ఏపీ హైకోర్టు మునిగింది.. సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారుల హల్చల్
posted on Oct 15, 2020 @ 11:32AM
ఏపీలో రాజధాని అమరావతిని వీలైనంతగా బదనాం చేసే పని వైసీపీ అధికారంలోకి రాకముందు నుండే మొదలు పెట్టింది. అది అమరావతి కాదు భ్రమరావతి అని ఒకసారి.. అది కేవలం ఒక కులం వారు ఉండే ప్రాంతమని మరోసారి చేసిన సంగతి తెల్సిందే. ఇపుడు మూడు రాజధానుల జపం చేస్తున్న జగన్ సర్కార్ ఆలోచనలకు తగ్గట్టుగా ఇప్పటికీ అమరావతి పై దాడి జరుగుతూనే ఉంది.
తాజాగా వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతిలోని హైకోర్టు చుట్టూ నీళ్లు చేరుతున్నట్లు, ఇక లాయర్లు పడవల్లో వెళ్తున్నట్లుగా ఓ భ్రమ సృష్టించారు. దీంతో హైకోర్టు మునిగిపోయింది, లాయర్లు పడవల్లో పోతున్నారంటూ దానికి ఒక వ్యాఖ్య కూడా జత చేసారు. దీంతో హైకోర్టు చుట్టూ నీళ్లు చేరాయంటూ వైసీపీ అనుకూల మీడియా కూడా హల్‌చల్ చేసింది. అయితే ఇది తప్పుడు ప్రచారమే అని తేలింది. అయితే వాస్తవానికి అక్కడ రోడ్ల నిర్మాణంలో భాగంగా తవ్విన మట్టిని రోడ్డుకు అటూ ఇటూ వేయడంతో... వర్షపు నీరు పోవడానికి దారిలేక కేవలం ఒకే ఒక్కచోట 50 మీటర్ల మేర నీరు నిలిచింది. పక్కనున్న మట్టికట్టకు చిన్న గండి కొడితే... ఐదు నిమిషాల్లో ఆ నీరంతా వెళ్లిపోతుంది. కానీ... వైసీపీ మద్దతుదారులు ఏకంగా హైకోర్టునే ముంచేశారు! అయితే తాజాగా ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ అమరావతి రైతులు సోషల్ మీడియాలో ఒరిజినల్ చిత్రాలతో పోస్టులు పెట్టారు. దీంతో వైసిపి మద్దతుదారులు సోషల్ మీడియాలో చేసిన ఈ మాయాజాలం చూసి అందరు అవాక్కవుతున్నారు
అంతేకాకుండా ఒకవైపు అమరావతిని పూర్తిగా డైల్యూట్ చేసేసి.. వైజాగ్ షిఫ్ట్ అయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకున్న సర్కార్.. కేవలం కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుత రాజధానిపై ఇంకా బురద చల్లాలని చూస్తుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఇలా ఉండగా ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సైతం.. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరు మునిగిపోయిన ఫోటో పెట్టి.. అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే దానికి కౌంటర్ పడిపోయింది. ఆ ఫోటో గోదావరి జిల్లాదని ఆధారాలతో సహా టీడీపీ వాళ్లు పెట్టేశారు.