సైబరాబాద్ లో కిడ్నాప్.. అనంతలో సేఫ్! బిట్ కాయిన్ లింక్
posted on Oct 28, 2020 @ 1:11PM
సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డాక్టర్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. పట్టపగలే కిడ్నాప్ అయిన దంతవైద్యుడి కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. డెంటిస్ట్ హుస్సేన్‌ను కిడ్నాపర్ల చెర నుంచి రక్షించారు. కిడ్నాపర్లు వైద్యుడిని బెంగళూరువైపు తీసుకెళ్తుండగా రాప్తాడు సమీపంలో అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు కారు దిగి పరారవగా, ఒక్కడు మాత్రమే పట్టుబడ్డాడు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. వైద్యుడిని హైదరాబాద్ తరలించారు. పట్టపగలే డాక్టర్ కిడ్నాప్ కావడం కలకలం రేపుగా.. కొన్ని గంటల్లోనే అనంతపురం పోలీసులు దుండగులను పట్టుకోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు.
డాక్టర్ హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న బంధువు ముస్తఫా కిడ్నాప్ ప్లాన్ చేశాడని గుర్తించారు. డాక్టర్ హుస్సేన్ ఇంటి పైన కిరాయి కి వుండే ఖలీద్ అనే వ్యక్తి ద్వారా అతను కిడ్నాప్ చేయించాడు. వాట్సాప్ కాల్ చేసి హుస్సేన్ కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు కూడా బిట్ కాయిన్ రూపంలో కావాలంటూ డిమాండ్ చేశారు. ఆ నెంబర్ ఆధారంగా వెహికిల్ ని ట్రెస్ చేసి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేసి డాక్టర్ ను సేవ్ చేశారు.
ముస్తఫా, ఖలీద్ బిట్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తారని.. అందుకే వాళ్లు ఆ రూపంలో మనీ అడిగారని గుర్తించారు. కిడ్నాపర్లకు కర్ణాటకలో హోటల్ బిజినెస్ ఉండటంతో.. అక్కడ పరిచయం ఉన్న వ్యక్తలతోనే కొడ్నాపర్ల ముఠాను హైర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల నుంచే కిడ్నాప్ కు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు అనుమాానితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దంతవైద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న హుస్సేన్‌ను కొందరు దుండగులు మంగళవారం మధ్యాహ్నం బుర్ఖాలో వచ్చి కిడ్నాప్ చేశారు. బండ్లగూడ జాగీర్‌లో ప్రధాన రహదారిపై ఉన్న సొంత భవనంలో క్లినిక్ నిర్వహిస్తున్నారు హుస్సేన్. రోగులను పరీక్షిస్తూ తీరిక లేకుండా ఉన్న ఆయన మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో తనతోపాటు తన వ్యక్తిగత సహాయకుడు సయ్యద్ సల్మాన్ మాత్రమే క్లినిక్‌లో ఉన్నారు. సరిగ్గా 1.30 గంటలకు అయిదారుగురు గుర్తుతెలియని వ్యక్తులు నల్లటి బురఖాలు ధరించి క్లినిక్ లోపలికొచ్చారు. సయ్యద్ సల్మాన్‌ను తీవ్రంగా కొట్టారు. మూతికి ప్లాస్టర్‌ను వేసి కాళ్లు, చేతులు కట్టేసి మరుగుదొడ్డిలో పడేశారు. ఆ తర్వాత వైద్యుణ్ని కొట్టారు. టేబుల్‌పై ఉన్న ఇన్నోవా కారు తాళం తీసుకుని హుస్సేన్‌ను ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. బలవంతంగా వైద్యుని కారులోనే ఎక్కించుకుని ఆరె మైసమ్మ వైపు దౌడు తీశారు.
కొంతసేపటికి తేరుకున్న డాక్టర్ సహాయకుడు సయ్యద్.. ఎలాగోలా మరుగుదొడ్డి నుంచి బయటపడి పాకుకుంటూ కొంతదూరం వెళ్లి కట్లు విప్పుకొని వైద్యుని ఇంట్లోనే పనిచేసే తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అలా హుస్సేన్ భార్యకు విషయం తెలియడంతో డయల్ 100కు ఫిర్యాదు చేయగానే రాజేంద్రనగర్ పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. క్లూస్‌టీం చేరుకుని రక్తపు మరకల నమూనాలను సేకరించింది. రాత్రి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆస్తి తగాదాలే కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.సైబరాబాద్ పోలీసులు అన్ని చెక్‌పోస్టులను అలర్ట్ చేశారు. దీంతో అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను ఎస్పీ సత్యయేసు అలర్ట్ చేశారు. అనంతపురం మీదుగా బెంగళూరుకు కిడ్నాప్ గ్యాంగ్‌ను గుర్తించిన పోలీసులు డాక్టర్ హుసేన్‌ను రక్షించారు.