మమ్మల్ని వద్దు అనే అధికారం ఎవరికీ లేదు
posted on Oct 27, 2020 @ 9:59PM
సిరిమానోత్సవంలో కోట సాక్షిగా పూసపాటి వంశంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆనంద గజపతిరాజు భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతిరాజు కోటపై నుండి సిరిమానోత్సవం చూడటానికి రావడం పట్ల మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత గజపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. సుధా, ఊర్మిళను కోటపైకి ఎవరు తీసుకువచ్చారని మాన్సాస్ సిబ్బందిని, పోలీసులను నిలదీశారు. వెంటనే వారిని కోటపై నుంచి పంపించాలని పోలీస్ అధికారులను ఆమె కోరగా.. వారిని పంపించడం తమ చేతుల్లో లేదని, మీరంతా ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి ఇలాంటి వివాదాల్లో తమను లాగొద్దని అధికారులు చెప్పారు. ఇదంతా గమనించిన సుధా, ఉర్మిళ అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం ట్విట్టర్ వేదికగా సంచయితకు ఉర్మిళ కౌంటర్ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా తన తండ్రి ఆనంద గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కోటపై నుంచి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం హాజరు కావడానికి సంశయించినా, సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడం ఇష్టంలేక వచ్చామని తెలిపారు. ఇక్కడికి వచ్చాక తమ కుటుంబ సభ్యులెవరూ లేరని గ్రహించామని, సంచయిత ఒత్తిడి కారణంగా మమ్మల్ని కోట విడిచిపెట్టమని సిబ్బంది కోరారని తెలిపారు. ఇతరులను అగౌరవపరిచే ప్రయత్నం మీ పాత్రను తెలుపుతోందంటూ సంచయిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిమాను సంబరంలో పాల్గొనే హక్కు రాజవంశం కుటుంబ సభ్యులుగా తన తల్లికి, తనకు ఉందని, మమ్మల్ని వద్దు అనే అధికారం ఎవరికీ లేదు అని ఉర్మిళ గజపతిరాజు వ్యాఖ్యానించారు.