విలవిలలాడిన విశ్వనగరం! కేసీఆర్ పాలనకు సాక్ష్యం?
posted on Oct 14, 2020 @ 2:15PM
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గొప్పగా చెబుతున్న విశ్వనగరం విలవిలలాడింది. భారీ వర్షానికి అల్లాడి పోయింది. సిటీలో గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైంది.. రహదారి సాగరమైంది. హైదరాబాద్ నగరం కనివిని ఎరుగని జల విలయాన్ని చూసింది. భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. భారీ వర్షానికి బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్లు సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.
నగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణగుట్ట బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో ఓ వెంచర్ ప్రహరీ కూలి.. ఇళ్లపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పాతబస్తీలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతన్ని ఎవరూ రక్షించలేని పరిస్థితి నెలకొంది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోయాయి. పాతబస్తీలో పరిస్థితి దారుణంగా ఉంది. వందలాది మంది వరద నీటిలోనే ఉన్నారు. బిల్టింగులపైకి చేరి సాయం చేయాలని, రక్షించాలని కేకలు పెట్టారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. వరద ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో హెలికాప్టర్లను ఉపయోగించారు. పాతబస్తీలో సహాచర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ కు తోడుగా సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాల్సి వచ్చింది.
హైదరాబాద్ మహానగరంలో మధ్యాహ్నమే కారు చీకట్లు కమ్ముకున్నాయి. సగం నగరం అంధకారంలో మునిగిపోయింది. గ్రేటర్ పరిధిలో 800 ఫీడర్లు ఉండగా దాదాపు 400 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.ప్రతిచోటా గంటల కొద్దీ సరఫరా నిలిచిపోయింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తుండడం, వర్షం తగ్గకపోవడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రంతా కరెంట్ లేక నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని జనాలు చెబుతున్నారు.
వరద ఉధృతికి పలు జాతీయ రహదార్లు స్తంభించిపోయాయి. హైదరాబాద్-విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. పలు కార్లు నీట మునిగాయి. రోడ్డుకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడం, వరద తీవ్రత మధ్య వాహనదారులకు ఇళ్లకు చేరడం కష్టమైంది. భారీ వర్షం, వరదతో నగరం జనం నరకం చూశారు.
హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌లా తయారు చేస్తాం.. పాతబస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 ఫిబ్రవరిలో ప్రకటించారు. .ఇప్పుడు కూడా సమయం వచ్చినప్పుడల్లా గ్రేటర్ ను ఎంతో అభివృద్ధి చేస్తామని చెబుతుంటారు కేసీఆర్. ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 60 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అయితే భారీ వర్షానికి హైదరాబాద్ లో పరిస్థితి చూస్తే.. నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయింది. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.
హైదరాబాద్ నగరంలో పరిస్థితికి ప్రధాన కారణం నాళాలు, నగర శివారులో ఉన్న చెరువులు కబ్జాకు గురికావడమే. చెరువులు కబ్జా కావడంతో వాటి కట్టలు తెగి వరద నీరు ప్రవహిస్తోంది. నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరదంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్ల వెంట నీళ్ల వెళ్లడానికే ఏర్పాట్లు లేకపోవడంతో ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. డ్రైనేజీలను పట్టించుకునే వారే లేకపోవడంతో అవన్ని వరదతో పొంగి ప్రవహించాయి. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలేవి బల్దియా తీసుకోకపోవడంతో సిటీ జనాలకు శాపంగా మారింది. రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలన్ని ఏకమయ్యాయి. కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో ఊహించుకోవచ్చు.
ఆరేండ్లలో60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ డబ్బులతో హైదరాబాద్ లో ఏం చేశారో ఎవరికి అర్ధం కావడం లేదు. ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ నిర్మించారో చెప్పాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. వరద నీరు పోయే నాలాలు విస్తరించలేదు, కొత్త కాల్వలకు గతి లేదు.. రోడ్లన్ని గుంతలుగానే ఉన్నాయి. మరి 60వేల కోట్లతో ఏం చేశారనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. డల్లాస్ , ఇస్తాంబుల్ చేయడం కాదు ముందు వరద నీరు పోయే మార్గాలు చూడాలని సీఎం కేసీఆర్ పై ఫైరవుతున్నారు ప్రజలు.
ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని, ఇస్తాంబుల్లా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఐదేండ్ల కింద ప్రకటించింది. కానీ అడుగు కూడా ముందుకు పడలేదు. ఇరుకైన రోడ్లు, చెత్తతో నిండిన మురికివాడలు, డ్రైనేజీలను తలపించే బస్తీలు కనిపిస్తున్నాయి. రాజసౌధాలు, వారసత్వ సంపదగా ఉన్న మసీదులు, కట్టడాలను 150కి పైగా గుర్తించిన ఇస్తాంబుల్ ప్రభుత్వం.. వాటిని రక్షించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించింది. కానీ మన నగరంలో 200కు పైగా ఉన్న కట్టడాలు, కోటలు, మసీదులు, దేవాలయాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. నాలాల్లో పూడికతీత కూడా తీయకపోవడంతో వర్షానికి వరద నీరు పోయే మార్గం లేక.. ఆ వరదంతా కాలనీలను, ఇండ్లను ముంచెత్తింది. ఓల్ట్ సిటీలోని కొన్ని కాలనీల్లోని జనం రాత్రంగా ఇండ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని మండిపడుతున్నాయి. విశ్వనగరం చేస్తామంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. డల్లాస్ చేస్తామంటూ సిటిని ఖల్లాస్ చేశారని ఫైరవుతున్నారు. ఇస్తాంబులే చేస్తామన్న పాతబస్తీని సముద్రంలా మార్చారని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా కేసీఆర్ గొప్పలు కట్టిపెట్టి గ్రేటర్ పై ఫోకస్ చేయాలని సిటీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే చాలని, లండన్, డల్లాస్ , ఇస్తాంబుల్ సిటీ తరహా సౌకర్యాలు తమకు అవసరం లేదని చెబుతున్నారు.