయనపై విమర్శలు చేసింది. అంతేకాదు, ఓ ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఏకంగా ఆయనను పదవి నుంచి తొలగించింది. అయితే, నిమ్మగడ్డ న్యాయపోరాటం చేసి గెలిచి మళ్ళీ పదవి చేపట్టారు. అయితే, ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.   ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోకి రావడంతో.. వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన విజ్ఞప్తిని రాష్ట ప్రభుత్వం పట్టించుకోలేదని తెలుస్తోంది. దీన్ని హైకోర్టులో సవాలు చేస్తూ నిమ్మగడ్డ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్‌ కు ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.   కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తే.. ఆయనపై విమర్శలు చేసి, ఆయనను పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు తీరా కరోనా అదుపులోకి వచ్చాక ఎన్నికలు నిర్వహిస్తామంటే సహకరించకపోవడం ఏంటని.. ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

దుబ్బాకలో బీజేపీ తరఫున పవన్‌ ప్రచారం!!

దుబ్బాక ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు సైతం తమ పార్టీకి చెందిన అభ్యర్థి కోసం దుబ్బాకలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఉపఎన్నిక ప్రచారపర్వంలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిగబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   బీజేపీకి జనసేన మిత్రపక్షం అన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని వార్తలొస్తున్నాయి. పవన్ ప్రచారం చేస్తే యువత ఓట్లు పడతాయని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ పెద్దలు ఇప్పటికే పవన్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే, పవన్ ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్చువల్ గా ప్రచారం నిర్వహించే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ పవన్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొని ఉపఎన్నిక ఫలితం బీజేపీకి అనుకూలంగా రాకపోతే అనవసరంగా విమర్శల పాలయ్యే అవకాశముంది. అందుకే పవన్ దుబ్బాకలో ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోవచ్చునని అంటున్నారు.