పంపకాలు పూర్తయ్యాయా! రెండు రోజుల రగడ అందుకేనా?
posted on Oct 28, 2020 @ 9:50AM
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి రూటే సెపరేటు. ఆయన వ్యూహాలు ఎవరికి అందవు. ఆయన ఏం చేసినా దానికో లెక్క ఉంటుందంటారు. వారం రోజుల్లో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఆయన ఎత్తులు అలానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్.. తమకు సవాల్ గా మారిన దుబ్బాకలోనూ విజయం కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే రెండు రోజులుగా సిద్ధిపేట, దుబ్బాకలో హైడ్రామా జరుగుతుందంటున్నారు. కేసీఆర్ ఉచ్చులో పడిన విపక్షాలు విలవిలలాడుతుండగా.. గులాబీ నేతలు మాత్రం అధినేత తమ ముందుంచిన టార్గెట్ పూర్తి చేశారనే ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకతను ప్రజల నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్ ఎదుర్కొంటుందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఇంచార్జ్ గా ఉన్న ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ఈ ఎన్నిక సవాల్ గానే నిలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని భావిస్తున్న గులాబీ దళం.. ఎలాగైనా గట్టేక్కేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లకు భారీగా తాయిలాలు ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది. ఇతర పార్టీల కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తుందంటున్నారు. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో చివరి అస్త్రాలను అధికార పార్టీ బయటికి తీసిందంటున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం.. ఆ పార్టీ నేతలంతా సిద్ధిపేటకు వచ్చి ఆందోళనలు చేయడం జరిగింది.
అయితే ఇక్కడే అధికార పార్టీ తమ ప్లాన్ వర్కవుట్ చేసిందంటున్నారు. దుబ్బాక బీజేపీ నేతలంతా సిద్ధిపేటకు చేరగా.. టీఆర్ఎస్ నేతలు మాత్రం గ్రామాల్లోకి వెళ్లి పంపకాలు పూర్తి చేశారట. నిరసన కార్యక్రమాల్లో బీజేపీ నేతలుండగా.. గులాబీ నేతలు ప్రలోభాలకు తెర లేపారట. ఉప ఎన్నిక కోసం ముందే 50 మంది ఓటర్లకు ఓ ఇంచార్జ్ ను నియమించింది కారు పార్టీ. వారంతా ఈ రెండు రోజుల్లో తమకు అప్పగించిన బాధ్యతను ఫినిష్ చేశారని తెలుస్తోంది. మనీ, మందుతో పాటు ఓటర్లకు కావాల్సినవన్ని ఇప్పటికే అన్ని గ్రామాలకు చేరిందంటున్నారు. దీంతో కేసీఆర్, హరీష్ రావుల వ్యూహంలో భాగంగానే రెండు రోజుల డ్రామా నడిచిందని, విపక్షాలు ఆయన ఉచ్చులో చిక్కుకున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పోలీసుల సోదాల్లోనూ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. బీజేపీ నేతల ఇండ్లలోనే సోదాలు జరిగితే అనుమానం వచ్చే అవకాశం ఉండటంతో ముందుగా.. తమ పార్టీ నేతల ఇండ్లలో సోదాలు జరిపించిందనే చర్చ జరుగుతోంది. అందుకే సిద్ధిపేట మున్సిపల్ చైర్మెన్ రాజనర్సుతో పాటు ఇబ్రహీంపూర్ కు చెందిన మరో టీఆర్ఎస్ నేత ఇండ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. తర్వాత రఘునందన్ రావు బంధువుల ఇండ్లపై రైడ్ చేశారు. సిద్ధిపేట సీపీ కూడా మీడియా సమావేశంలో ఇదే విషయం చెప్పారు. మంత్రి హరీష్ రావు కూడా బీజేపీపై విమర్శలు చేస్తూ ఇదే విషయం తెలిపారు. తమ పార్టీ నేతల ఇండ్లలో సోదాలు జరిగితే తాము సహకరించామని .. బీజేపీ మాత్రం రాద్దాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. డబ్బులతో అడ్డంగా పట్టుబడటంతో ఇలా అసత్య ప్రచారం చేస్తుందని హరీష్ రావు మండిపడుతున్నారు. సిద్ధిపేట సీపీ, మంత్రి హరీష్ రావు ప్రకటనలు సేమ్ గా ఉండటంతో అంతా పక్కా ప్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ పని కానిచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
సిద్ధిపేట జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసిన రాజకీయ విశ్లేషకులు అశ్చర్యపోతున్నారు. కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు పేలవంగా ఉంటున్నాయని, ఆయన ఉచ్చులో పడి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ప్రచారం చివరి దశలో ఉండగా రెండు రోజులు బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయలేకపోయారని వారు చెబుతున్నారు. అయినా సోదాల విషయంలో బీజేపీ ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యిందో తమకు అర్ధం కావడం లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.