జగన్ లేఖపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్!
posted on Oct 14, 2020 @ 5:18PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది.
హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో ఆ పార్టీ నేతలు న్యాయమూర్తులపైనా, న్యాయవ్యవస్థపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే ఏకంగా పార్లమెంట్ లో న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇంకో అడుగు ముందుకేసి.. ఏపీ హైకోర్టును జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సీజేఐకి లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మీడియా ముఖంగా వెల్లడించి సంచలనం రేపారు. అయితే, జగన్ లేఖను ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తప్పపట్టింది. న్యాయవ్యవస్థపై పెత్తనం చెలాయించే ప్రయత్నంలో భాగంగానే కాబోయే సీజేఐ స్థానంలో ఉన్న జస్టిస్ రమణపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
జగన్ లేఖను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, జగన్ చర్యలు న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మండిపడింది. జస్టిస్ రమణ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని.. ఎలాంటి ఆధారాలు లేకుండా న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. కోర్టుల స్వతంత్రతను దెబ్బదీసేలా జగన్ వ్యవహరించారని, న్యాయ వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టుగా తాము భావిస్తున్నామని తెలిపింది. ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడటం అత్యంత దారుణమని మండిపడింది. ఇది కచ్చితంగా కోర్టును ధిక్కరించడం కిందికే వస్తుంది. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న అపార నమ్మకాన్ని దెబ్బతీసే ఈ దుష్ట ప్రయత్నాన్ని ఢిల్లీ కోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది అని పేర్కొంది.
న్యాయమూర్తులపైనా, న్యాయవ్యవస్థపైనా బహిరంగ విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా దూకుడు తగ్గిస్తారో లేక అధికారంలో ఉన్న మమ్మల్ని ఆపే హక్కు ఎవరికీ లేదంటూ ఇలాగే దూకుడుగా వెళ్తూ ముందు ముందు పెద్ద సమస్యలు కొని తెచ్చుకుంటారో చూడాలి.