గాలి కాలుష్యానికి తోడైన నీటి కాలుష్యం! ఢిల్లీలో డేంజర్ బెల్స్ 

దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గాలి కాలుష్యంతో ఇప్పటికే ఢిల్లీ ప్రమాదంలో ఉండగా మరో షాకింగ్ న్యూస్ బయటికొట్టింది. ఢిల్లీలో తాగేందుకు  ఉపయోగిస్తున్న నీటిలో అమ్మోనియా ప్రమాదర స్థాయిలో ఉందని తేలింది. ఢిల్లీ నగరానికి యమునా నది నుంచి నీరు సరఫరా అవుతుంది. ఈ నీటిలో అమ్మోనియా ప్రమాదకర స్థాయికి చేరిందని పరిశోధనల్లో వెల్లడైంది. ఢిల్లీ జల మండలి కూడా దీన్ని ధృవీకరించింది. నివారణ చర్యలు చేపట్టామని, యమునా నది నీటిలో అమ్మోనియా స్థాయి తగ్గే వరకు లో ప్రెషర్‌తో నీటిని సరఫరా చేస్తామని తెలిపింది.    అమ్మోనియా అనేది హైడ్రోజన్, నైట్రోజన్ కలిసిన వాయు రూప మిశ్రమం. రంగులేని పదార్థం. ఇది నీటిలో బాగా కరుగుతుంది. మితిమీరిన అమ్మోనియా ఉన్న నీటిని వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. గాలిలో ఉండే అమ్మోనియా వల్ల మానవుల కళ్ళు, గొంతు, ఊపిరితిత్తులు, ముక్కు మండుతున్నట్లు అనిపిస్తాయి. అదే తాగు నీటిలో మోతాదుకు మించి అమ్మోనియా ఉంటే అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో చర్మంపై కాలినట్లు మచ్చలు ఏర్పడుతాయని చెబుతున్నారు.    ఇప్పటికే గాలి కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తాగు నీరు కుడా కాలుష్యం భారీన పడటంతో వణికిపోతున్నారు.  నీటి కాలుష్యం మరింత పెరిగితే తమను ఎవరూ రక్షంచలేదని ఢిల్లీ జనాలు ఆందోళన చెందుతున్నారు. తమ అరోగ్యంపై వారు తీవ్రంగా భయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కాలుష్య నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.    మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కేంద్రం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల జైలు లేదా రూ.కోటి జరిమానా విధిస్తారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి రెండూ విధించే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్‌ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు వాయు కాలుష్య సమస్య ఎక్కువగా ఉన్న సమీప ప్రాంతాలకూ వర్తిస్తుందని తెలిపింది. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోనూ ఆర్డినెన్స్‌ అమల్లో ఉంటుందని వివరించింది. ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో గాలి నాణ్యతా నిర్వహణకు 20 మంది సభ్యులతో కమిషన్‌ను నియమిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.  

ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వస్తుంది

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాను లెక్క చేయకుండా.. విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టడం సరికాదని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దని, కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలను ప్రారంభించాలని సీఎం జగన్ ను కోరారు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. జగన్ ఆవేశం తగ్గించుకుని, ఆలోచన పెంచుకోవాలని హితవు పలికారు.   మరోవైపు ఏపీ విద్యాశాఖ మంత్రికి రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో కచ్చితంగా వ్యతిరేక తీర్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని అన్నారు. విద్యాబోధనను ఏ మీడియంలో ప్రారంభించబోతున్నారో ముందు చెప్పాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

మీటర్లు బిగిస్తే పీకేస్తాం- జగన్ పై లోకేష్ ఫైర్ 

ఏపీ సర్కార్ పై పోరాటంలో దూకుడు మరింత పెంచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులను ఎగతాళి చేస్తే జగన్‌ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. 4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు తగదన్నారు లోకేష్. వ్యవసాయ మోటార్లకు మీటర్లను అంగీకరించమని, వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని హెచ్చరించారు. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని తేల్చి చెప్పారు లోకేష్. ఏడాదిన్నరలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యమంటే అని ప్రశ్నించారు. నష్టం అంచనా 100శాతం చేయాలని. ఎకరాకు రూ.25వేలు పరిహారం చెల్లించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.    వైసీపీ సర్కార్ చేతగానితనం వల్లే పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం యూటర్న్ తీసుకుందని లోకేష్ ఆరోపించారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టమని వాపోయారు. పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించుకుంటానన్న ఆ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.         చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారన్న నారా లోకేష్.. జగన్ ప్యాలెస్‌లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలని సూచించారు. ఆక్వా రంగం కుదేలైనందున ఎకరాకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలని, ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5వేలు పరిహారం ఇవ్వాలన్నారు.

రైల్వే హాస్పిటల్ టాయిలెట్లకు మా పార్టీ రంగులా.. సమాజ్ వాది పార్టీ ఆగ్రహం 

యూపీలోని గోరఖ్ పూర్ లో ఉన్న ఒక రైల్వే హాస్పిటల్ కు చెందిన మరుగుదొడ్లకు తాజాగా వేసిన రంగు తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడి గోడలపై ఎరుపు, ఆకుపచ్చ రంగు టైల్స్‌ ను ఉపయోగించడంపై అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ( SP) ఫైర్ అయింది. తమ పార్టీ జెండా రంగులను పోలి ఉన్నరంగులతో టైల్స్‌ వేయడమంటే తమను తమ పార్టీని అవమానించడమేనంటూ మండిపడింది. ఆ రంగులను వెంటనే తొలగించాలని.. ఒక వేళ రంగులను మార్చకపోతే తాము ఆందోళన ఉధృతం  చేస్తామని హెచ్చరించింది. అక్కడి రైల్వే ఆస్పత్రిలోని మరుగుదొడ్ల గోడలకు 4 నెలల క్రితమే ఈ రంగులని వేసినప్పటికీ.. ఇటీవల దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది.

ధరణి అద్భుతమంటున్న కేసీఆర్! దరిద్రమంటూ ఆరోపణలు

రెవిన్యూ శాఖలో కీలక సంస్కరణలు తెచ్చింది తెలంగాణ సర్కార్. కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ధరణితో భూవివాదాలకు చెక్ పడిందని చెప్పారు కేసీఆర్. ఇకపై ఎలాంటి లంచాలు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, వారం రోజుల్లోనే కొత్త పాస్ బుక్ ఇంటికి వస్తుందని చెప్పారు. అయితే ధరణి పోర్టల్ పై రెవిన్యూ నిపుణులు, రియల్ వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. ధరణి పోర్టల్ తో ప్రజలకు కొత్తగా ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ చెబుతున్న ధరణి పోర్టలో దరిద్రం పోర్టల్ అని మరికొందరు విమర్శిస్తున్నారు.    కొత్త సీసాలో పాత సారాలా ధరణి పోర్టల్ ఉందంటున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. పాత సిస్టాన్నే డెవలప్ చేశారని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ విధానాలన్ని పాతవే అంటున్నారు. ధరణి వెబ్ సైట్ అద్భుతమని కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారని, అసలు ధరణితో ప్రజలకు కొత్తగా కలిగే ప్రయోజనాలేంటో మాత్రం చెప్పడం లేదని కొందరు విమర్శిస్తున్నారు.    ధరణితో ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పిన కేసీఆర్.. అది ఎలా చేస్తారో మాత్రం చెప్పడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  గతంలోనూ సర్కార్ భూముల రిజిస్ట్రేషన్లు జరగలేదు. అయితే అక్రమార్కులు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని.. ప్రభుత్వ భూములను కబ్జా చేసి.. వాటికి ప్రైవేట్ సర్వే నెంబర్లు ఇచ్చి బోగస్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. ఈ పద్ధతిలోనే వేలాది ఎకరాల వక్ఫ్, దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ తరహా కబ్జాలను నివారించేందుకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు ఆపడం అసాధ్యమంటున్నారు నిపుణులు. వక్భ్ , దేవాదయ భూములకు కంచె వేయడంతోనే రక్షించడం సాధ్యమవుతుందని, ఆ పని మాత్రం సర్కార్ చేయడం లేదని చెబుతున్నారు.    వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహశీల్దార్ కార్యాలయాల్లో జరుగుతాయని చెప్పిన సర్కార్.. వ్యవసాయేతర భూములపై క్లారిటీ ఇవ్వలేదు. ఓపెన్ ప్లాట్లపైనా ధరణి పోర్టల్ లో స్పష్టత లేదు. ఎల్ఆర్ఎస్ పైనా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం లక్షలాది మంది ప్రజలు ఎల్ఆర్ఎస్ తో ఇబ్బంది పడుతున్నారు. కొందరు వ్యాపారులు చేసిన మోసంతో లక్షలాది మంది అమాయకులు  ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు కొన్నారు. అలాంటి వారిని ఏం చేస్తారో కొత్త చట్టంలో చెప్పలేదు. తమకు తెలియకుండానే సర్కార్ భూముల్లో ఫ్లాట్లు కొన్నవారికి రెగ్యులరైజ్ చేస్తారా లేక అక్కడి నుంచి వెళ్లగొడతారే ప్రభుత్వం చెప్పాలంటున్నారు రెవిన్యూశాఖ నిపుణులు. వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువపై క్లారిటీ ఇవ్వలేదని, మార్కెట్ విలువ పెంచిచే ప్రజలపై భారం పడుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    వివాదాస్పద భూములను ఎలా గుర్తిస్తారు..కోర్టు కేసులను ఏం చేస్తారన్న దానిపైనా ధరణి పోర్టల్ లో స్పష్టత ఇవ్వలేదంటున్నారు. లక్షలాది ప్లాట్లలో డబుల్ రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. వాటి సంగతి ఏం చేస్తారు... అందులో ఎవరికి ఆ ప్లాట్ కట్టబెడతారో సర్కార్ చెప్పాలంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. సీఎం కేసీఆర్ అద్భుతమని చెబుతున్న స్లాట్ బుకింగ్ విధానం గతంలోనూ ఉందంటున్నారు. ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని చాలా మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెబుతున్నారు. డాక్యుమెంట్ రైటర్లకు రేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. అయితే ఒక్కో డాక్యుమెంట్ రైటర్ ఒక్కోలా ఉంటారని, వారిని  కంట్రోల్ చేయడం సర్కార్ కు అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    వీఆర్వో  వ్యవస్థ రద్దుతో లంచాల పీడ పోయిందని చెప్పారు సీఎం కేసీఆర్. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో వీఆర్వోలు మాత్రం లంచాలు తీసుకున్నారా.. సర్వేయర్లు, తహశీల్దార్లు, ఆర్డీవోలు సచ్చీలుగా అని ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయలు లంచం తీసుకుంటూ ఎమ్మార్వోలు, ఆర్డీవోలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని జనాలు నిలదీస్తున్నారు. గతంలో రెవిన్యూ అధికారులు సింగిల్ గా ఎవరికి వారు దోచుకునేవారని, ధరణితో అంతా కలిసి బల్క్ గా దోచుకునే అవకాశం ఇచ్చారనే ఆరోపణలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.    రెవిన్యూ కొత్త చట్టం ప్రకారం భూముల విషయంలో అక్రమాలు జరిగితే  అధికారులతే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి. అయితే ఇంతకుముందు జరిగిన అక్రమాలకు అధికారులు బాధ్యులు కారా అన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. గతంలో అక్రమాలు చేసిన వారిని ఏం చేస్తరు.. ఇకపై అక్రమాలు చేస్తే ఏం చేస్తరో సీఎం ఎందుకు చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లు ధరణి వెబ్ సైట్ తో ప్రజలకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏమి లేదనే  అభిప్రాయమే మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది. కొత్త రెవిన్యూ చట్టం, ధరణి పోర్టల్ పై ముఖ్యమంత్రి చెప్పేవన్ని ఉత్తరకుమార మాటలేనని విపక్షాలు మండిపడుతున్నాయి.

బీజేపీకి కాంగ్రెస్ ఓటు బ్యాంకు? దుబ్బాకలో మరో ట్విస్ట్!

శత్రువుకు శత్రువు మిత్రుడవుతుంటారు. రాజకీయాల్లో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. అధికారం కోసం, తమ ప్రత్యర్థులను మట్టి కరిపించడం కోసం పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తుంటాయి. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇలాంటి సీనే కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ ను ఓడించి సీఎం కేసీఆర్ కు షాకిచ్చేందుకు పార్టీలకతీతంగా విపక్ష కార్యకర్తలు ఏకమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత చీలి అధికార పార్టీకి ప్రయోజనం కల్గకుండా చూసేందుకే లోపాయికారిగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు తమ బద్దశత్రువైన పార్టీకి కూడా మద్దతు ఇచ్చేందుకు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారనే చర్చ దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతోంది.    దుబ్బాక ఉప ఎన్నికలో త్రిముఖ పోరు జరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలంతా దుబ్బాకలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా సీరియస్ గా ప్రచారం చేస్తుండటంతో ట్రయాంగిల్ వార్ ఉత్కంఠ రేపింది. అయితే ఇటీవల జరిగిన ఘటనలతో  సీన్ మారిపోయిందంటున్నారు. రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసుల సోదాలు, గులాబీ నేతల తీరుతో బీజేపీపై ప్రజల్లో సానుభూతి పెరిగిందని చెబుతున్నారు. అధికార పార్టీ బోగస్ బ్యాలెట్ కు దిగిందనే ప్రచారం ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచిందంటున్నారు.దీంతో నియోజకవర్గంలోని కొందరు ఓటర్ల మైండ్ సెట్ లో మార్పు వచ్చిందంటున్నారు.    ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు.. విపక్షాల్లో ఏదో ఒక పార్టీనే ఎంచుకుని ఓటేయాలని భావిస్తున్నారట. అలా అయితేనే అధికార పార్టీని ఓడించడం సాధ్యమవుతుందని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుందనే అభిప్రాయంతో ఉన్నారట. ఇప్పటికే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు  బీజేపీ గట్టి పోటి ఇస్తుందన్న ప్రచారం ఉంది. సో ఆ పార్టీకే సపోర్ట్ చేయాలని కేసీఆర్ సర్కార్ పై కోపంగా ఉన్న ఓటర్లు డిసైడయ్యారని చెబుతున్నారు.    దుబ్బాకలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతున్నా ఆ పార్టీ కార్యకర్తల ఆలోచన మరోలా ఉందంటున్నారు. కేసీఆర్ ను ఓడించాలనే కసిగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారనే సమాచారం వస్తోంది. బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అయినా కేసీఆర్ కు షాకిచ్చేందుకు వారికి కూడా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ కేడర్ ఓపెన్ గానే చెబుతున్నారట. ప్రస్తుతానికి కొన్నిగ్రామాల్లో ఇలాంటి టాక్ వినిపిస్తున్నా క్రమంగా ఇది నియోజకవర్గమంతా విస్తరించే అవకాశం ఉందంటున్నారు. పోలింగ్ రోజు నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయి టీఆర్ఎస్, బీజేపీ  మధ్యే పోటీ జరిగినా అశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   నిజానికి దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ కు అత్యంత కీలకం. దుబ్బాకలో బీజేపీ గెలిచినా, సెకండ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ భవిష్యత్తుకే ప్రమాదం. ఈ విషయం తెలిసే దుబ్బాక బైపోల్ ను పీసీసీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. అయితే లోకల్ కేడర్ అలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉందట. టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యంగా వారు చెబుతున్నారట. అందుకే తమ పార్టీ లీడర్లతో సంబంధం లేకుండానే బీజేపీతో హస్తం కార్యకర్తలు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. బీజేపీ కన్నా వెనకబడితే కాంగ్రెస్ ఫ్యూచర్ ప్రమాదంలో పడుతుందని కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలకు చెప్పాలని చూసినా వారు కన్వీన్స్ కావడం లేదట. కేసీఆర్ ను ఓడించడమే తమకు ముఖ్యమని చెబుతున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక పీసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట.   టీఆర్ఎస్ ను ఓడించడం వరకు బాగానే ఉన్నా అందుకోసం తమకు జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీకి సపోర్ట్ చేయడమే తమకు ఇబ్బందిగా ఉందని పీసీసీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గ జనాల్లో వస్తున్న మార్పు తమకు కలిసి వస్తుందని కమలనాధులు ఆశ పడుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో తమకు విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లితే తమకు కష్టేమేనన్న అభిప్రాయం కారు పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.

80 శాతం మంది కరోనా బాధితులకు ఆ లోపం వల్ల ముప్పు ఎక్కువ.. తాజా పరిశోధనలో వెల్లడి 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. దాడి చేస్తూనే ఉంది. దీని తాకిడికి ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా సోకినా పెద్ద సమస్య లేకపోవచ్చు కానీ.. ఇప్పటికే పలు అనారోగ్యాలతో బాధ పడుతున్న వారు దీనికి బలైపోతున్నారు. దీంతో డాక్టర్లు మంచి ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు.   అయితే తాజాగా జరిగిన ఒక పరిశోధనలో కరోనా బారిన పడుతున్న వారిలో 80 శాతం మందికి "డి విటమిన్" లోపం ఉందని స్పెయిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా 216 మందిని పరిశీలించగా వారిలో 80 శాతం మంది రక్తంలో డి విటమిన్ తగినంత స్థాయిలో లేదని తేలిందని ఆ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరీ ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషులలోనే డి విటమిన్ తక్కువగా ఉన్నట్లు కూడా వారు నిర్ధారించారు. ఈ అధ్యయనం ప్రకారం తగినంత డి విటమిన్ లేకపోవడం వల్ల కరోనా రోగుల పరిస్థితి విషమించి చనిపోయే ప్రమాదం 51.5 శాతం ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెపుతున్నారు. అంతేకాకుండా "డి విటమిన్" లోపం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డి విటమిన్ తక్కువగా ఉన్నవారిలో డయాబెటీస్, రక్తపోటు, ఒబేసిటీ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వ్యాన్ బోల్తా పడి ఆరుగురి మృతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో దాదాపు 17 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరంతా పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను గోకవరం మండలం టాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదికి రావాల్సిన వ్యాన్‌ మెట్లు పై నుంచి ఒక్కసారిగా కింద పడినట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించిన జగన్ సర్కార్

మ‌ద్యం ప్రియుల‌కు జగన్ సర్కార్ శుభవార్త‌ చెప్పింది. మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఐఎంఎఫ్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మీడియం, ప్రీమియం ధరలను తగ్గిస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ కేటగిరీల బ్రాండ్ల‌పై 25శాతం వరకు ధరలను త‌గ్గించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టేందుకే ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే, క్వార్టర్ ధర రూ.200ల పైన ఉన్న మద్యం రేటు మాత్రమే తగ్గనుంది. బాటిళ్ల పరిమాణాలు, బ్రాండ్లను బట్టి తగ్గింపు రూ.50 నుంచి రూ.1350 వరకు ఉండనుంది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి. అయితే బీర్లు, రెడీ టూ డ్రింక్స్ రేట్లు మాత్రం య‌థాత‌థంగా కొన‌సాగ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.   ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పడిపోవడంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్న వైసీపీ.. మద్యనిషేదం చేస్తామని చెప్పింది. అందులో భాగంగానే మద్యం ధరలు పెంచి ప్రజలకు మద్యం అందుబాటు ధరలో లేకుండా చేస్తున్నామని ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆదాయం పడిపోవడంతో.. అమ్మకాలు పెంచుకునేందుకు ధరలను తగ్గించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.  

పోలవరంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని కేంద్రం కట్టాల్సిన అవసరం లేదని.. తామే నిర్మిస్తామని టీడీపీ నేతలు చెప్పి, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు దోపిడీ వల్లే పోలవరం నిధులు తగ్గాయని, ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణమని విమర్శించారు. అయితే ప్రధాని మోదీని ఒప్పించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అవసరమైతే పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని బొత్స ప్రకటించారు.   కాసుల కక్కుర్తితో ప్రత్యేక హోదాను టీడీపీ నేతలు తాకట్టు పెట్టారని బొత్స విమర్శించారు. చంద్రబాబు హయాంలో 3 లక్షల ఇళ్లకు పునాది వేశారని.. 81,048 ఇళ్ల నిర్మాణం 95 శాతం పూర్తయిందని చెప్పారు. ఇళ్లను ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ధర్నా అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని బొత్స విమర్శించారు.

గీతంకు వర్సిటీ హోదా తొలగించండి.. యూజీసీకి, హెచ్చార్డీకి ఎంపీ విజయ్ సాయిరెడ్డి లేఖ 

కొద్ది రోజుల క్రితం విశాఖలోని గీతం విద్యాసంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని చెబుతూ అక్కడి పలు నిర్మాణాలను విశాఖ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా గీతం ను మరోసారి టార్గెట్ చేస్తూ.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం యూజీసీ నిబంధనలను కూడా అతిక్రమించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కు లేఖ రాశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో అయన కోరారు. దీనితోపాటు గీతం యూనివర్సిటీకి ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ హోదాను యూజీసీ రద్దు చేయాలనీ, అయితే విద్యార్థులు మాత్రం నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా చేయొచ్చని అయన పేర్కొన్నారు.   గీతం సంస్థ విశాఖ క్యాంపస్‌ కోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తన దృష్టికొచ్చిందని సాయిరెడ్డి తెలిపారు. క్యాంపస్‌ కోసం నిబంధనలు ఉల్లంఘించి భూములు సేకరించారని సాయిరెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. గీతం సంస్థ నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరం తెలిపారు. యూజీసీ చట్టంలోని పలు నిబంధనలను గీతం ఉల్లంఘించినట్లు సాయిరెడ్డి ఆరోపించారు. గీతం విద్యా సంస్థకు.. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసందే.

గజపతి రాజుల పరువు బజారున పడేస్తున్న వారసులు...

కొన్ని నెలల క్రితం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా ఆనంద గజపతిరాజు మొదటి భార్య సంతానం ఐన సంచయిత గజపతిరాజు పదవి చేపట్టిన నాటి నుండి గజపతి రాజు కుటుంబీకుల మధ్య వివాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమను సంచయిత అవమానించిందని ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ఆరోపించారు. ఈరోజు తమ బంగ్లాలో ఊర్మిళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచయితపై తీవ్ర విమర్శలు చేశారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం రాజ కుటుంబికులుగా తమకు ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా తన తల్లి సుధా గజపతిరాజుతో కలిసి సిరిమాను ఉత్సవానికి వచ్చానని ఆమె తెలిపారు. అమ్మవారి వేడుకలు చూసేందుకు కోటలోకి వచ్చిన తమ పట్ల సంచయిత అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన తల్లితో కలిసి కోటలోకి ప్రవేశించగానే... తమ రాకను గమనించిన సంచయిత తన సిబ్బందిపై మండిపడి, వీళ్లను కోటలోకి ఎవరు రానిచ్చారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందని ఊర్మిళ వెల్లడించారు. దీంతో కోటపై ముందు వరుసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలని తమ దగ్గరకు వచ్చి ఈవో చెప్పారని ఆమె వివరించారు. అయితే, ఆ ఈవోను పర్మిషన్ అడిగి కొంతసేపు అక్కడే కూర్చుని దర్శనం చేసుకుని వచ్చేశామని ఆమె తెలిపారు.   అయితే ఈ తరహా అనుభవం ఎదురవుతుందని తమకు ముందే తెలుసని, సంచయిత ఎంతో అహంకారంతో ప్రవర్తిస్తోందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా మాన్సాస్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తన తల్లిని ఇంతవరకు ప్రమాణస్వీకారం కూడా చేయనివ్వలేదని ఊర్మిళ వెల్లడించారు. మాన్సాస్ ట్రస్టును సంచయిత తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. సంచయిత చేస్తున్న చేష్టలు దివంగత ఆనంద గజపతిరాజుకు అవమానకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. కోట బురుజుపై నుంచి సిరిమాను ఉత్సవం తిలకించే హక్కు ఆనంద గజపతి వారసులుగా తమకు కూడా ఉందని ఊర్మిళ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.   కాగా, నిన్న ఊర్మిళ, సుధా గజపతిరాజులను అక్కడ్నించి పంపించేందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేయడంతో... సంచయిత కోట బురుజుపై మరో వైపున కుర్చీ వేసుకుని కూర్చుని సిరిమానోత్సవ వేడుకలు తిలకించారు. దీంతో పైడితల్లి సిరిమానోత్సవం ఈసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. అమ్మవారి సాక్షిగా రాజ కుటుంబంలో ఇప్పటికే ఉన్న విభేదాలు తాజా ఘటనతో మరింత చెలరేగాయి.   దీంతో సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా నియమించబడ్డ సంచయిత వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎంతో గౌరవంగా జరగాల్సిన ఈ పవిత్ర కార్యక్రమం రసాభాసగా మారింది. దీంతో అందరి దృష్టి రాజకుంటుంబంపై పడింది. తాజా ఘటనపై సంచయిత గొప్పగా ఫీలవుతుంటే.. మరో పక్క ఊర్మిళ గజపతి మాత్రం ఇది రాజ కుటుంబానికి అవమానకరమని, బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ హాజరు కావాల్సిన కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనకూడదని ఆంక్షలు విధించడానికి అసలు సంచయిత ఎవరని ఊర్మిళ ప్రశ్నించారు.  

పాక్ పార్లమెంట్ లో మోడీ నినాదాలు! అసహనంతో ఉడికిపోయిన మంత్రులు 

పాకిస్తాన్ పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదాలు. ఏంటీ తప్పుగా రాశారని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్టే. మీరు చదివింది అక్షరాల నిజమే. మన దాయాది పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ప్రధాని మోడీ పేరు మార్మోగింది. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా మంత్రులు అసహనానికి గురయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక కొందరు మంత్రులు పార్లమెంట్ నుంచి బయటికి వెళ్లిపోయారు.             పాకిస్థాన్ పార్లమెంటులో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. బలూచిస్థాన్ ఉద్యమం గురించి పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ సభలో ప్రసంగిస్తుండగా, బలూచిస్థాన్ ఎంపీలు అడ్డుతగిలారు. వారు సభాముఖంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని వేనోళ్ల పొగుడుతూ పాక్ విదేశాంగ మంత్రిని తీవ్ర అసహనానికి గురిచేశారు. ఆ ఎంపీలు ఎంతకీ తగ్గకుండా మోడీ, మోడీ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో ఖురేషీ ఉడికిపోయారు.   బలూచిస్థాన్ ఎంపీల మనసుల్లోకి మోడీ భావనలు చొరబడినట్టున్నాయని, భారత అజెండాను విపక్ష సభ్యులు పాక్ లో అమ్ముతున్నారని ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అనుకూల నినాదాలతో జాతీయ సంస్థలను అవమానానికి గురిచేస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యుల నియోజకవర్గాల నుంచి బలూచిస్థాన్ స్వాతంత్రం కోసం నినాదాలు రావడం సిగ్గుచేటన్నారు పాక్ విదేశాంగ శాఖ మంత్రి. అయినా బలూచిస్థాన్ ఎంపీలు ఖురేషీకి పదేపదే అడ్డుతగిలారు. దాంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు.   అంతకుముందు  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వైఖరిని ఖండిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పాకిస్థాన్ పార్లమెంటు తీర్మానం ఆమోదించింది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా చార్లీ హెబ్డో పత్రికలో వ్యంగ్య చిత్రణ చోటుచేసుకోవడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఖండించకపోవడాన్ని నిరసిస్తూ పాక్ పార్లమెంటులో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ప్రసంగిస్తూ, మధ్యలో బలూచిస్థాన్ ప్రస్తావన తీసుకువచ్చారు. దాంతో బలూచిస్థాన్ ప్రాంత ఎంపీలు రెచ్చిపోయి మంత్రి ప్రసంగాన్ని రసాభాస చేశారు. భారత ప్రధాని మోడీకి జై కొడుతూ నినాదాలు చేశారు.

ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశం

ధరణి వెబ్ పోర్టల్‌ ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే భూమి యజమానుల వివరాలు కనిపించేలా ధరణి వెబ్‌సైట్‌ ను రూపొందించారు. ఇక మీదట వ్యవసాయ భూములన్నీ ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ ‌తోపాటు మ్యుటేషన్ కూడా జరిగే విధంగా ధరణి వెబ్ సైట్లో మార్పులు చేశారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తరువాత స్లాట్ సమయానికి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తే కేవలం 10-15 నిమిషాలలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరిగిపోతుంది. భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే.. ఇకపై భూమిని విక్రయించేవారు, కొనుగోలు చేసేవారు ఇద్దరూ తహసీల్దార్‌ ఎదుట హాజరు కావాల్సిందే.    ధరణి పోర్టల్ ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశంగా నిలుస్తుందని చెప్పారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభంతో రాష్ర్టంలోని 570 ఎమ్మార్వో కార్యాల‌యాన్ని స‌బ్ రిజిస్ర్టార్ కార్యాల‌యాలుగా మారాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పోర్టల్ వల్ల అందరి ఆస్తులు, భూములకు రక్షణ ఉంటుందని, అక్రమ రిజిస్ట్రేషన్లకు తావుండదని చెప్పారు. ఈ పోర్టల్ వల్ల క్రయ, విక్రయాలన్నీ నమోదు చేసిన 15 నిమిషాల్లో పూర్తవుతాయని అన్నారు. కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, పైరవీలు చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచలేదని, పాత చార్జీలే అమల్లో ఉంటాయని తెలిపారు. గొప్పగొప్ప సంస్కరణలను తీసుకొచ్చినప్పడు ఇబ్బందులు రావడం సహజమని.. వాటిని ఎదుర్కొని నిలబడ్డప్పుడే అభివృద్ధి సాధించగలుగుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.

రాజకీయాలకు సెలవ్! రజనీకాంత్ రివర్స్ గేర్ 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ లేనట్టేనా? రజనీ మక్కల్ మండ్రం గుడారం ఎత్తేసినట్టేనా! అంటే తమిళనాడులో జరుగుతున్న తాజా పరిణామాలతో అవుననే తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని సమాచారం. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రజనీకాంత్ స్పందించారు. ఆ లేఖ తనది కాదని, కానీ అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం నిజమేనని స్పష్టం చేశారు. త్వరలోనే 'రజనీ మక్కల్ మండ్రం' సభ్యులతో చర్చించిన తర్వాత రాజకీయ పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని రజనీ వెల్లడించారు.   దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ గా పేరున్న రజనీ కాంత్ త్వరలో రాజకీయపార్టీ స్థాపిస్తానంటూ హడావుడి చేశారు. తన అభిమానసంఘాలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. మొదట నుంచీ రాజకీయ ప్రవేశంపై సరైన స్పష్టత లేకుండా ఎప్పటికప్పుడు పార్టీ ఆవిష్కరణ వాయిదా వేస్తూ వచ్చారు బాషా. చివరికి ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం లేదనే సంకేతమిచ్చారు. అభిమానసంఘాలతో చర్చించి తుదినిర్ణయం చెబుతానంటూ మరో మాట చెప్పారు.    తమిళనాడు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో 69ఏళ్ళ రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో, ఆయన రాజకీయ ప్రవేశానికి దాదాపుగా తెరపడిపోయినట్లు కనిపిస్తోంది. ఆయనకు కిడ్నీ సమస్య ఉండడంతో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఆయన బయట తిరగడం మంచిది కాదంటూ డాక్టర్లు సలహా ఇచ్చారని చెబుతున్నారు.   రజనీ కాంత్ పేరిట వచ్చిన లేఖలో ఆయన ఆరోగ్య పరిస్థితి సమాచారం ఉంది. 2011లో రజనీకాంత్ కిడ్నీ వ్యాధి బారినపడడంతో సింగపూర్ లో వైద్యం చేయించుకున్నారని, 2016లో కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారని అందులో వివరించారు.  ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున, కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రజనీకాంత్ ఎంతమాత్రం బయట తిరగలేని పరిస్థితి ఉందని లేఖలో వివరించారు. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చినా కానీ ఆయన హెల్త్ కండీషన్ రీత్యా బయట తిరగడం సాధ్యం కాకపోవచ్చని అందులో పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి వల్ల రోగనిరోధక శక్తి కనిష్టస్థాయికి చేరిందని, ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉన్నందున బహిరంగ సభల్లో పాల్గొనడం రజనీకాంత్ ప్రాణాలకే ముప్పు అని లేఖలో వివరించారు.    రజనీకాంత్ పేరిట సర్క్యూలేట్ అవుతున్న లేఖ, ఆయన ఆరోగ్య పరిస్థితి, డాక్టర్ల అభిప్రాయాల ప్రకారం ఆయన రాజకీయ పార్టీ దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రజనీ మక్కల్ మండ్రం ప్రతినిధులు అధికారిక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి రజనీకాంత్ రాజకీయ పార్టీపై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడనుండటంతో తమిళనాడు రాజకీయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. రజనీకాంత్ పార్టీ పెట్టడం లేదన్న వార్తలతో ప్రతిపక్ష డీఎంకేలో సంతోషం వ్యక్తం అవుతుండగా అధికార అన్నాడీఎంకే నేతలు మాత్రం ఢీలా పడుతున్నారని చెబుతున్నారు.  

డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ వాక్సిన్..  కానీ భారత్ లో మాత్రం ఆలస్యం .. కారణం అదే..! 

కరోనాను ఎదుర్కొనేందుకు ఆక్స్ ఫ‌ర్డ్ - ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ "కోవిషీల్డ్" వాక్సిన్ వచ్చే డిసెంబర్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని భారత్ లో దీనిపై ట్రయల్స్ చేసి ఉత్పత్తి చేసే సీరం ఇండియా సంస్థ సిఇవో ఆధార్ పూనావాలా తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఈ వాక్సిన్ మూడో దశ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని.. దీంతో డిసెంబర్ నెలలో ఈ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు. ఈ వాక్సిన్ పై బ్రిటన్ లో జరుగుతున్న ట్రయల్స్ లో ఇటు యువకులలో అటు వృద్దులలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తోందని.. తీపి కబురు చెప్పారు. అయితే భారత్ లో మాత్రం తొలి బ్యాచ్ 2021 జులై- సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వెల్లడించారు. అయితే మనదేశంలో మాత్రం వాక్సిన్ ఎపుడు వస్తుందనే విషయం.. డిసిజిఐ అనుమతుల పై ఆధారపడి ఉంటుందని అన్నారు. తాము 10కోట్ల వాక్సిన్ డోసుల‌ను సిద్ధం చేస్తున్నామ‌ని… వ్యాక్సిన్ సేఫ్ అని ఫైనల్ ట్రయల్స్ లో తేలితే ప్రజల విస్తృత ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వ్యాక్సినేష‌న్ కు వెంట‌నే అవ‌కాశం ఇవ్వాల‌ని తాము భార‌త ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేస్తామ‌ని అయన వెల్ల‌డించారు. అయితే ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ నిర్ణ‌య‌మే కీల‌క‌మ‌ని అయన వ్యాఖ్యానించారు. ఒకవేళ భార‌త ప్ర‌భుత్వం కనుక అత్య‌వ‌స‌రం అని భావించి అనుమ‌తిస్తే మాత్రం జ‌న‌వ‌రి నాటికి సామాన్య ప్రజలకు క‌రోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయి. లేదంటే మాత్రం ఆల‌స్యం అవుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్యాక్సిన్ సేఫ్ అనే తేల‌టంతో… బ్రిట‌న్ లో అత్య‌వ‌స‌రంగా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

బోగస్ బ్యాలెట్ ఓట్లు! దుబ్బాకలో మరో రచ్చ 

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక అనూహ్య పరిణామాలకు వేదికవుతోంది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ఇక్కడ ప్రతి విషయం వివాదాస్పదమే అవుతోంది. అన్ని గ్రామాల్లోనూ అలర్ట్ గా ఉంటున్న పార్టీ శ్రేణులు చీమ చిటుక్కుమన్నా సీరియస్ గా స్పందిస్తున్నాయి. ఇటీవల జరిగిన నోట్ల కట్టల రగడ అలా ఉండగానే.. కొత్తగా బోగస్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారనే రచ్చ నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. అధికార పార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కై బోగస్ బ్యాలెటు ఓట్లు వేయించుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.   కరోనా వైరస్ కారణంగా ఈసారి ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. డెబ్బై ఏండ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడేవారు పోలింగ్ కేంద్రానికి రాకుండా ఇంట్లోనే ఉండి బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించింది. ఎన్నికల సంఘం అలాట్ చేసిన అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామాలకు వెళ్లి.. వృద్ధులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల నుంచి బ్యాలెట్ ఓట్లు తీసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. బ్యాలెట్ ఓట్ల కోసం అధికార పార్టీ నేతలు తమను అనుకూలంగా ఉన్నవారినే నియమించారని, వారు బ్యాలెట్ ఓట్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లోకి వస్తున్న పోలింగ్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. దీంతో దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.   దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, మిరుదొడ్డి మండలాల్లోని పలు గ్రామాలు అధికార, విపక్ష పార్టీల మధ్య బ్యాలెట్ ఓట్ల విషయంలో గొడవలు జరిగాయి. గ్రామాల్లోకి వస్తున్న ఎన్నికల సిబ్బంది.. వృద్ధులను అధికార పార్టీకి ఓటేయమని ప్రలోభాలకు గురి చేస్తున్నారని విపక్ష కార్యకర్తలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాలెటు ఓటు వినియోగించుకుంటున్న ఓటరు చెప్పిన గుర్తుకు కాకుండా కారు పార్టీకే అధికారులు ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల వృద్ధుల ఓట్లన్ని ఒకచోటే గంపగుత్తగా టీఆర్ఎస్ నేతలే వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటును తమకు అనుకూలంగా మలుచుకుంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని, అడ్డదారిలో గెలిచేందుకు కుట్రలు చేస్తుందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.   ఇక బ్యాలెటు ఓటు వినియోగించుకునే అర్హులంతా ఆసరా పెన్షన్లుదారులే. ఇది కూడా అధికార పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. కారు గుర్తుకు ఓటేయకుంటే ఫించన్ ఆగిపోతుందని వారిని గులాబీ నేతలు భయపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెన్షన్ పోతుందన్న భయంతో ఇష్టం లేకున్నా కొందరు వృద్ధులు, వికలాంగులు అధికార పార్టీ నేతలకే తమ బ్యాలెటు పేపర్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఓటమి భయంతోనే బ్యాలెటు ఓట్లను భారీగా వేసుకునేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పరిశీలకుడి దృష్టికి అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను తీసుకువెళ్లేందుకు కమలనాధులు సిద్ధమవుతున్నారట.   మరోవైపు ఎన్నికల సిబ్బంది మాత్రం ఎలాంటి అక్రమాలు జరగడం లేదంటున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే బ్యాలెటు ఓట్లు తీసుకుంటున్నామని, తామెవరిని ప్రభావితం చేయడం లేదని చెబుతున్నారు. వృద్ధులు, వికలాంగుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారితోనే ఓట్లు వేయిస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు కూడా విపక్షాల ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. కరోనా తర్వాత జరుగుతున్న ఎన్నికల కోసం ఈసీనే ఈ వెసులుబాటు కల్పించిందని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారని చెప్పారు. ఓటమిని ముందే గ్రహించిన విపక్షాలు.. అందుకు కారణాలు వెతుక్కుంటున్నాయని, అందులో భాగంగానే తమపై అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నాయని కారు పార్టీ నేతలు మండిపడుతున్నారు.    మొత్తంగా ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతుండటంతో పోలింగ్ నాటికి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనవచ్చనే భయాందోళన కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

ఫ్రాన్స్ లో మొదలైన కరోనా సెకండ్ వేవ్.. గడప దాటాలంటే పర్మిషన్ కావాల్సిందే

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ యూరప్ లో మొదలైంది. తాజాగా ఫ్రాన్స్ దేశంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవడంతో ఫ్రాన్స్ మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించింది. దేశంలో పరిస్థితి అదుపులో ఉంచేందుకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిన్న దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ ఆంక్షలు డిసెంబరు 1 వరకు అమల్లో ఉంటాయని ఆదేశాలు జరీ చేసారు. ఈ విషయం పై ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మొదలైందని, ఇది మొదటి దశ కంటే మరింత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా నేటి రాత్రి నుంచి అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుండి బయటకు అడుగుపెట్టాలంటే సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత జాగ్రత్త పడకుంటే 4 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. నవంబర్ నెల 15 నాటికి దాదాపు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని అయన పేర్కొన్నారు.   రాజధాని పారిస్ సహా మరి కొన్ని ప్రధాన పట్టణాల్లో రెండో దశ ప్రారంభం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు వారాల క్రితమే కర్ఫ్యూ విధించినా సెకెండ్ వేవ్‌ను కట్టడి చేయలేకపోయామని మాక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే 35 వేలకు పైగా మరణాలు కూడా నమోదైనట్టు చెప్పారు. అయితే వచ్చే రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి నెమ్మదిస్తే సడలింపులు ఇస్తామని మాక్రాన్ స్పష్టం చేశారు.