రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు 

దుబ్బాక ఉప ఎన్నిక , విపక్షాల ఆరోపణలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసలు లీడరే కాదన్నారు కేటీఆర్. గతంలో టీడీపీలో ఉన్న రేవంత్ ఇప్పుడు  కాంగ్రెస్ లో ఉన్నారని... త్వరలోనే బీజేపీలోకి వెళ్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే పార్టీ మారుతారని చెప్పారు కేటీఆర్. దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకపోవచ్చని మంత్రి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది కాబట్టే ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ గెలుస్తోందన్నారు కేటీఆర్.   సిద్ధిపేటలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనా స్పందించారు కేటీఆర్. సిద్ధిపేటలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని... లేనిది ఉన్నట్టు చెప్పడం బీజేపీ నేతల అలవాటని కేటీఆర్ విమర్శించారు. తాము ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నామని... తమ ఓపిక నశిస్తే ప్రధాని మోడీని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మాట్లాడటం తమకు కూడా వచ్చని అన్నారు. బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి సూచించారు కేటీఆర్.   మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్ కు ఇంత వరకు బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటి వరకు 27 వేల కోట్ల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. బీజేపీ నేతలు అసత్యాలు చెప్పడం మానుకంటే వారికే మంచిదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై ఇంతవరకు మాట్లాడని కేటీఆర్.. పోలింగ్ కు ఐదు రోజుల ముందు హాట్ కాెమెంట్స్  చేయడం చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో పోటీ తీవ్రంగా ఉండటం వల్లే కేటీఆర్ స్పందించారనే ప్రచారం జరుగుతోంది.  

బైడెన్ అవినీతిని దాస్తున్నారు.. మీడియాపై ట్రంప్ ఫైర్  

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్దీ రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ లో టెన్షన్ మరింత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎపుడు తన అనుచిత వ్యాఖ్యలతో వివాదాల్లో మునిగి తేలే ట్రంప్ తాజాగా అమెరికన్ మీడియాపై ఫైరయ్యారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అవినీతిని అమెరికన్ మీడియా తొక్కిపెడుతోందని అయన మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు, అలాగే బడా టెక్నాలజీ కంపెనీలు బైడెన్‌ నుంచి లబ్ది పొంది, ఆయనను రక్షించేందుకు ఆరాటపడుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగానే ఆ సంస్థలు అడ్డుకుంటున్నాయని అయన విమర్శించారు.   అమెరికాలో ఇటువంటి పక్షపాత వైఖరి ఇంతకుముందు ఎప్పుడూ లేదని, ఇప్పుడే మొదటి సారి చూస్తున్నామని అయన అన్నారు. అయితే చివరికి ఇది ఆ సంస్థలకే నష్టం చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఎన్నికలను ప్రస్తుత ప్రభుత్వ సూపర్ ఎకనమిక్ రికవరీకి, బైడెన్ డిప్రెషన్‌కు మధ్య జరుగుతున్న పోటీగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు ఈ రెండింటిలో ఏది కావాలో నిర్ణయించుకోవాలని కోరారు. ఇది ఇలా ఉండగా, మాస్కో మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు అందినట్టు ట్రంప్ కొద్దికాలం క్రితం ఆరోపించారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్మృతి ఇరానీ సూచించారు.   మరోవైపు.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువైంది. కొత్తగా 43,893 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. కరోనాతో మరో 508 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,20,010 కి చేరింది. ప్రస్తుతం 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో తుదితీర్పు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో తుదితీర్పు వెల్ల‌డైంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌ (24) కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్ తీర్పు ప్రకటించారు.   బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఏడాది మే 21న తొమ్మిది మందిని ఆహారంలో విషం కలిపి హ‌త్య‌చేసి వరంగల్ శివారులోని గొర్రెకుంట బావిలో పడేశాడు.   గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో మక్సూద్ కుటుంబం నివసించేది. ఆ పక్కనే ఇద్దరు బీహారీ యువకులు అద్దెకు ఉండేవారు. మక్సూద్ కుటుంబంతో సంజయ్‌ కి పరిచయం ఉంది. మక్సూద్ మరదలు రఫీకాతో సంజయ్ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశాడు. అయితే ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో.. తమవాళ్లకు పరిచయం చేస్తానని నమ్మించి తీసుకెళ్లి.. రైలు నుంచి తోసి హత్య చేశాడు.   అయితే, మక్సూద్ కుటుంబం రఫీకా గురించి ఆరా తీయడం, పోలీస్ కేసు పెడుతామని బెదిరించడంతో.. పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఆ కుటుంబం మొత్తాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఇదే క్రమంలోమక్సూద్ ఇంట్లో జరిగిన అతని మనవడి బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. ఆ పార్టీకి ఇద్దరు బీహారీ యువకులు కూడా హాజరయ్యారు. పథకం ప్రకారం ఆహారంలో విషం కలిపి అందర్నీ హత్య చేశాడు.    నిజానికి తొలుత ఇద్దరు బిహారీ యువకులను వదిలేద్దామని భావించినట్టు సంజయ్‌ విచారణలో వెల్లడించాడు. కానీ హత్యల విషయం వారి ద్వారా బయటకు వస్తుందన్న భయంతో వారిని కూడా హత్య చేసినట్టు అంగీకరించాడు. అలా ఒక్క హత్యను కప్పి పుచ్చుకోవడానికి మరో తొమ్మిది మందిని సంజయ్ హత్య చేశాడు.

కొంపదీసి ఓట్లు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో లెక్కిస్తారా.. విజయశాంతి

దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి తరుఫున అన్ని తానే అయి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ రావు ఈ ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అనేక సందేహాలకు తావిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అనుమానం వ్యక్తం చేసారు. మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసారు. ఫలితాలు ఎలా ఉండాలో ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే... అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు ఒక స్పష్టత వచ్చి ఉంటుందని విజయశాంతి తెలిపారు. హరీష్ రావు వ్యాఖ్యలను పరిశీలిస్తే... దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎం మిషన్లను కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పెట్టి, ఓట్లను లెక్కిస్తారేమోనని అనుమానం కలుగుతోందని ఆమె ఎద్దేవా చేశారు.   అసలు అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ పార్టీ.. అలాగే హరీష్ రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని ఫేస్‌బుక్‌ కామెంట్ లో ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారేమోనన్న చర్చ కూడా ప్రజలలో జరుగుతోందని విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నట్టుగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి తెలిపారు.

ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌ గా మాజీ ఎమ్మెల్యే

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ)కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ ను నియమించింది. ఎస్వీబీసీ ఛైర్మన్‌ గా నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లపాటు పదవిలో ఆయన కొనసాగనున్నారు.   కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్‌ గా సినీనటుడు పృథ్వీరాజ్ ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆయన వ్యవహారంతో ఛానల్ ప్రతిష్ఠ బజారున పడే స్థితికి చేరుకుంది. మహిళా ఉద్యోగినితో ఆయన ఫోన్ కాల్ లీక్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆయనను ఆగమేఘాలు మీద సాగనంపింది.     ఆ తర్వాత ఎస్వీబీసీ కొత్త చైర్మన్ ఎంపిక పై ప్రభుత్వం దృష్టి సారించింది. చైర్మన్ రేసులో జర్నలిస్ట్ స్వప్న, శ్రీనివాసరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ప్రస్తుతం ఎస్వీబీసీలో స్వప్న, శ్రీనివాసరెడ్డిలు డైరక్టర్లుగా పనిచేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక వీరికి ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు.    అయితే, ఇప్పటికే తిరుమల పవిత్రతను జగన్ సర్కార్ దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో తిరుమలకు సంబంధించిన పదవుల ఎంపికపై ఇక ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే ఎస్వీబీసీ ఛైర్మన్‌ గా సాయికృష్ణ యాచేంద్రను ఎంపిక చేశారని సమాచారం.

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం వసంతవాడ వాగులో ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన ఆరు మృతదేహాలను వెలికితీశారు. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. దేవీ నవరాత్రుల పురస్కరించుకుని కొన్ని కుటుంబాలు వాగు స‌మీపంలో వ‌న‌భోజ‌నాల‌కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వాగులో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు గొట్టుపర్తి మనోజ్ (15), కూనవరపు రాధాకృష్ణ (15), కర్నాటి రంజిత్ (16), శ్రీరాముల శివాజీ (17), గంగాధర వెంకట్ (15), కెల్లా ప‌వ‌న్ (17)గా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నోట్ల కట్టల వ్యవహారం తేల్చేందుకు.. దుబ్బాక ఉప ఎన్నికకు సీఈసీ ప్రత్యేక పరిశీలకుడు 

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మొన్న ఆదివారం సిద్దిపేటలో రాష్ట్ర పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య నోట్ల కట్టల స్వాధీనంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెల్సిందే. ఇదే విషయమై బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం తో అక్కడి పరిస్థితులు మరింత వేడెక్కాయి. దీనిపై స్థానిక పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న‌ర‌ని బీజేపీ ఆరోపించింది. సిద్ధిపేట ఘ‌ట‌న త‌ర్వాత కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక ప‌రిశీల‌కుడిని పంపాల‌ని, కేంద్ర బ‌లగాల ర‌క్ష‌ణ‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని బీజేపీ కోరింది. మరోవైపు దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. తాజాగా నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడిగా నియమించింది. ఈ మొత్తం వ్యవహారం పై స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు. ఐపీఎస్ అధికారి స‌రోజ్ కుమార్ కు పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు జ‌రిపినందుకు గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం అవార్డు కూడా ల‌భించింది.

పోలింగ్ కు ముందు రైతు బంధు! దుబ్బాకలో హజూర్ నగర్ ప్లాన్

తమకు సవాల్ గా మారిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చివరి అస్త్రంగా రైతు బంధును ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌ రైతులకు ఈసారి అందరికన్నా ముందు రైతుబంధు డబ్బులు వేసేలా సర్కారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.    నవంబర్‌ 3న పోలింగ్ జరగనుండగా.. అందుకు ఒకటి, రెండు రోజుల ముందు రైతుల అకౌంట్లలోకి నగదు పడేలా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.ప్రగతి భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. అంతేకాదు దుబ్బాక జనానికి ఆసరా పెన్షన్లూ ముందే ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం.    దుబ్బాక నియోజకవర్గంలో 1.82 లక్షల మంది ఓటర్లు ఉండగా వీళ్లలో 60 వేల మంది రైతులున్నారు. ఈ రైతుల్లో రెండు, మూడు ఎకరాల్లోపు వాళ్లే ఎక్కువున్నారు. వీళ్లందరికీ రైతుబంధు ఇవ్వడానికి సుమారు రూ. 300 కోట్లు అవసరమవుతుందని అధికారులు లెక్కలేసినట్టు తెలిసింది. రాష్ట్రమంతా డబ్బులేయాలంటే రూ. 7,220 కోట్లు కావాలని, ప్రస్తుతం సర్కారు దగ్గర డబ్బుల కొరత ఉందని అధికారుల్లో చర్చ నడుస్తోంది. కాబట్టి ముందు దుబ్బాకకు, విమర్శలు రాకుండా ఇంకొన్ని ప్రాంతాలకు నగదు బదిలీ చేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌‌లోనూ అధికార పార్టీకి రైతుబంధు మేలు చేసిందని ప్రచారం ఉంది. కొన్నిచోట్ల ఓటర్లు క్యూలో ఉన్నప్పుడే వాళ్ల అకౌంట్ లోకి డబ్బులు పడ్డాయని టాక్ ఉంది.    ఈ మధ్య కురిసిన వానలకు వరి, పత్తి, పెసర, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మక్కలను కొనేందుకు సర్కారు ముందుకు రాలేదు. మార్కెట్ లో ధర లేదని, కొనలేమని చేతులెత్తేసింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో దిగొచ్చింది. ఈ విషయంలో దుబ్బాక రైతులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని టీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. వాళ్ల కోపం చల్లార్చేందుకు రైతుబంధు సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు. పోలింగ్ కు ముందు పథకం సొమ్ము అందిస్తే రైతులు టీఆర్‌‌ఎస్‌‌కు అనుకూలంగా ఓటేస్తారని లీడర్లు అనుకుంటున్నారు.   గతేడాది అక్టోబర్‌‌లో హుజూర్‌‌నగర్ ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్‌‌కు ముందు హుజూర్ నగర్ రైతులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు రైతుబంధు సాయం అందించారు. వానకాలం సీజన్ బకాయిలను నిధుల కొరత కారణంగా వాయిదా వేసి ఎన్నికల ప్రచారం మొదలైన వెంటనే విడుదల చేశారు. ఓ వైపు ప్రచారం జరుగుతోంటే మరోవైపు రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రైతుల ఓటింగ్ శాతం పెరిగి టీఆర్ఎస్ క్యాండిడేట్‌‌ గెలిచారని ఇప్పటికి టీఆర్ఎస్ లీడర్లు చెబుతుంటారు.   రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 10వ తేదీ నాటికి ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తారు. దుబ్బాక సెగ్మెంట్‌లో ఆసరా లబ్ధిదారులు దాదాపు 20 వేల మంది ఉన్నారు.  బై ఎలక్షన్‌ దృష్ట్యా దుబ్బాకలో ఈ పెన్షన్లను ముందే అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీరందరికీ పోలింగ్‌కు ముందు పెన్షన్లు  అందించే చాన్స్ ఉందా అని రూరల్ డెవలప్ మెంట్ అధికారులను ప్రగతిభవన్ వర్గాలు ఆరా తీసినట్టు తెలిసింది.

కరోనా వాక్సిన్ పై బ్రిటన్ ప్రత్యేక అధికారి సెన్సేషనల్ కామెంట్స్ 

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిరోధించేందుకు వాక్సిన్ల కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతన్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని వాక్సిన్లు ఫైనల్ ట్రయల్స్ లో ఉన్నాయి. అయితే మరో పక్క కొంత మంది శాస్త్రవేత్తలు మాత్రం తొలి తరం వాక్సిన్ల విషయంలో అతి విశ్వాసం పనికిరాదని, ప్రజలు మాస్కులు, సామాజిక దూరం వంటి నియమాలు కచ్చితంగా పాటించాలని చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వ ఉన్నాతాధికారి ఒకరు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. త్వరలో రాబోయే మొదటి తరం టీకాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవచ్చని బ్రిటన్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కరోనా వాక్సిన్ టాస్క్ ఫోర్స్‌ చీఫ్ కేట్ బింగమ్ బాంబు పేల్చారు. ఈ వాక్సిన్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవచ్చని, కరోనా నుండి ప్రతి ఒక్కరినీ ఇవి రక్షించలేకపోవచ్చని ఆమె తెలిపారు. కరోనా వాక్సిన్ కోసం ప్రపంచమంతా వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రస్తుత సమయంలో బ్రిటన్ ప్రభుత్వ ఉన్నతాధికారి చేసిన ఈ కామెంట్స్ కు చాలా ప్రాధాన్యం ఏర్పడింది.   "అసలు మనకు ఎప్పటికైనా కరోనా వాక్సిన్ అందుబాటులోకి వస్తుందా రాదా అనే దానిపై చాలా సందేహాలున్నాయి. అందుకే.. మనం అంతాబాగానే ఉంటుందిలే అనే అలోచన ధోరణితో కాకుండా జాగ్రత్త పడాలి. అతివిశ్వాసానికి దూరంగా ఉండాలి" అంటూ కేట్ బింగమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "తొలి తరం వ్యాక్సిన్లు కరోనా నుంచి పూర్తి రక్షణను ఇవ్వలేకపోవచ్చు. అసలు కరోనా సోకకుండా ఆపలేకపోవచ్చు. ఇవి కేవలం వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గించవచ్చు. ఇది కూడా ప్రతి ఒక్కరి విషయంలో నిజం కాకపోవచ్చు. అయితే మనం ఆశిస్తున్న సుదీర్ఘ రక్షణను మాత్రం ఇవ్వలేకపోవచ్చు. ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం సిద్ధంగా ఉండాలి" అని ఆమె తెలిపారు.   అంతేకాకుండా.. మొదటి తరం వాక్సిన్లలో చాలావరకు విఫలం కూడా కావచ్చని, ఒకవేళ అన్నీ విఫలమైనా ఆశ్చర్య పోవద్దని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే 65 ఏళ్లు పైబడిన వారికి రక్షణ కల్పించే వాక్సిన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆమె అన్నారు. ఇదే సమయంలో ప్రపంచానికి కోట్ల సంఖ్యలో కరోనా డోసుల అవసరం ఉందని, కానీ..ప్రస్తుతమున్న వాక్సిన్ తయారీ సామర్థ్యం ప్రపంచ జనాభాకు అసలేమాత్రం సరిపోదని ఆమె తేల్చి చెప్పారు. బ్రిటన్ తో స‌హా ప్ర‌పంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు.   ఇది ఇలా ఉండగా.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ సైన్టిస్టులు నిన్న ఒక కీలక అధ్యయానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కరోనా నుండి కోలుకున్న వారిపై జరిగిన పరిశోధనలో.. కరోనా నుంచి రక్షించే యాంటీబాడీల సంఖ్య బ్రిటన్ ప్రజల్లో క్రమంగా తగ్గుతోందని, వారిలో ఈ నిరోధక శక్తి తక్కువ కాలం పాటు మాత్రమే ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో సమాజంలో కరోనా రోగనిరోధశక్తి వేగంగా తగ్గిపోవచ్చనే ఆందోళన అక్కడి ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోపక్క రెండో సారి కరోనా దాడిచేయచ్చనే అంచనాతో బ్రిటన్ ప్రభుత్వం సిద్ధం అవుతోందని వార్తలు వస్తున్నాయి.

ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశంపై జగన్ సర్కార్ పిటిషన్.. తిరస్కరించిన హైకోర్ట్

ఏపీలోని జగన్ సర్కార్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. మొన్న మార్చిలో స్థానిక ఎన్నికలను కరోనా కారణంతో ఎస్ఈసీ వాయిదా వేసినప్పుడు మొదలైన వివాదం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ సర్కార్ అర్ధాంతరంగా పదవి నుండి తప్పించడంతో పరాకాష్టకు చేరగా అయన కోర్టుకు వెళ్లి మరీ తన పదవిని తిరిగి పొందిన సంగతి తెలిసిందే.   కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నెలలో వాయిదాపడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమయ్యింది. ఇదే విషయంపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని తెలపాలని హైకోర్టు కోరిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు ఎస్ఈసీ ఈరోజు అఖిలపలక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశ నిర్వహణను నిలిపివేయాలని ప్రభుత్వం ఆ పిటిషన్‌లో కోరింది. అయితే తాజాగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటీషన్ ను తిరస్కరించింది.   అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ హాజరుకావడం లేదని.. పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సమావేశం నిర్వహించడానికి ముందు సుప్రీంకోర్టు.. ఏ తీర్పు ఇచ్చిందో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చదువుకోవాలని అంబటి సూచించారు. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసిందన్నారు. దీనిపై హెల్త్ సెక్రటరీ ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ముందు రాజకీయ పార్టీలను పిలవడంలో ఆయనకు వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయంటూ అంబటి ఆరోపించారు. దీంతో ఈ సమావేశానికి వెళ్లడం లేదని అయన స్పష్టం చేశారు.

సైబరాబాద్ లో కిడ్నాప్.. అనంతలో సేఫ్! బిట్ కాయిన్ లింక్ 

సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డాక్టర్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. పట్టపగలే కిడ్నాప్‌ అయిన దంతవైద్యుడి కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. డెంటిస్ట్ హుస్సేన్‌ను కిడ్నాపర్ల చెర నుంచి రక్షించారు. కిడ్నాపర్లు వైద్యుడిని బెంగళూరువైపు తీసుకెళ్తుండగా రాప్తాడు సమీపంలో అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు కారు దిగి పరారవగా, ఒక్కడు మాత్రమే పట్టుబడ్డాడు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. వైద్యుడిని హైదరాబాద్ తరలించారు. పట్టపగలే డాక్టర్ కిడ్నాప్ కావడం కలకలం రేపుగా.. కొన్ని గంటల్లోనే అనంతపురం పోలీసులు దుండగులను పట్టుకోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు.    డాక్టర్ హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న బంధువు ముస్తఫా కిడ్నాప్ ప్లాన్ చేశాడని గుర్తించారు. డాక్టర్ హుస్సేన్ ఇంటి పైన కిరాయి కి వుండే ఖలీద్ అనే వ్యక్తి ద్వారా అతను కిడ్నాప్ చేయించాడు. వాట్సాప్ కాల్ చేసి హుస్సేన్ కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు కూడా బిట్ కాయిన్ రూపంలో కావాలంటూ డిమాండ్ చేశారు. ఆ నెంబర్ ఆధారంగా వెహికిల్ ని ట్రెస్ చేసి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేసి డాక్టర్ ను సేవ్ చేశారు.    ముస్తఫా, ఖలీద్ బిట్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తారని.. అందుకే వాళ్లు ఆ రూపంలో మనీ అడిగారని గుర్తించారు. కిడ్నాపర్లకు కర్ణాటకలో హోటల్ బిజినెస్ ఉండటంతో.. అక్కడ పరిచయం ఉన్న వ్యక్తలతోనే కొడ్నాపర్ల ముఠాను హైర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల నుంచే కిడ్నాప్ కు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు అనుమాానితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది.    దంతవైద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న హుస్సేన్‌ను కొందరు దుండగులు మంగళవారం మధ్యాహ్నం బుర్ఖాలో వచ్చి కిడ్నాప్‌ చేశారు. బండ్లగూడ జాగీర్‌లో ప్రధాన రహదారిపై ఉన్న సొంత భవనంలో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు హుస్సేన్. రోగులను పరీక్షిస్తూ తీరిక లేకుండా ఉన్న ఆయన మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో తనతోపాటు తన వ్యక్తిగత సహాయకుడు సయ్యద్‌ సల్మాన్‌ మాత్రమే క్లినిక్‌లో ఉన్నారు. సరిగ్గా 1.30 గంటలకు అయిదారుగురు గుర్తుతెలియని వ్యక్తులు నల్లటి బురఖాలు ధరించి క్లినిక్‌ లోపలికొచ్చారు. సయ్యద్‌ సల్మాన్‌ను తీవ్రంగా కొట్టారు. మూతికి ప్లాస్టర్‌ను వేసి కాళ్లు, చేతులు కట్టేసి మరుగుదొడ్డిలో పడేశారు. ఆ తర్వాత వైద్యుణ్ని కొట్టారు. టేబుల్‌పై ఉన్న ఇన్నోవా కారు తాళం తీసుకుని హుస్సేన్‌ను ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. బలవంతంగా వైద్యుని కారులోనే ఎక్కించుకుని ఆరె మైసమ్మ వైపు దౌడు తీశారు.    కొంతసేపటికి తేరుకున్న డాక్టర్ సహాయకుడు సయ్యద్‌.. ఎలాగోలా మరుగుదొడ్డి నుంచి బయటపడి పాకుకుంటూ కొంతదూరం వెళ్లి కట్లు విప్పుకొని వైద్యుని ఇంట్లోనే పనిచేసే తన తండ్రికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పాడు. అలా హుస్సేన్‌ భార్యకు విషయం తెలియడంతో డయల్‌ 100కు ఫిర్యాదు చేయగానే రాజేంద్రనగర్‌ పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. క్లూస్‌టీం చేరుకుని రక్తపు మరకల నమూనాలను సేకరించింది. రాత్రి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆస్తి తగాదాలే కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.సైబరాబాద్ పోలీసులు అన్ని చెక్‌పోస్టులను అలర్ట్ చేశారు. దీంతో అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను ఎస్పీ సత్యయేసు అలర్ట్ చేశారు. అనంతపురం మీదుగా బెంగళూరుకు కిడ్నాప్ గ్యాంగ్‌ను గుర్తించిన పోలీసులు డాక్టర్‌ హుసేన్‌ను రక్షించారు.

టాప్ ఉగ్రవాదుల లిస్టులో హైదరాబాదీ

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన 18 మంది మెస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హైదరాబాదీ కూడా ఉన్నారు. ఓల్ట్ సిటీ మాదన్నపేట సమీపంలోని కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ పేరును కేంద్రం కరుడుగట్టిన ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతను రెండు దశాబ్దాలుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.    ఫర్హతుల్లా ఘోరీ అలియాస్‌ అబు సూఫియాన్‌ 1998లోనే ఉగ్రవాదం వైపు అడుగేశాడు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌(జేఈఎం) సానుభూతిపరుడిగా మారి భావసారూప్యం ఉన్న యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడం ప్రారంభించాడు. తొలుత దుబాయ్‌ పారిపోయి అక్కడ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టి అనంతరం పోలీసు ఒత్తిడి పెరగడంతో పాకిస్థాన్‌ చేరుకున్నాడు. ప్రస్తుతం అక్కడ నుంచే పనిచేస్తున్నాడు.    గుజరాత్‌లోని అక్షరధామ్‌ ఆలయంపై 2002లో జరిగిన దాడితో అతడి పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర పన్నినప్పటికీ పోలీసులు ఛేదించారు. 2005లో హైదరాబాద్ గ్రీన్‌ల్యాండ్స్ సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడిలోనూ ఘోరీ నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటనలో హోంగార్డు చనిపోయాడు. ప్రస్తుతం లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో పనిచేస్తున్న ఫర్హతుల్లా ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుల్లో ఒకడైన అమీర్ రాజాకు అత్యంత సన్నిహితుడు. దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనల్లో ఇతడి పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు.     ఇక కేంద్రం ప్రకటించిన 18 మంది ఉగ్రవాదుల జాబితాలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులైన కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో యాసిన్ భత్కల్‌కు ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఉరిశిక్ష విధించింది. కర్ణాటకకు చెందిన ఈ ముగ్గురూ దేశంలో అనేక పేలుళ్లకు సూత్రధారులు.

దేశంలో కరోనా వ్యాప్తి తరువాత మొదలైన మొట్టమొదటి అసెంబ్లీ పోలింగ్..

మనదేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కొద్దీ సేపటి క్రితం బీహార్ లో మొదలయ్యాయి. కరోనా కారణంగా ఒక్కో బూత్‌లో 1000 మంది ఓటర్లు మాత్రమే ఓటు వేసేలా ఏర్పాటు చేశారు. 80 ఏళ్లకు పైబడిన వృద్దులు అలాగే కరోనా లక్షణాలు ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శానిటైజ్ చేశారు. పోలింగ్ సిబ్బందికి మాస్కులు, ఇతర రక్షణ సామగ్రిని అందించారు. థర్మల్ స్కానర్, హ్యాండ్ శానిటైజర్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు   మొత్తం బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉండగా.. తొలి విడత పోలింగ్ లో ఈరోజు మొత్తం 71 స్థానాలకు పోలింగ్ జరుపుతున్నారు. ఈరోజు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో.. నక్సల్ ప్రభావిత జిల్లాలైన గయా, రోహ్తాస్, ఔరంగాబాద్ కూడా ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తొలి విడతలో భాగంగా ఈరోజు మొత్తం 2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.   ఈ ఎన్నికలలో బీజేపీ జేడీయూ కూటమి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి ముఖ్యులు ప్రచారం చేశారు. సీఎం నితీష్ కుమార్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఓటర్లను ప్రధాని కోరారు. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తేజశ్వి యాదవ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. నవంబరు 3న రెండో దశలో 94 స్థానాలకు, నవంబరు 7న మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు నిర్వహించి, అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు.

పంపకాలు పూర్తయ్యాయా! రెండు రోజుల రగడ అందుకేనా? 

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి రూటే సెపరేటు. ఆయన వ్యూహాలు ఎవరికి అందవు. ఆయన ఏం చేసినా దానికో లెక్క ఉంటుందంటారు. వారం రోజుల్లో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఆయన ఎత్తులు అలానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.  ఎన్నికల వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్.. తమకు సవాల్ గా మారిన దుబ్బాకలోనూ విజయం కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే రెండు రోజులుగా సిద్ధిపేట, దుబ్బాకలో హైడ్రామా జరుగుతుందంటున్నారు. కేసీఆర్ ఉచ్చులో పడిన విపక్షాలు విలవిలలాడుతుండగా.. గులాబీ నేతలు మాత్రం అధినేత తమ ముందుంచిన టార్గెట్ పూర్తి చేశారనే ప్రచారం జరుగుతోంది.     దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకతను ప్రజల నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్ ఎదుర్కొంటుందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఇంచార్జ్ గా ఉన్న ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ఈ ఎన్నిక సవాల్ గానే నిలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని భావిస్తున్న గులాబీ దళం.. ఎలాగైనా గట్టేక్కేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లకు భారీగా తాయిలాలు ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది. ఇతర పార్టీల కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తుందంటున్నారు. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో చివరి అస్త్రాలను అధికార పార్టీ బయటికి తీసిందంటున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం.. ఆ పార్టీ నేతలంతా సిద్ధిపేటకు వచ్చి ఆందోళనలు చేయడం జరిగింది.   అయితే ఇక్కడే అధికార పార్టీ తమ ప్లాన్ వర్కవుట్ చేసిందంటున్నారు. దుబ్బాక బీజేపీ నేతలంతా సిద్ధిపేటకు చేరగా.. టీఆర్ఎస్ నేతలు మాత్రం గ్రామాల్లోకి వెళ్లి పంపకాలు పూర్తి చేశారట. నిరసన కార్యక్రమాల్లో బీజేపీ నేతలుండగా.. గులాబీ నేతలు ప్రలోభాలకు తెర లేపారట. ఉప ఎన్నిక కోసం ముందే 50 మంది ఓటర్లకు ఓ ఇంచార్జ్ ను నియమించింది కారు పార్టీ. వారంతా ఈ రెండు రోజుల్లో తమకు అప్పగించిన బాధ్యతను ఫినిష్ చేశారని తెలుస్తోంది. మనీ, మందుతో పాటు ఓటర్లకు కావాల్సినవన్ని ఇప్పటికే అన్ని గ్రామాలకు చేరిందంటున్నారు. దీంతో కేసీఆర్, హరీష్ రావుల వ్యూహంలో భాగంగానే రెండు రోజుల డ్రామా నడిచిందని, విపక్షాలు ఆయన ఉచ్చులో చిక్కుకున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.    పోలీసుల సోదాల్లోనూ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. బీజేపీ నేతల ఇండ్లలోనే సోదాలు జరిగితే అనుమానం వచ్చే అవకాశం ఉండటంతో ముందుగా.. తమ పార్టీ నేతల ఇండ్లలో సోదాలు జరిపించిందనే చర్చ జరుగుతోంది. అందుకే సిద్ధిపేట మున్సిపల్ చైర్మెన్ రాజనర్సుతో పాటు ఇబ్రహీంపూర్ కు చెందిన మరో టీఆర్ఎస్ నేత ఇండ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. తర్వాత రఘునందన్ రావు బంధువుల ఇండ్లపై రైడ్ చేశారు. సిద్ధిపేట సీపీ కూడా మీడియా సమావేశంలో ఇదే విషయం చెప్పారు. మంత్రి హరీష్ రావు కూడా బీజేపీపై విమర్శలు చేస్తూ ఇదే విషయం తెలిపారు. తమ పార్టీ నేతల ఇండ్లలో సోదాలు జరిగితే తాము సహకరించామని .. బీజేపీ మాత్రం రాద్దాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. డబ్బులతో అడ్డంగా పట్టుబడటంతో ఇలా అసత్య ప్రచారం చేస్తుందని హరీష్ రావు మండిపడుతున్నారు. సిద్ధిపేట సీపీ, మంత్రి హరీష్ రావు ప్రకటనలు సేమ్ గా ఉండటంతో అంతా పక్కా ప్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ పని కానిచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.    సిద్ధిపేట జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసిన రాజకీయ విశ్లేషకులు అశ్చర్యపోతున్నారు. కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు పేలవంగా ఉంటున్నాయని, ఆయన ఉచ్చులో పడి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ప్రచారం చివరి దశలో ఉండగా రెండు రోజులు బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయలేకపోయారని వారు చెబుతున్నారు. అయినా సోదాల విషయంలో బీజేపీ ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యిందో తమకు అర్ధం కావడం లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.

మమ్మల్ని వద్దు అనే అధికారం ఎవరికీ లేదు

సిరిమానోత్సవంలో కోట సాక్షిగా పూసపాటి వంశంలో విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆనంద గజపతిరాజు భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతిరాజు కోటపై నుండి సిరిమానోత్సవం చూడటానికి రావడం పట్ల మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత గజపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. సుధా, ఊర్మిళను కోటపైకి ఎవరు తీసుకువచ్చారని మాన్సాస్‌ సిబ్బందిని, పోలీసులను నిలదీశారు. వెంటనే వారిని కోటపై నుంచి పంపించాలని పోలీస్ అధికారులను ఆమె కోరగా.. వారిని పంపించడం తమ చేతుల్లో లేదని, మీరంతా ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి ఇలాంటి వివాదాల్లో తమను లాగొద్దని అధికారులు చెప్పారు. ఇదంతా గమనించిన సుధా, ఉర్మిళ అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.    అనంతరం ట్విట్టర్‌ వేదికగా సంచయితకు ఉర్మిళ కౌంటర్‌ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా తన తండ్రి ఆనంద గజపతి రాజు మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గా ఉన్నప్పటి నుంచి కోటపై నుంచి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం హాజరు కావడానికి సంశయించినా, సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడం ఇష్టంలేక వచ్చామని తెలిపారు. ఇక్కడికి వచ్చాక తమ కుటుంబ సభ్యులెవరూ లేరని గ్రహించామని, సంచయిత ఒత్తిడి కారణంగా మమ్మల్ని కోట విడిచిపెట్టమని సిబ్బంది కోరారని తెలిపారు. ఇతరులను అగౌరవపరిచే ప్రయత్నం మీ పాత్రను తెలుపుతోందంటూ సంచయిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిమాను సంబరంలో పాల్గొనే హక్కు రాజవంశం కుటుంబ సభ్యులుగా తన తల్లికి, తనకు ఉందని, మమ్మల్ని వద్దు అనే అధికారం ఎవరికీ లేదు అని ఉర్మిళ గజపతిరాజు వ్యాఖ్యానించారు.

ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం.. వైసీపీ కీలక నిర్ణయం!

స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై బుధవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు ఎన్నికల కమిషన్ తీసుకోనుంది.    ఎన్నికల కమిషన్ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ నుంచి పాక సత్యనారాయణ హాజరు కానున్నారు. జనసేన, సీపీఎం ప్రతినిధులు ఇంకా ఖరారుకాలేదు.    ఇదిలా ఉంటే, ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని అధికార పార్టీ వైసీపీ నిర్ణయించుకుంది. వాయిదా పడ్డ ఎన్నికలు నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలన్న సుప్రీం ఆదేశాలను ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని వైసీపీ అంటోంది. ముందు రాజకీయ పార్టీలను పిలవడంతో ఎన్నికల కమిషన్ కి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతోందని చెబుతోంది. మూడు కరోనా కేసులు కూడా లేని రోజుల్లో ఎన్నికలు వాయిదా వేశారని, ఇప్పుడు రోజుకు మూడు వేల కేసులు నమోదవుతుంటే ఎన్నికలు నిర్వహిస్తారా? అని ప్రశ్నిస్తోంది.    దీనిని బట్టి చూస్తుంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కార్ పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసేదాకా ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.   కాగా, గతంలో కరోనా కారణంగా నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేయగా.. అసలు కరోనా ఎక్కడ ఉందంటూ ఆయనపై తీవ్ర విమర్శలు చేసి, ఆయనను పదవి నుంచి కూడా తప్పించింది జగన్ సర్కార్. అయితే, నిమ్మగడ్డ న్యాయం పోరాటం చేసి గెలిచి మళ్ళీ పదవి చేపట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం.. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. అయితే అప్పుడు కరోనా ఎక్కడ ఉందన్న జగన్ సర్కారే.. ఇప్పుడు కరోనా సమయంలో ఎన్నికలు ఏంటి అని ప్రశ్నించడం గమనార్హం.

లోకేష్ గురించి మాట్లాడటం పరమ వేస్ట్.. మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కొద్దీ రోజులుగా వరద బాధితులను ప్రమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో వరద బాధిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను కంట్రోల్ చేసి లోకేష్‌ను కిందికి దించేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే ఈ ఘటనపై కొందరు వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్రంలో వరదలు ఎప్పుడు వచ్చాయి? లోకేష్ ఎప్పుడు పరామర్శిస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుందని లోకేష్ తీరును తప్పు పట్టారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు కొల్లేరులో పెట్టుకుంటారా..?. లోకేశ్ ది అంతా ఆఫ్ నాలెడ్జ్ అని నాని అన్నారు. పార్టీని నడపడం రాదని... అంతేకాకుండా ట్రాక్టర్ నడపడం కూడా రాదని అయన విమర్శించారు. నిన్న కొల్లేటిలోకి ట్రాక్టర్ ను ఎలా దించాడో తెలుగుదేశం పార్టీని కూడా అలాగే దించేస్తాడని అన్నారు. బుద్ధి ఉన్నోడు ముందుగా దిగిపోండి ట్రాక్టర్ నుండి పార్టీ నుండి కూడా.. టోటల్ గా లోకేశ్ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా వేస్ట్ అని కొడాలి నాని చెప్పారు.

బీజేపీలోకి జంప్ చేయబోతున్న విజయశాంతి..? 

కొంత‌కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి త్వరలో బీజేపీ గూటికి చేర‌బోతున్నారనే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ సార‌థిగా ఉన్న విజ‌య‌శాంతి ప్రస్తుతం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూనే అధికార టీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తున్నారు. అసలు ఒక ద‌శ‌లో దుబ్బాక నుండి కాంగ్రెస్ త‌రుపున ఆమె పోటీ చేస్తారని ప్ర‌చారం జరిగినా ఆమె క‌నీసం గాంధీ బ‌వ‌న్ గ‌డ‌ప కూడా తొక్క‌లేదు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రాష్ట్రానికి వచ్చిన సమయంలో కూడ విజయశాంతి ఎక్కడ కనిపించలేదు. అయితే గత రెండు రోజులుగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో విజ‌య‌శాంతి భేటీ అవుతున్నారు. సోమ‌వారం కూడా ఆమె అర‌గంట పాటు కిష‌న్ రెడ్డి తో స‌మావేశం అయ్యారు. దీంతో విజ‌య‌శాంతి పార్టీ మార్పు దాదాపు ఖాయం అని వార్తలు వస్తున్నాయి.