ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే
posted on Oct 28, 2020 @ 6:25PM
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్ ను నియమించింది. ఎస్వీబీసీ ఛైర్మన్ గా నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లపాటు పదవిలో ఆయన కొనసాగనున్నారు.
కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్ గా సినీనటుడు పృథ్వీరాజ్ ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆయన వ్యవహారంతో ఛానల్ ప్రతిష్ఠ బజారున పడే స్థితికి చేరుకుంది. మహిళా ఉద్యోగినితో ఆయన ఫోన్ కాల్ లీక్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆయనను ఆగమేఘాలు మీద సాగనంపింది.
ఆ తర్వాత ఎస్వీబీసీ కొత్త చైర్మన్ ఎంపిక పై ప్రభుత్వం దృష్టి సారించింది. చైర్మన్ రేసులో జర్నలిస్ట్ స్వప్న, శ్రీనివాసరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ప్రస్తుతం ఎస్వీబీసీలో స్వప్న, శ్రీనివాసరెడ్డిలు డైరక్టర్లుగా పనిచేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక వీరికి ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు.
అయితే, ఇప్పటికే తిరుమల పవిత్రతను జగన్ సర్కార్ దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో తిరుమలకు సంబంధించిన పదవుల ఎంపికపై ఇక ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే ఎస్వీబీసీ ఛైర్మన్ గా సాయికృష్ణ యాచేంద్రను ఎంపిక చేశారని సమాచారం.