ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఈసీ స్పందన

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని, మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా? అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మరోవైపు ఎన్నికల సమయంలో హామీని ఇవ్వడం ద్వారా బీజేపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిందంటూ ఎన్నికల సంఘానికి ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, వివక్షతతో కూడి వాగ్దానాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రకటించిన హామీ సరైందా? కాదా? అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.    దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఎన్నికల కోడ్ ను బీజేపీ ఉల్లంఘించలేదని తెలిపింది. ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. ప్రజలకు సంక్షేమ పథకాన్ని ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మేనిఫెస్టోలు ప్రకటించడం సాధారణ అంశమేనని తెలిపింది. బీజేపీ హామీలో తమకు ఎలాంటి తప్పు కనిపించలేదని స్పష్టం చేసింది.

సీఈసీ బీజేపీలో ఒక శాఖ! శివసేన నేత సంచలన ఆరోపణలు 

సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘాన్నే టార్గెట్ చేశారు. ఈసీ బీజేపీలో ఓ శాఖగా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ సంజయ్‌ రౌత్‌. ఎన్నికల కమిషన్‌ బీజేపీకి కొమ్ము కాస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఉచిత కోవిడ్‌ వ్యాక్సిన్‌ హామీ ఇచ్చింది. దానిపై కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దానిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌.. అయితే బీజేపీ కరోనా వ్యాక్సిన్ హామీ ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదని ప్రకటించింది. దీనిపై శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్‌ బీజేపీకి చెందిన ఓ శాఖ. దాని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం’ అన్నారు. ఎన్నికల వేళ బిహార్‌లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు సంజయ్‌ రౌత్‌.    బీహార్ ఎన్నికలపై సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ చీఫ్‌, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ బీహార్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నారు.  ‘ఓ యువకుడు.. ఎవరి మద్దతు లేదు.. తండ్రి జైలులో ఉన్నాడు. సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్లు అతడి వెంట పడుతున్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి రేపు అతడు ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఓట్లు సంపాదించుకుంటాడు అనిపిస్తుంది’ అంటూ తేజస్విని ఉద్దేశించి మాట్లాడారు సంజయ్ రౌత్.

కేబినెట్ స్పెల్లింగ్ తెలీదు కానీ సీఎం అభ్యర్థి అట.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి(మహాఘటబంధన్) సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పై తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజస్వికి అసలు "కేబినెట్" అనే పదం పలకడం కూడా సరిగా రాదని అయన ఎద్దేవా చేశారు. కనీసం 10వ తరగతి కూడా చదవని తేజస్వి యాదవ్.. ఇంజినీరింగ్ చదివిన సీఎం నితీశ్ కుమార్ ను విమర్శిస్తున్నారని అయన మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య గురించి కూడా తేజస్వికి ఒక స్పష్టమైన అవగాహన లేదని అయన విమర్శించారు. అసలు కేబినెట్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తేజస్వి రాయలేడని అయన ఎద్దేవా చేశారు.   తేజస్వి తండ్రి ఒకప్పటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తన తొలి కేబినెట్ సమావేశంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని... దీనికోసం ప్రజల దగ్గర నుండి డబ్బులు కూడా వసూలు చేశారని... అయితే, అప్పటి ఆ అప్లికేషన్లన్నీ ఇప్పటికీ డస్ట్ బిన్ లోనే ఉన్నాయని అశ్వినీ చౌబే తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాకుండా... జేడీయూ, కాంగ్రెస్ కూటమిని "గప్పు - పప్పు" అని ఎద్దేవా చేశారు. ఈ గప్పు-పప్పుల కూటమి ప్రజలకు నెరవేర్చలేని తప్పుడు హామీలను ఇస్తుందని, ప్రజలు ఈ నాయకుల పట్ల చాల జాగ్రత్తగా ఉండాలని అయన అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన వసతులను కల్పించినప్పుడే దాన్ని మంచి పాలన అంటారని... లేకపోతే అది దోపిడీ ప్రభుత్వం అవుతుందని అయన తెలిపారు.   ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన మొదటి విడత పోలింగ్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనాలు ఉన్న నేపథ్యంలో జెడియూ, బీజేపీ కూటమి తేజస్వి యాదవ్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఎలాగైనా మిగిలిన విడతల ఎన్నికలలో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీలు ఈ విధంగా తమ ప్రత్యర్థిని టార్గెట్ చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానికి సీఎం జగన్ లేఖ.. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే

పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఏడు పేజీల లేఖ రాశారు. ప్రాజెక్టు నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో సీఎం జగన్ కోరారు.   విభజన చట్ట ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌ కు జీవనాడి లాంటిదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, పునరావవాస చర్యలకు కూడా నిధులను ఇవ్వాలంటూ 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో ప్రస్తావించారు. నిధుల విడుదల జాప్యం, పనులు ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.

వరద సాయమే కొంప ముంచుతుందా? గ్రేటర్ గులాబీలో టెన్షన్

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా. ఈ పాట ఇప్పుడు హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి అచ్చు గుద్దినట్లు సరిపోయేలా ఉంది. ఇటీవల కురిసన భారీ వర్షాలు, వరదలకు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 15 వందల కాలనీలను వరద ముంచెత్తిందని ప్రభుత్వ వర్గాలే ప్రకటించాయి. మోకాళ్ల లోతు నీటిలోనే రెండు, మూడు రోజుల పాటు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వరద పోటెత్తడంతో ఇండ్లలోని సామాగ్రి కూడా ధ్వంసమైంది. అయితే వరదలపై స్పందించిన సీఎం కేసీఆర్.. సిటీలో వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం 3 వందల కోట్ల రూపాయలు కూడా వెంటనే రిలీజ్ చేశారు.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఇప్పుడు చేస్తున్న వరద సాయం తమకు బల్దియా ఎన్నికల్లో కలిసి వస్తుందని అధికార పార్టీ ఆశించింది. వరద సాయం చేస్తున్న కాలనీలు, బస్తీలన్ని గంపగుత్తగా తమకే మద్దతిస్తాయని గులాబీ నేతలు భావించారు. అందుకే కేసీఆర్ వరద సాయం ప్రకటన చేసిన వెంటనే టీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. తమ డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు, బస్తీల్లో తిరుగుతూ వరద సాయం చేస్తామంటూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మరోలా మారిపోయింది. అధికార పార్టీ అంచనాలకు భిన్నంగా  తమకు గ్రేటర్ ఎన్నికల్లో కలిసి వస్తుందనుకున్న వరద సాయం పంపిణి.. కొంప ముంచేలా మారిపోయిందని టీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి.    నగరంలో వరద సహాయం వివాదంగా మారుతోంది. నీట మునిగిన ప్రాంతాలు, వాటిల్లిన నష్టం అంచనాలు, బాధితులకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నష్ట పరిహారంలో తేడాలు పలు అనుమానాలకు  తావిస్తున్నాయి. వరద నీటితో నష్టపోయిన వారికి కాకుండా అనర్హులకు ఇచ్చారని, మునిగిపోయిన తమను పక్కన పెట్టారంటూ సిటీలోని అన్ని ప్రాంతాల్లోనూ అందోళనలు జరుగుతున్నాయి. గడ్డిఅన్నారం, చంపాపేట, ఉప్పల్, రామంతాపూర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాంనగర్‌ ఏరియాలో అయితే గత వారం రోజులుగా ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. తమకు వరద సాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల దగ్గర నిరసనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్పొరేటర్లను చుట్టుముట్టారు. మున్సిపల్‌ అధికారులను నిర్బంధించారు. ఉప్పల్‌లో మున్సిపల్‌ కార్యాలయంలో ఎదుటే భోజనాలు చేసి ఆందోళనకు దిగారు.     అధికారులు పంపిణీకి సిద్ధం చేసిన జాబితాపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా, కార్పొరేటర్లు, నాయకులకు చెప్పిన ప్రాంతాలను సైతం జాబితాలో చేర్చారు. ముంపు బాధితుల్లో ఎక్కువ మందికి నగదు సాయం అందుతున్నా కొన్ని ప్రాంతాల్లో అందడం లేదు. ముంపునకు గురికాని ప్రాంతాల్లో సైతం నగదు పంపిణీ చేశారు. కొన్ని డివిజన్లలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యవహారం తలనొప్పింగా మారింది. నగదు పంపిణీ అయిన తర్వాత డబ్బులు వసూలు చేస్తుండంతో ఇటీవల ఎమ్మెల్యే మౌలాలి డివిజన్‌లో ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అయినా నాయకుల తీరు మారడం లేదు. చాలా డివిజన్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది. బాధితులకు అందజేసిన పరిహారంలో కొంత మొత్తాన్ని వసూళ్లు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ముంపునకు గురికాని ప్రాంతాల్లో రూ.5వేలు పంపిణీ చేస్తున్నారు.    వరద సహాయంలో దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని టీఆర్ఎస్ నేతలు డబ్బులు సూలు చేస్తున్నారనే ఆరోపణలు దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయి.వరద సహాయం రూ.10వేలు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే సగం డబ్బులు తిరిగి ఇవ్వాలని కొందరు నేతలు బాధితులను డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.. ఎందుకివ్వాలని బాధితులు ప్రశ్నిస్తే ‘అసలు మీ ఇల్లు మునగనే లేదు అని చెప్పి మొత్తం డబ్బులు తీసుకుంటాం’ అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు బారిన పడని కాలనీల్లో సైతం డబ్బులు ఇస్తున్నారని అసలైన అర్హులకు ఎందుకు ఇవ్వరని వాపోయారు.  కొందరి దగ్గర ఆధార్‌కార్డు తీసుకుని ఓటీపీ వచ్చిన తర్వాత లబ్ధిదారుని సంతకం తీసుకుని.. తర్వాత డబ్బులు ఇచ్చేది లేదని లోకల్ లీడర్లు వెళ్లిపోయారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. శవాల మీద ప్యాలాలు ఏరుకుంటున్నట్లు స్థానిక నేతలు వ్యవహరిస్తున్నారని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   గ్రేటర్ లో ప్రస్తుతం వరద సాయం అందిన వ్యక్తులు అదృష్టవంతుడిగా మారుతున్నాడు. డబ్బులు తీసుకున్నవారు సంతోష పడుతుండగా.. మిగతా వారంతా సర్కార్ పై ఆగ్రహంగా ఉంటున్నారు. దీంతో ప్రతి డివిజన్ లో సాయం అందని వారే ఎక్కువగా ఉంటారని.. వారంతా తమకు వ్యతిరేకమవుతున్నాయని గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. వరద సాయం కలిసి వస్తుందనుకుంటే .. అదే ఇప్పుడు తమకు ఇబ్బందిగా మారిందని, డివిజన్ లో తిరగలేకపోతున్నామని మరి కొందరు గులాబీ నేతలు కలవరపడుతున్నారు. మొత్తంగా గ్రేటర్ లో సర్కార్ చేస్తున్న వరద సాయం తమ కొంప ముంచుతూ విపక్షాలకు వరంగా మారిందనే చర్చే అధికార పార్టీలో ఎక్కువగా జరుగుతోంది.

కేంద్రంపై రైతులు పిడికిలి బిగించి ఉద్యమించాలి

జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని, కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదని, రైతులు కూర్చొని మాట్లాడుకునేందుకు వేదిక ఏర్పాటు చేసినందుకు గర్వపడుతున్నానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.   ఇతర దేశాల్లో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలనుకున్నా కేంద్రం ఆంక్షలు అడ్డుపతున్నాయని ఆరోపించారు. కేంద్రం నిర్థారించిన మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయొద్దని ఎఫ్‌సీఐ అంటోందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదు. రైతులను నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.    కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని, కార్పొరేట్ కంపెనీల కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయ బిల్లును అడ్డగోలుగా పాస్ చేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని, కేంద్రం తీరు బాగోలేదు కాబట్టే దసరా పండుగ రోజు రావణాసురుడికి బదులు మోదీ బొమ్మలు తగలబెట్టారని అన్నారు. కేంద్రంపై రైతులు పిడికిలి బిగించి ఉద్యమించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

ఏపీలో "జగన్ రూల్ ఆఫ్" లా ఏమైనా పెట్టారా.. మండిపడ్డ యనమల 

ఏపీలో అమరావతి రైతులకు, పోలీసులు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ అమరావతి ఐకాస, టీడీపీ, రాజధాని పరిరక్షణ సమితి కలిసి చలో గుంటూరు జైలుకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధంలో ఉంచారు. దీని పై తాజాగా స్పందించిన శాసనమండలి లో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు జగన్ సర్కార్ పై మండి పడ్డారు. రాష్ట్రంలో "జగన్ రూల్ ఆఫ్ లా" అని ప్రత్యేకంగా ఏమైనా తెచ్చారా అంటూ అయన ఘాటుగా స్పందించారు. శాంతియుత నిరసనలను కూడా అడ్డుకోవడం గర్హనీయం... ఏపిలో అసలు ‘‘రూల్ ఆఫ్ లా’’ ఉందా..? లేక ‘‘జగన్ రూల్ ఆఫ్ లా’’ అని ఏమైనా ప్రత్యేకంగా తెచ్చారా..? దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపిలో ప్రస్తుతం అమలవుతోంది.. ప్రజల ప్రాధమిక హక్కులను ప్రభుత్వం కాల రాస్తోంది.. అంతేకాకుండా రాజ్యాంగ హక్కులను పూర్తిగా హరించివేశారు. నిరసన తెలిపేందుకు దరఖాస్తు చేసినా అనుమతులు ఇవ్వలేదు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు. ఇటువంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి అణిచివేత పాలనను అందరు గర్హించాలి. ప్రజలు తమ ప్రాధమిక హక్కులను కాపాడుకోవాలని’’ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ఇరికించారా.. ఇరుక్కున్నారా? ఆ మంత్రికి ఊస్టింగేనా?

తెలంగాణ మంత్రి రాసలీలల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి గారి వలపు కలలే ఆయన కొంప ముంచాయని, బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా చిలిపి పనులు చేస్తుండటం వల్లే అడ్డంగా బుక్కయ్యారని కొందరు చెబుతున్నారు. తనంతట తానే మంత్రి పదవికి ఎసరు తెచ్చుకున్నారని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం మంత్రిని కావాలనే టార్గెట్ చేసి ఇరికించారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు కేబినెట్ లో బెర్త్ క్లియర్ చేసేందుకే ఇలా చేశారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి ఎపిసోడ్ లో ప్రచారంలో ఉన్న సినీ నటి ఇటీవలే ఎమ్మెల్సీ కవితను కలవడం ఆ మంత్రి అనుచరుల వాదనకు బలాన్నిస్తోంది.    కరీంనగర్ మంత్రి లీలలకు సంబంధించి గంటకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఒక హీరోయిన్ పై కన్నేసిన మంత్రిగారు తనకు తెలిసిన మహిళ ద్వారా.. ఈ  హీరోయిన్ తన దగ్గరకు రప్పించుకునే ప్రయత్నంచేశారని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. ఇటీవల కరీంనగర్ లో జరిగిన షో కి ఆ నటి చీఫ్ గెస్ట్ గా వచ్చిందట. ఇదే సమయంలో మంత్రిగారి కన్ను ఆమెపై పడిందని టాక్. తనకు ఆల్రెడీ పరిచయమున్న బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలితో నటిని తన వశం చేసుకునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. మంత్రిగారి ఆదేశాలతో మసాజ్ పేరుతో నటిని ఆ మహిళ పార్లర్ కు తీసుకెళ్లిందని, చాటింగ్ లో మంత్రిగారు చెప్పినట్టుగానే.. మసాజ్ చేస్తూ.. నటి ప్రైవేటు ఫొటోలు తీసిందని  తెలుస్తోంది. అయితే ఫొటోలు తీయడం గమనించిన నటి.. అక్కడే సదరు మహిళతో గొడవపడి.. ఫొన్ లాక్కుని వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.    కరీంనగర్ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయిన ఆ నటి.. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు.. ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం చేరవేసిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో తన బంధువులు ఉండటంతో డైరెక్ట్ గా సీఎంకే కంప్లైంట్ వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో డైరెక్ట్ గా ఇంటలిజెన్స్ రంగంలోకి దిగడం, ఏకంగా టీఆర్ఎస్ పార్టీ సొంత ఛానల్ లోనే మంత్రికి వ్యతిరేకంగా కథనాలు వచ్చాయంటున్నారు. అయితే దీనిపై కొన్ని మీడియాలు  మంత్రిని వివరణ కోరగా.. అసలు తనకు సంబంధం లేదని.. ఫేక్ స్క్రీన్ షాట్లతో తనను బద్నాం చేస్తున్నారని చెప్పినట్టు తెలుస్తోంది.   కరీంనగర్ జిల్లాలో మరో చర్చ కూడా జరుగుతోంది. కొన్ని రోజుల క్రితమే బీజేపీ జిల్లా అధ్యక్షుడి రాసలీలల వ్యవహారం బయటపడింది. మహిళతో సదరు  బీజేపీ నేత కలిసిఉన్న విజువల్స్, ఫోటోలు వైరలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాతో పాటు బీజేపీలో కలకలం రేపింది. వెంటనే స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. .ఆ నేతను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అయితే బీజేపీ నేత రాసలీలకు సంబంధించిన విజువల్స్ బయటికి రావడం వెనక.. ప్రస్తుతం రచ్చగా మారిన కరీంనగర్ మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతీకారంగానే మంత్రిని పక్కా ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఇరికించారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో కరీంనగర్ కు చెందిన కొందరు అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉందని జిల్లాలో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఈ విషయంపై సీరియస్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇష్యూ కాస్త సీరియస్ కావడంతో మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.    మరోవైపు కవితకు మంత్రి పదవిపై కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఖాళీలు లేనందున ఆమె కోసం ఎవరో ఒకరిని కేబినెట్ తప్పించాల్సి ఉంటుంది.  అయితే తాజా ఘటనతో కవితకు లైన్ క్లియరైందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పులు లేకుండా మంత్రిగారి కేసు బయటికి వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడే కాకున్నా.. కొన్ని రోజుల తర్వాత ఆ మంత్రి ప్లేస్ లో కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమంటున్నారు గులాబీ లీడర్లు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఓ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి చిలిపి పనులు చేయడంపై రాజకీయపార్టీలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తే ఇలా చేస్తే ఎలా అని.. ప్రశ్నిస్తున్నారు.

ఎంపీ నందిగం అనుచరులు చంపేసేలా ఉన్నారు: జగన్ కు వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో 

గుంటూరు జిల్లాలో అధికార వైసీపీలో వర్గ పోరు ముదురుతోంది. అక్రమ దందాలు, కమీషన్లు, వాటాల కోసం అధికార పార్టీ నేతలే కుమ్ములాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రజాప్రతినిధుల అక్రమ దందాలను.. ఆ పార్టీ కార్యకర్తలే బయటపెడుతుండటం కలకలం రేపుతోంది.  తాటికొండ నియోజకవర్గంలోని లింగాయపాలెం రైతు పొన్నూరు శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తాను వైసీపీ కార్యకర్తనని, గత ఎన్నికల్లో వైసీపీకే ఓటేశానని చెప్పుకొచ్చాడు. ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తనను కాపాడాలని అందులో వేడుకున్నాడు.   లింగాయపాలెంలో ఎంపీ అనుచరులు ఇసుక తవ్వకాలు చేపట్టారని, ఆ పక్కనే తనకు రెండెకరాల పొలం ఉందని పేర్కొన్నాడు. పొలానికి తాను అటునుంచే వెళ్లడంతో ఇసుక తవ్వకాల సమాచారం తానే ఇచ్చాననే ఉద్దేశంతో తనపై దాడి చేశారని, ఫోన్, రూ. 10 వేలు లాక్కున్నారని ఆరోపించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడి సీఐ కేసు నమోదు చేయకుండా ఎంపీని కలవాలని చెప్పారని, దీంతో ఎస్పీ వద్దకు వెళ్తానంటే కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. అయితే నిందితులను మాత్రం ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని అన్నారు.    గతంలో శ్రీనివాసరావుపై ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, తాజాగా వెలుగులోకి వచ్చి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు శ్రీనివాసరావు ఆరోపణలను ఖండించారు సీఐ శ్రీహరిరావు. శ్రీనివాసరావును తానెప్పుడూ చూడలేదని, ఎంపీ వద్దకు వెళ్లమని చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఈ కేసులో నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు.

బాంబే ఐఐటీని ఉద్దేశించి ప్రసంగించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం ముంబై ఐఐటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. "మేనేజ్‌మెంట్ స్కూల్ అవెన్యూస్" పేరుతో ఐఐటీకి చెందిన శైలేష్ జె మెహతా అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ లో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్ సమ్మిట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మేనేజ్‌మెంట్ విద్యార్థులను ఉద్ద్దేశించి రోజుకొకరు ఆన్‌లైన్‌లో ప్రసంగించి.. వారితో ఇంటరాక్ట్ అవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ అనిల్ కాకోద్కర్, నీతి ఆయోగ్ వైస్ చర్మన్ అరవింద్ పనగారియా, సంపర్క్ ఫౌండేషన్ చైర్మన్ వినీత్ నాయర్ ఒక్కొక్క రోజు ప్రసంగించనున్నారు.

దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు?

అందరికీ అగ్నిపరీక్ష   మరో ఏడాదిలో జమిలి ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోగా జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకూ అగ్నిపరీక్షగా మారింది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌పై.. ప్రజల్లో ఉన్న నమ్మకానికి, ఆ పార్టీ నాయకత్వ ధీమాకు, హరీష్‌రావు సత్తాతోపాటు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు సంజయ్ నాయకత్వానికి, అసలు సిసలు పరీక్షగా పరిణమించింది.   టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, రామలింగారెడ్డి మృతి కారణంగా జరగనున్న ఉప ఎన్నిక.. టీఆర్‌ఎస్-కాంగ్రెస్-బీజేపీలకు అగ్నిపరీక్షగా మారింది. దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా ఉందని ప్రచారం చేసుకుంటున్న, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నిక గెలవడం ప్రధానం. ఈ ఎన్నికలో గెలిస్తే, ప్రజలు టీఆర్‌ఎస్‌పై భరోసాతో ఉన్నారన్న సంకేతం వెళుతుంది. ఓడిపోతే, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే దుబ్బాకలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే, ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది.   పైగా హరీష్‌రావు వ్యక్తిగత ప్రతిష్ఠకూ ఇది అగ్నిపరీక్షనే. ఎందుకంటే ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు, ఆయనే స్టార్ క్యాంపెయినర్. హరీష్ ఒంటిచేత్తో ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెలిస్తే, అది హరీష్ ఖాతాలోకే వెళుతుంది. ఒకవేళ ఓడిపోతే అది హరీష్ వ్యక్తిగత ఓటమిగానే భావించాలి. అది ఇప్పటివరకూ ట్రబుల్‌షూటర్‌గా పేరున్న హరీష్‌కు పార్టీలో ఇబ్బందికర పరిణామమే. అయితే, అభ్యర్ధి ఎంపికపై టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు మండల స్థాయి నేతలు, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డికి లోపాయకారీ మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.   ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికీ ఇది సవాలే. ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో, బీజేపీ ఓటర్లను పోగొట్టుకుంది. ఎంపీగా ఉంటూ, సొంత కరీంనగర్ కార్పొరేషన్‌లో కూడా.. సొంత పార్టీ కార్పొరేటర్లను కాపాడుకోలేకపోయారన్న, అపప్రద మూటకట్టుకున్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావుకు స్థానికంగా మంచిపేరు ఉంది. పైగా ఆయన టీవీ చర్చల ద్వారా, అందరికీ పరిచయమే. స్వతహాగా న్యాయవాది అయిన రఘునందన్‌రావుకు ఇమేజ్ ఉన్నప్పటికీ, సంస్థాగతంగా అక్కడ బీజేపీ బలహీనమే. ఇటీవల జరిగిన డబ్బుల పంపిణీ వ్యవహారం, కొంతమేరకు ఆ పార్టీ వైపు చూసేలా చేయగలిగింది. అంతకుమించి, కాంగ్రెస్‌తో పోలిస్తే, సంస్థాగతంగా బీజేపీకి పెద్దగా బలం లేదంటున్నారు.   మరోవైపు కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డికీ, ఈఎన్నిక ప్రతిష్ఠాత్మకమే. ఆయన మంత్రి అయిన తర్వాత, జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో గెలిస్తే, కిషన్‌రెడ్డి పలుకుబడి పెరుగుతుంది. ఓడిపోతే, మంత్రిపదవి ఇచ్చినా, పార్టీకి ఉపయోగం లేదన్న సంకేతాలు వెళతాయి. ఇప్పటికే కేంద్రనిధులపై, హరీష్ విసిరిన సవాలుకు బీజేపీ నేతలు జవాబు ఇవ్వలేదు. బీజేపీ నేతలు జనంలోకి వెళ్లడం కంటే, మీడియా-సోషల్‌మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారన్న అభిప్రాయం లేకపోలేదు.   ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రచారం కూడా టీఆర్‌ఎస్‌కు పోటా పోటీగానే ఉంది. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ప్రచారం కాకరేపుతోంది. బీజేపీ-టీఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారన్న ప్రచారాన్ని, ఆయన కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లగలిగారు. ఆయన సభలకు జనం బాగానే హాజరయ్యారు. పైగా దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి, నియోజకవర్గంలో మంచిపేరుంది. మూడుదశాబ్దాల రాజకీయ చరిత్రలో, మచ్చలేని నేతగా పేరుంది. ఆ సానుభూతితోపాటు, పార్టీ క్యాడర్ దన్ను కూడా శ్రీనివాసరెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోంది.   ఒకవేళ ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే, ఇక తెలంగాణలో ఆ పార్టీ ప్రభంజనం ప్రారంభమయినట్లే లెక్క. ఓడిపోతే, అది పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వానికి మరో అప్రతిష్ఠ. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలతోపాటు, భార్య పోటీ చేసిన ఉప ఎన్నికలో పార్టీని గెలిపించలేని నేతగా, అపవాదు మూటకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలో కూడా ఓడిపోతే, ఆయన పదవికి ఎసరు తప్పదు.   ఇప్పటివరకూ ఉన్న ప్రచారసరళి చూస్తే... టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్యనే పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాకపోతే ఇటీవల డబ్బుల పంపిణీ వ్యవహారం రచ్చ కావడంతో.. ఆ రెండురోజుల వాతావరణం, టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య పోటీ అన్నట్లు కనిపించిందని, రాజకీయ విశ్లేషకుల అంచనా. -మార్తి సుబ్రహ్మణ్యం

ఎరక్కపోయిన ఇరుక్కుపోయిన వైసీపీ ఎంపీలు

ఎంపీలను ఖాతరు చేయని ఎమ్మెల్యేలు   ఎంపీలను లెక్కచేయని అధికారులు   బదిలీలలో ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట   ఆ ముగ్గురు ఎంపీల అవస్థలు వర్ణనాతీతం   పార్లమెంటు సభ్యులంటే దేశ రాజధానిలో బోలెడంత గౌరవం. రాజ్యసభ సభ్యులయితే పెద్దమనుషుల కింద లెక్క. లోక్‌సభ సభ్యులకూ ఎనలేని గౌరవం. కానీ సొంత ఇలాకాలో మాత్రం వారివి సినిమా కష్టాలు. ఎవరూ పట్టించుకోరు. వారి లెటర్లకు విలువే ఉండదు. ఏపీలో పాపం అధికార వైసీపీ ఎంపీల కష్టాలు చూస్తున్న ఆ పార్టీ నేతలు.. పగవాడికి సైతం అలాంటి కష్టాలు రాకూడదని జాలి చూపిస్తున్న దయనీయం వారిది. అన్ని కోట్లు ఖర్చు పెడితే వారికి మిగిలింది.. ముందు, వెనుక పోలీసు వాహనాలు, వాటి సైరన్లేనట!   ఏపీలో వైసీపీ ఎంపీల పరిస్థితి దారుణాతిదారుణంగా మారింది. ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి, హీనపక్షం 15 కోట్ల చొప్పున ఖర్చు చేసి, ఎమ్మెల్యేల గెలుపులో కీలకపాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే, వారిని దరిదాపులకే రానీయని దయనీయం. తమ నియోజవర్గాల్లో ఎంపీలు జోక్యం చేసుకుంటే, అక్కడ కొత్తగా వర్గాలు తయారవుతాయన్నది ఎమ్మెల్యేల భయం. అందుకే ఎంపీలను తమ నియోజకవర్గాల్లో అడుగుపెట్టనీయడం లేదట. దానితో.. తమను ఎన్నికల ముందు, ఏటీఎం మిషన్లుగా వాడుకున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు దూరంగా పెడుతుండటాన్ని ఎంపీలు సహించలేకపోతున్నారు.   ఒకవేళ ఎమ్మెల్యేలకు తెలయకుండా వెళితే, ఇక ఎంపీలకు తిప్పలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ల నుంచి సీఐల బదిలీల వరకూ ఎంపీలు చేసే సిఫార్సులను, అటు ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చిన వారికే పోస్టింగులిస్తున్న పరిస్థితి. కలెక్టర్ల సంగతి దేవుడెరుగు? మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలే మాట వినే దిక్కులేదు. ఇప్పుడు ఎంపీల విధులేమిటంటే, ఎమ్మెల్యేల సిఫార్సులు ఆమోదించి, దానికి ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేయడమే.   గుంటూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల ఎంపీల పరిస్థితి, మరీ దయనీయంగా ఉందన్న వ్యాఖ్యలు, వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలును, దాదాపు ఎమ్మెల్యేంతా దూరంగా పెడుతున్నారట. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజనీ టెలిఫోన్ కాల్‌లిస్ట్ వ్యవహారం, పార్టీలో చిచ్చురేపింది. ఆమెతో ఎంపీకి పొసగడం లేదు. తనకు వ్యతిరేకంగా ఎంపీ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్నది ఆమె ఆరోపణ. దానితో తనను బాగా ప్రోత్సహించే ఓ సలహాదారు సాయంతో, తనపై నిఘా పెట్టేందుకు సహకరించిన పోలీసు అధికారులను, ఆమె శంకరగిరి మాన్యాలు పట్టించారు. దీనిపై ఇప్పటికీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలను ఎంపీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదట. దీనితో ఎంపీ వర్గీయులు పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారట.   ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిదీ అదే పరిస్థితి. జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ, ఆయనను రానీయడం లేదట. పెత్తనమంతా మంత్రి బాలినేనిదే. గతంలో ఆయన చెలాయించిన హవా, ఇప్పుడు పనిచేయడం మానేసిందంటున్నారు. నిజానికి మాగుంట ఏ పార్టీలో ఉన్నా, అధికారులు ఆయనను గౌరవించేవారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన మాటకు విలువ ఇచ్చేవారు. ఏ సీఎంలయినా, ఆయన అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి, పూర్తిగా రివర్సయిపోయిందంటున్నారు. అటు చూస్తే లిక్కర్ తయారీ ఆదాయం పోయింది. ఇటు చూస్తే సొంత ప్రభుత్వంలోనే గౌరవం లేని పరిస్థితి.   వీరందరినీ మించిన విషాదం.. నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిది. గత టీడీపీ సర్కారులో.. ఆయన ఆర్ధిక ప్రయోజనాలన్నీ పొందారు. ఆ తర్వాత కండువా మార్చి, వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అయినా ఆదాల మాట, ఇప్పుడు వినేవారెవరూ లేరట. ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాదని, ఏ ఒక్క వైసీపీ నేత కూడా ఆదాల ఇంటిక వెళ్లే ధైర్యం చేయడం లేదట. నిజానికి ఆదాల ఏ ప్రభుత్వంలోన యినా, తన పనులు సులభంగా చేయించుకునేవారు.   వైఎస్ హయాంలో 60 కోట్ల మేరకు, కండలేరు ప్రాజెక్టు పనులు నామినేషన్‌తో దక్కించుకున్నారు. అంతకుముందు దక్కించుకున్న మదనపల్లి పనులను, టీడీపీ వచ్చిన తర్వాత రద్దు చేయించుకుని, అంచనాల విలువ పెంచుకుని, అందులో 182 కోట్లు దక్కించుకున్నారు. అదొక్కటే కాదు. అప్పటికి గతంలో ఉన్న బకాయిలు కూడా, టీడీపీ సర్కారు హయాంలో రాబట్టుకున్నారు.   గత ఎన్నికల ముందు.. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులను, ఆదాల కంపెనీ 550 కోట్లకు దక్కించుకుంది. దానిపై అప్పట్లో టీడీపీ సీనియర్లే అభ్యంతరం వ్యక్తం చేసినా, చంద్రబాబు పట్టించుకోలేదు. అంటే టీడీపీ కూడా ఆదాలను ‘బాగా చూసుకున్నద’న్నమాట. సరే.. అయినా, పెండింగ్ నిధులు క్లియరయిన మెసేజ్ వచ్చిన తర్వాత, సైలెంటుగా పార్టీ కండువా మార్చి, వైసీపీలోకి జంపయ్యారనుకోండి. అది వేరే విషయం! అలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, చిటికెలో పనులు చేసుకునే అంతలావు ఆదాల.. ఇప్పుడు సొంత పార్టీలో, సినిమా కష్టాలు అనుభవిస్తున్నారంటే ఆశ్చర్యమే మరి!   గతంలో చంద్రబాబు మంజూరు చేసిన, సోమశిల ఫేజ్-2 ప్రాజెక్టు పనులను సీఎం జగన్ రద్దు చేసి, ఆదాలకు షాక్ ఇచ్చారట! దానిని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ, కడపకు చెందిన మరో కంపెనీకి కట్టబెట్టారట. పార్టీ మారినా ఫలితం ఉంటుందనుకున్న ఆదాల అంచనా ఆ రకంగా తల్లకిందులయిందట. దీనిపై సీఎం జగనన్నను కలిసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదట. చివరాఖరకు ఓ సలహాదారు వద్దకు వెళ్లి గోడువినిపించుంటే, ఆయన జగన్ వద్దకు వెళ్లి ఆదాల అవస్థలు వివరించారట.   అయితే.. జగన్ మాత్రం.. ‘చంద్రబాబు ఆ ప్రాజెక్టు ఇచ్చిన తర్వాతనే కదా ఆదాల మన పార్టీలో చేరింది’ అని నర్మగర్భ వ్యాఖ్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చివరాఖరకు ఫాఫం.. బాగుండదని, దయదలచి, ఓ 150 కోట్ల పనులేవో సర్దుబాటు చేసినట్లు చెబుతున్నారు. అది కూడా ఆ ప్రాజెక్టులో మిగులు ప్రాతిపదికనట. చివరకు ఎంపీ ఆదాలకు దక్కాల్సిన.. సర్వేపల్లి కెనాల్ 200 కోట్ల రూపాయల పనులు కూడా ఆయనకు దక్కలేదట! నిజానికి ఈ ప్రాజెక్టు కోసం ఆదాల కొన్నేళ్ల నుంచి తన ప్రత్యర్థులతో యుద్ధం చేస్తున్నారు.   కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో.. ఈ పనులను దక్కించుకునేందుకు, నాటి ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డితో, ఆదాల యుద్ధం చేశారు. ఇద్దరూ ఆ పనులు తమకు కావాలని పట్టుపట్టారు. కిరణ్ చేసిన సయోధ్య కూడా ఫలించలేదు. ఆ తర్వాత టీడీపీ సర్కారులో, సోమిరెడ్డి-ఆదాల మధ్య పోరు నడిచింది. ఆ ఐదేళ్లు అలా గడిచింది. ఇప్పుడు వైసీపీలో చేరి ఎంపి అయినప్పటికీ, ఆదాలకు ఉపయోగం లేకుండా పోయింది. ఆ పనులను నెలూర్లు టౌన్-రూరల్ ఎమ్మెల్యేలు, సిఫార్సు చేసిన వారికి ఇచ్చేశారట. అలా ఎవరి వల్లా కాని ఈ పనులను జగన్, కొన్ని నెలలలోనే క్లియర్ చేశారన్న మాట. ఫాఫం.. వైసీపీ ఎంపీలు! -మార్తి సుబ్రహ్మణ్యం

టర్కీ, గ్రీస్ దేశాలలో భారీ భూకంపం.. సునామీ 

టర్కీ, గ్రీస్ దేశాలను నిన్న భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. దీనికి తోడు 196 సార్లు స్వల్ప ప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఏజియన్ సముద్రంలో సునామీ కూడా వచ్చింది. భారీ భూకంపం రావడంతో పశ్చిమ టర్కీలోని ఇజ్మీర్‌లో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు పెట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ పలు భవనాలు నేలకూలాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ దెబ్బతింది. రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు కూడా కుప్పకూలాయి. భారీ ఎత్తున కూలిన శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు చేస్తున్న ప్రయత్నాలకు సంబంచించిన వీడియోలను టర్కీ మీడియా ప్రసారం చేసింది. భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్ దేశాల్లో ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. 419 మంది గాయపడ్డారు. సామోస్ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూరోపియన్‌–మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ ప్రకటించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించడంతో ప్రకంపనలు మరికొన్ని వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని గ్రీస్‌కు చెందిన భూకంప నిపుణుడు ఎకిస్ సెలెంటిస్ పేర్కొన్నారు.

మచిలీపట్నంలో దారుణం.. వైసీపీ నేత కుమారుడి సజీవ దహనం

కృష్ణాజిల్లా కేంద్రం అయిన మచిలీపట్నం(బందరు)లో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషా ఇంట్లో ఉన్న సమయంలో అతని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఖాదర్ బాషాను మచిలీపట్నం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాదర్ బాషా మృతి చెందారు.   అయితే, మార్కెట్ యార్డు చైర్మన్ కుమారుడి మీద హత్యాయత్నం అనగానే అందరు ముందుగా ఇది రాజకీయ ప్రత్యర్థుల పనేనని భావించారు. కానీ, పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో అతడి భార్య ఈ పనిచేసినట్టు తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఖాదర్ బాషాపై అతడి మొదటి భార్య ఇలా పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఖాదర్ 14 ఏళ్ల క్రితం షేక్ నదియాను వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది కాలం క్రితం ఆయన తన భార్య నదియాకు తెలియకుండా ఆమె సొంత చెల్లెల్ని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో రెండో వివాహం విషయంలో నదియా, ఖాదర్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య నదియా ఈరోజు ఖాదర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిందని భావిస్తున్నారు. అంతేకాకుండా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ప్రమేయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చేతికొచ్చిన వరి పంటకు తామే నిప్పు పెడుతున్న రైతన్నలు.. దయనీయ స్థితిలో అన్నదాత 

కామారెడ్డి జిల్లాలో సన్నరకం వరికి తెగులు సోకి పంట మొత్తం నాశనం కావడంతో రోజుకో చోట రైతులు పంటను దహనం చేస్తున్నారు. చేతికొచ్చిన వరి పంటకు దోమపోటు సోకడంతో ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పండిన పంట నెలకొరగడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని దిగాలు పడిన రైతులు పంటకు నిప్పు పెడుతున్నారు. రాజంపేట్ మండలం.. ఎల్లారెడ్డి పల్లి తండా కు చెందిన రైతులు బాబూలాల్, శ్రీనివాస్ లు చెరి రెండు ఎకరాల సన్నరకం వరి సాగు చేశారు. అయితే దోమపోటుతో గింజ కూడా రాకపోవడంతో వరి పంటకు నిప్పంటించారు. దీంతో వేల రూపాయల నష్టం వాటిల్లిందని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరో పక్క లింగంపేట్ మండలంలో సన్నరకం వరి 6000 ఎకరాలలో సాగు చేయగా దాదాపు 2000 ఎకరాలకు పైగా దోమపోటు, అగ్గి తెగులు సోకాయి. ఒకపక్క మార్కెట్ లో సన్నరకం వరికి మద్దతు ధర లేకపోగా.. మరోపక్క దోమపోటు, తెగుళ్లు సోకడంతో కనీసం ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   మరో పక్క నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం చామన్ పల్లికి చెందిన రైతు ఏలేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో తన రెండెకరాల పొలంలో దొడ్డు రకం వరి సాగు చేయగా లాభలు వచ్చాయని.. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఈ సారి సన్న రకం వరి సాగు చేయగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటపొలంలో వర్షం నీరు నిలిచింది. దీంతో వరిపంట దోమపోటుకు గురై ఎండిపోయింది. దీంతో తీవ్రంగా నష్ట వస్తుందని భావించిన రైతు తీవ్ర మనస్థాపానికి గురై.. ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా.. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. రైతన్నల బతుకులు మాత్రం మారడం లేదు. వర్షాలు లేక కొన్ని సార్లు, వర్షాలు ఎక్కువై కొన్ని సార్లు పంట చేతికి రాక పెట్టుబడులు కూడా పోగొట్టుకుంటున్నారు. తాను పండించే పంటను పసిపాపలా భావించి..  కంటికి రెప్పలా కాపాడుకున్న అన్నదాత ఆ పంటకు తానే నిప్పు పెట్టడం అత్యంత విషాదకరం.   

లోకేష్ కు ఆ రెండిటికి మధ్య తేడా తెలీదు.. మంత్రి కొడాలి నాని సెటైర్లు

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అటు టీడీపీ, ఇటు లోకేష్ పై సెటైర్లు వేశారు. నారా లోకేష్ కు అసలు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఒక వేస్ట్ ఫెలో అని నాని తీవ్ర స్థాయిలో విమర్శ చేసారు. రాష్ట్రంలో లోకేష్ ఎంత తిరిగినా టీడీపీకి ఏమాత్రం ఉపయోగం లేదని అయన వ్యాఖ్యానించారు. అమరావతిలో ఉన్న రైతులు మాత్రమే రైతులు కాదని కొడాలి నాని అన్నారు. అమరావతిలో భూములు కొన్నారు కాబట్టే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు బేడీలు వేశారని తాను కూడా బేడీలు వేసుకున్న దేవినేని ఉమ.. మరి బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు తనను తాను గన్‌తో కాల్చుకోవాలని కొడాలి నాని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వస్తున్న ఇబ్బందులకు అప్పటి మంత్రి దేవినేని ఉమానే కారణమని నాని ఆరోపించారు.   అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేట్లు పెరిగాయని, రూ. 55వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని వ్యాఖ్యానించారు. ఇదే అంశం పై ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో రాజ్యసభలో కేంద్రాన్నీ రూ. 55వేల కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారా ? అని అడడగ్గా.. ఒప్పుకున్నట్లు చెప్పిందని అన్నారు. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తెస్తామని చెప్పిన వైసీపీ.. 22 మంది ఎంపీలను ఇస్తే.. ఇప్పుడు వాళ్ల పైన ఉన్న కేసుల మాఫీ కోసం ఆ నిధులను రూ. 25 వేల కోట్లకు కుదించారని లోకేష్ మండిపడ్డారు.

AP people are always unlucky

The people of Andhra Pradesh are always unlucky. They continuously have to fight for the establishment of their capital city. And, even after realising their dream after a prolonged battle, for some reason or the other, they again stand to lose it later. It is time the people of Andhra realise this bitter truth.   Even after 60 years of the State formation, the people are back to square one. Be it for Madras, Kunool, Hyderabad and now for Amaravathi, they have to wage a war but ultimately proved to be unfortunate.    When Andhra got separated from the then Madras State in 1953 when the linguistic States were formed, the people fought for a long time for Madras to be the capital but ultimately had to compromise for Kunool. However, when the State of Nizam was merged with Andhra and Andhra Pradesh was formed in 1956, the capital was again shifted from Kurnool to Hyderabad, which means people of Andhra have to again compromise with their fate.   Again, when Telangana was formed, the leaders fought that Hyderabad be made as the Union Territory and be the capital for both the Telugu States. Here too, it is the people of Andhra who have to come to terms and move out of the city in search of a capital.    The battle for both Madras and Hyderabad was acrimonious, hard-fought and prolonged. In case of Hyderabad, the plea to at least turn it into a Union Territory was disallowed. The best that was offered was a joint capital for 10 years, just a breathing time for the people of Andhra to build a new capital.     So, this is the third time that the people of the State have to compromise and go in search of their fate. For some reasons, the Government that was formed in Andhra Pradesh after the State bifurcation in 2014 decided to set up the capital at Amaravathi and this dream too was just short-lived. Once again, the people of the State have come onto the streets not knowing their fate, whether Amaravathi will remain to be the capital or not.   In fact, several industrialists, educationists and people from different walks of life from Andhra have immensely contributed to the growth of not only then Madras now Chennai and Hyderabad to take both the cities to global standards. It is the Tollywood that once based in Madra contributed massively for the growth of the entire film world in South India but ultimately had to move out of Chennai to Hyderabad.    Of course, in losing Chennai and Hyderabad there were enough reasons but the sole rationale behind losing Kunool and now Amaravathi, appears to be only settling political scores. Sure, there were many Telugu people who moved to Madras during the colonial era, which actually changed the history of the city or the region around, but, ultimately we have to compromise on this.   Then, briefly, it was Kurnool which served as the State’s Capital from 1953 to 1956, before it was replaced by Hyderabad. But the most-devastating of all is the loss of Hyderabad.    Kurnool is the 5th largest city of Andhra Pradesh and is often referred to as The Gateway of Rayalaseema. Kurnool was the capital of Andhra State between October 1, 1953 and October 31, 1956 until the State was merged with the then Nizam State to form Andhra Pradesh.   Compromising with our fate, the people slowly began forgetting Chennai and Kurnool and began moving to Hyderabad. In 58 years they have contributed for the speedy growth of Hyderabad to take it to international standards. None other than K Taraka Rama Rao, Minister in Telangana Cabinet and son of Chief Minister K Chandrasekhar Rao, has admitted that Andhras did their best for the overall development of  Hyderabad.   What is important is that it is the people of Andhra who struggled to develop both Chennai and Hyderabad but had to ultimately leave the cities with a heavy heart. However, they now realised that to get their glory they need to support cities within their own cultural territory and thus decided to support for Amravathi, strategically located between Vijayawada and Guntur. However, it is again short-lived and it is once again proved that they are unlucky.    The people of Andhra elect leaders who go great lengths with development plans of the capital city but these leaders settle political scores later at the cost of the people. However, though a bit late, the common public realised that it is not actually the capital cities that are the real problem but it is the good leaders that they are not electing. Rather than exporting people outside the core territory, good leaders will help them find opportunities locally by building great economic centers.    Andhra Pradesh has a long coastline, two great rivers, the Krishna and the Godhavari, and an extremely fertile delta territory. Unlike many Indian States it did not suffer from terrorism nor wars. Majority of the population is educated. Rather than holding a victim mindset for long, it is time the populace concentrate on developing their own cities, feel political veterans.

తెలంగాణ మంత్రి రాసలీలలు! సోషల్ మీడియాలో రచ్చ 

తెలంగాణలో ఓ మంత్రి ఇబ్బందుల్లో పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ మంత్రి రాసలీలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఆ మంత్రి  వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో రచ్చ కావడంతో ఆ మంత్రి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సంజాయిషీ ఇచ్చుకునే పనిలో పడ్డారు.   సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాట్సాప్ చాటింగ్ వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి సినీ నటితో సరసాలు చేయాలనుకున్నారు. అయితే, ఆ విషయం ఆమెతో నేరుగా చెప్పకుండా మరో మహిళను రంగంలోకి దింపాడు. మంత్రి తరఫున రంగంలోకి దిగిన ఆ మహిళ సినీ నటితో చర్చలు మొదలు పెట్టింది. మంత్రి చాలా మంచి వాడని, అతడితో చాలా పనులు ఉంటాయని, టచ్‌లో ఉంటే మంచిదంటూ చెప్పడం మొదలు పెట్టింది. అయితే, ఆ సినీ నటి ఇవేవీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి నియమించిన మహిళ ఏకంగా మరో దుశ్చర్యకు పాల్పడింది. ఆ సినీ నటికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను కూడా తీసింది. ఆ ఫొటోలను మంత్రికి పంపించింది.    ఆ మహిళతో ఏదో మామూలుగా మాట్లాడుతున్న సమయంలో ఆ మహిళ సెల్ ఫోన్ చూసిన సినీ నటికి అందులో తన ప్రైవేట్ ఫొటోలు ఉండడం గమనించి షాక్ తింది. ఆ సినీ నటి గురించి మంత్రితో మహిళ చర్చించిన అంశాలు కూడా వాట్సాప్ ఛాటింగ్ లో ఉన్నాయి. దీంతో మరింత షాక్ తిన్న సినీ నటి .. ఆ మహిళ ఫోన్ తీసుకుని ఆ సమాచారం మొత్తం స్క్రీన్ షాట్లు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని చెబుతున్నారు.   'మన దేశ రాజధానిలో నిర్భయపై జరిగిన హింసాకాండ. మన రాష్ట్ర రాజధానిలో దిశపై జరిగిన హింసాకాండ. నేటికీ ఏ మార్పు రాలేదు. మహిలలపై ఈ హింసని మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఆపలేమా? మన తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు? ఒకవేళ మనం నమ్మిన నాయకులే మహిళలపై రాక్షస వాంఛతో ప్రవర్తిస్తే వాళ్లని ఏం చేయాలి?' అంటూ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణలోని ఓ ప్రముఖ పట్టణంలోని హోటల్లో ఆమె ఉన్నప్పుడు సదరు మంత్రి ఒంటరిగా హోటల్‌కు వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. యువతి బస చేసిన హోటల్లో రికార్డులను ప్రభుత్వ ఇంటిలిజెన్స్ పరిశీలించినట్టు సమాచారం. అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారని తెలుస్తోంది.

ప్రశ్నించడం మరిచావా పవన్! జనసేనానిపై జనంలో చర్చ

ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారు సినీ హీరో పవన్ కల్యాణ్. కాని ఇటీవల కాలంలో ఆయన ప్రశ్నించడమే మరిచిపోయినట్లు కనిపిస్తోంది. జనం కోసం ఎంతకైనా పోరాడుతానన్న జనసేనానికి కొన్ని రోజులుగా జనాలను, వారి సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రాలో ఎన్నో సమస్యలున్నా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల్లో నిర్ణయాలు జరుగుతున్నా, రాష్ట్రానికి నష్టం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.    జగన్ సర్కార్ నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు పొందకుండా ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని ఏపీ ‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కృష్ణా బోర్డుకు డీపీఆర్‌ సమర్పించి, ఆమోదించేంత వరకు ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ సూచించిన నేపథ్యంలో .. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతులు అవసరమా? లేదా? అన్న అంశంలోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం ఆదేశాలకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది. కేంద్ర జలవనరుల శాఖ అభిప్రాయమే ప్రాజెక్టుకు గండంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలపై సీమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమ నుంచి కరువును తరిమేయడమే లక్ష్యమని ఎన్నో సార్లు చెప్పిన పవన్.. ఈ ప్రాజెక్టుకు కేంద్రం వైఖరిని ఎందుకు నిలదీయడం లేదని సీమ వాసులు పవన్ ను ప్రశ్నిస్తున్నారు.   ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. పోలవరం కోసం గతంలో పవన్ పవర్ ఫుల్ ప్రసంగాలు చేశారు. ఇప్పుడా పోలవరం ప్రాజెక్టుతో కేంద్రం ఆటలాడుతోంది. ప్రాజెక్ట్ బడ్జెట్ ఆమోదించామని ఒకసారి , కాస్త కోత విధించామని మరోసారి చెబుతూ వస్తోంది. తాజాగా ఏపీకి షాకిస్తూ భూసేకరణ నష్టపరిహారం తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది కేంద్రం. పోలవరం నిర్వాసితుల గురించి గతంలో పవన్‌కల్యాణ్ మాట్లాడారు. గోదావరి జిల్లాల పర్యటనలోనూ, పోలవరం పర్యటనలోనూ నిర్వాసితుల అంశాన్ని పవన్ లేవనెత్తారు. కానీ ఇప్పుడు కేంద్రం పునరావాస ప్యాకేజీని ఇచ్చేదిలేదని స్పష్టం చేసినా పవన్ కల్యాణ్ మాత్రం మాట్లాడటం లేదు. ఇదెక్కడి న్యాయమని నోరు విప్పి మోడీ సర్కార్ ను అడగడం లేదు. పవన్ తీరుతో పోలవరం నిర్వాసితులతో పాటు జనసేన కార్యకర్తల్లోనూ నిరాశ వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తు ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంలో స్పందించపోవడం సరికాదనే విమర్శలు పవన్ పై వస్తున్నాయి.    ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొల్లేరు లంక ప్రాంతాలు , కృష్ణా పరివాహకంలో వందలాది గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది కొన్ని రోజుల పాటు నీళ్లతోనే సహవాసం చేశారు. వరదలు ముంచెత్తి లక్షలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వరద బాధితులను అదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. కాని వరదల సమయంలో ఏపీ ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు జనసేన. హైదరాబాద్ వరద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీకి మాత్రం నయా పైసా కూడా ప్రకటించలేదు.దీనిపైనే ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. వరదలతో అల్లాడిన ప్రజలకు ప్రతిపక్ష పార్టీగా అండగా నిలవాల్సిన పవన్ కళ్యాణ్.. కనీసం స్పందించకపోవడం దారుణమంటున్నారు బాధితులు. బీజేపీ కూడా వరద బాధితుల విషయంలో నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ బాటలోనే జనసేనాని నడిచినట్టున్నారని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    ఇక స్థానిక ఎన్నికలపై రాష్ట్రంలో నిబంధనల యుద్ధం నడుస్తోంది. కరోనా కారణంగా ఎన్నికలు ఇప్పుడు వద్దని వైసీపీ వాదిస్తోంది. మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎస్‌ఈసీ సమావేశానికి వైసీపీ రాలేదు. అయితే అనూహ్యంగా జనసేన కూడా భేటీకి డుమ్మా కొట్టింది. తమ అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా పంపించింది. ఎస్‌ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పింది. అయితే జనసేన  ఎస్‌ఈసీ సమావేశానికి రాకపోవడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. తన మిత్రపక్షం  బీజేపీ తన వైఖరి స్పష్టంగా చెప్పేసినా.. జనసేన దాగుడు మూతలు ఆడటమేంటనే విమర్శలు వచ్చాయి.    అమరావతి రైతుల ఉద్యమం మూడు వందల రోజులు దాటింది.ర్యాలీలు, జిల్లాల్లో సంఘీభావ నిరసనలతో ఊపు పెంచారు రాజధాని రైతులు. గతంలో నేనున్నాని మాట ఇచ్చిన పవన్ మాత్రం కనీసం స్పందించలేదు. ఇద్దరు రైతులకు బేడీలు వేసిన ఘటనపై అందరూ మండిపడ్డా పవన్ మాత్రం స్పందించలేదు. పవన్ కళ్యాణ్ తీరుపై ఇప్పుడు ఏపీ జనాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ సమస్యలను ఆయన పట్టించుకోవడం మానేసినట్టున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. బీజేపీతో స్నేహం చేసిన జనసేన చీఫ్... ఎప్పుడు దేనిమీద రియాక్ట్ కావాలో తెలియకో తికమక పడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని లేదంటే ముందుకెళ్లడం కష్టమనే అభిప్రాయం మెజార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.