సోషల్ మీడియాతో కారు షేక్! హరీష్ కు టెన్షన్

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. 10 రోజుల్లో ప్రచారం ముగియనుండటంటతో పార్టీలన్ని ఓటర్ల ప్రసన్నం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో అభ్యర్థులే ఎక్కువ ఇంటింటి ప్రచారం చేసేవారు. ముఖ్యనేతలు సభలు, ర్యాలీల్లో పాల్గొనేవారు. కాని దుబ్బాకలో మాత్రం అన్ని పార్టీల ముఖ్యనేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. నేతల ప్రచారం కంటే సోషల్ మీడియా క్యాంపెయిన్ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం దాదాపుగా ప్రతి ఇంటిలో స్మార్ట్ ఫోన్లు ఉండటంతో డిజిటల్ ప్రచారం కీలకంగా మారింది. వాట్సాప్ గ్రూపులతో పాటు ఫేస్ బుక్ ద్వారా సమాచారం  నిమిషాల్లోనే జనాలకు చేరుతుండటంతో పార్టీలు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయి. ఆన్ లైన్ ప్రచారం కోసం సిబ్బందిని కూడా నియమించుకున్నాయి. కొన్ని పార్టీలు సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.     సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారం ప్రజల్లోకి ఈజీగా వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ తరహా ప్రచారంలో బీజేపీ ముందు నుంచి యాక్టివ్ గా ఉంది. రోజురోజుకు అది మరింత బలపడుతోంది. దుబ్బాక నియోజకవర్గ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, గత అరేండ్లలో జరిగిన అభివృద్ధి పనులు, నిధులపై బీజేపీ చేస్తున్న ప్రచారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళుతుందని, అది తమకు నష్టం కల్గించే అవకాశం ఉందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే మంత్రి హరీష్ రావే ప్రెస్ మీట్ పెట్టి మరీ సోషల్ మీడియాలో తమ పార్టీ, ప్రభుత్వంపై ఫేక్ పోస్టింగులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదంటూ మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని హరీష్ రావు హెచ్చరించారంటే.. దుబ్బాక ఉప ఎన్నికలో సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ఊహించవచ్చు.   సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించడమే కాదు తమ పార్టీ డిజిటల్ వింగ్ ను బలపేతం చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ ఆన్ లైన్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలింగ్ తేదీ వరకు యాక్టివ్ గా ఉండాలని, ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని జనాలకు చేరవేయాలని సూచించారు. అంతేకాదు టీఆర్ఎస్, కేసీఆర్ సర్కార్ పై ఇతర పార్టీలు చేస్తున్న అసత్య వార్తలకు ఎప్పటికప్పుడు కౌంటరివ్వాలని దిశానిర్దేశం చేశారు హరీష్ రావు.  అయితే దుబ్బాక నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ లేరని గ్రహించిన హరీష్ రావు.. దిద్దుబాట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే హరీష్ రావు ప్రత్యేకంగా కొందరిని నియమించినట్లు చెబుతున్నారు.          కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో జోరుగానే ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ఐటీ సెల్ తో పాటు ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ గ్రూపులు యాక్టివ్ గా పని చేస్తున్నాయి. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీమ్ టీఆర్ఎస్ టార్గెట్ గా పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. పార్టీ ఇంచార్జ్ డైరెక్షన్ లో కొన్ని సోషల్ మీడియా గ్రూపులను కూడా దుబ్బాక కోసం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నికలో సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారినట్లు కనిపిస్తోంది.  అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఎక్కువ ప్రచారం జరుగుతుందని చెబుతున్నారు. అయితే సోషల్ మీడియా ప్రచారం  పోలింగ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఫలితాల్లోనే తేలనుంది.

హైదరా‘బాధ’లకు కారకులెవరు?

కబ్జాలను తొలగించే దమ్ము కేసీఆర్ సర్కారుకు ఉందా?   ప్రభుత్వం-ప్రజలదే ఈ పాపమా?   సాగరమయమయిన రాజధాని నగరం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలకు కారకులెవరు? రోజుల తరబడి జనం బతుకు, నీళ్లలోనే నానడానికి మూలమెవరు? కళ్ల ముందే తమ కుటుంబ సభ్యులు వరద ప్రవాహం, డ్రైనేజీల్లో పడికొట్టుకుపోవడానికి కారణమెవరు? ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలతో బూతులు తిట్టించుకునే పరిస్థితికి కారణమేమిటి? గోడ కూలి కొందరు, ఇళ్లు కూలి మరికొందరు, ఇలా డజన్ల సంఖ్యలో మృతి చెందడానికి కారకులెవరు? ఈ పాపం ఎవరిది? ప్రభుత్వాలదా? ప్రజలదా?.. లేక ఇద్దరూనా? ఇవీ.. ఇప్పుడు మహానగరాన్ని ముంచెత్తుతున్న ప్రశ్నలు.   అవును. ఈ ఉత్పాతానికి కారకులెవరన్న చర్చ జరుగుతోంది. గత చరిత్ర- పాలకుల నిర్ణయాలు- వైఫల్యాలు-అధికారుల అవినీతి-ప్రజాప్రతినిధుల ఓట్ల కోణంతోపాటు..  ప్రజల అత్యుత్సాహం- అత్యాశ- బలహీనతలు కలసి వెరసి, మహానగరాన్ని ముంచేశాయన్నది సుస్పష్టం. ఈ మహానగరం బాగుపడాలంటే 11 వేల కోట్లు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తొలినాళ్లలో చెప్పారు. ఆ తర్వాత 25-30 కోట్లు అయితే తప్ప నగరం బాగుపడదన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు, నగర సమస్యలపై చాలా ఆందోళన చెందారు. గత పాలకులపై అనేక విమర్శలు చేశారు. ఇదంతా వారి పుణ్యమేనని ఆరోపించారు.  తానొస్తే డల్లాస్‌లా మార్చేస్తానన్నారు. ఇప్పటికి కేసీఆర్ సీఎం అయి ఆరేళ్లు దాటుతోంది. నగర ప్రజలు ఆయన పార్టీకే పట్టం కట్టారు. మేయర్ పీఠం సహా మెజారిటీ కార్పొరేటర్లనూ, ఆయన పార్టీకే కట్టబెట్టారు. అయినా ఇప్పటివరకూ చేసింది శూన్యమన్నది జనం నుంచి వినిపిస్తున్న పెదవి విరుపు.   ఎవరు పాలకులుగా వచ్చినా, మహానగర సమస్యల మూలాన్ని విస్మరిస్తూ వచ్చారు. కీలెరిగి వాతపెట్టే బదులు, తాత్కాలికంగా పూతపూసే విధానాలు అవలంబించారు. అదే ఇప్పటి విషాదానికి అసలు కారణమన్నది నిష్ఠుర నిజం. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. నిజాం కాలం నాటి జనాభాకు, ఇప్పుడు వందరెట్ల జనాభా పెరిగింది. కానీ అదే డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతోంది. ఫలితంగా పెరుగుతున్న ఒత్తిడే ఈ విషాదానికి కారణం. కుంటలు, చెరువులు, నాలాలు కబ్జాలపాలవడం, చెరువుల్లో నీటి సామర్థ్య నిలువలు తగ్గిపోవడం వంటి కారణాలతో.. చిన్న వర్షానికే కాలనీలు చిత్తడయిపోతున్నాయి. నాలాల ఆక్రమణలను నెలరోజుల్లో తొలగిస్తామని చెప్పిన బల్దియా అధికారులు, వానలు తగ్గిన తర్వాత ఆ మాటే మర్చిపోయారు. కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు, మెట్రో రైల్ నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్ సూత్రాలు ఉల్లంఘించడ ంతో, అక్కడ రోడ్లు ఇంకా నీటికిందనే కనిపిస్తున్నాయి.   కొన్ని దశాబ్దాలుగా నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలకు సర్కారే దోషిగా కనిపిస్తోంది.  ఎఫ్‌టిఎల్ పరిథిలో ఇళ్లు నిర్మించడం, కింది ప్రాంతాలకు నీరు ప్రవహించకుండా.. అడ్డంగా అపార్టుమెంట్లు నిర్మించడం వంటి ఉల్లంఘనలకు, అధికారుల అవినీతి- ప్రోత్సాహమే కారణం. అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పుడే కొరడా ఝళిపించకుండా, పూర్తయిన తర్వాత నోటీసులివ్వడం ద్వారా, కబ్జాదారులకు కోర్టులకు వెళ్లే అవకాశం ఇస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని చాలామంది టౌన్‌ప్లానింగ్ అధికారులు, కోట్లకు పడగలెత్తడానికి కారణం ఇదే. ఏసీబీకి పట్టుబడే వారిలో, మున్సిపల్-రెవిన్యూ సిబ్బందే ఎక్కువ కనిపిస్తున్నారు.  వారికి కార్పొరేటర్లు-నేతల సిఫార్సులూ అంతే కారణం.   చాలాచోట్ల.. అక్రమంగా నిర్మించిన అపార్టుమెంట్లలో ప్రజాప్రతినిధులు, ఒక ఫ్లాట్‌ను బహుమతిగా తీసుకుంటున్నారన్నది నిజం. శివారు ప్రాంతాలు, గ్రేటర్ పరిథిలోని  స్థానిక విలేకరులకు, అక్రమ నిర్మాణాలే జీవనాదాయంగా మారిందన్నదీ అంతే నిజం! ఇప్పుడు చాలామంది స్థానిక విలేకరులు, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కంటే ముందే రోడ్డెక్కి, ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారాన్ని అనధికారికంగా పర్యవేక్షిస్తున్నారు. యాజమన్యాలు జీతాలివ్వకపోవడమూ దానికి ఒక కారణం.   అసలు ఈ విషయంలో సర్కారే దోషిగా మారింది. హయత్‌నగర్ -2 ఆర్టీసీ డిపో నిర్మాణమే అందుకు నిలువెత్తు నిదర్శనం. కాల్వంచ, సామనగర్ మీదుగా వచ్చే, వరద నీటికి అడ్డంగా ఆ డిపోను కట్టారు. దానివల్ల నష్టమేమిటో ప్రతి భారీ వర్షమే వేలెత్తి చూపిస్తోంది.  పాతబస్తీలో ఇమ్లిబన్ బస్టాండ్, మెట్రో కోసం.. ప్రభుత్వమే మూసీ నదిని ఆక్రమించింది.  ప్రజలకు బుద్ధులు చెప్పే ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘిస్తే, ఇక ప్రజలు నిబంధనలు ఎందుకు పాటిస్తారన్నది ప్రశ్న. అసలు ఎఫ్‌టిఎల్ పరిథిలో ఇళ్లు, అపార్టుమెంట్లతోపాటు.. ఏకంగా కాలనీలకు కాలనీలే వెలుస్తుంటే, అధికారులు గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా?   అధికారుల పాపం-నేతల అవినీతి పుణ్యాన, ఇప్పుడు శివారు ప్రాంతాల్లో చెరువుల గట్లను కొట్టడంపై కాలనీల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వచ్చింది. దశాబ్దాల నుంచి నగరం నరకంగా మారుతున్నా.. హైడ్రాలాజికల్ మ్యాప్‌ను సూచించే మాస్టర్‌ప్లాన్ రూపొందించాలన్న తెలివి ఇప్పటివరకూ ఏ పాలకుడికీ లేకపోవడం దురదృష్టం. ఇప్పుడు డబుల్‌బెడ్‌రూములు, అప్పుడు రాజీవ్ ఆవాస్ యోజన వంటి గృహనిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, నిరుపేదలకు ఇచ్చి ఉంటే ఇప్పుడు వారు నాలాలను కబ్జా చేసుకుని గుడిసెలు నిర్మించుకునే వారు కాదు. ప్రభుత్వానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లేకపోవడం జనం ఎదుర్కొంటున్న సమస్యలకు మరో కారణం.   ఇప్పటికయినా నాలాలు, చెరువుల ఆక్రమణపై.. కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపితేనే, భవిష్యత్తు తరాలకు భద్రత. దానికి దమ్ము-ధైర్యం-చిత్తశుద్ధి కావాలి. అది కేసీఆర్ సర్కారుకు ఎంతవరకూ ఉందన్నదే ప్రశ్న. గతంలో బెంగళూరు నగరం కూడా, ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. అప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి, చెరువులు-నాలాల కబ్జాలపై కన్నెర్ర చేసింది. ఫలితంగా వాటి ఆక్రమణలను కర్నాటక సర్కారు తొలగించింది. ఆ స్ధాయి ధైర్యం కేసీఆర్ సర్కారుకు ఉంటుదనుకోలేం. కారణం... ప్రస్తుత కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలంతా ఆ పార్టీకి చెందిన వారే. అదీ అసలు విషయం. కబ్జాదారుల్లో తమ పార్టీ వారున్నా సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించడం వరకూ బాగానే ఉంది. కానీ అది ఆచరణలోనే కష్టం.   మళ్లీ గ్రేటర్‌లో పాగా వేయాలని టీఆర్‌ఎస్ పరితపిస్తోంది. ఇప్పటికే మంత్రులు,ఎమ్మెల్యేలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లారు. కొత్త హామీల చిట్టా తెరుస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో  ఆక్రమణలు తొలగిస్తే, బాధితులయిన ప్రజలు సర్కారు పార్టీకి ఓటేయరు. అందుకే పాలకులు చెప్పే కబుర్లన్నీ, నీటిమీద రాతలవుతున్నాయి. అటు జనంలో కూడా.. కారుచౌకగా భూమి లభిస్తే చాలు, అది ఎంత ప్రమాదకర ప్రాంతమయినా ఇల్లు కట్టుకుంటే చాలన్న బలహీనత పోవాలి. ఎఫ్‌టీఎల్ సహా, చెరువుల కింద వెంచర్లు వేస్తున్న రియల్టర్లను, అన్ని రాజకీయ పార్టీలు భుజానికెత్తుకుంటున్నారు. అసలు చాలామంది ప్రజాప్రతినిధులే ఇప్పుడు రియల్టర్లు. ఇప్పుడు పాలకులను నిలదీస్తున్న ఈ రాజకీయ పార్టీలే, ఒకప్పుడు అక్రమార్కుల కొమ్ముకాశారన్నది విస్మరించడమే ఆశ్చర్యం. ఇందుకు ఏ ఒక్క పార్టీ మినహాయింపు కాదు. -మార్తి సుబ్రహ్మణ్యం  

దివ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

ఇటీవల విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ నేత దేవినేని అవినాష్‌ లు దివ్య తల్లిదండ్రులు కుసుమ, జోసెఫ్ లతో పాటు ఆమె సోదరుడు దినేష్‌ లను సీఎం జగన్‌ వద్దకు తీసుకొచ్చారు. దివ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తాము బిడ్డను పోగొట్టుకున్నామని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అలాగే, దివ్య కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల సాయం ప్రకటించారు.   అనంతరం దివ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ..  తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళామని చెప్పారు.  నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారని తెలిపారు. హోం మంత్రి సుచరిత కూడా తమ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  

నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్లు.. ఒక పూటే

ఆంధ్రప్రదేశ్‌ లో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. మంగళవారం ‌జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్కూళ్లు పున:ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు.    రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2,4,6,8 తరగతులకు మరో రోజున తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే.. మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు.    కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక పూటే తరగతులు ఉంటాయని సీఎం వెల్లడించారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని పేర్కొన్నారు. నవంబర్‌ నెలలో ఇది అమలవుతుందని, డిసెంబర్‌ లో పరిస్థితిని మరోసారి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు ఇష్టపడకపోతే.. వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

సెంచరీ వైపు ఉల్లి పరుగు... ఇక సామాన్యులకు చుక్కలే

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని తెలుగులో సామెత. ఉల్లి లేకుండా తెలుగింటి ఇల్లాలి వంట ను ఊహించడం కూడా కష్టమే. అటువంటిది కోయకుండానే ఇల్లాలి కంట కన్నీరు పెట్టిస్తోంది ఉల్లిపాయ. దీనికి కారణం మొన్నటి వరకు రూ 20 నుండి రూ 30 అమ్మిన కిలో ఉల్లి ధర ప్రస్తుతం రూ 65 నుండి రూ 70 పలుకుతోంది. త్వరలో ఇది సెంచురీ మార్క్ కూడా దాటవచ్చని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో సామాన్య ప్రజల వంటకాల్లో ఉల్లిపాయ మాయం కానుంది. వచ్చే దీపావళి నాటికి బహుశా ఉల్లి సామాన్యులకు అందనంత ఖరీదుగా మారవచ్చు. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఐన నాసిక్‌లో ఉన్న లాసల్‌గావ్‌లో సోమవారం ఉల్లిపాయ మార్కెట్ ధర క్వింటాల్‌కు 6802 రూపాయలు పలికింది. ఈ ధర ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు అత్యధికం.   తాజాగా వ్యాపార వర్గాలు చెపుతున్న వివరాల ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా ఉల్లి పంట పండే మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉల్లి పంట పొలాలలోనే పాడైయిపోయింది. దీంతో ఉల్లి ధర ఆకాశాన్నీ తాకుతోంది. అంతేకాకుండా మహారాష్ట్ర తో పాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటకలలో కూడా ఉల్లి పంటకు భారీ నష్టం జరగడంతో ధరలు సామాన్యులకు అందని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీనికి తోడు కొందరు వ్యాపారులు ఇప్పటి నుంచే ఉల్లికి కృత్రిమ కొరత సృష్టించడం ప్రారంభించారు. అయితే ఫిబ్రవరిలో కొత్త పంట వచ్చేవరకు ఉల్లిపాయల ధరలు తగ్గే అవకాశం కూడా లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్రైన్‌లో దొంగ పరార్.. ఫ్లైట్‌లో పోలీసుల చేజింగ్!  హాలీవుడ్ రేంజ్ చేజ్

నగలు కొట్టేసి పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి పోలీసులు హెలికాప్టర్‌లో చేజింగ్ చేయడం లాంటి సీన్లు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ రియల్‌గా జరిగింది. అది ఏ విదేశాల్లోనో కాదు.. మన దేశంలోనే. కోటి 30 లక్షల రూపాయల విలువైన బంగారం, వజ్రాల నగలు కొట్టేసి పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి బెంగళూరు పోలీసులు ఈ రకమైన చేజింగ్ చేశారు. రైలులో కోల్‌కతాకు పరారవుతున్న దొంగ మిస్ అయితే దొరకడని ఫ్లైట్‌లో ముందుగానే అక్కడికి చేరుకుని మాటు వేసి మరీ అరెస్టు చేశారు.   బెంగళూరులోని జేపీ నగర్‌లో నివసించే బిల్డర్ రాజేశ్ బాబు ఇంట్లో పశ్చిమ బెంగాల్‌లోని బుర్దావన్‌కు చెందిన కైలాస్ దాస్ పని మనిషిగా ఉండేవాడు. ఆరేళ్ల నుంచి నమ్మకంగా ఉంటూ పని చేసుకుంటున్న దాస్‌కు రాజేశ్ ఇంటి సెల్లార్‌లో రూమ్‌ కూడా ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం రాజేశ్ కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేర్చించారు. రాజేశ్ ఫ్యామిలీ అంతా ఆ హడావిడిలో ఉండగా దాస్‌కు ఆ ఇంట్లో ఉండే బంగారు, వజ్రాల నగలపై కన్నుపడింది. అక్టోబర్ 9న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోటి 30 లక్షల రూపాయల విలువ చేసే నగలు ఉండే ఎలక్ట్రానిక్ లాకర్‌ను తీసుకుని పరారయ్యాడు. బెంగళూరు నుంచి మైసూర్ పారిపోయి అక్కడ స్క్రూ డ్రైవర్‌తో లాకర్‌ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోవడంతో సొంతూరికి వెళ్లిపోయి అక్కడ ఏదొకటి చేయొచ్చని ఫిక్స్ అయ్యాడు.   ఇక రెండ్రోజుల క్రితం మళ్లీ బెంగళూరు వచ్చి కైలాస్ దాస్య యశ్వంత్ పూర్ నుంచి హౌరా వెళ్లే ట్రైన్ ఎక్కాడు. అయితే ఆ ముందు రోజే రాజేశ్ బాబు కుటుంబం లాకర్ మిస్ అయిన విషయం చూసుకోవడంతో వాళ్లు జేపీ నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ తెప్పించుకుని పరిశీలించారు. సరిగ్గా అతడు ట్రైన్ ఎక్కిన కొన్ని గంటల తర్వాతే పోలీసులు రైల్వే స్టేషన్ ఫుటేజీ చూడడంతో దొంగ రైలు ఎక్కిన విషయం పసిగట్టగలిగారు. దీంతో అతడు చివరి స్టేషన్ చేరుకుని ట్రైన్ దిగి సిటీలోకి వెళ్లాడంటే మళ్లీ పట్టుకోవడం కష్టం అవుతుందని పోలీసులు భావించారు. దీంతో అక్కడికి చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాల్లో వెళ్తే దాస్‌ను పట్టుకోవడం కుదరదని విమానంలో కోల్‌కతాకు వెళ్లారు. రైలు హౌరా స్టేషన్ చేరుకోగానే దొంగ ప్లాట్‌ఫామ్‌పై దిగడాన్ని పోలీసులు పసిగట్టారు. అయితే పోలీసులు తన కోసమే వచ్చారని అర్థం చేసుకున్న దాస్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు చుట్టుముట్టి అతడని అరెస్టు చేశారు. నగలు ఉన్న లాకర్‌తో పాటు దొంగను బెంగళూరుకు తీసుకువచ్చారు పోలీసులు.   దొంగిలించిన నగలతో ట్రైన్ లో పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు హాలీవుడ్ సినిమా రేంజ్ లో చేజ్ చేసిన బెంగళూరు పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాలో వారిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు, హాట్సాప్ బెంగళూరు కాప్్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతకైనా దొంగను పట్టుకునేందుకు ఏకంగా విమానంలో వెళ్లి ఆపరేషన్ ను సక్సెస్ చేసిన బెంగళూరు పోలీసులకు అందరూ సెల్యూట్ చేయాల్సిందే..

కేంద్రాన్ని మెచ్చుకున్నా కౌంటర్లేనా! బీజేపీకి ఆ నేత భారమేనా! 

ప్రజలు బాగోగులు, రాష్ట్ర అభివృద్ధి వారికి పట్టదా? వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీనే ఫణంగా పెడుతున్నారా? సొంత పార్టీ కార్యకర్తలు ఛీదరించుకుంటున్నా తమ తీరు మార్చుకోరా?. ఆంధ్రప్రదేశ్  బీజేపీలోని  కొందరు నేతల తీరుతో ఇప్పుడు ప్రజల నుంచి ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి.  ఏపీ బీజేపీ నేతలు సొంత పార్టీకే సున్నం పెట్టేలా తయారవుతున్నారనే చర్చ జరుగుతోంది. అధికార వైసీపీకి మద్దతు పలుకుతూ తమ రాజకీయ పబ్బం గడపుకుంటున్న కొందరు కమలం నేతలు..  రోజురోజుకు మరింత దిగజారుతున్నరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి తీరు మరీ విచిత్రంగా ఉంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ను ప్రశంసించిన వారిని ఆయన టార్గెట్ చేయడం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. వైసీపీ ప్రాపకం కోసం మోడీ చేసిన అభివృద్ధిపైనా విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్లు చేయడం ఏపీ కమలం దుస్థితికి అద్ధం పడుతోంది.      టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఎప్పుడూ మాట్లాడుతుంటారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇటీవల ఆయన మరీ బరి తెగిస్తున్నారు. బీజేపీ కంటే వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నట్లుగానే ఆయన ప్రెస్ మీట్లు ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆయన కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం  కాక రేపుతోంది. బెజవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంపై ప్రకటన చేసిన నాని.. ఏపీ అభివృద్ధి విషయంలో 2014-19 మధ్యకాలం ఏపీకి స్వర్ణయుగమని, ఆ అయిదేళ్లు రాష్ట్రం ముఖచిత్రం మారిపోయే ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబుతోపాటు నాటి కేంద్రమంత్రులకు దక్కుతుందని, బీజేపీ చాలా సపోర్ట్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు.   అయితే చంద్రబాబు, టీడీపీపై ఎప్పుడెప్పుడు విమర్శలు చేయాలా అనే చూసే విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే స్పందించారు. కేశినేని నానికి కౌంటరిచ్చారు. ఏమండోయ్ నాని గారు.. మీ బాబు గతంలో బిజెపి గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమి చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగిపోయి నాడు బిజెపిని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని చెప్పారు.. నేడు మీరెమేూ గతఐదేళ్లు స్వర్ణ యుగం కేంద్రమంత్రులందరు రాష్ట్రానికి అండగా నిలిచారని చెబుతున్నారంటూ ట్వీట్ చేాశారు. ఎంపీ కేశినేని నాని కామెంట్లకు కౌంటర్ గా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.   కేశినేని నాని మోడీ సర్కార్ ను ప్రశంసిస్తూ కామెంట్లు చేయడం విష్ణువర్ధన్ రెడ్డి నచ్చడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నానిని తప్పుపడుతున్నారంటే.. గత ఐదేండ్లలో ఏపీకి మోడీ సర్కార్ ఏం చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయంగా ఉన్నంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీకి బీజేపీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని చెబితే అభినందించాల్సింది పోయి కార్నర్ చేయడమేంటనీ కొందరు బీజేపీ నేతలు కూడా ఫైరవుతున్నారట. చంద్రబాబును విమర్శించాలనే ఆతృతతో మోడీ సర్కార్ ను కేశినేని ప్రశంసించిన విషయాన్ని..  విష్ణువర్ధన్ రెడ్డి పక్కనపెట్టారనే వ్యాఖ్యలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. చంద్రబాబును టార్గెట్ చేయడంలో తప్పు లేదు కాని.. తమ పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించడమేంటనే చర్చ ఏపీ కమలనాధుల్లో కనిపిస్తోంది. మొత్తంగా విష్ణువర్ధన్ రెడ్డి తీరుతో ఏపీ బీజేపీ తీవ్రంగా నష్టపోతుందనే చర్చ   ఆ పార్టీలో జరుగుతోంది. ఆయన్ను కంట్రోల్ చేయకపోతే పార్టీకి పూడ్చలేని నష్టం జరుగుతుందని కొందరు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

అసత్య వార్తలు రాస్తే కేసు వేస్తా! జర్నలిస్టుపై పీవీ సింధు గుస్సా

గ్రౌండ్ లోనూ, బయట కూడా ఎప్పుడూ కూల్ గా కనిపించే భారత బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించింది. ఓ స్పోర్ట్స్ జర్నలిస్టుపై మండిపడుతూ వరుసగా ట్వీట్లు చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ రిపోర్టర్ నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు.. వార్తలు రాసేటప్పుడు నిజాలు ఏంటో తెలుసుకుని రాయాలి. అతడు ఇటువంటి చర్యలను మానుకోకపోతే నేను అతడిపై చట్టబద్ధంగా పోరాడతానని ట్వీట్ లో పీవీ సింధు హెచ్చరించింది.   పీవీ సింధు ప్రస్తుతం లండన్ లో ఉంది. అయితే  ఆమె మొట్టమొదటి సారి తన తల్లిదండ్రులతో కాకుండా ఒక్కరే విదేశాలకు వెళ్లిందని టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ జర్నలిస్టు కథనం రాశాడు. మరో రెండు నెలలు ఆమె అక్కడే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. కుటుంబంలో సమస్యలు తలెత్తడం వల్లే సింధు పది రోజుల క్రితం లండన్ వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ టీమ్ తో కలిసి ఆమె అక్కడే ప్రాక్టీసును మొదలు పెట్టనుందని, ఆమెను తిరిగి ఇంటికి రప్పించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆ కథనంలో రాసుకొచ్చాడు ఆ జర్నలిస్ట్.  ఈ కథనంపైనే పీవీ సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిట్‌నెస్‌లో భాగంగా న్యూట్రిషన్ కోసం తాను కొన్ని రోజుల క్రితం లండన్‌కు వచ్చానని, నిజానికి తన తల్లిదండ్రుల అనుమతితోనే వచ్చానని ఆమె చెప్పింది. ఈ విషయంలో వారితో ఎటువంటి గొడవలూ లేవని వివరించింది. నాకోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులతో నాకు సమస్యలు, గొడవలు ఎందుకు ఉంటాయి? నా కుటుంబంతో నేను చాలా క్లోజ్ గా ఉంటాను.. వారు నన్ను ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు నేను వారితో మాట్లాడుతూనే ఉన్నానని సింధు తెలిపింది. అలాగే  కోచ్ పుల్లెల గోపిచంద్ తోనూ ఆయన శిక్షణ సంస్థతోనూ తనకు ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేసింది పీవీ సింధు.

బీజేపీ... భలే భలే!

‘సస్పెండ్ల సోము’గా మారిన వీర్రాజు   తాజాగా లంకా దినకర్‌పై వేటు   ప్రశాంతిభూషణ్‌ను సమర్ధించిన విష్ణువర్దన్‌రెడ్డి   మరి సత్యపైనా వేటు వేస్తారా?            బీజేపీ ఏపీ దళపతి సోము వీర్రాజు చాలా బిజీగా ఉన్నారట. ఎందుకు? ఏపీలో వరద సాయంలో జగన్ సర్కారు వైఫల్యం, టీటీడీలో గోల్డ్ వ్యవహారం, జస్టిస్ రమణ అంశంపై పార్టీ విధానంపై, కసరత్తు చేసే పనిలో బిజీగా ఉన్నారనుకుంటున్నారా? అబ్బే.. పార్టీలో ఇంకా ఎంతమందిని సస్పెండ్ చేయాలన్న జాబితాపై, కసరత్తు చేసే పనిలో బిజీగా ఉన్నారు. నిజం. ఇదంతా ఏదో ఉత్తుత్తిగా చెబుతున్న మాట కాదు. లంకా దినకర్‌పై వేటు తర్వాత పార్టీలో అందరికీ తెలిసిపోయిన రహస్యమిది!   ఏ పార్టీకయినా కొత్త అధ్యక్షుడు వస్తే, చేరికలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ, ఆంధ్రా బీజేపీలో పరిస్థితి అందుకు రివర్సు. పార్టీ విస్తరణ పట్ల నిబద్ధత, ‘వైసీపీపై తీవ్ర వ్యతిరేకత’, ‘టీడీపీపై  ప్రేమ’ ఉన్న సోము వీర్రాజు జమానాలో మాత్రం.. సస్పెన్షన్ల పర్వం విజయవంతంగా కొనసాగుతూ, వచ్చే వారి కంటే పార్టీ నుంచి పోయేవారి సంఖ్య కొండవీటి చాంతాడులా పెరిగిపోతుండటమే విశేషం. ఓ.వి.రమణ అనే సీనియర్ నాయకుడితో మొదలయిన ఈ సస్పెండ్ల పర్వం.. రాజధానిలో పార్టీకి సొంత భూమిచ్చిన వెగలపూడి గోపాలకృష్ణ నుంచి, ఇప్పుడు లంకా దినకర్ వరకూ కొనసాగుతోంది. దీనితో పార్టీ వర్గాలుతమ నాయకుడిని  ‘సస్పెన్షన్ల సోము’ అని పిలుచుకుంటున్నారట.   పాపం.. జాతీయ స్థాయిలో పార్టీ విధానాలను సమర్ధిస్తూ గళం విప్పే, సీనియర్ నేత పురిఘళ్ళ రఘురాం ఒక్కరే ఈ వేటు నుంచి తప్పించుకున్నారు. సునీల్ దియోధర్ కూడా కన్నా హయాంలో.. పురిఘళ్ల రఘరాం, లంకా దినకర్‌పై వేటు వేయాలని ఒత్తిడి చేసినా, కన్నా పుణ్యాన అప్పట్లో అది సాధ్యం కాలేదు. అప్పటికీ, లంకా దినకర్‌కు షోకాజు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ‘వైసీపీ వ్యతిరేక’ విధానాలు అవలంబిస్తున్న సోము నాయకత్వంవచ్చింది. దానితో సస్పెన్షన్ కత్తికి బాగా పదనుపట్టి, ఓ అరడజను మందిపై కస కసా వేటేశారు. అదన్నమాట సంగతి!   ఏపీ బీజేపీలో క్రమశిక్షణా రాహిత్యం బాగా పెరిగిందట. ఎవరు పడితే వాళ్లు మీడియాకెక్కి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారట. ప్రకటనలు ఇచ్చేస్తున్నారట. వ్యాసాలు రాసేస్తున్నారట. అది పార్టీ ప్రయోజనాలకు భంగకరమట. అందుకే అప్పుడు ఓ.వి. రమణ-ఇప్పుడు లంకా దినకర్‌పై వేటేశారు. మధ్యలో కావలి బీజేపీ మహిళా నేతపైనా సస్పెన్షన్ విధించారు. నిజానికి పాపం రమణ అనే నాయకుడు, అమరావతి అంశంపై పత్రికలో రాసిన వ్యాసంలో కొత్త ప్రస్తావన ఏమీ లేదు. అంతకుముందు కన్నా, జీవీఎల్, సునీల్‌దియోధర్, సత్య మాట్లాడినవే. కానీ సోముకు అవి పార్టీ వ్యతిరేకంగానే కనిపించాయి.   ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు.. రమణ కూడా ఇదే ప్రశ్న వేసి, తనతోపాటు అమరావతిపై మాట్లాడిన వారందరినీ సస్పెండ్ చేయమని సవాల్ విసిరారు. మరో నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పాపం తన భూమిని పార్టీ ఆఫీసు నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఆయన ఓ సందర్భంలో అందరినీ నమ్మినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. అది కూడా సోము దృష్టిలో నేరంగా కనిపించింది. దానితో వీర్రాజు బౌలింగ్‌లో, ఆయన రెండవ వికెట్‌గా బౌల్డయ్యారు. కానీ విచిత్రంగా.. ఆయన ఇచ్చిన భూమి మాత్రం తీసుకుని, వెలగపూడిని మాత్రం గెంటేశారు.   ఇప్పుడు దినకర్ వికెట్ కూడా ఎగిరిపోయింది. సోము వీర్రాజు బౌలింగ్‌లో, దినకర్ కొట్టిన బంతిని విష్ణువర్దన్‌రెడ్డి క్యాచ్ పట్టి, అవుట్ చేశారు. లంకా దినకర్ అనే వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే కాదు. మంచి వక్త కూడా. ఆర్ధిక-రాజకీయ అంశాలపై ఆయన చేసే విశ్లేషణల కోసమే, జాతీయ మీడియా ఆయనను ఎంచుకుంటుంది. వీర్రాజు అండ్ కోకు... దినకర్ ఎవరో తెలియకపోయినా, జాతీయ చానెళ్లు చూసే వారికి లంకా దినకర్ విజ్ఞానమేమిటన్నది తెలుసు. కానీ, జాతీయ మీడియా కంటే,  సోము ఎక్కువ  విజ్ఞానవంతులు కాబట్టే, ఆయన సస్పెన్షన్ వేటు వేసినట్లు కనిపిస్తోంది.   సరే.. పార్టీ వ్యతిరేక చర్యలంటే గుర్తుకొచ్చింది. మొన్నమధ్య వైసీపీ అధికార మీడియా సాక్షి చానెల్‌లో,  జస్టిస్ రమణ వ్యవహారంపై చర్చ పెట్టారు. అందులో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైసీపీని ‘మనసారా’,  ‘తీవ్రంగా వ్యతిరేకించే’ విష్ణువర్దన్‌రెడ్డి.. లాయర్ ప్రశాంతిభూషణ్ వ్యాఖ్యలను సమర్ధించారు. ఒక వ్యక్తి సిఫార్సు చేసే వ్యక్తులు జడ్జిలు ఎలా అవుతారని ప్రశ్నించారు. మరి ఆ ప్రకారంగా.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏ సీఎంలు, ఇప్పటివరకూ  ఎవరినీ జడ్జిలుగా ఎంపిక చేయడం లేదు కామోసు! సుప్రీంకోర్టు ఆదేశాలతో,  ఒక రూపాయి జరిమానా కట్టిన ప్రశాంతిభూషణ్ అనే న్యాయవాది, బీజేపీ సర్కారుపై ఒంటికాలితో లేస్తుంటారు. ఆయన బీజేపీ వ్యతిరేకి అన్నది రహస్యమేమీ కాదు. మరి అలాంటి వ్యక్తిని, జగనన్న కోసం..  విష్ణన్న సమర్థించడం,  పార్టీ విధానాలకు అనుకూలమా? వ్యతిరేకమా? వీర్రాజే చెప్పాలి.   అంతేనా? టీడీపీ సర్కారులో ‘రేరా’ పదవి అనుభవించి, బీజేపీలో చేరిన చందు సాంబశివరావు అనే మరో మేధావి.. కులాలు-మతాల విషయంలో తాను జగన్, రాజశేఖర్‌రెడ్డికి క్రెడిట్ ఇస్తున్నట్లు సెలవిచ్చారు. మరి వైసీపీ సర్కారును అభినందించడం కూడా పార్టీ వ్యతిరేక విధానమయిట్లయితే, ఆయనపైనా వేటు వేయకుండా ఎందుకున్నారో కూడా,  ‘ఇద్దరు మేధావులే’ సెలవివ్వాలి. కొత్త కమిటీలో వేసిన అధికార ప్రతినిధులెంత విజ్ఞానవంతులో, ఎంత విషయపరిజ్ఞానం ఉన్నవారో చెప్పడానికి.. తిరుమల అంశంపై టీవీ5లో జరిగిన ఒక్క చర్చ చాలు.   సోమనాధ్ ఆలయం ఎక్కడ ఉందన్న కాంగ్రెస్ నేత ప్రశ్నకు, చర్చలో పాల్గొన్న బీజేపీ మహిళా నేత నుంచి పాపం జవాబు లేదు. ఇలాంటి మేధావులు, బుద్ధిజీవుల తెలివితేటలు చూసి టీవీ ప్రేక్షకులు కూడా మురిసిముక్కలవుతున్నారట. ఇలాంటి ఆణిముత్యాలను ఏరికోరి తెచ్చుకున్న కమలదళాలను మెచ్చుకోవలసిందే.   ఓకే.. ఓవి రమణ, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, లంకా దినకర్లు పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారు. కాబట్టి సస్పెండ్ చేశారు. బాగానే ఉంది. మరి పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తాజాగా రాసిన వ్యాసం సంగతేమిటి? అందులో ఆయన వైసీపీ విధానాలను తూర్పాపట్టారు కదా? జడ్జిలపై జగన్ పార్టీ నేతల దాడిని కడిగేశారు కదా? జగన్ సర్కారు, ఒక కులంపై దాడి చేస్తోందని విరుచుకుపడ్డారు కదా? మరి ఆయన రమణ, దినకర్ మాదిరిగా.. సోము వీర్రాజు అండ్ విష్ణువర్దన్‌రెడ్డి పర్మిషను తీసుకునే ఆంధ్రజ్యోతికి వ్యాసం రాశారా? ఒకవేళ అలా పర్మిషన్ తీసుకోకపోతే, మరి సత్యకుమార్‌నూ సస్పెండ్ చేయాలి కదా? సోముకు మరి అంత ధైర్యం ఉందా? అన్నది ఇప్పుడు కమలదళాల ప్రశ్న.   కన్నా హయాంలో టీడీపీ నుంచి చేరిన వారంతా, ఆ పార్టీ కోవర్టులేనన్నది ఇప్పటి నాయకత్వం అనుమానం. ఆవిధంగా టీవీ చర్చల్లో పాల్గొనే వారందరినీ తప్పించారట. టీడీపీ అనుమానితుల జాబితాను ముందు పెట్టుకుని, ఒక్కోరిపై ఇలా వేటు వేస్తూ పోతారట. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. ఆ ప్రకారంగా మరి సుజనాచౌదరితోపాటు చేరిన ముగ్గురు ఎంపీలు, మాజీ మంత్రులపైనా ఇలాగే పొమ్మనకుండా పొగబెడతారేమోనన్నది, ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న గుసగుస. మరి.. సునీల్‌దియోధర్, సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ వంటి మార్గదర్శకుల జమానాలో ఏదైనా సాధ్యమేనేమో?! -మార్తి సుబ్రహ్మణ్యం

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీ కీలక తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కీలక తీర్పు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది.   ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలు, జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ఆరు నెలల్లో కమిటీ అధ్యయనం పూర్తి చేయాలని ఎన్జీటీ స్పష్టంచేసింది.    ప్రాజెక్టు విస్తరణపై సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్‌లో చెప్పినట్లు డీపీఆర్‌ లు సమర్పించి, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లొచ్చని సూచించింది.  

పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో కరోనాకు చెక్.. సీసీఎంబీ తాజా పరిశోధన  

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఒక పక్క వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశలో ఉండగా మరో పక్క ఆ వైరస్ ను యాంటీ వైరల్ ఆహార పదార్ధాలతో ఎదుర్కొనేందుకు మన దేశంలో చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయి. కరోనాకు విరుగుడు మందులు రావడంలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దీనికోసం ఫుడ్ సప్లిమెంట్లను తయారు చేసే పరిశోధన తాజాగా మన దేశంలో జరిగింది. దీనికోసం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పుట్టగొడుగులపై చేసిన తాజా పరిశోధన విజయవంతమైంది. పుట్టగొడుగులలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్స్ వంటి యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కరోనాకు చెక్ పెట్టగలవని ఈ తాజా పరిశోధనలో తేలింది.   ఈ తాజా పరిశోధనలో పుట్టగొడుగులతో చేసిన ఫుడ్ సప్లిమెంట్ ను కరోనా వైరస్‌కు తక్షణ విరుగుడుగా ఉపయోగించవచ్చని పరిశోధకులు తేల్చారు. ఇందులో భాగంగా అటల్ ఇంక్యుబేషన్‌లోని స్టార్టప్ సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీతో కలిసి సంయుక్త పరిశోధనలు చేసింది. ప్రముఖ ఔషధ ఆహార ఉత్పత్తి సంస్థ ఆంబ్రోషియా ఫుడ్ ఫామ్‌తో కలిసి పుట్టగొడుగులతో చేసిన సప్లిమెంటును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొన్ని ప్రయోగాలు చేపట్టింది. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కర్కమిన్‌తో కలిసి ద్రవ రూపంలో ఉండే ఈ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.   పసుపుతో కలిసిన ఈ ఆహార మిశ్రమం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతోపాటు యాంటీ ఆక్సిడెంటుగా కూడా పనిచేసి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే ఎయిమ్స్ ఈ ఫుడ్ సప్లిమెంటుపై పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇపుడు ఎయిమ్స్ నాగ్‌పూర్, భోపాల్, నవీ ముంబై కేంద్రాల్లోనూ దీనిపై ప్రయోగాలు సాగుతున్నాయి. కరోనాను ఎదుర్కునే ఈ ఫుడ్ సప్లిమెంట్ వచ్చే ఏడాది ఆరంభం లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీసీబీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.

సీఎం జగన్ క్రైస్తవుడని ఎలా చెపుతారు.. హైకోర్టు సూటి ప్రశ్న

ఏపీ సీఎం జగన్ మతం విషయంలో వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఒక షాకింగ్ ప్రశ్న వేసింది. సీఎం జగన్ క్రైస్తవుడని చెప్పేందుకు ఆధారాలు ఉంటే కోర్టు ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ ను ఆదేశించారు.    తిరుమల శ్రీవారి ఆలయంలోకి అన్యమతస్తులు వెళ్లేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ అన్యమతస్థుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ చేసిన వాదనతో ఏపీ హైకోర్టు విభేదించింది. అంతేకాకుండా ఎటువంటి ఆధారాలూ లేకుండా ముఖ్యమంత్రి హిందువు కాడని, క్రిస్టియన్ అని కోర్టు ముందు ఎలా వాదిస్తారని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ.. సీఎం మతానికి సంబంధించి తగిన ఆధారాలు ఉంటేనే తదుపరి విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఇక ఈ కేసులో గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చడంపై కూడా తీవ్ర అభ్యంతరం తెలిపిన న్యాయమూర్తి ఆయన్ను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చారు.    కొద్ది రోజుల క్రితం తిరుమల వెళ్లిన సీఎం జగన్ శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వలేదని, ఇది దేవాదాయ చట్టానికి విరద్ధమని అంటూ గుంటూరు జిల్లా వైకుంఠాపురానికి చెందిన సుధాకర్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

పది వేలు సరే.. ప్రాణాలకు రక్షణేది! ఆ పనిచేస్తే ఆయన దేవుడే? 

వరదలతో అల్లాడిపోయిన హైదరాబాద్ ప్రజలను వర్షాలు ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. రాత్రి నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్ ఏరియాలో భారీ వర్షం కురిసింది. మరో 48 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఐఎండీ అలర్ట్ తో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ నుంచి స్పీడ్ బోట్లను తెప్పించింది.  వరద ముంపు ఎక్కువగా ఉన్న మీర్ పేట, దిల్ షుక్ నగర్, ఓల్డ్ సిటీలోని బస్తీలు, లోట్టు ప్రాంతాల్లో స్పీడ్ బోట్లను  అందుబాటులో ఉంచింది. అవసరమైతే మరిన్ని బోట్లను తెప్పిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.    వరద బాధితులకు పరిహారం కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లోని ప్రతి ఇంటికి 10 వేల రూపాయలు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు లెక్కలు తీస్తున్నారు. వరదలతో సిటిలో ఇప్పటికే వంద మందికి పైగానా చనిపోయారు. చెరువుల్లో, నాలాల్లో ఇంకా మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. అయితే వరద బాధితులకు సర్కార్ సత్వర సాయం చేయడాన్ని స్వాగతిస్తూనే... ప్రభుత్వానికి మరిన్ని ప్రశ్నలు వేస్తున్నారు  గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు. వరదల నుంచి ప్రజల ప్రాణాలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. కాలనీలన్ని చెరువులుగా మారిపోయాయని, తమకు బతుకు భరోసా లేకుండా పోయిందని అవేదన చెందుతున్నారు. నష్ట పరిహారం ఇవ్వడంతో  పాటు శాశ్వాత వరద నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇండ్లలోకి వరద చేరకుండా , కాలనీలు మునగకుండా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.    ఇటీవలే సిటీలోని వరద ప్రాంతాలను పరిశీలించారు మంత్రి కేటీఆర్. అక్కడి సమస్యలను స్వయంగా చూశారు. గ్రేటర్ వరదలపై మాట్లాడిన కేటీఆర్.. నాలాల కబ్జాలు నిజమేనని ఒప్పుకున్నారు. చెరువు శిఖం భూముల్లోనూ కట్టాడాలు ఉన్నాయన్నారు. ఇటీవలే మైలార్ దేవ్ పల్లి పరిసరాలను ముంచెత్తిన పల్లె చెరువును పరిశీలించిన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కూడా చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అంగీకరించారు. ఇప్పుడు సిటి జనాలు ఈ విషయాలనే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. అక్రమ కట్టడాలున్నాయని చెబుతూ వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చెరువుల్లోని కబ్జాలను ఎందుకు తొలగించడం లేదని నిలదీస్తున్నారు. నాలాలపై ఉన్న ఇండ్లను తొలగిస్తామని ఐదేండ్ల క్రితం ఇచ్చిన హామీ ఏమైందని బస్తీ వాసులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.    భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారెవరూ టెన్షన్​ పడొద్దని.. ఆదుకునేందుకు దేవుడి లాంటి సీఎం కేసీఆర్ ఉన్నారని గ్రేటర్ పరిధిలోని మంత్రులు, మేయర్, టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు.టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చినాక అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు. 2014 తర్వాత కట్టినవన్నీ చట్టానికి లోబడి ఉన్నయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగితే మొత్తం హైదరాబాద్ మునిగిందని ప్రచారం చేయటం కరెక్ట్​ కాదు. గత పాలకుల పాపమే ఈ పరిస్థితికి కారణమన్నారు. అయితే గ్రేటర్ అధికార పార్టీ నేతల మాటలపైనా సిటి  ప్రజలు విమర్శలు చేస్తున్నారు. 2014కు ముందే అక్రమ కట్టడాలు ఉన్నాయని చెబుతున్న నేతలు.. ఆరేండ్లు అవుతున్నా వాటిని ఎందుకు తొలగించలేదని అడుగుతున్నారు. గత ఎన్నికల సమయంలో వరద నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారా లేదా అని నిలదీస్తున్నారు. రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధిలో వరద నివారణకు శాశ్వాత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.    హైదరాబాద్ ను వరదలు ముంచెత్తకుండా చర్యలు చేపడితే నిజంగా కేసీఆర్ దేవుడేనని చెబుతున్నారు గ్రేటర్ ప్రజలు. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఆయన దేవుడో కాదో నిరుపించుకోవాల్సిన సరైన సమయం ఇదేనని చెప్పారు. తమ లీడర్లు నష్టపోతారనే, కబ్జాలు తీసేస్తే కొన్ని ఓట్లు రావనే కారణాలు చూడకుండా..ఓట్లు రాజకీయలను పక్కన పెట్టి  పార్టీలకతీతంగా పనిచేసి భాగ్యనగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని  స్పష్టం చేస్తున్నారు. ఎప్పటిలానే మాటలతో సరిపెట్టకుండా చిత్తశుద్దితో చర్యలు చేపట్టి హైదరాబాద్ ను వరదల నుంచి రక్షించాలని గ్రేటర్ వాసులు కోరుకుంటున్నారు.

రావాలి జనం.. తాగాలి మద్యం! ఏపీలో ఇదే కొత్త నినాదం

మాట తప్పం.. మడమ తిప్పం. ఇది ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ఎప్పుడూ చేసే జపం. ప్రజలకు ఇచ్చిన మాట తప్పేది లేదని, ఇచ్చిన హామీని అమలు చేయడమే తమ విధి అని టాంటాం చేస్తుంటారు. అయితే అదంతా ఉట్టిదేనని తెలిపోతోంది. ఇప్పటికే  చాలా సార్లు ఇది రుజువైంది. ఇప్పుడు మద్యం విషయంలో మరోసారి జగన్ సర్కార్ బండారం బయటపడింది. దశలవారీగా మద్య పాన నిషేదం చేస్తామని లిక్కర్ ధరలు పెంచిన జగన్ ప్రభుత్వం.. తర్వాత తుస్సుమనిపించింది. లిక్కర్ ధరలు భారీగా తగ్గించడంతో రాష్ట్రంలో అమ్మకాలు పెరిగిపోయాయి. భారీగా మద్యం విక్రయాలు సాగిస్తూ ఆదాయం పెంచుకుంటోంది జగన్ సర్కార్. దీంతో ధరలు పెంచి అమ్మకాలు తగ్గిస్తాం అంటూ ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటలన్నీ ప్రచారానికి పరిమితమయ్యాయి. రావాలి జనం... తాగాలి మద్యంలా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి.   లాక్‌డౌన్‌ కాలంలో మూతపడిన మద్యం షాపులను తిరిగి తెరిచినప్పుడు వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచింది. ఒకేసారి 75శాతం ధరలు పెంచి మందుబాబులకు షాకిచ్చింది. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రభుత్వం అనుకున్న దశలవారీ మద్య నిషేధ ప్రణాళిక అమలౌతోందని అందరూ భావించారు. కానీ 4 నెలలు తిరగకుండానే వెనకడుగు వేసింది జగన్ సర్కార్. మద్యం దొరక్క శానిటైజర్లు తాగుతున్నారని, ప్రభుత్వ ఆదాయం తగ్గిందనే కారణాలు చూపించి సెప్టెంబరు 3న ధరలను భారీగా తగ్గించేసింది. దీంతో అమ్మకాలు 50 శాతం పెరిగాయి. మే నుంచి ఆగస్టు వరకు నెలకు దాదాపు 12 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మిన ఎక్సైజ్‌ శాఖ.. సెప్టెంబరులో ఒకేసారి 18.39 లక్షల కేసులు అమ్మేసింది. ఆగస్టు వరకు నెలకు సగటున 2.5 లక్షల కేసులు బీర్లు అమ్మిన ఎక్సైజ్‌శాఖ.. సెప్టెంబరులో 5.82 లక్షల కేసులు అమ్మేసింది. అక్టోబర్ లో మొదటి 15 రోజుల్లోనే దాదాపు పది లక్షల కేసుల లిక్కర్‌ అమ్మినట్లు సమాచారం. ఇది సెప్టెంబరు మాసం కంటే మరో లక్షన్నర కేసులు ఎక్కువ.    2019 అక్టోబర్ లో తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీలోనే లిక్కర్ ధరలు పెంచింది జగన్ సర్కార్. ముందుకు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా మద్యం ధరలు పెంచుకుంటూ పోయింది. కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చేవారు. ఇతర రాష్ట్రాల లిక్కర్ కొనుగోలుకు మందుబాబులు ఎగబడేవారు. అయితే ఆదాయం కోసమే సర్కార్ మద్యం ధరలు పెంచినా... విక్రయాలు తగ్గడంతో తమకు అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం. మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే ధరలు పెంచామని గొప్పగా ప్రకటించుకుంది. దశల వారీగా షాపులను కూడా తగ్గిస్తూ.. పూర్తి మద్యపాన నిషేదం దిశగా వెళతామని చెప్పింది.     దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని చెప్పిన ఏపీ సర్కార్.. తర్వాత జే టర్న్ తీసుకుంది. మద్యం ధరలను తగ్గించింది. ఇప్పుడు ఏపీలోనూ మద్యం తక్కువ ధరకే లభిస్తుండటంతో లోకల్ షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు జనాలు. అనేక బ్రాండ్ల ధరలు ఒక్కో సీసాపై ఒకేసారి 30 నుంచి 70 రూపాయల వరకు తగ్గిపోవడంతో మందుబాబులు ఎడాపెడా తాగేస్తున్నారు. ఏపీలో మద్యం సేల్స్  భారీగా పెరిగాయి. దీంతో దశల వారీగా మద్య నిషేదంపై జగన్ వైఖరి మారిందా... ఏపీలో ఇక మద్య నిషేదం లేనట్టేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మాట తప్పం.. మడమ తిప్పమనే వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారని పలువురు నిలదీస్తున్నారు.

అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం.. తక్కువ స్థాయిలో సునామీ కూడా 

అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. దీని ప్రభావం వల్ల సోమవారం స్వల్ప సునామీ తీరానికి వచ్చింది. ఐతే ఈ భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత మంది చనిపోయారన్న వివరాలు ఇంకా అందవలసి ఉంది. అయితే భారీ భూకంపం రావడంతో... నష్టం కూడా ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. అయితే భూకంపం వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేయగా... తీరం వెంట ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.   భూకంపం వచ్చిన అలస్కా కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాండ్ పాయింట్ నగరం తీరంలో సముద్రపు అలలు 2 అడుగుల ఎత్తుకి ఎగసిపడ్డాయని తెలుస్తోంది. తీరం నుంచి 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం వల్ల కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకూ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూకంపం వచ్చిన మొదట్లో భారీ సునామీ రావచ్చని అధికారులు అంచనా వేసినా తర్వాత స్వల్ప సునామీగా హెచ్చరికను మార్చారు. అయితే భూమి చాలా లోతున భూకంపం వచ్చింది కాబట్టి... మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది.

పడవ కొనాల్సిందే! వరదలపై హైదరాబాదీల సెటైర్లు 

కుండపోత వానలతో హైదరాబాద్‌ అతలాకుతలం అవుతోంది. వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో భాగ్యనగరం జలమయమైంది. గతవారం కురిసిన వర్షాలు, వరద ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తడంతో జనం బెంబేలవుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. వాహనాదారులు రోడ్డెక్కాలంటే జంకుతున్నారు.    హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ వర్షాలకు భాగ్యనగరంలో బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. నగరంలో వందలాది కాలనీలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. సిటీలోని రోడ్లు, వీధులు, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. నీటిలో చిక్కుకున్న వారికి పడవల ద్వారా సహాయక చర్యలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వరదలపై సోషల్‌ మీడియాల్లో నెటిజన్‌లు ఫన్నీ మీమ్స్ క్రియోట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన కారును ఏకంగా తాడుతో ఇంటి గేటుకు కట్టేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. గతంలో తడి, పొడి చెత్త కోసం రెండు బుట్టలను ఇచ్చినట్లు.. ఈ సారి ఒక తాడు, చైన్‌ను ఇస్తే బాగుంటుంది అని ఓ వ్యక్తి కామెంట్‌ చేయగా, పాపం వరద నీటితో తన కారును కొట్టుకొని పోకూడదని అతడు చేసిన ప్రయత్నం ఫలించాలని కోరుకుంటన్నా అంటూ మరో వ్యక్తి కామెంట్‌ చేశారు. ఇక భారీ వర్షాలు అంటూ వాతావరణశాఖ హెచ్చరికతో ముందు జాగ్రత్తగా ఇలా తాడుతో కట్టేశారని మరికొంతమంది అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు.   ఇక హైదరాబాద్‌ ప్రస్తుత పరిస్థితి గురించి సినీ నటుడు బ్రహ్మాజీ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆయన ఇంటిలోకి నీరు చేరిన ఫొటోలను  ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..  ఇది మా ఇంటి పరిస్థితి..  ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్న... దయచేసి మీకు తెలిసిన మంచి పడవ గురించి తెలపండి అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు బ్రహ్మాజీ.    హైదరాబాద్‌లో  భీభత్సం సృష్టిస్తున్న వరదలపై హీరో విజయ్‌ దేవరకొండ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల వాసులు వరదల కారణంగా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో నేను అందుబాటులో లేనందుకు చాలా బాధగా ఉంది. మీ అందరి కోసమే నేను ఆలోచిస్తున్నా.. అందరి కోసం ప్రార్థనలు చేస్తున్నా.. తొందరగా అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను.." అని విజయ్‌  తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు.. మేము కూడా నిన్ను మిస్‌ అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హాథ్రాస్‌‌ ఘటనలో ఊహించని కోణం.. ఆ రైతు పాలిట శాపం

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్‌ లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యువతి మరణానికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించి తమకి న్యాయం చేయాలని బాధిత యువతి కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మూలంగా ఓ రైతు కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది. తన పంట నాశనం అయిందని, రూ.50వేలు నష్ట పరిహారం చెల్లించాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.   హాథ్రాస్‌లో బాధిత యువతిని పొలాల్లోకి తీసుకెళ్లిన నిందితులు ఓ పంట పొలంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీబీఐ అధికారులు పంట పొలంలో క్రైం సీన్‌ను పరిశీలించారు. ఆ సమయంలో క్రైం సీన్‌ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానిని ఆదేశించారు. క్రైం సీన్‌లో సాక్ష్యాధారాలను సేకరించి భద్రపరిచే వరకూ పొలానికి నీళ్లు పెట్టవద్దని, కోత కోయవద్దని అధికార యంత్రాంగం ఆదేశించింది. సకాలంలో నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో రెండున్నర ఎకరాలలో ఉన్న పంట నాశనం అయిపోయింది. దానికి తోడు చాలామంది పంటను తొక్కారు. దీంతో పంట నాశనమై 50 వేల రూపాయల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయిందని రైతు వాపోయాడు. ఐదుగురు కుటుంబ సభ్యులతో కూడిన తన కుటుంబం పొలాన్ని నమ్ముకునే బతుకుతోందని, పెట్టుబడి నిమిత్తం లక్షా అరవై వేలు లోన్ తీసుకున్నానని, ఇప్పుడు తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు డిమాండ్ చేశాడు.

మహానగరంలో విలయంపై 'రంగం'లో మహంకాళి ముందే హెచ్చరించింది.. 

వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమవుతున్న సంగతి తెల్సిందే. ఈ వర్షాలతో కొన్ని చోట్ల ఐతే అపార్ట్ మెంట్లలోని మొదటి రెండో ఫ్లోర్ వరకు నీరు రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక పక్క నాళాలు కబ్జా.. మరో పక్క చెరువులకు గండ్లు పడడంతో కాలనీలు.. చెరువులను తలపిస్తున్నాయి. ఇంతకు ముందు ఎపుడు చూడని స్థాయిలో వరద నీటికి అటు పశువులు. ఇటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   అయితే ఈ విపత్తు గురించి బోనాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద జరిగే భవిష్యవాణి "రంగం"లో అమ్మవారు పూనిన మహిళ స్వర్ణలత ముందే హెచ్చరించింది. "గంగ వస్తుంది రా.. అంతా కొట్టుకుపోతుంది, ఇంక మీరు ఆలోచించేది లేదు. నేను చెప్పేది లేదు. ఏడుగురు అక్కాచెల్లెళ్లం.. ఆగమేఘాల మీదున్నాం. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అందరూ జాగ్రత్తగా ఉండాలని" ఆ రంగంలో స్వర్ణలత ఛేప్పారు. అంతేకాకుండా ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదని" ఆమె హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ సంవత్సరం జరిగిన రంగంలో ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచ రాజకీయాల్లో సంచలనం జేసిండా అర్డెర్న్‌..!

రాజకీయాల్లో రాణించాలంటే ఉండాల్సిన లక్షణాలు కష్టించే మనస్తత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, దూసుకెళ్లే నైజం, దేన్నైనా ఎదుర్కోగల గుండె ధైర్యం. ఈ లక్షణాలన్నీ చిన్నప్పటినుండి ఒంటపట్టించుకున్న జేసిండా వరుసగా రెండోసారి న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. న్యూజిలాండ్ పార్లమెంటు కు జరిగిన ఎన్నికల్లో 120 సీట్లకు గాను, జేసిండా సారధ్యంలోని లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో  64 సీట్లను సాధించింది. అయితే ఇప్పటివరకూ న్యూజిలాండ్ చరిత్రలో ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది లేదు. అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే ఆ దేశాన్ని పాలిస్తూ వచ్చాయి. కానీ మొదటి సారి చరిత్రను తిరగరాసి రెండవసారి న్యూజిలాండ్ పీఠాన్ని దక్కించుకున్న ఘనత జేసిండా దే.. అందుకే 'జేసిండా ది గ్రేట్' అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..   సంచలనాత్మక నిర్ణయాలకు, సరికొత్త రికార్డు లకు పెట్టింది పేరు జేసిండా అర్డెర్. న్యూజిలాండ్ ప్రధానిగా చిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టారు. దేశ పరిపాలనా బాధ్యతతో పాటు తల్లిగా బిడ్డ పెంపకం బాధ్యతను కూడా సమర్ధవంతంగా నిర్వహించారు. మూడు నెలల పాపాయితో ఐక్యరాజ్యసమితిలో  ప్రసంగించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. దేశపరిపాలన, బిడ్డ ఆలనాపాలన రెండింటికీ ప్రాధాన్యత ఇస్తున్న ఆమె నిబద్ధతను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కొనియాడారు.   ఇంత ఘనత సాధించిన జేసిండా న్యూజిలాండ్ లోని హోమిల్టన్ లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రోజ్ అర్డెర్న్‌ పోలీసు డిపార్ట్మెంట్ లో చిన్న ఉద్యోగి. తల్లి లారెల్, ఇద్దరూ అడపిల్లలే. పెద్దామ్మాయి లూయిస్, రెండో అమ్మాయి జేసిండా. చిన్నప్పటి నుండి కష్టించే పనిచేసే గుణం జేసిండా సొంతం. స్కూల్ లో టీచర్ పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావు అని అడిగితే పొలిటీషియన్  అంది. ఇలా రాజకీయాలపై ఆమెకు ఉన్న ఆసక్తిని టీచర్లు మరింత పెంచారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆ దేశ ఎంపీ మారలిన్ వారన్ ఇంటర్వ్యూ చేసి స్కూలులో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆమె స్పూర్తితో మానవ హక్కుల సంఘం లో కార్యకర్తగా చేరింది. కాలేజీ రోజుల్లో కూడా విద్యార్థి నాయకురాలిగా చురుకైన పాత్ర పోషించింది. వైకాటో యూనివర్సిటీ లో పీజీ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ వెళ్లింది. పదిహేనేళ్ళ వయసులోనే లేబర్ పార్టీలో చేరి సభలు, సమావేశాల్లో పాల్గొంది. 2018లో మౌంట్ ఆల్బర్ట్ నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. ఆ తర్వాత కొద్దికాలానికే లేబర్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. తొమ్మిదేండ్ల పాటు ప్రతి పక్ష హోదాలో ఉన్న లేబర్ పార్టీని గెలిపించడమే కాకుండా చిన్న వయసులో ప్రధాని గా రికార్డు సృష్టించింది. రెండోసారి ప్రధానిగా ఎన్నికై తన రికార్డును తానే బద్దలు కొట్టింది.   ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ని పూర్తిగా అరికట్టేలా కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేసింది. కరోనా పరీక్షలు  విస్తృతంగా చేస్తూ వైరస్ వ్యాప్తిని అదుపుచేయడంలో జేసిండా పోషించిన కీలక పాత్ర ఆమెను మరోసారి గెలిచేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.