తిరుపతిలో యువతిపై పాస్టర్ అత్యాచారం.. ఫిర్యాదుపై పట్టించుకోని దిశా స్టేషన్ పోలీసులు
posted on Oct 15, 2020 @ 11:15AM
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన 20 ఏళ్ల యువతిపై ఓ పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడదమే కాకుండా అత్యాచారం చేశాడు. ఈ ఘటన పై బాధితురాలి తల్లి కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు దిశా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా కేసు నమోదు చేయకపోవడంతో.. వారు స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు అదనపు ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది.
ఈ అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం "తిరుపతిలో ఉండే పాస్టర్ దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో గత నెల 4వ తేదీన మా పెద్దకుమార్తె (బాధితురాలు) పనికి చేరింది. అయితే ఈ నెల 3వ తేదీన దేవసహాయం కారులో వచ్చి.. సరకు డెలివరీ ఇవ్వాలని.. బాధితురాలిని తీసుకెళ్లాడు. అలా చెప్పి తీసుకెళ్లిన పాస్టర్ రేణిగుంట రోడ్డులోని తుకివాకం గ్రామ సమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత అమ్మాయి ఇంటికి వచ్చాక జరిగిన ఘోరం గురించి తమకు తెలిసింది. దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దిశ పోలీస్ స్టేషన్‌కు వెళితే.. వాళ్లతో మీరు పోరాటం చేయలేరని అక్కడి అధికారులు అన్నారు. అంతేకాకుండా మా అమ్మాయిని వేరే పని చేసుకోమని కూడా సలహా ఇచ్చారు. దీంతో మేము స్పందన కార్యక్రమం ద్వారా ఈ దారుణం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం" అని ఆమె చెప్పారు. ఇంకా, స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదును అదనపు ఎస్పీ సుప్రజ.. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కు పంపడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి.. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితురాలు తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటన పై అలాగే.. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా టీడీపీ నేత నరసింహయాదవ్, టీఎన్‌ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ శ్రేణులు ధర్నా చేసారు.