బండి సంజయ్ ని చంపాలని చూశారు! రేవంత్ రెడ్డి సంచలనం 

సిద్దిపేటలో పోలీసుల సోదాలు, బీజేపీ ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. బీజేపీకి తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదన్నారు. టీఆర్ఎస్ తన బుట్టలోనిదే అని భావించిన బీజేపీకి దెబ్బ తగిలాకే అసలు విషయం తెలిసినట్టుందన్నారు. సీఎం కేసీఆర్ కు బీజేపీలో అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.         కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపైనా హాట్ కామెంట్స్  చేశారు రేవంత్ రెడ్డి. కేంద్రమంత్రిగా కలెక్టర్, సీపీని పిలిచి సమీక్షించే అధికారం ఉన్నా కిషన్‌రెడ్డి ఆ పనిచేయలేదని విమర్శించారు. ఘటనపై విచారణకు కిషన్‌రెడ్డి  ఎందుకు అదేశించలేదన్నారు. టీఆర్ఎస్‌తో కిషన్‌రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.    ఏపీ ఎంపీ రఘురామరాజుకు సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం.. తమ సొంత ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. సంజయ్‌ను మొదటిసారి కొట్టినప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోలేదు కాబట్టే.. చంపేందుకు మళ్లీ ప్రయత్నం చేశారన్నారు. రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు ఉంటే ఐటీ అధికారులు సోదాలు చేయాలని... అంతేకానీ పోలీసులు పోదాలు చేయడమేంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

రాజధాని రైతుల చేతులకు బేడీలు.. ఇదేనా జగన్ తెస్తానన్న రైతురాజ్యం

గుంటూరు జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. జైలు వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు, రాజధాని పరిరక్షణ సమితి నేతలు, తదితరులు రైతులను పరామర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.    కాగా, మంగళగిరి మండలం కృష్టాయపాలేనికి చెందిన రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో.. పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులకు అనుకూలంగా కొంతమంది ఆటోలలో రావడంతో రాజధాని రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో రవి అనే వ్యక్తి రాజధాని రైతులపై కేసు పెట్టాడు. తర్వాత అతను తన ఫిర్యాదును వాపసు తీసుకుంటూ లేఖ రాసిచ్చినా.. కోర్టులోనే తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. తన ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రస్తావన లేకపోయినా కేసు అలా నమోదు చేశారని రవి తెలిపాడు. దీంతో పోలీసుల తీరుపై స్థానికులు ఫైర్ అయ్యారు. ఇక తాజాగా రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంతో మరోసారి పోలిసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   రాజధాని రైతులకు బేడీలు వేయడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేశారని, రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు మాత్రం బేడీలు వేశారని మండిపడ్డారు. ఇదేనా సీఎం జగన్ తెస్తానన్న రైతు రాజ్యమని ప్రశ్నించారు. 3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే, తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు, అమరావతిని చంపేస్తుంటే ఎంత కోపం రావాలి? అని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలి. లేదంటే, న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని లోకేష్ అన్నారు.

నితీశ్ కుమార్ పై చెప్పు! బీహార్ లో బ్యాడ్ పాలిటిక్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు షాక్ తగిలింది. ముజఫర్ పూర్ లో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఎన్నికల ర్యాలీని ముగించుకుని హెలికాప్టర్ వద్దకు వస్తుండగా కొందరు నితీశ్ పై చెప్పులు విసిరారు. అయితే అవి ఆయనకు తగలలేదు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.   బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాయకులకు ఊహించని పరాభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఎన్నికల ప్రచార సభల్లో నితీశ్ కుమార్ కు వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. దీంతో, నిరసనకారులపై నితీశ్ మండిపడుతున్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ, ఓట్లు వేయకున్నా పర్వేదంటూ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బీహార్ లో సంచలనం రేపాయి.   బీహార్ లో ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఎన్డీఏ కూటమి తరపున సీఎం నితీశ్ కుమార్ తో పాటు బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఇక మహాకూటమి నుంచి ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. మూడు విడతల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి.

ఏపీలో రెండో విడత రైతు భరోసా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. మొత్తం 50.07 లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. రైతు భరోసా రెండో విడతలో రైతులకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించిన గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని, వారికి రూ.11,500 చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నాము. ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అర్హులందరికీ మేలు జరిగేలా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం అని సీఎం అన్నారు.   జూన్-సెప్టెంబర్ నెలల్లో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారమందించింది. లక్షా 66 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.135 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. పంట నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచేలా వైఎస్సార్ జలకళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉచితంగా బోర్లు వేయడం, మోటార్లు అందించడం ద్వారా రైతన్న తన కాళ్లపై తాను నిలబడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయన్నారు. వరదలపై ప్రతిపక్షం చేస్తున్న రాజకీయాలు బాధ కలిగిస్తున్నాయని సీఎం న్నారు.

ప్రచారంలో కనిపించని జోష్! దుబ్బాకలో 'చేతు'లెత్తేసినట్టేనా? 

తెలంగాణలో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో  రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారిపోతున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించినా.. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొది సీన్ మారిపోతోంది.  త్రిముఖ పోరు కాస్త ఇప్పుడు హోరాహోరీ పోరుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక సమరంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. రెండు రోజులుగా సిద్ధిపేట, దుబ్బాకలో హాట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. పోలీసుల సోదాలు, నేతల పరస్పర సవాళ్లతో నియోజకవర్గం హోరెత్తుతోంది. ఇంత జరుగుతున్నా ఎక్కడా కాంగ్రెస్ కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను కలవరపెడుతోంది. పీసీసీ ముఖ్య నేతలంతా ప్రచారం చేస్తున్నా హస్తం పార్టీలో జోష్ రాలేదని, ఉప ఎన్నిక రేస్ నుంచి పార్టీ త్పపుకున్నట్లేనన్న చర్చ దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతోంది.     నిజానికి దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సవాల్ గా తీసుకుంది. రాష్ట్ర కొత్త ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ కూడా దుబ్బాకనే మొదటి టార్గెట్ గా పెట్టుకున్నారు. విజయం కోసం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకే టికెటిచ్చారు. నియోజకవర్గంలో పట్టున్న చెరుకు చేరికతో కాంగ్రెస్ కు లాభిస్తుందని పీసీసీ పెద్దలు భావించారు. కాని ఫ్లీల్డ్ లో సీన్ మరోలా ఉంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా... ఆయన్ను జనాలు టీఆర్ఎస్ వ్యక్తిగానే భావిస్తున్నారట. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మళ్లీ కారు ఎక్కరన్న గ్యారంటీ ఏంటనే చర్చ దుబ్బాక ప్రజల్లో జరుగుతుందట. బీజేపీ కూడా ఇదే ప్రచారం చేస్తోంది. శ్రీనివాస్ రెడ్డిని కేసీఆరే కాంగ్రెస్ లో చేర్పించారని, ఆయన డైరెక్షన్ లోనే పోటీ చేస్తున్నారని ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చీల్చేందుకే గులాబీ బాస్ అలా ప్లాన్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది జనాల్లోకి బాగా వెళ్లిందని.. అందుకే చెరుకుకు దుబ్బాక ప్రజల నుంచి సపోర్ట్ లభించడం లేదని తెలుస్తోంది.    చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేరికతో తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చెరుకుని చేర్చుకుని టికెట్ ఇవ్వడంతో... ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తున్న నేతలంతా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో చాలా మంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అధికార పార్టీ నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు కొందరు నేతలు. అయితే నేతలందరిని కాదని చెరుకును చేర్చుకుని వెంటనే టికెట్ ఇవ్వడాన్ని దుబ్బాక కాంగ్రెస్ కేడర్ జీర్ణించుకోలేకపోతుందని తెలుస్తోంది.    చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేరికతో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పార్టీకు గుడ్ బై చెప్పేశారు. ఉప ఎన్నికలో  కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన ఇద్దరు సీనియర్ నేతలు.. కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, బొంపల్లి మనోహర్ రావు  గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మద్దల నాగేశ్వర్ రెడ్డి కూడా అధికార పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గంలో పేరున్న కాంగ్రెస్ నేతలంతా ఆ పార్టీని వీడారని చెబుతున్నారు. ద్వితియ శ్రేణి నేతలు కూడా కాంగ్రెస్ ను కాదని ఎవరి దారి వారు చూసుకున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సిరెడ్డి కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొనడం లేదని తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ యాక్టివ్ గా ఉండగా.. ఆయన వ్యతిరేక వర్గమంతా దుబ్బాక ఉప ఎన్నికను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కేడరే చెబుతోంది.    దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారంలో ముఖ్య నేతలంతా పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డిలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. అయితే పార్టీ పెద్దలంతా ప్రచారానికి వస్తున్నా.. క్షేత్రస్థాయిలో వారికి సహకరించే లీడర్లు కాంగ్రెస్ కు కరువయ్యారని తెలుస్తోంది. ఎన్నికలు సభల, ర్యాలీలకు ఏర్పాట్లు చేసే నేతలు కూడా హస్తం పార్టీకి నియోజకవర్గంలో దొరకడం లేదట. దీంతో హైదరాబాద్ నుంచే వచ్చే నేతలే తమతో కొందరిని తీసుకుని వస్తున్నారంట. వారితోనే హడావుడి చేయిస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేసిన కొందరు నేతలు.. ఎంత చేసినా లాభం లేదనే నిర్ణయానికి వచ్చి మెక్కుబడి ప్రచారమే చేస్తున్నారని టాక్.    మొత్తానికి టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి సహకరించేందుకు దుబ్బాక కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తించాలని పీసీసీ ప్రయత్నిస్తున్నా.. లోకల్ సపోర్ట్ లేకపోవడంతో ఢీలా పడ్డారని చెబుతున్నారు. కేసీఆర్ ను ఓడించాలనే కసిగా ఉన్న కొందరు కార్యకర్తలు కూడా.. ఈసారికి బీజేపీకి ఓటు వేయాలని ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక రేసులో కాంగ్రెస్ చేతులెత్తిసినట్టేనన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతోంది.  

సిద్ధిపేటలో ఏం జరిగింది? దుబ్బాకలో అసలేం జరుగుతోంది? 

దుబ్బాక ఉప ఎన్నిక  అధికార పార్టీని భయపెడుతోందా? బీజేపీ టార్గెట్ గా సోదాలకు కారణమేంటి? సిద్దిపేటలో దొరికిన డబ్బు ఎవరిది? రఘునందన్ రావే సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారా?. దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణలో కాక రేపుతోంది. గత రెండు రోజులుగా దుబ్బాక, సిద్దిపేటలో జరుగుతున్న పరిణామాలు కలవరం రేపుతున్నాయి. అసలు దుబ్బాకలో ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ వరకు పరిస్థితి ఎలా ఉండబోతోంది, పార్టీలు ఎలాంటి వ్యూహాలు అవలంభించబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది.    దుబ్బాక ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. దసరా పండుగ మరుసటి రోజే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. సిద్ధిపేటలోని రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షల రూపాయలు దొరికాయని, ఆ డబ్బును సీజ్ చేశామని సిద్ధిపేట సీపీ ప్రకటించారు. అయితే బీజేపీ కార్యకర్తలు మాత్రం పోలీసులపై  డబ్బులను రఘునందన్ రావు మామ ఇంట్లో పెట్టారని ఆరోపిస్తున్నారు. డబ్బుల కట్టలు ఉన్న బ్యాగు పోలీసుల చేతిలో ఉన్న వీడియో వైరల్ గా మారింది. పోలీసులు డబ్బును ఇంట్లో పెడుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు లోపలికి వెళ్లి ఆ బ్యాగును లాక్కునే విజువల్స్ బయటికి వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఇంట్లో దొరికిన డబ్బును సీజ్ చేసి బ్యాగును బయటికి తీసుకువస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేసి కొంత డబ్బును తీసుకెళ్లారని చెప్పారు. రఘునందన్ రావు మామ ఇంట్లో దొరికిన డబ్బులో 5 లక్షల రూపాయలను కొందరు ఎత్తుకెళ్లారని సీపీ ప్రెస్ మీట్ లో ప్రకటించారు.      రఘునందన్ రావు మామ, బంధువుల ఇళ్లలో పోలీసుల దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. పార్టీ చీఫ్ బండి సంజయ్ హుటాహుటిన సిద్ధిపేటకు వచ్చినా పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లారు. అయితే పోలీసులు తనపై దాడి చేశారని సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ తొత్తుగా మారిన జోయల్ డేవిస్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధిపేట వెళ్లి రఘునందన్ రావును పరామర్శించారు. పోలీసులు సోదాలు జరిగిన ఇంటిని పరిశీలించారు. సిద్ధిపేట పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రఘనందన్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు, బండి సంజయ్ పై దురుసు ప్రవర్తనకు నిరసనగా చలో ప్రగతి భవన్ కు పిలుపిచ్చింది బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా కమలం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.    దుబ్బాక ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలను  బీజేపీ కేంద్ర పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్ రావుకు  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితులపై అరా తీసినట్లు చెబుుతున్నారు. పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే యోచనలో అభ్యర్థి రఘునందర్‌రావు ఉన్నట్లు తెలస్తోంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నుంచి డిమాండ్ వస్తున్నాయి. ఓటమి భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ చేయించిన సర్వేలో పూర్తిగా వెనకబడినట్లు తేలడంతో చిల్లర రాజకీయాలకు దిగారని మండిపడుతున్నారు. సిద్ధిపేట పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని సీపీ జోయల్ ను ఓపెన్ గానే హెచ్చరించారు అర్వింద్.    మరోవైపు సిద్ధిపేట ఘటనపై టీఆర్ఎస్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. మూడోసారి కూడా డిపాజిట్‌ దక్కదని భావించి రఘునందన్‌ కొత్త రాజకీయ నాటకాలకు తెరతీశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆయనపై నమ్మకం లేక గ్రామాల బీజేపీ కమిటీలకు కమిటీలే టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నాయని చెప్పారు. దొంగ రాజకీయాలు చేస్తున్న రఘునందన్‌ ట్రాప్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి,  బండి సంజయ్‌ పడిపోయారన్నారు హరీష్ రావు. రఘునందన్‌ బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారని చెప్పారు. దీనిపై వీడియో ఫుటేజీలు బయటపెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు హరీష్ రావు. రాజకీయ సానుభూతి కోసం రఘునందన్ నాటకాలు ఆడుతున్నారాని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయని.. సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ ఇంట్లో పోలీసులు బెడ్‌ను చింపి మరీ సోదాలు చేశారని చెప్పారు. అంగీ, లాగులు చింపుకొని టీఆర్‌ఎస్‌ వాళ్లే చింపారని ఆరోపించే స్థాయికి బీజేపీ వాళ్లు వచ్చారని హరీశ్‌ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించి పోలీసులు పట్టుకున్న డబ్బును లాక్కుపోయారన్నారు. తప్పు చేయనివారైతే పోలీసులకు సహకరించాలని సూచించారు హరీష్ రావు.   పోలీసుల సోదాలు, డబ్బులు సీజ్, బీజేపీ ఆందోళనలు, టీఆర్ఎస్ కౌంటర్లతో దుబ్బాక రాజకీయ గరంగరంగా మారింది. నియోజకవర్గంలో ఏం జరుగుతుంది.. పోలింగ్ నాటికి ఏం జరగబోతుందన్న ఆందోళన జనాల్లో కనిపిస్తోంది. అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్లే పోలీసులను ఉపయోగించి  గట్టెక్కాలనే ప్రయత్నాలు చేస్తుందో అనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. పోలీసుల సోదాలతో టీఆర్ఎస్ పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది బీజేపీకి లాభించవచ్చని కూడా వారు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పుంజుకోవడంతో రెండు పార్టీలు డ్రామాకు తెర తీశాయని హస్తం నేతలు చర్చించుకుంటున్నారు.

భారత్ కు చిన్న ఊరట.. భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు..  

దేశంలో నిన్న కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో జస్ట్ 36,470 మాత్రమే నమోదయ్యాయి. ఒకప్పుడు రోజుకు లక్ష దాకా వచ్చేవి. ఇప్పుడు ఇంతలా తగ్గిపోవడం చిత్రమే. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429కి చేరింది. దేశంలో నిన్న 488 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,19,502కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతం ఉండగా... ప్రపంచ దేశాల్లో అది 2.66 శాతంగా ఉంది. గత 24 గంటల్లో ఇండియాలో... కరోనా నుంచి 63,842 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,01,070కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 6,25,857 ఉన్నాయి.   అయితే గత 24 గంటల్లో నమోదైన కేసులను గమనించినట్లయితే హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు తగ్గుతున్నాయి.

చిన్నారిని రక్షించేందుకు 241 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా పరిగెత్తిన రైలు.. 

ఒక చిన్నారిని కిడ్నాపర్ బారి నుండి కాపాడేందుకు ఆ రైలు ఏకంగా 241 కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా పరుగులు పెట్టింది. ఇదేమి బాలీవుడ్ సినిమా క్లైమాక్స్ సీన్ కాదు.. నిజంగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని లలిత్ పూర్ రైల్వే స్టేషన్ లోని రైల్వే పోలీసుల వద్దకు ఒక మహిళ పరుగుపరుగున వచ్చి తన కూతురు కనిపించడంలేదని.. ఎవరో అపహరించారని ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్ లోని సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ చిన్నారిని తీసుకుని ఒక కిడ్నాపర్ రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు లో ఎక్కినట్లు గుర్తించారు. అయితే అప్పటికే ఆ రైలు స్టేషన్ నుండి బయలుదేరిపోయింది. దీంతో ఆ రైలును ఎక్కడైనా ఆపితే కిడ్నాపర్ తప్పించుకుపోయే అవకాశం ఉందని పోలీసులు తమ పై అధికారులకు అలాగే రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఆ రైలును దారిలోని ఏ స్టేషన్ లోను ఆగకుండా క్లియరెన్స్ ఇస్తూ 241 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత భోపాల్ స్టేషన్ లో నిలిపివేశారు. ఐతే అప్పటికే స్టేషన్ లో భారీ ఎత్తున పోలీసులు ఆ రైలును రెండు వైపులా చుట్టుముట్టి కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకుని ఆ చిన్నారిని క్షేమంగా ఆమె తల్లికి అప్పగించారు. అయితే మధ్యలో ఉన్న స్టేషన్లలో ఆగకుండా రైలు వెళ్లిపోతుండడంతో ప్రయాణికులు భయపడి గందరగోళానికి గురయ్యారు. అయితే కిడ్నాపర్ ను పట్టుకోవడానికి రైల్వే అధికారులు.. పోలీసులు ఇంతటి సాహసం చేసారని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీస్ చేతిలో డబ్బు బ్యాగ్.. డబ్బు కట్టలతో బీజేపీ కార్యకర్తల పరుగులు!

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు.. సిద్దిపేటలోని రఘునందన్‌ మామ, బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రఘునందన్ మామ ఇంట్లో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల విషయం తెలుసుకున్న రఘునందన్‌.. దుబ్బాకలో తన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి, అక్కడి నుంచి ఆయన సిద్దిపేటలోని తన మామ ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆయన ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి.. స్వాధీనం చేసుకున్న నగదును తీసుకొని పరుగులు తీశారు.   అయితే, రఘునందన్ బంధువుల ఇంట్లో రూ.18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, కొందరు వాటిని లాకున్నారని పోలీసులు చెప్తుండగా.. బీజేపీ శ్రేణులు మాత్రం పోలీసులే అక్కడకు డబ్బు తెచ్చారని ఆరోపిస్తున్నారు. వేరే ఇంట్లో దొరికిన డబ్బులను రఘునందర్ మామ ఇంట్లో పెట్టేందుకు పోలీసులే డబ్బు తీసుకొచ్చారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాదు, పోలీస్ డబ్బు బ్యాగ్ తీసుకొస్తున్న దృశ్యాలను కార్యకర్తలు రికార్డ్ కూడా చేశారు. ఆ వీడియోలో పోలీస్ డబ్బులు తీసుకురావడం, వాటిని కార్యకర్తలు లాక్కొని వెళ్లి బయటున్న మీడియాకి, జనాలకి చూపించడం కనిపిస్తోంది. అయితే, అది పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బా? లేక పోలీసులు రఘునందర్ మామ ఇంట్లో పెట్టేందుకు తెచ్చిన డబ్బా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిన్న పిల్లలకు రక్షణే లేదా? మరో బాలుడు దారుణ హత్య

తెలంగాణలో మరో దారుణం జరిగింది. సంచలనం రేపిన మహబూబాబాద్ దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసు మరవకముందే మరో బాలుడి హత్యకు గురయ్యాడు. శామీర్ పేటలో పది రోజుల క్రితం మిస్సైన ఐదేండ్ల బాలుడు కేసు విషాదాంతమైంది. బాలుడి అదియాన్ డెడ్ బాడీని శామీర్‌పేట్ ఔటర్‌ రింగ్‌రోడ్ పక్కన  గుర్తించారు పోలీసులు. బాలుడిని హత్య చేశారి అక్కడ పూడ్చి పెట్టారని పోలీసులు నిర్ధారించారు. శామీర్ పేట అవుటర్ రింగు రోడ్డు దగ్గర మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. ఆ డెడ్ బాడీని శామీర్‌పేటలో అదృశ్యమైన అదియాన్దిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోని తీసుకున్నారు.    శామీర్‌పేటకు చెందిన సయ్యద్‌ ఉసేన్‌, గౌజ్‌బీ మూడో కుమారుడు అథియాన్‌ స్థానిక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 15న మధ్యాహ్న భోజనం అనంతరం ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు.      హత్యకు గురైన బాలుడు  ఉంటున్న ఇంటి మరో పోర్షన్‌లో బిహార్‌కు చెందిన సోన్‌సోన్ద్ అద్దెకుంటున్నాడు.  మూడు రోజుల క్రితం తాను దొంగలించిన మొబైల్‌తో ఇంటి యజమానికి ఫోన్‌ చేశాడు. రూ.15 లక్షలిస్తే బాలుడిని అప్పగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో  ఇంటి యజమాని, బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా బాలుడిని చంపేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోలీసులకు చూపించాడు. బాలుడిని చంపి 11 రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.      తెలంగాణలో ఈ మధ్య కిడ్నాప్‌లు, హత్యల ఘటనలు పెద్ద ఎత్తున జరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇటీవలే మహబూబాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి గంట వ్యవధిలోనే హత్య చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తి పోలీసులకే తెలియని టెక్నాలజీని వాడాడు. ఆ ఘటన మరవక ముందే ఐదేండ్ల బాలుడు హత్యకు గురి కావడం ఆందోళన కల్గిస్తోంది.     దీక్షిత్ రెడ్డి కేసులో కిడ్నాపర్లను గుర్తించడానికి పోలీసులు ఐదు రోజులు తీసుకోవడంపై ఆరోపణలు వచ్చాయి. హైటెక్ టెక్నాలజీ ఉన్నా పోలీసులు ఫెయిలయ్యారని ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అధియాన్ కేసులోనూ పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. బాలుడు మిస్సై 10 రోజులైనా కేసును చేధించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేసును సీరియస్‌గా తీసుకోకుండా అలసత్వం వహించడంతో ఈ ఘోరం జరిగిందని అధియాన్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాధితుడు ఉండ్లే ఇంట్లో కిరాయికి ఉంటున్న యువకుడు.. బాలుడ్ని కిడ్నాప్ చేశాడని తేలడంతో జనాలు ఫైరవుతున్నారు. మిస్సింగ్ కేసును విచారణ చేస్తున్న పోలీసులు... ఇంటి పక్కన వారిని ఎందుకు ప్రశ్నించకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది.

మందుబాబులకు షాకిచ్చిన జగన్ సర్కార్

మందు బాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వీల్లేదని పేర్కొంది. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతిలేదని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులని, జీవో నెంబర్ 310ను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది.    కాగా, ఏపీలో మద్యం ధరలు పెరగడం, కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో.. మద్యం ప్రియులు పొరుగు రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా మద్యాన్ని తెచ్చుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని కలిగించింది. దీంతో హైకోర్టు తీర్పుతో మద్యం ప్రియులకు ఉపశమనం కలిగినట్లు అయింది. అయితే తాజాగా ప్రభుత్వం తెచ్చిన జీవోతో మందుబాబులకు మళ్ళీ చిక్కులు తప్పవని అంటున్నారు. 

నారా లోకేష్‌ కు తప్పిన ప్రమాదం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్‌పై వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్‌ ను అదుపుచేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. హటాత్తుగా జరిగిన ఈ ఘటనతో వెంట ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు హడలిపోయారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.   గత కొద్దిరోజులుగా భారీ వర్షాలకు ఏపీలోని లోతట్టు ప్రాంతాలు, పంటపొలాలు నీట మునిగాయి. ఈ తరుణంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను, రైతన్నలను పరామర్శించాలని నారా లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. ఇందులో భాగంగానే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పర్యటించారు.

పోలవరం ప్రాజెక్ట్‌ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పోలవరం ప్రాజెక్ట్‌ కు కేంద్రం ఇచ్చే నిధులపై స్పష్టత వచ్చింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు.. ప్రాజెక్ట్‌ డ్యామ్‌ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని, పునరావాసంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది.    పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై విజయవాడకు చెందని సౌరభ్ ఖమర్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని వివరణ కోరగా కేంద్రం జవాబు ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలపై స్పష్టత ఇచ్చింది. తాము ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. పునరావాస, పరిహారం ప్యాకేజీలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.   2015 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.8,614.16 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.950 కోట్లు మంజూరైనట్లు వెల్లడించింది. నాబార్డు ద్వారా రూ.7,664.16 కోట్లు మంజూరైనట్లు తెలిపింది. పోలవరానికి చేసిన వ్యయంలో ఇంకా రూ.2,234.77 కోట్లు పెండింగ్‌ ఉందని తెలిపింది.    ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 71 శాతం, పునరావాస పనులు 19.85 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్రం వెల్లడించింది. పునరావాసంతో కలిపి 41.05శాతం మేర నిర్మాణం అయినట్టు తెలిపింది. 

బీజేపీలో వ్యాక్సిన్ సెగ! దిద్దుబాటు చర్యల్లో మోడీ, షా

ఉచిత కరోనా వ్యాక్సిన్  హామీ కమలంలో కలకలం రేపుతుందా? బీహార్ ఎన్నికల మేనిఫెస్టో పై బీజేపీలోనే విభేదాలొస్తున్నాయా?. అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  కరోనా వ్యాక్సిన్ ను వాడుకోవడంపై బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీతో  ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి ఇబ్బంది వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇది విపక్షాలకు వరంగా మారిందని కొందరు కమలనాధులుచెబుతున్నారు. బీహార్ నేతల తీరు, మేనిఫెస్టో కూర్పుపై వారు మండిపడుతున్నారని సమాచారం.    ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ తో తమకు డ్యామేజీ కల్గిందని బీజేపీ పెద్దలు గుర్తించినట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు కూడా దిగింది. దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ను ఇస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారని తెలిపారు. ఒక్కో వ్యాక్సిన్ కు రూ. 500 వరకు ఖర్చవుతుందని... ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సారంగి ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కరోనాను వాడుకోవాల్సిన అవరసం తమకు లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.    దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ఉంది. కరోనా బాధితుల సంఖ్య 80 లక్షలకు చేరింది. అయితే గత నెల రోజులతో పోలిస్తే.. ప్రస్తుతం రోజువారి కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయినా జనాల్లో మాత్రం వైరస్ భయం పోలేదు. ఇప్పటికి చాలా కంపెనీలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం చేపిస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చేవరకు  ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ప్రజలంతా  కరోనా నివారణ టీకా ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రజా జీవితంలో కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది. ఇలాంటి తరుణంలో కరోనా వ్యాక్సిన్ పై బీజేపీ చేసిన ప్రకటన ఇప్పుడా పార్టీని ఇబ్బందుల్లో పడేసినట్లు భావిస్తున్నారు.    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా వ్యాక్సిన్ ను బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చడం దుమారం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్  హామీ ఇచ్చిన బీజేపీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ చెప్పడంపై.. విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నిస్తున్నాయి, ఎన్నికలు ఉంటే తప్ప ప్రజలకు ఏమీ చేయరా? అంటూ విరుచుకుపడుతున్నారు ప్రతిపక్షాల నేతలు. కరోనా మహమ్మారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిలదీశారు.    కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందన్న దానిపై ఆరోగ్య సంస్థల దగ్గర క్లారిటీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా టీకా కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నా.. వ్యాక్సిన్ కచ్చితంగా ఎప్పుడు వస్తుందన్న దానిపై క్లారిటీగా చెప్పడం లేదు. మరోవైపు కొన్ని సంస్థలు మాత్రం రెండేళ్ల వరకు వ్యాక్సిన్ రాకపోవచ్చని చెబుతున్నాయి. మనదేశంలోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ కూడా వ్యాక్సిన్ పై పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ పై ఫార్మా సంస్థలకే క్లారిటీ లేని సమయంలో వ్యాక్సిన్ ను అందరికి ఉచితంగా ఇస్తామని చెప్పడం తీవ్ర విమర్శల పాలైంది. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కమలనాధులను కడిగి పారేస్తున్నారు.    మొత్తం బీహార్ అసెంబ్లీ మేనిఫెస్టోలో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ ఇచ్చిన బీజేపీ.. జనాల్లో చులకన అయ్యిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొందరు నేతల అత్యాత్సాహం వల్లే తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీలోనూ చర్చ జరుగుతుందట. వ్యాక్సిన్ హామీతో విపక్షాలకు అనవసరంగా అస్త్రం ఇచ్చినట్లైందని కొందరు కమలనాధులు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

శ్రీశైలంలో పవర్ జనరేషన్ ఎప్పుడు! అసలు జరిగిన నష్టమెంత? 

కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే వందలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. శ్రీశైలం నుంచి ఇంకా నీటిని దిగువకు వదులుతూనే ఉన్నారు. అయితే వరద భారీగా వస్తున్న శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్ చేయలేకపోతోంది తెలంగాణ సర్కార్. ప్లాంట్ లో ఆగస్టు 20న భారీ ప్రమాదం జరిగింది. అయితే రెండు నెలలు కావస్తున్నా పవర్ ప్లాంట్ లో మరమ్మత్తులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో పవర్ జనరేషన్ సాధ్యం కావడం లేదు. పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై గప్ చుప్ గా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్.. ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇప్పటికి చెప్పడం లేదు.    ప్రమాదం తర్వాత ప్లాంట్ ను పరిశీలించిన జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీలు.. నెలరోజుల్లోపే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. మరమత్తులు జరుగుతున్నాయంటూ ఎవరిని లోపలికి అనుమతించ లేదు. పవర్ ప్లాంట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన  విపక్ష నేతలను అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగి రెండు నెలలు పూర్తయ్యాయి. కాని  పవర్ జనరేషన్ మాత్రం మొదలు కాలేదు. దీంతో ప్రమాదంలో పవర్ ప్లాంట్ లో భారీగానే నష్టం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ ప్లాంట్ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన కమిటీలు, సీఐడీ నివేదికలు ఇంకా రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి.    ఆగస్టు 20 అర్ధరాత్రి శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌‌ ప్లాంట్‌‌లో ప్రమాదం జరిగింది. ప్లాంట్‌‌లో 150 మెగావాట్‌‌ల కెపాసిటీ ఉన్న ఆరు యూనిట్లలో నాలుగు యూనిట్లు భారీగా దెబ్బతిన్నాయి. రెండు యూనిట్లు బాగానే ఉన్నాయని అధికారులు చెప్పినా.. వాటిలోనూ విద్యుత్ ఉత్పత్తి ఇంకా షురూ కాలేదు. గత రెండు నెలలుగా నీళ్లు తోడడానికి, క్లీన్‌‌ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి స్టార్ట్ చేయాలని ప్రయత్నించినా... మళ్లీ షార్ట్‌‌ సర్క్యూట్‌‌ అయినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం దాన్ని మాక్‌‌ డ్రిల్‌‌ అని చెప్పి కప్పి పుచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.  రెండు యూనిట్లను ఈ నెల15న స్టార్ట్‌‌ చేయాలని భావించారు. కానీ లోడ్‌‌ తీసుకోవడం లేదని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది.     పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.  జెన్ కో ,  టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీలు, ట్రాన్స్‌‌కో జెఎండీ శ్రీనివాస్‌‌రావుతో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లతో ప్రత్యేక టెక్నికల్‌‌ కమిటీనీ కూడా వేసింది. ఈ సంఘటన ప్రమాదమా? ఏదైనా కుట్రకోణమా? అనేది తేల్చేందుకు సీఐడీ టీమ్‌‌ ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కుట్రకోణం లేదని ప్రమాదమనే సీఐడీ నివేదిక రూపొందించినట్లు సమాచారం.  ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చేది మాత్రం ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీనే. గత నెలలో రెండు రోజుల పాటు శ్రీశైలంలో తిష్టవేసి ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ దర్యాప్తు చేపట్టింది. టెక్నికల్ కమిటీ శ్రీశైలం వెళ్లి కూడా ఇప్పటికే నెల కావస్తోంది. అయినా రిపోర్టు అందించలేదు. సీఎండీకీ, ఇద్దరు డైరెక్టర్లకు కరోనా రావడంతో నివేదిక రూపొందించడంలో జాప్యం జరిగినట్లు మంత్రి జగదీష్‌‌రెడ్డి కౌన్సిల్‌‌ సమావేశంలో వెల్లడించారు. అయితే రెండు రిపోర్టులు వేర్వేరుగా వస్తే సమస్య అని రెండింటినీ పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రిపోర్టులు ఇవ్వడానికి ఇంకా టైమ్ పడుతుందని సమాచారం. మొత్తంగా శ్రీశైలం ప్రమాదాన్ని టెక్నికల్‌‌ ప్రాబ్లమ్‌‌గా తేల్చే పనిలో ఉన్నట్లు తెలిసింది.   శ్రీశైలం పవర్‌‌ప్లాంట్ ప్రమాదంపై విద్యుత్‌‌ వర్గాలు మొదటినుంచీ రహస్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదం ఘటన బయటపడకుండా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వీడియోలు బయటికి రాకపోతే అసలు విషయాన్నే బయటికి రాకుండా చూసేవాళ్లన్న అనుమానాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. రెస్క్యూ బృందాలను పంపకుండా మంత్రి, సీఎండీ స్వయంగా వెళ్లడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరూ తెల్లవారుజామునే ప్లాంటుకు చేరుకోగా, రెస్క్యూ బృందాలు మాత్రం మరునాడు మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రైవేట్ సిబ్బంది ఉన్న టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగితే దాన్ని మాక్ డ్రిల్ అని కప్పిపుచ్చారన్న విమర్శలు వచ్చాయి. సొంత సిబ్బంది ఉన్నప్పడు చేయాల్సిన మాక్‌‌ డ్రిల్‌‌ ప్రైవేటు సిబ్బంది ఉన్నప్పుడు ఎలా చేస్తారన్న అనుమానాలు తలెత్తాయి. మొత్తంగా రెండు నెలలైనా  పవర్ ప్లాంట్ ఘటనపై మిస్టరీ అలాగే ఉండిపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

హోదా లేదు.. నిధులివ్వరు! ఏపీపై ఎందుకింత కక్ష?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే ఆ పార్టీలకు పడనట్లుంది. అందుకే కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తునే అంధకారంలోకి నెడుతున్నాయి. ఇది ప్రస్తుతం సగటు ఆంధ్రప్రదేశ్ వాసి మదిలో తొలస్తున్న ప్రశ్న. కేంద్రంలో అధికారం అనుభవించిన కాంగ్రెస్, బీజేపీలు ఏపీతో ఆటలాడుకుంటున్నాయనే ఆగ్రహం ఏపీ జనాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ నట్టేట ముంచితే... గత అరేండ్లుగా బీజేపీ తమను దగా చేస్తుందనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. రాష్ట్ర విభజన నుంచి తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం తగ్గింపు వరకు ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు మోసం చేస్తూనే ఉన్నాయని జనాలు ఫైరవుతున్నారు.         ప్రత్యేక హోదా విషయంలో ఈ రెండు పార్టీలు పాపం మూటగట్టుకున్నాయి. విభజన సమయంలో  ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన అప్పటి  కాంగ్రెస్ ప్రభుత్వం.. విభజన చట్టంలో మాత్రం పెట్టలేదు.ఇక హోదా సంగతి ఎవరికి పెద్దగా తెలియనప్పుడే.. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పింది బీజేపీ. అధికారంలోకి వచ్చాకా ప్లేటు ఫిరాయించింది . విభజన చట్టంలో పెట్టలేదంటూ కాంగ్రెస్ పై నెపం వేస్తూ.. హోదా ఇవ్వడం కుదరదని చెప్పింది. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి దాన్ని కూడా పక్కనపట్టేసింది పువ్వు పార్టీ. నీతి ఆయోగ్ పేరుతో రూల్స్ మార్చి.. ప్యాకేజీ కాదు  స్పెషల్ పర్పస్ వెహికల్ కింద  అప్పులాగా  తీసుకోవాలని మాట మార్చింది.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారం మోపుతోంది.     2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీని తలదన్నే రాజధానిని ఇస్తామని హామీ ఇచ్చారు బీజేపీ పెద్దలు. అమరావతి  శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర పాలకులు అదే మాట చెప్పారు. తర్వాత కేపిటల్ ఊసే మర్చిపోయారు. ఇప్పుడు అమరావతిని మూడు ముక్కలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నా కాషాయ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ రాజధాని  విషయంలో బీజేపీ తీరు మరీ దారుణంగా ఉంటోంది. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతుండగా.. కేంద్రం మాత్రం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని కోర్టులో ఏకంగా అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అసలు రాజధాని విషయంలో బీజేపీ స్టాండో ఏంటో చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. ద్వంద్వ విధానాలతో ఏపీ జనాలను మోసం చేయవద్దని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇక  అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీకి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు కనీసం స్పందించకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.    జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణం పూర్తికి  అన్ని విధాలా సహకరిస్తామన్న మోడీ సర్కార్.. ఇప్పుడు దాని నిధుల్లో కోతలు పెట్టడం కలకలం రేపుతోంది. ఏపీకి జీవనాడిని చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్లక్ష్యం చేయడంపై ఏపీ ప్రజలు ఫైరవుతున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి .. కేంద్ర సంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేసి.. చాలా ఇచ్చేశామని చెప్పుకున్నారే గాని.. ఇవ్వాల్సినవి ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది.  కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు కొద్దొ గొప్పో నిధులు వచ్చాయని .. ఆయన కేంద్ర కేబినెట్ నుంచి వెళ్లాక ఏపీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందని ఏపీ ప్రజలు చెబుతున్నారు. జాతీయ రహదారులు, రైళ్లకు జనరల్ గా ఏటా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఇచ్చిన డబ్బులను  లెక్కేసి..  ఇంతిచ్చాం అంతిచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు కాని ఏపీకి ప్రత్యేకంగా   మోడీ  సర్కార్ ఏమిచ్చిందో చెప్పాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి.    అంతర్వేది, దుర్గగుడి లాంటి మతపరమైన అంశాలొచ్చినప్పుడు రాజకీయంగా లాభపడటానికి చూసుకున్నారని... తెర వెనక మంతనాలతో వాటిని ముగించేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో రోజు ఒక్కో స్ట్రాటజీ తీసుకుంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఆటలాడుతుందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు వైసీపీకి కోఆపరేట్ చేయడం.. వైసీపీకి కూడా చెక్ పెట్టాలనుకుంటే మరోలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.దీంతో బీజేపీ తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు ఎందుకిలా అన్యాయం చేస్తున్నారోనని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఏపీ అంటే ఎందుకంత కసే తమకు అర్ధం కావడం లేదని ప్రజలు ఆందోళన పడుతున్నారు.

మూడు పార్టీలది సెంటిమెంటే! దుబ్బాక ఓటరు ఎటో? 

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి జరుగుతున్న ఉపఎన్నిక కాక రేపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. త్రిముఖ పోరులో గట్టెక్కేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నాయి. అయితే ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రధానంగా సెంటిమెంటునే రగిలిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజల సానుభూతిని దక్కించుకుని ఎన్నికలో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయని చెబుతున్నారు. ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు సెంటిమెంట్ ను నమ్ముకోవడం ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో చర్చ నీయాంశంగా మారింది.    అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పోటీ చేస్తున్నారు. రామలింగారెడ్డి మరణంతో ఆయన భార్యకు టిక్కెట్ ఇవ్వడంతో సెంటిమెంట్ పనిచేస్తుందని టీఆర్ఎస్ భావిస్తుంది. రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి పనులను చెబుతూనే సుజాతమ్మను అసెంబ్లీకి పంపిద్దామంటూ ప్రజల్లో సానుభూతి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. రామలింగారెడ్డి కుటుంబంపై ఉన్న సానుభూతితో పాటు కేసీఆర్  సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దుబ్బాకలో తమను గట్టెక్కిస్తాయని టీఆర్ఎస్ భావిస్తుంది.   ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి కూడా తన తండ్రి అయిన మాజీ మంత్రి, దివంగత చెరుకు ముత్యం రెడ్డి పేరునే నమ్ముకుంటున్నారు. తన తండ్రి  ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప దుబ్బాకలో అసలు అభివృద్ధి జరిగిందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగలేదని ప్రచారంలో కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. ముత్యం రెడ్డి పట్ల దుబ్బాక ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయన పేరు చెబితేనే కొందరు ఆయన్ను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే దుబ్బాకలో ప్రచారం చేస్తున్న నేతలంతా ముత్యం రెడ్డి పేరు చెబుతూనే జనాలను కలుస్తున్నారు. గతంలో దుబ్బాక నియోజకవర్గంలో తన తండ్రి చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి.    బీజేపీ అభ్యర్థి రఘునందనరావు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. ఆయన గత రెండు దఫాలుగా బీజేపీ అభ్యర్థిగా దుబ్బాకలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వమని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన రఘునందన్ రావును చట్టసభలోకి పంపాలనే మాటలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. రామలింగారెడ్డిని మూడు సార్లు గెలించామని.. ఈసారి మరో ఉద్యమకారుడికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఉద్యోగులు, యువతలో జరుగుతుందని తెలుస్తోంది. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సెంటిమెంట్ రగిలిస్తూనే... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటుతున్నా నిరుద్యోగులను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని రఘునందనరావు తన ప్రచారంలో విరుచుకుపడుతున్నారు.    దుబ్బాక ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు సెంటిమెంట్ ను రాజేస్తూ ప్రజల్లోకి వెళుతుండటం ఆసక్తిగా మారింది. అభ్యర్థుల సెంటిమెంట్ రాజకీయాలతో దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారని చెబుతున్నారు. అయితే మూడు పార్టీల సెంటిమెంట్ లో ఎవరికి ప్రజల సపోర్ట్ లభిస్తుందో చూడాలి మరీ...

మనిషి ఒక చోట.. మనసు మరొక చోట!

ఇంకా పూర్తి కాని టీచర్ల బదిలీ కష్టాలు   మనసులేని తెలుగు ముఖ్యమంత్రులు   తెలంగాణ సీఎంఓలో మగ్గుతున్న బదిలీల ఫైల్ ఆమె జగ్గయ్యపేటలో టీచరు. కానీ కుటుంబం నిజామాబాద్‌లో ఉంటుంది. ఆయన కరీంనగర్‌లో టీచరు. కుటుంబం మాత్రం శ్రీకాకుళంలో ఉంటుంది. వీరు కలిసేది ఏ పండుగలు, పబ్బాలకో. లేదా చావులు పెళ్లిళ్ల సందర్భాల్లోనే. పుట్టిన చోట ఉద్యోగం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? పరస్పర బదిలీలకు రెండు రాష్ర్టాల ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నారు. కానీ పాలకులు తలచుకుంటే అది పెద్ద సమస్య కాదు. కానీ పాలకులు తలచుకోకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్య.   తమను తమ సొంత రాష్ర్టాలకు బదిలీ చేయమంటూ, ఏళ్ల కిత్రం ఇచ్చిన దరఖాస్తులకు ఇంతవరకూ మోక్షం కలగలేదు. ఆ మధ్యలో పాపం పాలకులు, కొద్దిమేరకు కరుణించి ఇచ్చిన ఉత్తర్వులకూ ఇప్పటిదాకా దిక్కూ మొక్కూ లేదు. దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించనట్లు.. కేసీఆర్ కరుణించినా, తెలంగాణ సీఎంఓ అధికారులకు మాత్రం దయకలగడం లేదు. ఫలితంగా.. రెండు తెలుగు రాష్ర్టాల ఉపాధ్యాయుల బదిలీ ఫైలు, ఎక్కడి వేసిన గొంగళి అక్కడే వేసినట్లుంది. ఇదీ ఆంధ్రా-తెలంగాణ టీచర్ల అంతర్రాష్ట బదిలీ సినిమా కష్టాలు.   రాష్ట్ర విభజన చట్టం అన్ని విభాగాల్లో ఇంకా పూర్తి కాక, ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లే... రెండు తెలుగు రాష్ర్టాల టీచర్లు, తమ అంతర్రాష్ట బదిలీ సమస్యల పరిష్కారం కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రా నుంచి తెలంగాణ రాష్ర్టానికి వచ్చేందుకు 200 మంది టీచర్లు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్లేందుకు 650 మంది టీచర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.  ఏపీ సీఎం జగన్ విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సందర్భంగా, ఆయనను తెలంగాణలో పనిచేస్తున్న, ఏపీ టీచర్లు కలసి వినతిపత్రం ఇచ్చారు. దానికి స్పందించిన జగన్.. తాము అధికారంలోకి వస్తే, తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులను ఏపీకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.   ఆ తర్వాత ఆయన ఆ మేరకు  తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.  రాష్ట్ర విభజన తర్వాత,  2017 ఆగస్టు7న.. సర్క్యులర్ మెమో నెంబర్ 9940/ఎస్పీఎఫ్ అండ్ ఎంసి.2015/డేటెడ్ 7-8-2017న,  ఆంధ్రా-తెలంగాణ ప్రభుత్వాలు ఒక ఉత్తర్వు ఇచ్చాయి.  ఆరు (కె) పాయింట్ ప్రకారం.. కేవలం భార్యాభర్తలు, పరస్పర ఒప్పంద బదిలీలకు కొన్ని షరతులతో అంగీకరించారు. ఒకే మేనేజ్‌మెంట్-ఒకే సబ్జెక్ట్-నేటివిటీ ప్రాతిపదికన అనుమతించారు. అయితే అప్పటి ఉత్తర్వు అంశానికి అనుగుణంగా బదిలీ అయిన వారు కేవలం 20 మంది మాత్రమే.   మిగిలిన వందలాది టీచర్లకు ఈ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారాయి. దానితో వారంతా ముఖ్యమంత్రుల నుంచి- ఎమ్మెల్యేల వరకూ తిరిగి, రెండు ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వుల్లో,  తమ బదిలీకి ప్రతిబంధకంగా ఉన్న ఉత్తర్వులను సవరించాలని కోరారు. అంటే నేటివిటీ-మేనేజ్‌మెంట్-సబ్జెక్ట్ షరతులు లేకుండా..  హెడ్ టు హెడ్ బదిలీ చేయాలని కోరారు. దానితో జీఓ ఆర్‌టి నెంబర్ 1096 డేటెట్ 19-5-2018న, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ అంశాలన్నీ సున్నితంగా పరిష్కారమయ్యేలా చూడాలంటూ‘ ఒక కమిటీ వే శాయి. అందులో ఇరు రాష్ర్టాల సీఎస్‌లు కూడా సభ్యులుగా ఉన్నారు.   దానిమీద కమిటీ, 2018 జూన్‌లో తొలివిడత భేటీ అయింది. నేటివిటీ-సబ్జెక్ట్-మేనేజ్‌మెంట్‌పై చర్చించింది. ప్రధానంగా తెలంగాణలో మున్సిపల్  స్కూళ్లు లేనందున, ఏపీ నుంచి వచ్చే టీచర్లను ఏవిధంగా సర్దుబాటు చేయాలన్న అంశంపై చర్చించారు. మళ్లీ ఇప్పటివరకూ ఆ కమిటీకి అతీగతీ లేదు. అసలు సదరు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంది? ఏ సిఫార్సులు చేసిందో ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని రెండు రాష్ర్టాల టీచర్ల ఎమ్మల్సీలు, సంఘాలకూ పట్టిన దాఖలాలు లేవు. అయితే.. ఈ కమిటీ చేసిన కొన్ని సిఫార్సులు జీఏడీకి వెళ్లి, అక్కడి నుంచి 7824/2018 నెంబరుతో,  తెలంగాణ సీఎఓంకు చేరినట్లు తెలుస్తోంది. కానీ సీఎంఓ అధికారులు ఇప్పటిదాకా, వాటిని పరిష్కరించకుండా నాన్చుతున్నట్లు చెబుతున్నారు. ఈ బదిలీల వల్ల ప్రభుత్వానికి  ఆర్ధికంగా వచ్చే నష్టం గానీ, ప్రమోషన్లలో ఇతరులకు వచ్చే సమస్యలు గానీ ఏమీ ఉండవని స్పష్టం చేస్తున్నారు. వివిధ వర్గాలకు వరదానాలు ఇస్తున్న, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. టీచర్ల సమస్యలు మాత్రం పరిష్కరించకపోవడమే ఆశ్చర్యం. -మార్తి సుబ్రహ్మణ్యం

‘గీతం’పై ఆ గగ్గోలేమిటి ‘బాబూ’..

బాబు బంధువుల కోసమా మా పోరాటం?   తల పట్టుకుంటున్న తముళ్లు   అధికార వియోగం అనుభవిస్తున్న, టీడీపీ నాయకత్వం అడుగులు తడబడుతున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అధినేత చంద్రబాబునాయుడు అయోమయం కనిపిస్తోంది. ఊపిరాడకుండా జగనన్న,  నలుచెరుగులా పెట్టిన లాక్‌డౌన్‌తో నాయుడు గారి అనుభవం కూడా, అయోమయంలో పడినట్లుంది. అందుకు గీతం యూనివర్శిటీ వ్యవహారమే ఉదాహరణ. అది పూర్తిగా ప్రైవేటు యూనివర్శిటీ. ప్రభుత్వానికి సంబంధం లేదు. అలాంటి యూనివర్శిటీపై చాలా ఏళ్ల నుంచి భూ ఆక్రమణ కేసులున్నాయి. తాము కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయమని స్వయంగా పెట్టుకున్న దరఖాస్తులున్నాయి. ఈ క్రమంలో వాటిని జగన్ సర్కారు తొలగించే ప్రయత్నం చేసింది. కాకపోతే ఉదయం కాకుండా, అర్ధరాత్రి కూల్చివేతలు చేపట్టింది. ఇదీ విశాఖపట్నం గీతం యూనివర్శిటీ కథ.   అయితే ఆ అర్ధరాత్రి కూల్చివేతలపై, తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కక్ష సాధింపు చర్య అని ఖండించింది. అధినేత చంద్రబాబు ఖండన ప్రకటన వెలువడిన వెంటనే.. నేతలంతా దాన్ని అందుకున్నారు. అయితే, ఈ ‘అతి వ్యవహారేమిటో’అర్ధం కాక తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. ప్రైవేటు యూనివ ర్శిటీలో ఆక్రమణలు తొలగిస్తే, తమ పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుందో? అది ప్రజాసమస్య ఎలా అవుతుందో  అర్ధంకాక, పాపం తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. పైగా..గీతంపై గగ్గోలు పెడుతున్న నేతలెవరూ.. అవి అక్రమ నిర్మాణాలు కావు. అక్కడ అక్రమ కట్టడాలు లేవని చెప్పడం లేదు. అంతా సక్రమంగా కొనుగోలు చేసిన భూములేనని వాదించలేకపోతున్నారు. అదో విచిత్రం.   కానీ, లలిత జువెలరీ అధినేత తన యాడ్‌లో,   ‘డబ్బులు ఎవరికీ  ఊరకనే రావని’ చెప్పినట్లు.. బాబు గారు కూడా ‘ఏదీ ఊరకనే చేయరన్న’ విషయం, తమ్ముళ్లు తెలుసుకోకపోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే.. సదరు గీతం యూనివర్శిటీ,  బాబు బావమరిది కమ్ వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ అల్లుడిది. అంటే లోకేష్ తోడల్లుడిదన్నమాట. అదన్న మాట సంగతి! గీతం అధినేత భరత్, గత ఎన్నికల్లో విశాఖ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.   అందుకే ప్రైవేటు యూనివర్శిటీ అయినప్పటికీ, బంధువుల కోసం బాబు కష్టపడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు గళం విప్పుతున్న పార్టీ అధినేత.. తన పార్టీ నేత కమ్ బంధువు ఆస్తిని స్వాధీనం చేసుకుంటే అడ్డుకోకపోతే ఎలా? లేకపోతే భరత్‌బాబు ఫీలయి, అలగడూ? పైగా ఇదంతా అల్లుళ్ల వ్యవహారమాయె! అయితే.. యావత్ టీడీపీ తమ్ముళ్లంతా, గీతంపై సర్కారు చర్యను ఖండిస్తే, సొంత మామయిన బాలకృష్ణ మాత్రం మౌనంగా ఉండటమే ఆశ్చర్యం. మరి మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా?   సరే.. అసలు గీతం యూనివర్శిటీ భూములపై, సర్కారు ఎందుకు దృష్టి సారించిందో ఓసారి చూద్దాం. గీతం కాలేజీ కాంపౌండ్ వాల్ పరిథిలో, 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఆ యూనివర్శిటీ సర్వేయర్లు- రెవిన్యూ అధికారులు కలసి గుర్తించారు. మరో 18 ఎకరాలు కాంపౌండ్‌కు ఆనుకుని ఉంది. అంటే మొత్తం 40 ఎకరాలు గీతం యూనివర్శిటీ కబ్జాలో ఉందన్నమాట. నిబంధనల ప్రకారం 5 నెలల క్రితమే గీతం ఆధీనంలో ఉన్న భూమిని, అధికారులు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. కానీ  ముందస్తు నోటీసలివ్వకుండా, అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు, మిత్ర మీడియా విరుచుకుపడుతోంది.   అయితే, కూల్చివేతల ముందు నోటీసు ఇవ్వలేదన్న, తమ్ముళ్ల వాదన విస్మయం కలిగిస్తోంది. మరి ఆ ప్రకారంగా.. 40 ఎకరాలు ఆక్రమించిన సదరు గీతం యూనివర్శిటీ యజమాని, వాటిని ఆక్రమించే ముందు ప్రభుత్వానికేమైనా నోటీసులిచ్చారా.. అని ప్రశ్నిస్తే పోయే పరువు పార్టీదే కదా? ఇలాంటి ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, దానిని రాజకీయం చేయడం వల్ల.. తమకు వచ్చేదేమీ లేకపోగా, జరిగే నష్టమే ఎక్కువని తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. పైగా, ప్రజల కోసం కాకుండా, బాబు బంధువుల కోసమే పోరాడుతున్నారన్న సంకేతాలు వెళితే.. బాబుపై కొద్దోగొప్పో ఉన్న గౌరవం కూడా, పోయే ప్రమాదం లేకపోలేదని మొత్తుకుంటున్నారు.   మరి గీతంపై ఇంత అవ్యాజానురాగాలు ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయుడు.. తాను అధికారంలో ఉన్నప్పుడే, వాటికి అనుమతులన్నీ ఇచ్చేస్తే,  ఈ పంచాయతీ ఉండేది కాదు కదా? అన్న సందేహం మెడ మీద తల ఉన్న ఎవరికయినా రావచ్చు. మంత్రులు బొత్స, ముత్తంశెట్టికి ఆల్రెడీ వచ్చేసి, అదే ప్రశ్న సంధించారు కూడా. నిజానికి తాము ఆక్రమించిన ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయమని, పాపం గీతం యూనివర్శిటీ 2014లో అప్పటికీ శాస్త్రప్రకారం, దరఖాస్తు కూడా చేసింది. మరి అప్పుడే ఆ పనేదో చేయకుండా,  ఇప్పటి సర్కారు చేసిన స్వాధీన ప్రయత్నాలను అడ్డుకోవడం వల్ల,  టీడీపీకి రాజకీయంగా వచ్చే ఫాయిదా ఏమిటన్నదే ప్రశ్న. హబ్బే.. ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇంకా స్కూలు మార్చకపోతే ఎట్టా?   అటు జగనన్న సర్కారు కూడా కేవలం గీతంపై మాత్రమే ప్రేమ చూపకుండా, ఇలాంటి గీతం యూనివర్శిటీలకు అన్న-తమ్ముళ్లపై కూడా చూపిస్తే బాగుంటుంది. ఎలాగూ ఆక్రమణ అని తేల్చినందున, ఆ తొలగింపులేవో ఉదయమే చేయకుండా, ఈ అర్థరాత్రి ఎపిసోడ్లు ఎందుకో అర్ధం కాదు. బహుశా జగన్‌బాబుకు అర్ధరాత్రి నిర్ణయాలు అచ్చివచ్చినట్లున్నాయి. ప్రజావేదిక నుంచి మొదలయిన ఈ సెంటిమెంటనే ఆయింట్‌మెంట్ విశాఖ వరకూ పూస్తున్నట్లున్నారు. పనిలో పనిగా, వైసీపీ వీరులు కూడా కబ్జాలు చేసిన భవనాలను కూడా ఇలాగే పెకిలిస్తే.. ‘జగన్ అనే నేను’ సినిమా మరింత విజయవంతమవుతుంది కదా?! సీఎం గారూ... మీకు అర్ధమవుతోందా?! -మార్తి సుబ్రహ్మణ్యం