ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశంపై జగన్ సర్కార్ పిటిషన్.. తిరస్కరించిన హైకోర్ట్
posted on Oct 28, 2020 @ 1:11PM
ఏపీలోని జగన్ సర్కార్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. మొన్న మార్చిలో స్థానిక ఎన్నికలను కరోనా కారణంతో ఎస్ఈసీ వాయిదా వేసినప్పుడు మొదలైన వివాదం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ సర్కార్ అర్ధాంతరంగా పదవి నుండి తప్పించడంతో పరాకాష్టకు చేరగా అయన కోర్టుకు వెళ్లి మరీ తన పదవిని తిరిగి పొందిన సంగతి తెలిసిందే.
కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నెలలో వాయిదాపడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమయ్యింది. ఇదే విషయంపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని తెలపాలని హైకోర్టు కోరిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు ఎస్ఈసీ ఈరోజు అఖిలపలక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశ నిర్వహణను నిలిపివేయాలని ప్రభుత్వం ఆ పిటిషన్‌లో కోరింది. అయితే తాజాగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటీషన్ ను తిరస్కరించింది.
అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ హాజరుకావడం లేదని.. పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సమావేశం నిర్వహించడానికి ముందు సుప్రీంకోర్టు.. ఏ తీర్పు ఇచ్చిందో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చదువుకోవాలని అంబటి సూచించారు. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసిందన్నారు. దీనిపై హెల్త్ సెక్రటరీ ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ముందు రాజకీయ పార్టీలను పిలవడంలో ఆయనకు వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయంటూ అంబటి ఆరోపించారు. దీంతో ఈ సమావేశానికి వెళ్లడం లేదని అయన స్పష్టం చేశారు.