ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య. చావు కూడా విడదీయలేని ప్రేమ!

ప్రేమ ఎంత గొప్పదో చెప్పనవసం లేదు. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి. ప్రేమ కోసం రాజ్యాలే కూలాయి. ప్రేమకు పేద, పెద్ద తేడా ఉండదు. ప్రేమలో పడిన వారికే దాని గొప్పతనం ఏంటో తెలుస్తుందని చెబుతుంటారు. అంతటి ప్రేమ గొప్పతనాన్ని చాటే ఘటన తాజాగా వెలుగు చూసింది. మరణం కూడా ప్రేమను విడదీయలేకపోయింది. భూపాలపల్లి జిల్లాలో జరిగిన విషాద ఘటన అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది.    మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామానికి  ఇద్దరు యువ‌తీ యువ‌కులు ప్రేమించుకున్నారు. మొదట స్నేహంతో ఏర్పడిన వారి పరిచయం గాఢ ప్రేమకు దారితీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనకున్నారు. ఇంతలోనే ప్రియురాలు అనారోగ్యంతో కన్నుమూసింది.      ప్రియురాలు చనిపోవడంతో ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు ప్రియుడు. మానసికంగా కుమిలిపోయాడు. తన ప్రాణంలాంటి ప్రియురాలే లేని ఈ లోకంలో ఇక తాను భూమి మీద బతకడం ఎందుకని భావించిన ప్రియుడు.. చివరకు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.    దసరా పండుగ రోజే ప్రియుడు ఉరి వేసుకుని చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇద్దరు ప్రేమికుల మరణంతో ఆ రెండు కుటుంబాలతో పాటు బంధువులు, సన్నిహితులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

గ్రేటర్ పై జనసేన అశలు! పవన్ పాచిక పారేనా? 

జీహెచ్ఎంసీ ఎన్నికలను జనసేన సీరియస్ తీసుకుందా? బీజేపీతో కలిసి బల్దియాలో పాగా వేసేలా ప్లాన్ చేస్తోందా? అంటే జనసేన పవన్ కళ్యాణ్ తాజా అడుగులు చూస్తే అవుననే అనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్ గానే పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనలు ఉన్నాయని చెబుతున్నారు.  హైదరాబాద్ వరదలు, చెరువుల సంరక్షణ, ఎంతో కాలంగా వివాదంగా ఉన్న 111 జీవోలపై పవన్ చేసిన కామెంట్లు ఇందుకు బలాన్నిస్తున్నాయి. బల్దియా ఎన్నికల్లో సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని, అందుకే ఆయన హైదరాబాద్ సమస్యలపై స్పందించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.    హైదరాబాద్ సమస్యలు ప్రస్తావిస్తూ.. ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతూనే ప్రస్తుత సర్కార్ కు బాధ్యతలు గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం పార్టీలు ఏం చేయాలో కూడా వివరించారు. నగరాన్ని కాపాడుకునేందుకు ప్రజలుగా గ్రేటర్ వాసులు చేయాల్సిన పనులు కూడా తెలిపారు పవన్ కళ్యాణ్. అన్ని పార్టీలు వ్యవస్థలను బలోపేతం చేసేలా వ్యవహరించాలని, వ్యవస్థకు తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్యలు చాలా భయకరంగా ఉంటాయని హెచ్చరించారు జనసేనాని. నిజానికి హైదరాబాద్ సమస్యలపై ఇటీవల ఎవరూ మాట్లాడనంత క్లారిటీగా పవన్ మాట్లాడరనే చర్చ సిటీ ప్రజల్లో జరుగుతుందని తెలుస్తోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జనసేన కసరత్తు కూడా ప్రారంభించిందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు కమిటీలను నియమిస్తున్నారు. ఇప్పటికే మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని పలు డివిజన్లకు కమిటీలను  ఖరారు చేశారు. ఈ కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టాయని, ఇటీవల వచ్చిన వరద సహాయక పనుల్లో చురుకుగా  పాల్గొన్నాయని చెబుతున్నారు. మిగిలిన డివిజన్ల కమిటీలను త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో తమకు 40 డివిజన్లలో పట్టుందని, పవన్ కళ్యాణ్ గ్లామర్ తో మరిన్ని సీట్లలోనూ పుంజుకుంటామని హైద్రాబాద్ జనసేన నేతలు ధీమాగా చెబుతున్నారట.   గ్రేటర్ పరిధిలో జనసేనకు సుమారు 8 లక్షల సభ్యత్వం ఉందని సమాచారం. ప్రతి నియోజకవర్గంలో సుమారు పది వేల మంది జనసేన సభ్యులు ఉన్నారట. 20వేలకు పైగా సభ్యత్వమున్న నియోకవర్గాలు సైతం ఉన్నాయని జనసేన గ్రేటర్ నాయకులు చెబుతున్నారు. ఆంధ్రా సెటిలర్లు అధికంగా నివాసముండే మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో జనసేనకు ఎక్కువ బలమున్నట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో జనసేనకు కార్యకర్తల బలముంది. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో జనసేనకు సుమారు 28వేల ఓట్లు వచ్చాయి. అధికార టీఆర్ఎస్ ఓట్లను జనసేన చీల్చినందుకే.. రేవంత్‌రెడ్డి 6వేల ఓట్ల మెజారిటీతో మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందారని జనసేన వర్గాలు విశ్లేషిస్తున్నాయి.     బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బండి సంజయ్.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలిశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో కూడా జనసేనతో కలసి పనిచేస్తామని గతంలో చెప్పారు. ప్రతి ఏడాది కిషన్ రెడ్డి నిర్వహించే భారతమాతకు మహా హారతి కార్యక్రమానికి సైతం పవన్ కల్యాణ్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇవన్నీ బీజేపీ-జనసేన కలిసి గ్రేటర్‌లో పోటీ చేయటానికి ఉపకరిస్తాయని ఆ పార్టీ క్యాడర్ ఆశిస్తోంది. ఖచ్చితంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గ్లామర్ ప్రభావం ఉంటుందో.. ఆ లెక్క  ప్రకారమే సీట్ల సర్దుబాటు కూడా చేసుకోవాలని జనసేన నేతలు నిర్ణయించారట. గ్రేటర్ లో పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేస్తారని తెలుస్తోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీచేస్తే పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు. కాని  బిజెపితో కలసి పోటీ చేస్తే ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తో పాటు  పట్టణ ప్రాంతాల్లో బిజెపికి ఉండే బలం ఆ కూటమికి కలిసి వస్తుందని చెబుతున్నారు. మొత్తంమీద గ్రేటర్ పోరులో సుమారు 40 డివిజన్లలో ఆంధ్రా సెటిలర్లు కీలకం‌ కానున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పోటీచేస్తే..  ఆ ప్రభావం ఎవరిపై పడుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది.

కేసీఆర్..శహభాష్!

మక్కజొన్నల కొనుగోలుకు గ్రీస్‌సిగ్నల్   రైతులను గట్టెక్కించిన కేసీఆర్ నిర్ణయం   ప్రత్యర్ధి పార్టీతో సైతం ప్రశంసలు   కేసీఆర్ రూటే వేరు   తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అంచనా వేయడం దుర్లభం. ఆయన ఎప్పుడు ఆగ్రహిస్తారో, ఎప్పుడు అనుగ్రహిస్తారో నర మానవుడూ అంచనా వేయలేడు. పట్టుపడితే విడిచిపెట్టే వ్యక్తి కాదు. పట్టువిడుపులు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి. 50 రోజులపైగా నడిచిన ఆర్టీసీ సమ్మెను ఏ మాత్రం ఖాతరు చేయని కేసీఆర్.. ఆ తర్వాత అదే ఆర్టీసీ కార్మికులను, తన ఇంటికి పిలిచి షడ్రశోపేత భోజనం పెట్టి పంపించిన నేత. నామినేటెడ్ పదవుల నుంచి టికెట్ల వరకూ, ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం రైతుల పెదవులపై చిరునవ్వులు పూయించింది. దానితో మొన్నటి వరకూ సర్కారుపై ఆగ్రహించిన అదే రైతు.. ఇప్పుడు తమను కేసీఆర్ కరుణించటంతో,  మహదానందపడుతున్నాడు. ఈ అంశంలో ఒక్క రైతు మాత్రమే కాదు. కేసీఆర్‌ను నిరంతరం తూర్పారపట్టే,  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. దటీజ్ కేసీఆర్!   తెలంగాణలో తాము పండించిన, మక్కజొన్న పంటను సర్కారు కొనుగోలు చేయకపోవడంతో, రైతు కుమిలిపోయాడు. దానిపై పెట్టిన పెట్టుబడి సంగతి అటు ఉంచితే, కనీసం ఖర్చులయినా వస్తే చాలన్న ఆశతో ఉన్నాడు. సర్కారు హెచ్చరికను పెడచెవిన పెట్టినందుకు, తనను తాము నిందించుకున్నాడు. రైతుల పక్షాన బీజేపీ-కాంగ్రెస్-టీడీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ప్రధానంగా నిజామాబాద్ ప్రాంతంలో, ఈ పంట ఎక్కువగా పండిస్తారు. దానితో ఆందోళన అక్కడే కేంద్రీకృతమయింది. నిజానికి మక్కజొన్న పంట వేయవద్దని, కేసీఆర్ సర్కారు గతంలో కూడా రైతులకు సూచించింది. దీనివల్ల 845 కోట్లు సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లింది. అయినా కేసీఆర్ పెద్దమనసుతో, సర్కారు ధర చెల్లించింది.   ప్రస్తుతం దేశంలో మక్కలకు డిమాండ్ లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతుధర ప్రకటించకపోవడం, విధానాలు మారడం వంటి కారణాలతో ఈ సీజన్‌లో.. అంటే వానాకాలంలో మక్కజొన్నల పంట వేయవద్దని స్వయంగా, కేసీఆర్ అనేకసార్లు రైతులకు సూచించారు. నిజానికి కేంద్రం మక్కలపై.. 50 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించిన ఫలితంగా, మక్కల ధర పడిపోయింది. ఈ పరిణామాలు పరిశీలించిన తర్వాతనే,  ప్రభుత్వ నిబంధనలు పాటించిన వారికే రైతుబంధు పథకం వర్తింపచేస్తామని, సైతం ఒక దశలో హెచ్చరించారు. ఎందుకంటే.. మక్కజొన్న పంట వేయవద్దని,  గతంలో హెచ్చరించినా వినని రైతుల నుంచి కొనుగోలు చేసిన సర్కారుకు.. క్వింటాలుకు 850 రూపాయల నష్టం వచ్చింది. అదీ కేసీఆర్ పట్టుదలకు కార ణం.   అయినా ఖాతరు చేయని రైతులు, ఈ సీజన్‌లో కూడా మక్కజొన్న పంట వేశారు. పైగా సర్కారు తమ  పంట కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. దీనితో ఆగ్రహించిన కేసీఆర్, వారి ఆందోళనను పట్టించుకోలేదు. వాస్తవ పరిస్థితులు వివరించినా, రైతులు ఖాతరు చేయకుండా మక్కజొన్న పండించి.. తర్వాత ఇప్పుడు మళ్లీ సర్కారు మెడపై,  రాజకీయ పార్టీలపై కత్తి పెట్టించడమే కేసీఆర్ ఆగ్రహానికి అసలు కారణం. రైతుల పక్షాన రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహించడం, మీడియా కూడా రైతుల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తుండటంతో, కేసీఆర్ మనసు మార్చుకోవలసి వచ్చింది. దానితో ఈ ఒక్క సీజన్‌కు మాత్రమే.. క్వింటాలుకు 1,850 రూపాయల చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా, మక్కజొన్న కొనుగోలు చేస్తామని చల్లని కబురు చెప్పారు. అయితే, అది కూడా ఈ ఒక్కసారి మాత్రమేనన్న షరతు విధించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని..  నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం అభినందించి, కృతజ్ఞతలు చెప్పారు. ఇక రైతుల ఆనందానికి అవధుల్లేవు. సర్కారు తమ పంట కొనదన్న భావనకు వచ్చిన వారిపై కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తే, వారికి మహదానందమే కదా? అంటే ప్రత్యర్ధులతో సైతం,  ప్రశంసలు కురిపించుకోవడం కేసీఆర్‌కే సాధ్యమయిందన్నమాట! -మార్తి సుబ్రహ్మణ్యం

ప్రజల క్రమశిక్షణ సరే.. సర్కారుకు బాధ్యత సంగతేమిటి?

రోడ్లు బాగుచేయని సర్కారుకు చలాన్లు వేసేదెవరు?   జగన్ సర్కారుపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు   ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. హీరో మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా,  ఇప్పుడు ఆంధ్రాలో వాహనదారుల చావుకొచ్చిపడింది. ఆ సినిమాలో క్రమశిక్షణ లేకుండా, వాహనాలు నడుపుతున్న వారిని దారిలో పెట్టేందుకు.. సీఎం పాత్రధారి మహేష్, ట్రాఫిక్ చలాన్లు ఐదింతలు చేస్తూ నిర్ణయం తీసుకుంటాడు. దానితో జనం దారిలోకి వచ్చి, హెల్మెట్ పెట్టుకోవడం, రాంగ్‌రూట్లో వెళ్లకుండా క్రమశిక్షణ పాటిస్తారు. దానితో సీఎం మహేష్ జనం దృష్టిలో హీరోగా మారతాడు.   అది సినిమా. మనం చూసే సినిమాలకు లాజిక్కులుండవు. అప్పట్లో ఆ సినిమాను,  హైదరాబాద్‌లో చూసిన ఆంధ్రా సీఎం జగన్‌కు, మహేష్ పాత్ర విపరీతంగా నచ్చేసినట్లుంది. ఆ ప్రభావంతోనే ఇప్పుడు విధించిన ట్రాఫిక్ చలాన్లతో ఆయన ‘జగన్ అనే నేను’గా మారారు. వాహనదారులను క్రమశిక్షణలో పెట్టేందుకు,  జగన్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. యుశ్రారైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజయితే.. ‘జగన్ అనే నేను’పై బోలెడంత వ్యంగ్యం కురిపించారు.   తమకు క్రమశిక్షణ నేర్పించే ముందు, ప్రభుత్వం కూడా తన బాధ్యత నిర్వర్తించాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకు సాక్ష్యంగా దెబ్బతిన్న రోడ్లు, వాటివల్ల ప్రమాదానికి గురైన వాహనాల ఫొటోలు పెడుతున్నారు. సర్కారు నిర్ణయంతో, అటు లక్షలాదిమంది వాహనాదారుల్లో కూడా,వ్యతిరేకత పెరుగుతోంది.   ప్రభుత్వం తన ఖజానా నింపే వ్యూహంలో భాగంగానే, చలాన్ల పేరుతో దోపిడీ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆటోడ్రైవర్లయితే, తమకు 10 వేలు ఇచ్చి 25 వేలు వసూలు చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. దీనితో రంగంలోకి దిగిన రవాణాశాఖా మంత్రి పేర్ని నాని.. ఇదంతా ప్రజలను క్రమశిక్షణలో పెట్టేందుకు, ట్రాఫిక్‌పై అవగాహన పెంచే క్రమశిక్షణ చర్యలో భాగంగానే సూత్రీకరించారు.   నిజమే. ప్రజలకు ట్రాఫిక్‌పై, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బెజవాడ రోడ్లను చూస్తే, అంత ధిక్కారపర్వానికి-అరాచకవాదానికి ఏ పేరు పెట్టినా సరిపోదు. వాహనదారులది అంత అరాచకం మరి! రాంగ్‌రూట్‌లోకి వెళ్లి మరీ, ట్రాఫిక్ పోలీసులతో వాదులాటకు దిగే దృశ్యాలు,  రోజుకు కొన్ని డజన్ల సార్లు చూడవచ్చు. కార్లపై నిబంధనలకు విరుద్ధంగా చౌదరి, నాయుడు అని రాసుకుంటారు. ఇప్పుడు కొత్తగా రెడ్డీస్ అనే మూడక్షరాలు తోడయ్యాయి. ఇలాంటి ధిక్కారాల మెడ విరచడం అవసరమే.   వేగంగా వెళ్లే వాహనాలను, మద్యం తాగి డ్రైవింగ్ చే సే వారిని, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసేవారిని, ఓవర్‌లోడ్‌తో వెళ్లే భారీ వాహనాలను కచ్చితంగా నియంత్రించాల్సిందే.  మంత్రి నాని సెలవిచ్చినట్లు.. క్రమశిక్షణతో, నిబంధనలు పాటించేవారెవరూ.. కొత్త చలాన్లకు భయపడాల్సిన పనిలేదు. మరి క్రమశిక్షణ ఒక్క పౌరులకేనా? ప్రభుత్వానికి అవసరం లేదా? అన్నది ఇప్పుడు తెరపైకొచ్చిన చర్చ. మొన్నామధ్య, మాజీ ఎంపి హర్షకుమార్ సర్కారుకు ఆసక్తికరమైన ఓ సవాల్ విసిరారు. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకూ ఉన్న,  గోదావరిపై ఉన్న ఫోర్త్ బ్రిడ్జిపై  సీఎం జగన్ కాన్వాయ్‌పై రాగలిగితే.. తాను రాజకీయాలు మానేస్తానన్న సవాల్ విసిరారు. నిజానికి హర్షకుమార్ ప్రస్ర్తావించిన ఆ రోడ్లపె,ై లారీల విడిభాగాలు కూడా కుదుపుల దెబ్బకు ఊడిపోతుంటాయి. ఇలాంటి బ్రిడ్జిలు బోలెడు. విజయవాడ నుంచి రాజమండ్రికి రావడానికి, కనీసం ఆరుగంటలు పడుతోందన్న హర్షకుమార్ ఆవేదనలో, అణువంత అబద్ధం కూడా లేదు. మరి ఆ ప్రకారంగా ప్రభుత్వంపై కూడా చలాన్లు విధించాలి కదా?   ఏపీలో ఉన్న రోడ్లలో ఇప్పటికే 46  శాతం దెబ్బతిన్నాయన్నది ఒక అంచనా. ఇక జాతీయ రహదారుల పరిస్థితి కూడా దారుణం.వీటిని పునర్నిర్మించేంత నిధులు సర్కారు వద్ద లేవన్నది వాస్తవం. ముందు ఇలాంటి కీలక సమస్యలను పరిష్కరించిన తర్వాత, ప్రభుత్వం చలాన్లపై దృష్టి పెడితే బాగుంటుంది.   ఇటీవలే బెజవాడ కనకద్గుమ్మ వారథి వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను.. కేంద్రమంత్రి, సీఎం కలసి ప్రారంభించారు. కానీ కొద్దిరోజులకే ఫ్లైఓవర్‌పై రోడ్డు పగుళ్లు పడి, పైనుంచి పెచ్చులు కింద పడటంతో, కానిస్టేబుల్ గాయాలపాలయ్యారు. మరి ఇలాంటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి చలాన్లు వేయరా? వేగంగా నడిపే వాహనాలకు చలాన్లు విధించడం బాగానే ఉంది. కానీ ఇటీవలి కాలంలో మంత్రుల కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొని, పోలీసులు గాయపడుతున్న సందర్భాలున్నాయి. మరి అప్పుడు చలాన్లు ఎవరికి వేయాలి? ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే స్టికర్లు పెట్టుకుంటున్నారు. ఈ ధిక్కారంపై ఇంతవరకూ చలాన్లు విధించిన దాఖలాలు లేవు. రాష్ట్ర రాజధానిలో కొన్ని వేల వాహనాల అద్దాలకు, బ్లాక్ ఫిలింలు ఇప్పటికీ తొలగించలేదు. మరి ఆర్టీఏ అధికారులు నిద్రపోతున్నారా?   గత కొన్ని రోజుల నుంచి.. నిరంతరం కురుస్తున్న భారీ వర్షాల వల్ల, గ్రామాలు మునిగిపోతున్నాయి. కార్లు కొట్టుకుపోతున్నాయి. నగరాలు-పట్టణాలు జలమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 20,745 అక్రమ నిర్మాణాలు, 691 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని ఇటీవలే సర్కారీ శాఖనే వెల్లడించింది. మరి ఈ పాపం ఎవరిది? ప్రభుత్వాలు ఏ పార్టీవయినా, శిక్ష ఎవరికి విధిస్తారు? రాష్ట్రంలో రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలు.. అవినీతికి ఆలవాలమయ్యామన్న నివేదికలు వస్తూనే ఉన్నాయి. మరి వాటిపై ఎవరు,  ఎవరికి చలాన్లు విధిస్తారు?   గత కొద్దినెలల క్రితం ఏసీబీ డైరక్టర్ జనరల్  పీఎస్సార్ ఆంజనేయులు, అవినీతి ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా కేవలం మూడురోజుల్లో డజన్లమంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. పీఎస్సార్ దూకుడుతో సర్కారీ ఉద్యోగుల వెన్నులో వణుకు పుట్టింది.  దానితో రెవిన్యూ ఉద్యోగుల సంఘం గగ్గోలు పెట్టింది. ఏసీబీ చర్యల వల్ల ప్రజలు ఉద్యోగులను, ముద్దాయిలుగా చూస్తున్నారని టన్నుల కొద్దీ కన్నీరు కార్చింది.  ఏసీబీకి మేమే దొరికామా? సర్కారు కార్యక్రమాలకు సహరిస్తున్నా, తమపై కావాలని వేధిస్తున్నారంటూ గావుకేకలు పెట్టింది. ఆశ్చర్యంగా మరుసటి రోజు నుంచీ,  ఏసీబీ మెరుపుదాడులు ఆగిపోయాయి.   దాన్నిబట్టి తెర వెనుక ఏసీబీపై,  ఎన్ని ఒత్తిళ్లు వచ్చాయన్నది ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ, సర్కారు కార్యక్రమాలకు సహకరిస్తున్నంత మాత్రాన, ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయకూడదా? వారు ఏసీబీ దాడులకు అతీతులా? ఇలాంటి అవినీతి జలగలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాత, సర్కారు  ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తే బాగుండేది.   సీఎం జగన్ చూసిన,  ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా.. మహేష్ అదే చేశారు. కానీ ఈ ‘జగన్ అనే నేను’ హీరో మాత్రం, ఒక్క వాహనదారులపైనే ప్రతాపం చూపించడమే విచిత్రం. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో మైనింగ్ అక్రమ తవ్వకాలు, అడ్డగోలుగా జరుగుతున్నాయి. విశాఖ కేంద్రంగా కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. మంత్రులు-అధికార పార్టీ ఎమ్మెల్యేల సౌజన్యంతోనే, అవి విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న భూముల్లో అవినీతి జరుగుతోందని, నెల్లూరు లాంటి నగరం మాఫియాకు అడ్డాగా మారిందని,  స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. వీటికితోడు లిక్కర్, గుట్కా, ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్న స్వైరవిహారం, మీడియాలో నిత్యం దర్శనమిస్తోంది. నిజానికి క్రమశిక్షణ లేని వాహనదారుల వల్ల, సమాజానికి పెద్ద ప్రమాదేమీ లేదు.వ్యక్తులకే నష్టం!  కానీ, సమాజానికి-రాష్ట్ర ఆదాయానికి గండికొట్టే ఇలాంటి ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపితేనే.. ‘జగన్ అనే నేను’ సినిమా హిట్టవుతుంది. ‘భరత్ అను నేను’ సినిమాలో మహేష్ కూడా చే సింది అదే! -మార్తి సుబ్రహ్మణ్యం  

తిరుపతి బీజేపీ అభ్యర్ధిగా దాసరి శ్రీనివాసులు?

తిరుపతి పార్లమెంటు స్ధానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో, బీజేపీ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారి, దాసరి శ్రీనివాసులు పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికుడయిన దాసరి, ఈపాటికే క్షేత్రస్థాయిలో ఆలయాల అభివృద్ధి, అనాధ బాలురను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. బీజేపీలో చేరిన ఆయనకు, ప్రస్తుత నాయకత్వం ఎలాంటి పదవి ఇవ్వకపోయినా.. ప్రతిష్టాత్మక సమరసత సేవా  ఫౌండేషన్ బాధ్యతలలో బిజీగా ఉన్నారు.   స్థానికుడయినందున, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉన్న దాసరి శ్రీనివాసులుకు, గత ఎన్నికల్లోనే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ బీజేపీ-సంఘ పరివారం అంతా,  వైసీపీని గెలిపించాలన్న భావనతో ఉండటంతో, ఆయన పోటీ చేసే యోచన విరమించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత సమరసత సేవా   ఫౌండేషన్ బాధ్యతలు అప్పగించడంతో, ఆయన దానిపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తున్నారు.   ప్రస్తుతం ఈ ఫౌండేషన్ ఆధ్వర్యాన.. తీరప్రాంతాలు, దళిత-గిరిజన వాడల్లో దాదాపు 500 దేవాలయాలు నిర్మించారు. మత్స్యకారులు, దళితుల లక్ష్యంగా మతమార్పిళ్లు జరుగుతున్న నేపథ్యంలో.. వాటిని  అడ్డుకుని, వారిలో హైందవ మత సంప్రదాయాలు పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే సూటిగా చెప్పాలంటే, హిందూమతమే దళిత-బడుగువాడల వద్దకు వెళుతోంది.   అందులో భాగంగా మత్స్యకారులు-దళిత-గిరిజనులకు వేదం నేర్పించే, బృహత్తర బాధ్యతను ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఆ ప్రకారంగా.. అర్చక శిక్షణ పూర్తి చేసుకున్న బీసీ-దళిత యువకులను, వారి ప్రాంతాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించే దేవాలయాలకు అర్చకులుగా నియమిస్తున్నారు. ఆలయాల్లో వారి ఆధ్వర్యానే ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆ రకంగా ఇప్పటివరకూ, రాష్ట్రంలో 500 దేవాలయాలు నిర్మించడం విశేషం. అంటే 500 మంది ఎస్సీ-ఎస్టీ-బీసీలను అర్చకులుగా  నియమించారన్న మాట. రాష్ట్రంలో అసలు దేవాలయాలు లేని ప్రాంతాలను గుర్తించి, ప్రధానంగా.. తీరప్రాంతాలు-దళిత-గిరిజన వాడల్లో దేవాలయాలు నిర్మించడం ఈ ఫౌండేషన్ లక్ష్యమని చెబుతున్నారు.   టీటీడీ ఇచ్చే నిధులను,  దేవదాయ శాఖ ద్వారా సమరసత ఫౌండషన్‌కు వస్తుంది. ఒక్కో దేవాలయానికి 5 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు.  ఆవిధంగా ఇప్పటిదాకా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు, 25 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నారు. గతంలో ఈ బాధ్యతను దివంగత మాజీ ఏఐఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ విజయవంతంగా నిర్వర్తించగా, ఇప్పుడు ఆ బాధ్యతలను దాసరి శ్రీనివాసులు నిర్వహిస్తున్నారు.   ఆ కార్యక్రమాలు సమీక్షిస్తున్న దాసరి.. మరోవైపు తిరుపతి పార్లమెంటు పరిథిలో, పేద-అనాధ-వీధి బాలలను గుర్తించి, వారిని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించే కార్యకమ్రాలు చేపడుతున్నారు. దళిత-బీసీ విద్యార్థినీ, విద్యార్ధుల తలిదండ్రుల వద్దకు వెళ్లి, వారిని ఒప్పించి ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది పిల్లలను ఆయన, గురుకుల పాఠశాలలో చేర్పించడం విశేషం.   కాగా ప్రస్తుతం బీజేపీ-జనసేన కలసి పనిచేస్తుండటం, టీడీపీ బలహీనపడుతుండటం, ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం వల్ల... ఈసారి తిరుపతిలో బీజేపీ, అధికార వైసీపీకి బలమైన పోటీ ఇవ్వగలదన్న భావన ఉంది. పైగా గతంలో అక్కడ,  వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు మాజీ ఏఐఎస్ వెంకటస్వామి బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. వైసీపీ నుంచి పదవీ విరమణ చేసిన మాజీ అధికారి వరప్రసాద్ కూడా, తిరుపతి నుంచే గెలవడం విశేషం.   అంతకుముందు రిటైర్డు పోలీసు అధికారి వర్ల రామయ్యను, టీడీపీ నాయకత్వం చివరి నిమిషంలో సీటిచ్చినా, ఆయన బలమైన పోటీ ఇచ్చారు. దీన్నిబట్టి తిరుపతి స్థానంలో ప్రజలు పదవీ విరమణ చేసిన అధికారులను,  ప్రజలు ఆదరిస్తున్నారన్న విషయం అర్ధమవుతుంది. బహుశా అదే అంచనాతో,  దాసరి శ్రీనివాసులుకూ ఎంపీ సీటు ఇచ్చేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు కనిపిస్తోంది.  -మార్తి సుబ్రహ్మణ్యం

ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

రాజ్యాంగ పరంగా ఏర్పడిన వ్యవస్థ అయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మా ఆధీనంలో పని చేయాల్సిందేనని మంకుపట్టు పట్టి కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు పదే పదే గుర్తు చేస్తున్నా మారడం లేదు.    అదే వైఖరితో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు పని చేస్తూ ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశంపై ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఈ నెల 28న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.    స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది. అందుకే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కసరత్తు ప్రారంభించారు. ఒక వైపు ఈ కసరత్తు కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి కార్యాలయం దీన్ని జరగకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.    అందులో భాగంగానేనా అన్నట్లు సోమవారం సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సమావేశంలో ఎవరు పాల్గొంటారు అనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేకుండా ఈ సమావేశానికి హాజరుకావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు వాట్ప్ యాప్ లో మెసేజ్ వచ్చింది.    రాజ్యంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి కి చెందిన కార్యదర్శి ఈ విధంగా సమావేశానికి రావాలని ఆదేశాలు ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. రాష్ట్రంలో జరగబోయే పార్లమెంటు ఉప ఎన్నిక, శాసన మండలి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల విషయం పై ఈ నెల 26న అంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చించేందుకు రావాలని ఆ మెసేజి సారాంశం.    ఘాటైన సమాధానం ఇచ్చిన ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఈ నెల 28న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ విధమైన మెసేజి ఎన్నికల కమిషనర్ కు రావడం ఏమిటి? ఎన్నికల కమిషనర్ ను ఈ విధంగా ప్రభుత్వ అధికారి సమన్ చేయవచ్చా? ఇవేవీ ఆలోచించకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం మెసేజీలు పంపేసింది.    ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నుంచి వచ్చిన ఈ మెసేజికి ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఘాటైన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు అయిన వ్యక్తి అని ఈ విధంగా ఒక సమావేశానికి తనను రావాల్సిందిగా ప్రభుత్వ అధికారి కోరడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని సమాధానం లో పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.    ఈ విధంగా  విధులకు భంగం కలిగిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం విషయాన్ని సంబంధిత న్యాయస్థానం దృష్టి కి తీసుకువెళ్లాల్సి ఉంటుందని కూడా ఘాటుగా సమాధానం ఇవ్వడంతో ఒక్క సారిగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు తాము చేసిన తప్పేంటో తెలిసింది.    తనకు తెలియకుండా సమావేశాలకు వెళ్లవద్దని, తన కార్యదర్శిని రమేష్‌ కుమార్ ఆదేశించారు. 26 నుంచి విజయవాడలో అందుబాటులో ఉంటానని కార్యదర్శికి తెలిపారు. రమేష్ కుమార్ సమాధానం చూసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తగ్గుతుందా లేక ఇంకా అదే విధంగా ప్రవర్తిస్తుందా అనేది చూడాలి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల భారం పడనుంది. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.2,074 కోట్ల భారం పడనుంది. జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించింది. మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.3,802 కోట్ల రూపాయల భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎస్‌లో మూడు విడతల్లో జమ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఏమీ చేయలేరు.. మంత్రి కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్  

కరోనా కలకలంతో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసందే. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మరోపక్క.. స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది.    అయితే తాజాగా స్థానిక ఎన్నికల వ్యవహారంపై మంత్రి కొడాలి నాని మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అది సరైన పద్దతి కాదు. నిమ్మగడ్డ మరి కొన్ని నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. తర్వాత రిటైర్ అయ్యి హైదరాబాద్‌లో ఉంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదు. అసలు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఈ విషయంలో ఏమీ చెయ్యలేరు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అలా కాకుండా ఎన్నికల సంఘం తనంత తాను ఎన్నికలు నిర్వహిస్తానంటే అది జరిగే పనికాదు. కరోనా మహమ్మారి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. ఇంతకూ ముందులాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం కూడా సాద్యం కాదు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. అసలు దసరా తర్వాత కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు బీహర్ అసెంబ్లీ ఎన్నికలతో ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

మీ హత్యకు కుట్ర జరుగుతోంది.. మాజీ మంత్రి అయ్యన్నకు బెదిరింపు మెసేజ్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు ఆయనకు ఒక వ్యక్తి పంపిన మెసేజ్ కలకలం రేపుతోంది. తాను ఒక ఎస్సై నంటూ అవతలి వ్యక్తి ఆయనకు మేసేజ్ పెట్టారు. ఈ హత్యకు ఇప్పటికే లావాదేవీలు కూడా జరిగాయని ఆ మెసేజ్ సారాంశం. అయ్యన్నను హత్యచేసి దానిని మావోయిస్టులు చేసినట్లు చిత్రీకరిస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఐతే ఈ మేసేజ్ పై అయ్యన్నపాత్రుడు వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వియ్యపు తాతారావు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వియ్యపు తాతారావు బుచ్చయ్యపేట కేటీ ఆగ్రహారానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ తాతారావు గతంలో కూడా పలువురికి బెదిరింపు మేసేజ్‌లు పంపినట్లు పోలీసు విచారణలో తేలింది.

పెన్సిలుతో పొడిచి, కొరికి కూతుర్ని హింసించిన తల్లి 

సమాజంలో మానవత్వం నశించిపోతోంది. అమానుషాలు పెరిగిపోతున్నాయి. సొంత మనుషులే కిరాతకులవుతున్నారు. మెంటల్ బ్యాలెన్స్ తప్పి సైకోల్లో ప్రవర్తిస్తున్నారు. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలాంటి దారుణ ఘటన జరిగింది. కన్నకూతురిపైనే తల్లి కిరాతకంగా ప్రవర్తించింది. కన్నకూతురిని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది.  అనంతరం కొరికి గాయాలపాలు చేసింది తల్లి.    కరోనా నేపథ్యంలో విద్యాలయాలు ఆన్‌లైన్‌ కాస్లులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆరో తరగతి చదువుతున్న 12 ఏండ్ల  బాలిక ఇంట్లో వర్చువల్ పద్ధతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలికను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ బాలిక సమాధానం చెప్పకపోవడంతో ఆమె పక్కనే ఉన్న తల్లికి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. టీచర్‌ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదంటూ కన్న కూతురిని దారుణంగా గాయపర్చింది. తన చేతిలో ఉన్న పెన్సిల్ తో 12 సార్లు పొడిచింది. అంతటితో ఆగని ఆ మహా తల్లి .. నోటితో కొరికి కూతురిని గాయపరిచింది.                         అక్కను అమ్మ గాయపర్చడంతో అది చూసిన చిన్నకూతురు భయపడిపోయింది. తెలివిగా వ్యవహరించింది. 1098 ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో  ఎన్జీవో ప్రతినిధులు వారి ఇంటికి చేరుకుని ఆ తల్లికి చివాట్లు పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు చికిత్స చేయించారు. కుమార్తెను పెన్సిలుతో పొడిచిన తల్లిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అమరావతిలో పెయిడ్‌ ఉద్యమం.. వీడియోతో అడ్డంగా బుక్కయ్యారు!!

అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 300 ల రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తుంటే.. అది ఉద్యమమే కాదని, అసలు వాళ్ళంతా రైతులు కాదు పెయిడ్ అరిస్ట్ లని అన్న జగన్ సర్కార్.. ఇప్పుడదే అమరావతి ఉద్యమాన్ని చూసి భయపడుతోందా?. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టించడం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.    అమరావతి రైతులకు పోటీగా శనివారం నాడు మందడంలో ఓ శిబిరం వెలిసింది. అయితే, ఆ శిబిరంలో పాల్గొన్నవారికి శిక్షణ ఇస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఆ వీడియో చూస్తే అమరావతి రైతులుకి వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమం నడిపే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శిబిరానికి వచ్చిన మహిళలకు ఏం మాట్లాడాలో శిక్షణ ఇస్తున్నాడు. ఏ ఊరని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతంలోని గ్రామమని చెప్పమన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారని.. అందువల్లే రిలే దీక్షలో పాల్గొంటున్నామని చెప్పమని మహిళలతో చెబుతున్నట్లు వీడియోలో ఉంది. అంతేకాదు, డబ్బులు కోసం కాదు.. ఇళ్ల స్థలాల కోసమే స్వచ్ఛందంగా వచ్చామని చెప్పాలని వారికి చెబుతున్నట్లు వీడియోలో రికార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   ఇప్పటి వరకూ రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని వక్రంగా మాట్లాడిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు వీడియోతో అడ్డంగా బుక్కయిన ఈ వ్యవహారంపై ఏం సమాధానం చెప్తారోనన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి రైతులు అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పెరుగుతుందన్న భయం ప్రభుత్వంలో మొదలైందని, అందుకే పెయిడ్‌ ఉద్యమాన్ని చేయిస్తోందని మండిపడుతున్నారు.

బీహార్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఏపీ! టెర్రరిజం గవర్నమెంటన్న చంద్రబాబు 

విశాఖలోని గీతం విద్యాసంస్థల కూల్చివేతలను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గీతం  యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను అధికారులు కూల్చివేయడం పట్ల ఆయన మండిపడ్డారు. ఎంతోమంది విద్యార్ధుల చదువులకు,యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత 'గీతం' విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను.. కోర్టులో ఉన్న వివాదంపై,ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు ట్వీట్లు చేశారు.   ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఇలా విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి చేటుదాయకమన్నారు చంద్రబాబు. మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం వర్సిటిలో విధ్వంసం వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. వ్యక్తులపై, పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ టెర్రరిజం అంటూ ఇప్పటికే విద్యా, వైద్య ,పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు రావాలంటేనే భయపడే దుస్థితి ఏర్పడిందన్నారు చంద్రబాబు.              రాష్ట్రంలో జరుగుతున్న హింసా విధ్వంసాలను చూసి బీహార్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఏపీ మారిందనే ప్రచారం దేశంలో జరుగుతుందన్నారు చంద్రబాబు. అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2590 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించింది గీతం సంస్థ. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్థరాత్రి 200 మందితో వెళ్ళి కూల్చడం దారుణమని చంద్రబాబు అన్నారు.   కట్టడం చేతగానివాళ్లకు కూల్చే హక్కులేదన్నారు చంద్రబాబు.ఇప్పటికే చదువు,ఉపాధి,ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్కరాష్ట్రాలకు పోతున్నారని చెప్పారు.ఈ సమయంలో అటు విద్యాసేవ,ఇటు సామాజికసేవల్లో చేయూత అందిస్తూ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్లక్ చర్య అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

గులాబీ కార్యకర్తలకే వరద సాయం! గ్రేటర్ లో కొత్త పంచాయితీ 

కుండపోత వానలు, వరదలతో గ్రేటర్ హైదరాబాద్ వణికిపోయింది. గతంలో ఎప్పుడు లేనంతగా వరద నగరాన్ని ముంచెత్తింది. దాదాపు 15 వందల కాలనీలు రెండు, మూడు రోజుల పాటు మోకాళ్ల లోతు నీటిలోనే ఉండి పోయాయి. ఇండ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది  ఇండ్లు నీట మునిగాయి. వరద తగ్గినా ఇంకా కొన్ని బస్తీలు బురదలోనే ఉన్నాయి. వరద కట్టడిలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం.. బాధితులకు మాత్రం నష్ట పరిహారం ప్రకటించింది. వరద ముంచెత్తిన కాలనీల్లోని ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వడం బాగానే ఉన్నా... పంపిణిలో మాత్రం మళ్లీ అవకతకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిజమైన వరద బాధితులకు కాకుండా అధికార పార్టీ నేతలు చెబుతున్నవారికే డబ్బులు ఇస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు జనాలు.   వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాల్లో తిరిగి జీహెచ్ఎంసీ అధికారులు వివరాలు సేకరించారు. అయితే అవి కూడా తప్పుడు తడకలుగా ఉన్నాయని చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు, లోకల్ కార్పొరేటర్, వార్డు లీడర్లు చెప్పిన పేర్లతోనే అధికారులు జాబితాలు తయారు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ పార్టీ వారికే టీఆర్ఎస్ నేతలు పరిహారం ఇప్పిస్తున్నారని చాలా ప్రాంతాల్లో ఆందోోళనలు  జరుగుతున్నాయి. చెక్కుల పంపిణికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను పరిహారం కోసం నిలదీస్తున్నారు నిజమైన వరద బాధితులు. వరదలతో ముంపుకు గురైన వారికి నష్ట పరిహారం  ఇవ్వాలి గాని.. ఇలా ఎవరికి  పడితే వారికే ఇవ్వడమేంటనీ ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే  మైనంపల్లికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గోషామహాల్ పరిధిలో చెక్కుల పంపిణికి వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను స్థానికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకే వరద సాయం పేరుతో నష్ట పరిహారం అందిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.   టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో అంతా వారి చెప్పినట్లే చెక్కుల పంపిణి జరుగుతోంది. అయితే విపక్షాల కార్పొరేటర్లు ఉన్న చోట మాత్రం అలా చేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపైనే ఆర్కే పురం డివిజన్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్నారు స్థానికులు. ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ గా బీజేపీ వ్యక్తి ఉన్నారు.  అయితే వరద బాధితుల లిస్టు మాత్రం ఆమెకు తెలియకుండానే తయారైందట. వరదలతో సమయంలో గల్లీగల్లీ తిరిగి ప్రజల కష్టాలు చూసిన తనకు తెలియకుండా లిస్టు ఎలా ప్రిపేర్ చేస్తారని మంత్రి సబిత ముందే బీజేపీ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలు చెప్పినవారి పేర్లతో తయారు చేశారని,  వరద సాయంలోనే రాజకీయం చేయడమేంటనీ ఆమె సబితను నిలదీశారు. స్థానికులు కూడా భారీగా వచ్చి టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చెక్కుల పంపిణిని హడావుడిగా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.   కొన్ని డివిజన్లలో అధికార పార్టీ నేతలు మరింత బరితెగించారని చెబుతున్నారు. అసలు ముంపే లేని ప్రాంతాల్లో కూడా చెక్కులు ఇస్తున్నారని తెలుస్తోంది. ఫేక్ బాధితులకు చెక్కులు ఇచ్చి.. తర్వాత వారికి కొంత ఇచ్చి మిగితాదంతా గులాబీ నేతలు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నేతలు కలిసి వరద సాయాన్ని కాజేస్తున్నారనే విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తామని హామీ ఇస్తేనే చెక్కులు ఇస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని సమాచారం. వరద సాయాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకోవడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి.   భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ లో అపార నష్టం జరిగిందని సీఎం కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు. గ్రేటర్ వరద బాధితులకు సాయం కోసం విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. సర్కార్ పిలుపుతో టాలీవుడ్ స్టార్లు, వ్యాపార వేత్తలు, ఐటీ సంస్థలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. వరద బాధితులకు సాయం పేరుతో విరాళాలు సేకరిస్తున్న ప్రభుత్వం.. పరిహారాన్ని సరిగ్గా పంపిణి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ పార్టీ నేతల జేబులు నింపేందుకే కేసీఆర్, కేటీఆర్లు సినీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులపై ఒత్తిడి తెచ్చి మరీ విరాళాలు సేకరిస్తున్నారా అని విపక్షాలు ఫైరవుతున్నాయి. వరద కట్టడిలో విఫలమైన ప్రభుత్వం.. వరద సాయంలో రాజకీయం చేయడం దారుణమంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఇప్పటికేనా ప్రభుత్వం చిల్లర పనులు మానుకోవాలని సూచిస్తున్నాయి. మొత్తంగా వరద బాధితులకు అందించే నష్ట పరిహారం విషయంలోనూ అక్రమాలు జరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

పోలింగ్ కు ముందు ఫెస్టివల్! దుబ్బాక ఓటర్లకు డబుల్ ధమాకా

ఉప ఎన్నికలు వచ్చాయంటనే ఓటర్లకు డిమాండ్. ఉప ఎన్నికలో పోటీ తీవ్రంగా ఉంటే ఓటర్లకు పండుగే. మరో పది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఓటర్లకు మాత్రం డబుల్ ఫెస్టివల్ వచ్చినట్లైంది. తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు విజయ దశమి రావడంతో దుబ్బాక  ఓటర్లకు డబుల్ ధమాకా తగిలినట్లైంది. ఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్ల ప్రసన్నం కోసం నానా పాట్లు పడుతున్నాయి. భారీగా డబ్బులు వెదజల్లుతున్నారు నేతలు. ఇప్పుడు దసరాను ఓట్ల వేటలో పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని తెలుస్తోంది. పండగ పూట ప్రజలకు భారీగా నజనారాలు, తాయిలాలు ఇస్తున్నారట. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో దసరా జోష్ రెట్టింపైందని చెబుతున్నారు.    దుబ్బాక నియోజకవర్గంలోని ఓటర్ల కోసం పండగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయట ప్రధాన పార్టీలు. మందు, మటన్ ఇంటింటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. ఇందుకోసం భారీగా మేకలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యూహం ప్రకారం పార్టీలు  ముందుకెళ్తున్నాయని చెబుతున్నారు. మందు, మటన్ పంపిణి కోసం ప్రతి 100 ఇండ్లకు ఒక ఇన్​చార్జిని పెట్టారట. గ్రామాలు, వార్డులు, కులాలు, మహిళా గ్రూపులు, రైతులు, యువజన సంఘాలు.. ఇలా ఎలా సాధ్యమైతే అలా మటన్ పంపిణి చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. పండుగ రోజు ప్రతి ఇంటికి లిక్కర్ ను సరఫరా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు. మద్యం పంపకాల్లో క్యాండిడేట్లు కొత్త పోకడ పోతున్నారట. గ్రూపులు పెట్టి, స్పెషల్​టోకెన్లు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.   దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా ప్రలోభాలు జోరుగా నడుస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు క్యాండిడేట్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త ఆఫర్లతో ఓటర్లపై వల విసురుతున్నారు. సన్న బియ్యం బస్తాలు, నూనే డబ్బాలు, గోదుమ పిండిలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారట. ఇంటింటికీ కేజీ బాస్మతి బియ్యం ప్యాకెట్లను కొన్ని గ్రామాల్లో ఇచ్చారని చెబుతున్నారు. వెజిటేరియన్స్​ కోసం స్వీట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంటిల్లిపాదికి కొత్త బట్టలను కూడా సరఫరా చేసినట్లు చెబుతున్నారు. యువకులకైతే ఏది అడిగితే అది ఇచ్చేందుకు పార్టీల నేతలు ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.   మంది, మటన్ పంపిణిలోనూ పార్టీలు పోటి పడుతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ వారు ఇచ్చిన దాని కంటే ఎక్కువే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక పార్టీలు పోటీ పడి ఇస్తున్న తాయిలాలతో ఖుషీగా ఉన్నారు దుబ్బాక ఓటర్లు. ఉప ఎన్నిక సమయంలో దసరా రావడంతో ఈసారి జబర్దస్తుగా జరుపుకుంటామని చెబుతున్నారు. మొత్తంగా దుబ్బాకలో ఈసారి దసరా డబుల్ జోష్ తో జరుగుతుందని తెలుస్తోంది.

బీహార్ సంగతి సరే.. మిగిలిన రాష్ట్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయా.. బీజేపీపై మండిపడ్డ శివసేన 

బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో తీవ్ర దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ హామీపై ఇపుడు దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ ఒకప్పటి మిత్రపక్షమైన శివసేన తన అధికార పత్రిక సామ్నా వేదికగా ఈ హామీని తీవ్రంగా తప్పు పట్టింది. "ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను ఎదుర్కునే వ్యాక్సిన్ పై బీజేపీ రాజకీయాలు చేస్తోంది. బీహార్ కు కరోనా వ్యాక్సిన్ అందాలి. కానీ మిగిలిన రాష్ట్రాలేమైనా పాకిస్తాన్ లో ఉన్నాయా? వ్యాక్సిన్ పై దేశంలోని అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులున్నాయి." అని సామ్నాలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది.    కరోనా తో మొత్తం దేశం తీవ్రంగా బాధపడుతోందని, అయితే కేవలం బిహార్ మాత్రమే కోవిడ్ తో బాధపడటం లేదని అలాంటి పరిస్థితిలో వ్యాక్సిన్ రాజకీయాలు చేయడం ఏంటని బీజేపీ పై శివసేన తీవ్రంగా విమర్శించింది. ఇటువంటి పరిస్థితుల్లో జాతి, కుల, మత, ప్రాంత భేదాల్లేకుండా అందరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చూస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, కానీ బీజేపీ మాత్రం బీహార్ ఎన్నికల సందర్భంగా రాజకీయం చేస్తోందని శివసేన తప్పు పట్టింది. అసలు ఈ విషయంలో బీజేపీని ఎవరు గైడ్ చేస్తున్నారో తమకు తెలియదని, బీజేపీ నాయకత్వంలో ఏం లోపముందో కూడా తమకు తెలియదని విమర్శించింది.   అంతేకాకుండా బీహార్ ఎన్నికలలో వివిధ పార్టీల నేతలు కోవిడ్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, ప్రచార సమయంలో కనీసం భౌతిక దూరాన్ని పాటించడం లేదని శివసేన మండిపడింది. "కరోనా మహమ్మారి వ్యాపిస్స్తున్న సమయంలో దేశంలో బిహార్ ఎన్నికలే మొట్టమొదటివి. దీంతో అన్ని ర్యాలీలు వర్చువల్ ర్యాలీలుగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే పార్టీలు ఆ విషయాల్నే మరిచిపోయినట్లున్నాయి. అసలు భౌతిక దూరం అనేది ఏమాత్రం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరు ముఖ్య నేతలు హెలికాప్టర్ల సహాయంతో వివిధ ప్రాంతాలకు వెళ్లి, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహుశా బిహార్ లో ప్రస్తుతానికి కరోనా వైరస్ లాంటిదేమీ లేదు కాబోలు." అంటూ సామ్నా వేదికగా శివసేన సెటైర్లు వేసింది.

కోడెల శివరాం పెత్తనం మాకొద్దు ‘బాబూ’...

సత్తెనపల్లిలో మరోసారి తమ్ముళ్ల తిరుగుబాటు   నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్న కమ్మ వర్గ నేత లు   గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో.. తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య మరోసారి ఆధిపత్యపోరు మొదలయింది. నియోజకవర్గ పార్టీపై కోడెల శివరాం పెత్తనంపై, పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎలాంటి పదవి లేని శివరాం, నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు.   ఇప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ, శివరాం రాకతో గందరగోళంగా మారిందన్న ఫిర్యాదుతో నాయకత్వం వద్దకు వెళ్లనున్నారు. గత ఎన్నికల ముందు కోడెలను వ్యతిరేకించిన కమ్మ వర్గ నాయకులే, ఇప్పుడు శివరాంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండటం ప్రస్తావనార్హం. అధికారంలో ఉన్నప్పుడు, కోడెల కుటంబ చర్యలతో ఘోరంగా దెబ్బతిన్న పార్టీ పరువు, ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటున్న సమయంలో, శివరాం రాకతో మళ్లీ ఐదేళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదంలో పడిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.   పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, కోడెల కుటుంబ సభ్యుల చర్యల వల్ల పార్టీ దెబ్బతింది. స్పీకర్ స్థాయి నేతయినా నేతలు భయపడలేదు. కోడెలకు టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ.. చంద్రబాబు సమక్షంలోనే, గుంటూరు పార్టీ ఆఫీసులో టీడీపీ సీనియర్లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయినా పట్టించుకోని నాయకత్వం.. కోడెలకు టికెట్ ఇవ్వడం, పార్టీ ఓడిపోవడం, ఆ తర్వాత అసెంబ్లీలో ఫర్నిచర్ ఎత్తుకెళ్లిన కేసు, ఎక్కువ అద్దెకు తన సొంత భవనాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం, ఆ తర్వాత శివరాం తమ వద్ద డబ్బులు తీసుకున్నారంటూ పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు, తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టులు కండిషన్ బెయిల్ ఇవ్వడాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ నేతలు గుర్తు చేస్తున్నారు.   గత ఎన్నికల్లో సులభంగా గెలవాల్సిన సత్తెనపల్లి సీటు నుంచి, పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం.. కోడెల కుటుంబసభ్యుల వ్యవహారశైలేనని స్పష్టం చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య తర్వాత, ఇప్పటివరకూ నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనని శివరాం.. ఇప్పుడు మళ్లీ కార్యకర్తలను పిలిపించుకోవడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. గత ఎన్నికల్లో కోడెల కుటుంబసభ్యుల వల్ల నష్టపోయిన కార్యకర్తలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కోడెల మృతికి శివరాం ఒత్తిళ్లే కారణమని, కోడెల శివప్రసాద్ బావమరిని సాయి అప్పట్లో డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదును టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకోలేదని, శివరామే హత్య చేశారని సాయి చేసిన ఆరోపణ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.   ఐదేళ్ల కాలంలో ఒక్కరికీ న్యాయం చేయకుండా, ఆర్ధికంగా ఎదిగేందుకే  కాలం వెచ్చించి.. ఇప్పుడు మళ్లీ తమపై పెత్తనానికి రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి నియోజకవర్గ ఇన్చార్జిని నియమించకపోవడంతో, స్థానిక నేత అబ్బూరి.. వ్యయ ప్రయాసలకోర్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరిస్తున్నారు. కోడెల కుటుంబసభ్యుల చర్యల వల్ల దూరమైన పార్టీని, తిరిగి జనంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెబుతున్నారు.   ఈ సమయంలో.. తిరిగి కోడెల శివరాం రంగంలోకి దిగి హడావిడి చేయడం వల్ల, ఆ కుటుంబం వల్ల నష్టపోయిన కార్యకర్తలు, ప్రజలు పార్టీని ఎందుకు అభిమానిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన మేనేజర్ చేసిన పొరపాట్ల వల్ల నష్టం జరిగిందని, ఇకపై అలా జరగకుండా అండగా ఉంటానన్న హామీపై, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యువనేత ప్రమేయం-ఆదేశాలు లేకపోతే, ఒక సాధారణ మేనేజర్ రెచ్చిపోవడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో శివరాం, గుంటూరు షోరూం కేంద్రంగా చలాయించిన హవా, తమకు చేసిన అవమానాలు మర్చిచపోలేమని సీనియర్లు ఖరాఖండీగా చెబుతున్నారు. మెత్తగా మాట్లాడే ఆయన మాటలకు-చేతలకు పొంతన ఉండదని చెబుతున్నారు.     ఇప్పుడిప్పుడే జనంలోకి వెళుతున్న పార్టీలో.. శివరాం మళ్లీ ప్రవేశించడం వల్ల, లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు. ఐదేళ్ల కాలంలో సాగించిన హవా వల్ల నష్టపోయిన వర్గాలు-వ్యక్తులు-నేతలు- ఆ కుటుంబాన్ని మర్చిపోతున్న సమయంలో, మళ్లీ అదే వ్యక్తి రావడం వల్ల, ఇప్పుడు ఉన్న కార్యకర్తలు కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పైగా ఆయన మీద కేసులు కూడా కొట్టివేయలేదని, కేసులున్న వ్యక్తులకు నాయకత్వం అప్పగిస్తే, ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయో నాయకత్వమే ఆలోచించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.   నిజానికి కోడెల కుటుంబానికి.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంకా సానుకూల పరిస్థితి రాలేదు. సూటిగా చెప్పాలంటే ఆ కుటుంబంపై వ్యతిరేకత పూర్తిగా తొలగిపోలేదు. పైగా ఆ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు సాగించిన హవా, తీసుకున్న నిర్ణయాలు-చర్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై.. రెడ్లలోని ఒక వర్గానికి తప్ప, మిగిలిన ఏ వర్గంలోనూ వ్యతిరేకత లేదు. ఆయన సోదరుడి జోక్యంపైనే  విమర్శలున్నాయి. అయితే, కోడెల హయాంలో జరిగిన వ్యవహారాలతో పోలిస్తే, అది చాలా తక్కువేనన్న అభిప్రాయం ఉంది. ఇటీవల కోర్టుకెక్కిన క్వారీ వ్యవహారం కూడా వైసీపీ అంతర్గతమే. అది కూడా అంబటి స్వయంకృతమేనంటున్నారు. ఇవి తప్ప, ప్రజలకు గానీ-వివిధ కులాలకు గానీ, అంబటితో వచ్చిన సమస్యలంటూ కనిపించడం లేదు.   ప్రస్తుతం సత్తెనపల్లిలో వైసీపీని ఎదుర్కొనే శక్తి టీడీపీకి లేకపోయినా, కొంతమేరకు ఆ పార్టీకి ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంది. బలమైన కమ్మ సామాజికవర్గ దన్ను ఉంది. అయితే గత ఎన్నికల్లో ఆ వర్గం కోడెల కుటుంబంపై వ్యతిరేకతతో, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమే టీడీపీ ఓటమికి ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. కొడుకు-కూతుళ్లు ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదన్న ఫిర్యాదులను, చంద్రబాబు అప్పుడే పరిష్కరించి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. ప్రధానంగా గ్రామాల్లో ఇప్పటికీ ఆ పార్టీ అంత బలహీనంగా ఏమీ లేదు.   ఈ సమయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న శివరాం.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశిస్తే.. పార్టీకి ఉన్న సానుకూలత కూడా, వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందన్నది మెజారిటీ కార్యకర్తల వాదన. దివంగత కోడెల శివప్రసాద్ స్థానంలో, శివరాంను చూసేందుకు కార్యకర్తలెవరూ ఇష్టపడటం లేదు. సత్తెనపల్లి-నర్సరావుపేటలో కుటుంబసభ్యుల జోక్యం లేకపోతే, కోడెల జీవించి ఉండేవారన్న అభిప్రాయం ఇంకా తొలగిపోలేదు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గమే, శివరాం రాకను వ్యతిరేకిస్తుండటం ప్రస్తావనార్హం. సంపాదనే ప్రధానంగా, ప్రజలతో ఆత్మీయత- మానవ సంబంధాలు కోల్పోయిన వారి వల్ల, పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. పైగా వ్యక్తులపై పడిన బురద, పార్టీ తనంతనట తాను అంటించుకున్నట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు.   కాగా, నియోజకవర్గ పార్టీలో శివరాం.. వర్గ విబేధాలు సృష్టిస్తున్నారన్న ఫిర్యాదుతో, పార్టీ నాయకత్వం వద్దకు వెళ్లేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారు. దీనికి కమ్మ వర్గ నేతలే నాయకత్వం వహిస్తుండటం విశేషం. కోడెల జీవించినప్పుడే, ఆయనకు భయపడకుండా.. ఎన్నికల్లో ఆయనకు ఇకెట్ ఇవ్వవద్దని, ఫిర్యాదు చేసేందుకు వెళ్లామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీలో ఎలాంటి పదవి లేని శివరాం వ్యవహారశైలిపై, ఫిర్యాదు చేసేందుకు భయమెందుకని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ హోదాలో శివరాం నియోజకవర్గంలో కార్యకమ్రాలు నిర్వహిస్తున్నారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.   తమకు శివరాం నాయకత్వం వద్దని, ఆయన ఉంటే తాము పార్టీలో కొనసాగడం కష్టమని, నాయకత్వానికి స్పష్టం చేయనున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీని బతికించాలన్న ఆసక్తి-చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే, ఎవరైనా మాజీ ఎమ్మెల్యేల స్థాయి, లేదా జిల్లా స్థాయి నాయకులకు పార్టీ పగ్గాలివ్వాలని సూచించనున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదే కామోసు? అధికారం శాశ్వత మనుకుని విర్రవీగే.. ఇప్పటి తరం యువ నాయకులకు, సత్తెనపల్లి పరిణామాలు ఓ కనువిప్పు! -మార్తి సుబ్రహ్మణ్యం

గన్నవరం ఎమ్మెల్యే వంశీకి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్  

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రత కొన‌సాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య కొంత తగ్గినట్టు కనపడినప్పటికీ మళ్ళీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది … అంతేకాకుండా ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా కరోనా మ‌హ‌మ్మారి మాత్రం వ‌ద‌ల‌టం లేదు. అంతేకాకుండా సామాన్య ప్రజలు మాత్ర‌మే కాకుండా ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా దీని బారిన పడుతున్నారు.   ఏపీలో ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డ‌గా… తాజాగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా వైరస్ సోకింది. తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు పాజిటివ్ అని తేల‌టంతో 14 రోజుల పాటు హోంక్వారెంటైన్ లో ఉండ‌నున్నట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే వంశీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఆయనకు ఎలాంటి కరోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని వైద్యులు తెలిపారు. దీంతో గ‌త నాలుగైదు రోజులుగా ఆయ‌న్ను క‌లిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

రూటు మార్చిన ట్రంప్.. భారత్ ఎంతో రోత.. కారణం అదేనా...

నిన్నటి వరకు భారత్ అన్నా.. మోడీ అన్నా.. ఎంతో ఇష్టమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా భారత్ అంటే రోత అన్నట్లుగా మాట్లాడాడు. తాజాగా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా.. డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జోబైడెన్‌తో నాష్‌విల్లేలో గురువారం రాత్రి జరిగిన జరిగిన చివరి డిబేట్ లో ట్రంప్‌ భారత్‌ను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. "భారత్‌ను చూడండి.. అక్కడ పీల్చేగాలి కూడా రోత పుట్టిస్తుంది. భారతే కాదు.. చైనా, రష్యా దేశాలు కూడా వాయుకాలుష్యమయమే.." అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ మూడు దేశాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణస్థాయిలకు పడిపోయిందని అన్నారు. వాతావరణ మార్పుల విషయంలో ఆ మూడు దేశాలు సహకరించడం లేదని ఆరోపించారు. అందుకే పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుందంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి ఆ మూడు దేశాలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ట్రంప్ అన్నారు.   ఇది ఇలా ఉండగా భారత్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ చేసిన విమర్శలపై నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు. గత ఏడాది అమెరికాలో నిర్వహించిన "హౌడీ.. మోడీ" కార్యక్రమాన్ని పలు సందర్భాల్లో ట్రంప్‌ ప్రస్తావిస్తూ.. మోదీ తనకు ఆప్తమిత్రుడంటూ ఆకాశానికి ఎత్తేసిన విషయాన్నీ పలువురు నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అయితే ట్రంప్‌ ఒక్కసారిగా ఇలా రూటు మార్చి భారత్‌పై విరుచుకుపడటానికి కారణం... వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న భారతీయుల ఓట్లపై ట్రంప్‌, బైడెన్‌ కన్నేశారు. అయితే ఇటీవల జరిగిన సర్వేల్లో అనూహ్యంగా బైడెన్‌కే భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడి కావడంతో ట్రంప్‌ తన అక్కసునంతా ఈవిధంగా వెళ్లగక్కారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కొంప ముంచిన వైసీపీ లేఖలు? పోలవరానికి రూ. 15.6 వేల కోట్లే!

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని అత్యంత భారీగా తగ్గించేసింది. పోలవరానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సింది రూ.15,667.90 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. ఇందులోనూ  రూ.8,614.16 కోట్లు ఇప్పటికే మంజూరు చేశామని కేంద్రం చెబుతోంది. ఈ లెక్కన పోలవరానికి కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది కేవలం రూ.7,053.74 కోట్లే. 2013, 2014 అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.15,667.90 కోట్లకు కేంద్రం కుదించింది. కేంద్రం ఇవ్వాల్సింది రూ.7,053.74 కోట్లే అని అంగీకరిస్తేనే.. ప్రసుత్తం రూ.2,234.28 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం షరతు పెట్టిందని తెలుస్తోంది.    పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయాన్ని కేంద్రం తగ్గించిన సమాచారం తెలియడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజులుగా హైరానా పడుతున్నట్లు తెలుస్తోంది. అందు కోసమే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఇవాళ కూడా నిర్మలతో సమావేశమయ్యారు బుగ్గన. అయితే పోలవరం నిధులు, సవరించిన బడ్జెట్ అంచనాల ఆమోదంపై కేంద్రం నుంచి బుగ్గనకు ఎలాంటి ఊరట లభించలేదని చెబుతున్నారు.    నెల రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన బడ్జెట్ కు పోలవరం అథారిటీ ఆమోదం తెలిపిందని వార్తలు వచ్చాయి. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు పునరావాస ప్యాకేజీ, ముంపు బాధితులకు పరిహారం కోసం అవసరమైన 56 వేల కోట్ల రూపాయలు భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వైసీపీ నేతలు కూడా ప్రచారం చేసుకున్నారు. జగన్ వల్లే ఇది సాధ్యమైందని, కేంద్రాన్ని ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారని మంత్రులు కూడా చెప్పారు. ఇప్పడు సీన్ మారిపోవడంతో వైసీపీ నేతలు దిక్కులు చూస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్లు నెల రోజుల క్రితం కేంద్రం ఓకె చెబితే.. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎందుకు ఈ ప్రకటన చేస్తారనే చర్చ వస్తోంది.ఢిల్లీ నుంచి సరైన సమాచారం లేకుండానే వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.56 వేల కోట్లకుపైగా అంచనాలను గతంలో టీడీపీ కేంద్రానికి పంపింది. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పోలవరంపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి వైసీపీ లేఖలు రాసింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని, అందుకే.. 2013- 14లో రూ.29,027.95 కోట్లుగా ఉన్న అంచనాలను రూ.55,548.87 కోట్లుకు పెంచేశారని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఆరోపించారు. ప్రాజెక్టు అంతా అవినీతిమయమని. కమీషన్లకు కక్కుర్తిపడి అంచనా వ్యయాన్ని పెంచారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ రాసిన లేఖలు, ప్రతిపక్ష నేతగా గతంలో జగన్ చేసిన ఆరోపణలే పోలవరానికి ఇప్పుడు శాపంగా మారాయని అధికారులు అంటున్నారు.    వైసీపీ అధికారంలోకి వచ్చాకా పోలవరం పనుల్లో వేగానికి బ్రేక్ పడింది ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరిట కాంట్రాక్టు సంస్థను మార్చేసింది జగన్ సర్కార్. అయితే ఇప్పుడు కేంద్రం కాలాన్ని కూడా రివర్స్‌ చేసి, 2013-14 అంచనాలే ఫైనల్‌ అని తేల్చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో  పోలవరం ప్రాజెక్ట్ పనులపై ఆందోళన నెలకొంది. కేంద్రం 15.6 వేల కోట్లే ఇస్తే.. ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వానికి భారం కానుంది. అసలే అంతమాత్రంగా ఆర్థిక పరిస్థితి ఉన్న ఏపీకి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి కష్టమవుతుందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.   అంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై తాజాగా జరుగుతున్న పరిణామాలు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. రాజకీయాల  కోసం జగన్ గతంలో చేసిన ఆరోపణలు వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.