గడువు ప్రకారమే గ్రేటర్ పోల్! వరదలతో మారిన గులాబీ ప్లాన్?
posted on Oct 15, 2020 @ 1:12PM
గ్రేటర్ లో టీఆర్ఎస్ కు వరదపోటు తగలనుందా? జీహెచ్ఎంసీ ముందస్తు ఎన్నికలపై గులాబీ పార్టీ ఆలోచనలో పడిందా? గడువు ప్రకారమే బల్దియా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుందా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వస్తోంది. గ్రేటర్ ఎన్నికలను మూడు నెలల ముందే నిర్ణయించాలని భావించిన అధికార పార్టీ.. ఆ దిశగా కసరత్తు కూడా చేసింది. ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ అయితే మరింత స్పీడ్ గా వెళ్లారు. గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ వారిని పరుగులు పెట్టించారు. అయితే తాజాగా గ్రేటర్ ఎన్నికలపై అధికార పార్టీ ఆలోచనలో పడిందని తెలుస్తోంది. ముందస్తు వెళ్లకుండా షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని భావిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు హైదరాబాద్ లో వచ్చిన వాన, వరదలే కారణమంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు... అధికార పార్టీని షేక్ చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే నగరంలో వరద బీభత్సం పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. వరద నివారణ చర్యలు చేపడతామంటూ అరేండ్లుగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఎక్కడా ఏమి చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. వరదలో ఉన్న ప్రజలను కాపాడటంలోనూ విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. వరద బాధితులకు ఆహారం అందించడం లేనూ బల్దియా చేతులెత్తిసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు అధికారులు ఎవరూ రాకపోవడంతో స్థానిక యువకులే సాహసం చేసి వృద్ధులు, పిల్లలను ఇండ్ల నుంచి బయటికి తీసుకొచ్చిన విజువల్స్ వైరల్ గా మారాయి. మంగళవారం రాత్రి వరద ముంచెత్తితే జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం మధ్యాహ్నానికి తమ దగ్గరకు వచ్చారని కొన్ని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ స్వయంగా జనాగ్రహం చవిచూశారు. తమ ప్రాంతానికి వచ్చిన కేటీఆర్ తో స్థానికులు వాగ్వాదానికి దిగడం కనిపించింది. వర్షాలు వచ్చినప్పుడల్లా వరదలు ఇండ్లను ముంచెత్తుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జనాలు మంత్రిని నిలదీశారు. ప్రచారం చేసుకోవడమే తప్ప మీరు చేసిందేంటని కొందరు కేటీఆర్ ను నేరుగానే ప్రశ్నించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఆయన హడావుడిగా పర్యటించి వెళ్లారు. మంత్రి దగ్గరకు జనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడం ఎల్బీనగర్ ఏరియాలో వివాదాస్పదమైంది. తమతో మాట్లాడకుండా, సమస్యలు తెలుసుకోకుండా ... మంత్రి కేటీఆర్ ఇక్కడికి ఎందుకు వచ్చారని మహిళలు ప్రశ్నించడంతో బల్దియా అధికారులు సమాధానం చెప్పకోలేక దిక్కులు చూశారు.
వరదలు ముంచెత్తడంతో గతంలో ఎప్పుడు లేనంతా భాగ్యనగరం విలయాన్ని చూసింది. ప్రకృతి విలయానికి 30 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. పాత భవనాలు కూలి కొందరు సజీవ సమాధయ్యారు. నగరంలోని వందలాది కాలనీలు , వేలాది ఇండ్లు పూర్తిగా నీట మునిగాయి. లక్షలాది జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లు, బైకులు ఎన్ని కొట్టుకుపోయాయే లెక్కలేదు. వాహనాలు వరదలో పోతుండగా చూడటం తప్ప ఎవరూ ఏం చేయలేని పరిస్థితి ఉందంటే వరద ఉధృతి రేంజ్ లో ఉందో ఊహించవచ్చు. సిటీలోని రహదారులు, కాలనీలు చెరువులుగా మారాయి. హైదరాబాద్ నగరం కనివిని ఎరుగని జల విలయాన్ని చూసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
పాతబస్తీ అయితే చిన్నపాటి సముద్రంలానే కనిపించింది. వందలాది మంది కొన్ని గంటల పాటు వరద నీటిలోనే ఉండిపోయారు. బిల్టింగులపైకి చేరి సాయం చేయాలని, రక్షించాలని కేకలు పెట్టారు. వరద కట్టడిలో విఫలమైన అధికారులు.. వరద నుంచి బాధితులను కాపాడటంలోనూ ఆలస్యంగా స్పందించారు. వరద ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం కూడా సిబ్బందికి కష్టంగా మారింది. పాతబస్తీలో సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను ఉపయోగించాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ కు తోడుగా ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగి వందలాది మందిని వరదల నుంచి రక్షించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ లేకపోవడంతో ప్రజలు అంధకారంలో ఉండిపోయారు.
హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌లా తయారు చేస్తాం.. పాతబస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సార్లు ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చి ఆరేండ్లైనాఅతీ గతి లేదు. అభివృద్ధి చెందడం కాదు గతంలో కన్నా సమస్యలు పెరిగాయంటున్నారు ప్రజలు.
ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 60 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. అయితే సిటీలో ఎక్కడా కొత్త నాలాలు వేయలేదు. ఉన్నవాటిని విస్తరించలేదు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించలేదు. నగరంలోని చెరువులు కబ్జాకు గురికావడంతో వరద ఉధృతికి వాటి కట్టలు తెగాయి. నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరదంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. చెరువుల కబ్జాలు అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలేవి తీసుకోలేదని సిటీ జనాలు మండిపడుతున్నారు. 60 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని ఆరోపిస్తున్నాయి. డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ విశ్వనగరమంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని మండిపడుతున్నారు. విపక్షాలు ఆరోపణలు, జనాల ఆగ్రహాన్ని స్వయంగా చూసిన కేటీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై వైఖరి మార్చుకున్నట్లు చర్చ జరుగుతోంది. వరదలతో ప్రభుత్వంపై జనాలంతా ఆగ్రహంగా ఉన్నారని, ఇప్పట్లో ఎన్నికలకు వెళితే వ్యతిరేక ఫలితాలు వస్తాయని కేటీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి వరకు గడువుంది. ఆ సమయానికి ప్రజల్లో కొంత మార్పు వస్తుందని, వరదలను మర్చిపోయే అవకాశం ఉంటుందని మెజార్టీ గులాబీ నేతల అభిప్రాయంగా ఉందట. అందుకే గ్రేటర్ లో ముందస్తుకు వెళ్లకూడదని కేటీఆర్ దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. అయితే వరదల కారణం కాకుండా కరోనా వంకతోనే .. షెడ్యూల్ ప్రకారమే బల్దియా ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ చెప్పాలని డిసైడైనట్లు తెలుస్తోంది.