దుబ్బాకలో గెలుపెవరిది! ఓటర్ల నాడి ఎలా ఉంది?
తెలంగాణలో రాజకీయంగా కాకరేపిన దుబ్బాక ఉప ఎన్నికలో ఓటరు తీర్పు ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకుని ప్రచారం చేయడంతో భారీగా ఓటింగ్ నమోదైంది. పోలింగ్ చివరి నిమిషం వరకు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ప్రయత్నించాయి. దీంతో గతంలో ఎప్పుడు లేనంత హోరాహోరీగా దుబ్బాక ఉప ఎన్నిక జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు దుబ్బాక ఓటర్లు ఎటు వైపు మెగ్గుచూపారన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. పోలింగ్ సరళిని బట్టి ఫలితాలను అంచనా వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. గ్రామాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయో అంచనా వేసుకుంటున్నారు బరిలో నిలిచిన అభ్యర్థులు.
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగి, చేగుంట మండలాలు ఉన్నాయి. తమకు అన్ని మండలాల్లో లీడ్ వస్తుందని, 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు దుబ్బాక రూరల్, నార్సింగ్ , చేగుంట, రాయపోల్ మండలాల్లో తమకు మంచి లీడ్ వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. యువత, ఉద్యోగుల ఓట్లన్ని గంపగుత్తగా తమకే పడ్డాయని, దుబ్బాకలో ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ గెలవబోతుందని చెబుతోంది కమలదళం. ఇక మల్లన్నసాగర్ ముంపు గ్రామాలున్న తోగుంట మండలంలో పోలింగ్ కాంగ్రెస్ కు వన్ సైడ్ గా జరిగిందని, మిరుదొడ్డి, చేగుంట, దుబ్బాక అర్బన్, రూరల్ లోనూ లీడ్ సాధిస్తామని హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గెలుపుపై ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమాగా ఉన్నా రాజకీయ విశ్లేషకులు, వివిధ సర్వే సంస్థల లెక్కల ప్రకారం దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ నడిచిందంటున్నారు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు నార్సింగ్ మండలాల్లో బీజేపీకి లీడ్ కనిపించిందని, రాయపోల్, చేగుంట మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడిచిందని అంచనా వేస్తున్నారు. మిరుదొడ్డి, దౌలతాబాద్, దుబ్బాక రూరల్ మండలాల్లో కారు కు ఆధిక్యత రావొచ్చని లెక్కలు వేస్తున్నారు. తోగుంట మండలంలో మాత్రమే టీఆర్ఎస్, బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సొంత మండలం కావడం, మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో 78,187 మంది రైతులు రైతుబంధు, 52,823 మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. 5,599 మందికి కల్యాణలక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్ కిట్స్ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయని, వీరందరి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఉంది. ఇక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు 30 వేలకు పైగా ఉన్నారు. వీరిపై ఆశలు పెట్టుకుంది బీజేపీ. రైతు బంధు తీసుకున్నా కేసీఆర్ సర్కార్ పై రైతులు ఆగ్రహంగా ఉన్నారని, లక్ష రుణమాఫీ అమలు చేయకపోవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మద్దతు ధర, నియంత్రిత పంటల సాగు విధానాలతో ప్రభుత్వానికి రైతులు వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు. నిరుద్యోగులంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని చెబుతున్నారు.
దుబ్బాక నియోజరవర్గంలో మొత్తం లక్షా 98 వేల 807 మంది ఓటర్లున్నారు. మొత్తం ఏడు మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో లక్షా 90 వేల మంది ఓటర్లకు గాను 1,63,658 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.92% ఓటింగ్ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు రామలింగా రెడ్డికి 89,299 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటి చేసిన మద్దుల నాగేశ్వరరెడ్డి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు కేవలం 22 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.