ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం.. వైసీపీ కీలక నిర్ణయం!
posted on Oct 27, 2020 @ 9:59PM
స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై బుధవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు ఎన్నికల కమిషన్ తీసుకోనుంది.
ఎన్నికల కమిషన్ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ నుంచి పాక సత్యనారాయణ హాజరు కానున్నారు. జనసేన, సీపీఎం ప్రతినిధులు ఇంకా ఖరారుకాలేదు.
ఇదిలా ఉంటే, ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని అధికార పార్టీ వైసీపీ నిర్ణయించుకుంది. వాయిదా పడ్డ ఎన్నికలు నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలన్న సుప్రీం ఆదేశాలను ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని వైసీపీ అంటోంది. ముందు రాజకీయ పార్టీలను పిలవడంతో ఎన్నికల కమిషన్ కి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతోందని చెబుతోంది. మూడు కరోనా కేసులు కూడా లేని రోజుల్లో ఎన్నికలు వాయిదా వేశారని, ఇప్పుడు రోజుకు మూడు వేల కేసులు నమోదవుతుంటే ఎన్నికలు నిర్వహిస్తారా? అని ప్రశ్నిస్తోంది.
దీనిని బట్టి చూస్తుంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కార్ పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసేదాకా ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, గతంలో కరోనా కారణంగా నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేయగా.. అసలు కరోనా ఎక్కడ ఉందంటూ ఆయనపై తీవ్ర విమర్శలు చేసి, ఆయనను పదవి నుంచి కూడా తప్పించింది జగన్ సర్కార్. అయితే, నిమ్మగడ్డ న్యాయం పోరాటం చేసి గెలిచి మళ్ళీ పదవి చేపట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం.. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. అయితే అప్పుడు కరోనా ఎక్కడ ఉందన్న జగన్ సర్కారే.. ఇప్పుడు కరోనా సమయంలో ఎన్నికలు ఏంటి అని ప్రశ్నించడం గమనార్హం.