ఉద్యోగం కోసం.. వ్యభిచార* 

ఉద్యోగం అవసరం ఉన్నవాళ్లే  వాళ్ళ టార్గెట్. అందులోను ముఖ్యంగా అమ్మాయిలే.  ఉద్యోగం పేరుతో నగరానికి వచ్చిన ఒంటరి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి. వ్యభిచా* గృహాలకు పంపుతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం బతకాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. మన అవసరాలను కొంత మంది కేటుగాళ్ళు కాష్ చేసుకుంటారు. మనకి  ఉద్యోగం కావలి. మోసం చేసేవాడికి డబ్బు తో పాటు అవసరం కావాలి. అందుకు ఈజీగా మోసపోయేవాళ్లు కావాలి.  అందుకే వాళ్ళు అమ్మాయిలను టార్గెట్ చేసుకున్నారు. ఉద్యోగం  పేరుతో  నగరానికి వచ్చిన కొంత మంది ఒంటరి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని మాయ మాటలు చెప్పి, మోసపుచ్చి వ్యభిచా* గృహాలకు చేరవేశారు ముగ్గురు డుందగులు.   గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్‌(28), వరంగల్‌కు చెందిన సురేష్‌(19), తూర్పుగోదావరికి చెందిన పవన్‌(20)లతో పాటు అఖిల్‌, తేజ, చరణ్‌ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచా* కూపంలోకి దించేవారు. దిల్లీకి చెందిన ఓ యువతి(19)కి ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌లో ఉంటున్న మహిళ పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. ఆ యువతి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ రాగా ఆమెను సతీష్‌కు పరిచయం చేసింది. ఆమెను వ్యభిచా* వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సతీష్‌, సురేష్‌, పవన్‌లను అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.     మనం ఉద్యోగం ఎందుకు చేస్తాం. తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉందామనో, కుటుంబ పరిస్థితులు బాగాలేకానో .. సొసైటీలో బాగా బతుకుదామనో ఉద్యోగం చేయాలనుకుంటాం.. ఉద్యోగం చేయడం  వెనక  చాలా కారణాలే ఉండొచ్చు కారణాలు ఏవైనా అవసరం పీకల మీద ఉన్నపుడు  వెనక వెనక ముందు ఆలోచించకుండా అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎక్కడి వరకు దారితీస్తాయో తెలియదు.  సో అందుకని ఆలోచించకుండా ఏ నిర్ణయాలు తీసుకోకండి. 

నీ ఇల్లు బంగారం కానూ...

8.5 కిలోల బంగారం. 78 కేజీల వెండి. ఏ జ్యూవెల్లరీ షాపులో ఉన్న నగల లెక్కలు కావివి. ఒకే ఒక్క వ్యక్తికి చెందిన వెండి, బంగారు ఆభరణాల చి్ట్టా ఇది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత బీజేపీ నేత ఖుష్బూ ఇంట్లో ఉన్న బంగారు ఖజానా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఛెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఖుష్బూ. ఈ సందర్బంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన దగ్గర ఉన్న ఆభరణాలు, ఆస్తుల చిట్టా ప్రకటించారు.  తన దగగ్ర 8.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. ఆ నగల విలువ 3.42 కోట్లు ఉంటుందని తెలిపారు. ఎనిమిదిన్నర కిలోల బంగారంతో పాటు 78 కిలోల వెండి కూడా ఉన్నట్టు అఫిడవిట్‌లో ఉంది. ఖుష్బూ దగ్గర ఏకంగా ఓ జ్యువెల్లరీ షాపునకు సరిపడా ఆభరణాలు ఉంటే.. ఆమె భర్త సుందర్ దగ్గర మాత్రం దాదాపు అర కిలో బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్టు వెల్లడించారు. ఎంతైనా లేడీస్ లేడీసే కదా! ఇక ఖుష్బూకి భారీగా స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. 34.56 కోట్ల స్థిరాస్తులు, 6.39 కోట్ల చరాస్తులు  సహా మొత్తం 40.96 కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిపారు. తన  వార్షిక ఆదాయం 1.50 కోట్లు అని.. అయితే, బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం కేవలం 2.15 లక్షల నగదు మాత్రమే ఉందని తెలిపారు. 40 లక్షల విలువ చేసే రెండు లగ్జరీ కార్లు కూడా ఖుష్బూ దగ్గర ఉన్నాయట.  అయితే, ఇంత ఆస్తులు, ఇన్ని వెండిబంగారు ఆభరణాలు ఉన్న ఖుష్బూ.. చదువుకుంది మాత్రం కేవలం ఎనిమిదో తరగతి వరకే.

షాకింగ్.. అక్కడ బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి పశువుల మేత..!

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు చేరిక పెంచడానికి... అలాగే  పేద విద్యార్థులకు కనీసం ఒక పూట ఆహారం అందించడం కోసం దేశ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న సంగతి తెల్సిందే. ఈ పథకానికి ఇటు కేంద్ర  ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూరుస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. పేద విద్యార్థులకు అందించే  ఆహారం ఇదా అని తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రలోని పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో కూడా ఇక్కడ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఆహార పదార్థాలను నేరుగా పిల్లలకు ఇంటివద్దకే  అందిస్తున్నారు. స్థానిక కార్పొరేషన్ అధికారులు దీనికి సంబంధించిన పనులను  పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం విద్యార్థులకు అందించమని చెపుతూ కొన్ని ఆహార పదార్థాలు పూణెలోని  స్కూలు నెంబర్ 58కి  చేరుకున్నాయి. అయితే వాటిని విప్పి చూసినవారు షాక్ తిన్నారు. ఎందుకంటే అవి మనుషులు తినే ఆహార పదార్థాలు ఎంతమాత్రం కావు. అవి కేవలం  పశువులకు ఆహారంగా పెట్టే పదార్థాలు. అయితే వీటిని పిల్లలకు పెట్టండంటూ స్కూళ్లకు సరఫరా చేయడంపై ఇటు విద్యార్థి సంఘాలు, అటు తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది స్థానికులు వీటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రంగంలోకి దిగి ఈ ఆహార పదార్థాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై  పూణె మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్పందిస్తూ..  ఎక్కడో తప్పు జరిగి ఉంటుందని.. కేవలం సమాచార లోపం వల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు అంతేకాకుండా దీనిపై ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైందని.. బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు. తాజాగా ఈ ఘటనను ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు  అధికారపక్షంపై  విరుచుకుపడుతున్నాయి    

పార్టీల ఆస్తుల లెక్కలు..

దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నాయి? అందులో ఎన్ని జాతీయ పార్టీలు, ఎన్ని ప్రాంతీయ పార్టీలు? అంటే లెక్క చెప్పడం కొంచెం చాలా కష్టమే. ముఖ్యంగా, అన్నతో చెడి చెల్లి, అయ్యతో చెడి కొడుకు ఎరికి వారు వేరు కుంపటి పెట్టుకోవడంతో కుక్క గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రాంతీయ పార్టీల లెక్క తేల్చడం, మరీ కష్టం కావచ్చును. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం లెక్క ప్రకారం దేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు,  ఓ ఫిఫ్టీ దాకా గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలలో సిపిఐ,టీఎంసీ,ఎన్సీపీల జాతీయ హోదా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతోంది. ఈ మూడు పార్టీలకు జాతీయ హోదా ఉపసంహరిచుకోమని కేంద్ర ఎన్నికల సంఘం 2019లోనే నోటీసులు ఇచ్చింది. అయితే, ఇంకా అధికారికంగా ఆ పార్టీల  జాతీయ హోదా రద్దు కాలేదు కాబట్టి వాటి హోదా ఇంకా కొనసాగుతోంది.  ఆప్ నుంచి ఎస్పీ దాకా, ఎంఐఎం నుంచి డీఎంకే, అన్నాడీఎంకే దాకా, బిజు జనతాదళ్ నుంచి జనతా దళ్ (ఎస్), జనతాదళ్ (యూ)వరకు టీడీపీ నుంచి తెరాస, వైసీపీ వరకు మొత్తం ఓ 48 గిర్తింపు పొందిన ప్రాతీయ పార్టీ లున్నాయి. ప్రాతీయ పార్టీలలో కాసుల పార్టీలు వేరయా అన్నట్లు, దేశం మొత్తంలో ఉన్న ప్రాంతీయ పార్టీల ఫైనాన్సు స్టేటస్ లెక్కలు తీస్తే, ఉభయ తెలుగు రాష్రాలలోని మూడు ప్రాంతీయ పార్టీలు,టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ ఫస్ట్ టెన్’ పార్టీలలో ప్లేస్ సంపాదించాయి.2018-19 సంవత్సరానికి దేశంలో టాప్‌ టెన్‌ పార్టీలతో కూడిన జాబితాను ‘అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఏడీఆర్‌) విడుదల చేసింది. ఈ జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ రూ.572 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ రూ.232 కోట్లతో ఆ తర్వాత స్థానంలో ఉంది.  ఏఐఏడీఎంకే రూ.206 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.  ఇక తెలుగు పార్టీల విషయానికివస్తే రూ.193 కోట్ల ఆస్తులతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.188 కోట్ల ఆస్తులతో టీఆర్‌ఎస్‌ ఆరో స్థానంలో, రూ.93 కోట్ల ఆస్తులతో వైసీపీ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. టీడీపీకి రూ.115 కోట్లు, టీఆర్‌ఎ్‌సకు రూ.152 కోట్లు, వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్స్డ్  డిపాజిట్లు ఉన్నాయి.  కాగా బీజేపీ 2,904.18 కోట్ల ఆస్తులను ప్రకటించింది. జాతీయ పార్టీలు వెల్లడించిన ఆస్తుల్లో ఇది 54.29 శాతం. కాంగ్రెస్‌ రూ.928.24 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించింది. ప్రాతీయ పార్టీలలో, తెలుగు పార్టీలు ‘గౌరవప్రద’ స్థానం ‘సంపాదించు’ కున్నాయి.

 గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న..   

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. రెండు స్థానాల్లోనూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే లీడ్ లో ఉన్నా... రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండ-వరంగల్- ఖమ్మం ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. ఫస్ట్ ప్రియారిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆధిక్యత రాగా.. రెండో ప్రయారిటీలో మాత్రం తీన్మార్ మల్లన్న దూసుకుపోతున్నారు. రెండో ప్రయారిటీలో కోదండరామ్ కు ఎక్కువ ఓట్లు వస్తాయని అంతా భావించగా.. ఫలితాల్లో మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తీన్మార్ మల్లన్నకు భారీగా ఓట్లు పోలవుతున్నాయి. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 66 మంది ఎలిమినేషన్ పూర్తైంది. 66వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి లక్షా 17 వేల 386 ఓట్లు రాగా తీన్మార్ మల్లన్న 91 వేల  858  ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్   79 వేల 110 ఓట్లు సాధించి మూడో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 42 వేల 15 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాములు నాయక్ కు 29 వేల ఓట్లు రావడంతో... ఈ రౌండ్ లో రెండో ఓటు ఎవరికి ఎక్కువగా వస్తుందన్నది ఆసక్తిగా మారింది తొలి ప్రాధాన్యత ఓటులో పల్లాకు 27 వేల 550 ఓట్ల ఆధిక్యం రాగా... రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మాత్రం పల్లా వెనకబడ్డారు. ఆయన మూడో స్థానానికి పడిపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న పుంజుకోవడంతో... పల్లా లీడ్ క్రమంగా తగ్గుతోంది. 66 మంది ఎలిమినేషన్ అయ్యేసరికి పల్లా ఆధిక్యం 25 వేల 5 వందలకు పడిపోయింది. ఇప్పటికే రెండు వేల ఓట్ల లీడ్ తగ్గించారు తీన్మార్ మల్లన్న.ఇదే ట్రెండ్ కొనసాగితే.. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ వరకు వచ్చేసరికి పల్లాపై తీన్మార్ మల్లన్న లీడ్ లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోదండరామ్ కు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు భారీగానే వస్తున్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ కంటే 12 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ ఎలిమినేషన్ లో తనకు భారీగా ఓట్లు వస్తాయని కోదండరామ్ ఆశతో ఉన్నారు. 

వాణీ దేవి ధర్మాగ్రహం

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ముందెన్నడూ లేనంతగా భారీ పోలింగ్ జరిగింది. చదువుకున్నోళ్ళు ఓటింగ్’కు రారు, ఓటేయరు అన్న అపవాదును తుడిచేసే విధంగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, డాక్టరేట్లు, ఇంకా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉద్యోగాల వేటలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులు పోలింగ్ లో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో సామాన్య ఓటర్లులా బారులు తీరి, ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు నియోజక వర్గాలలోనూ భారీగా పోలింగ్ జరిగింది. రంగా రెడ్డి-మహబూబ్ నగర్ – హైదరాబాద్ నియోజక వర్గంలో ఏకంగా 67 శాతం పోలింగ్ నమోదైంది. ఇదొక రికార్డు.  ఇంత ఉత్సాహంగా ఓటేసినా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెరాస అభ్యర్ధి, పీవీ కుమార్తె వాణీదేవికి ఓటర్ల మీద కోపమొచ్చింది. ఓట్ల మీద కోపం రావడం మాత్రమే కాదు, ఆమె మీద ఆమెకే జాలి లాంటిది ఎదో వేసింది. ఇంతకీ అందుకు కారణం ఏమంటే, చెల్లని ఓట్లు.ఆమె పోటీచేసిన నియోజకవర్గంలో ఏకంగా 20వేలకు పైగా  ఓట్లు చెల్లక పోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. పట్టభద్రులు సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకో లేక పోవడం పట్ల బాధను వ్యక్తంచేస్తూ, ఇవేం చదువులు, మేము నేర్పిన చదువులు ఇవేనా  అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. నిజమే కదా పట్టభద్రులకు ఓటు వేయడం రాక పోవడం పట్ల ఎవరికైనా ఆగ్రహం రావడం సహజమే కదా, అందునా ఉపాధ్యవృత్తిలో ఉన్న పీవీ కుమార్తెకు ఆగ్రహం రావడం సహజం.నిస్సందేహంగా ఆమెది అమెది ధర్మాగ్రహమే, అర్థం చేసుకోవచ్చును. అయితే, అదే పట్టభద్రుల ఎన్నికల్లోనూ   కోట్లు ఖర్చు చేయడం,ప్రలోభాలకు గురి చేయడం, సాధారణ ఎన్నికల్లో కంటే ఎక్కువగా తాయిలాలు ఎరావేయడం వంటి, సకల అక్రమాలకు పాల్పడడం విషయంలోనూ ఆమె అదే ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తే ఆమె గౌరవం ఇంకొంచెం ఇనుమడించేది కదా ..  

ప్రివిలేజ్ నోటీసులకు నిమ్మగడ్డ గడుసు సమాధానం

ఎపి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హక్కులకు భంగం కలిగించారని మంత్రి పెద్దిరెడ్డి అసెంబ్లీ ప్రివిలెజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో చర్చించిన కమిటీ ఎస్ఈసీ కి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా తమ ముందు విచార‌ణ‌కు హ‌జ‌ర‌య్యేందుకు సిద్ధంగా ఉండాలంటూ క‌మిటీ కొన్ని అంశాల‌ను పేర్కొంది.. తాజాగా ఈ నోటీసులపై ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ స‌మాధానం ఇచ్చారు. తాను కోవిడ్ వ్యాక్సిన్  తీసుకున్నానని.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నానని.. కొన్ని రోజులపాటు  ప్ర‌యాణాలు చేయ‌లేన‌ని ఆయన తన సమాధానంలో తెలిపారు. అంతేకాకుండా తాను అస‌లు ప్రివిలేజ్ క‌మిటీ ప‌రిధిలోకే రాన‌ని..  దీనిపై మీరు ఇంకా ముందుకు వెళ్లాల‌నుకుంటే స‌రైన స‌మ‌యంలో తగిన ఆధారాల‌తో స్పందిస్తాన‌ని ఆయన తెలిపారు. మరోపక్క తన‌కు శాసనస‌భ‌పై అత్యున్న‌త గౌర‌వం ఉంద‌ని.. తాను స‌భ్యుల హ‌క్కుల‌కు భంగం క‌లిగేలా ఎపుడూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని రమేష్ కుమార్ త‌న స‌మాధానంలో పేర్కొన్నారు.   గత నెల ఫిబ్రవరిలో జరిగిన  పంచాయితీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా ఉన్న నిమ్మ‌గ‌డ్డకు‌, ప్ర‌భుత్వంలోని కొంతమంది  మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోణ‌ప‌లు జ‌రిగాయి. మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని వ్యాఖ్య‌ల‌పై నిమ్మ‌గ‌డ్డ సీరియ‌స్ గా స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డిని ఐతే హౌస్ అరెస్ట్ చేయాలనీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పోలిసులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఐతే హైకోర్టు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసిన సంగతి తెల్సిందే.    

మాల్స్, స్కూల్స్ క్లోజ్.. మళ్లీ రాత్రి కర్ఫ్యూ..

మార్చి 31 వరకూ విద్యా సంస్థలన్నీ మూత. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకూ రాత్రిపూట కర్ఫ్యూ అమలు. ఆదివారం.. సినిమా థియేటర్స్, మాల్స్, మల్టీఫ్లెక్స్, రెస్టారెంట్స్ క్లోజఓ్. సోషల్ గ్యాదరింగ్‌పై నిషేధం. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే పర్మిషన్. 50శాతం సామర్థ్యంతో థియేటర్లకు అవకాశం. శనివారం నుంచి కొత్త కరోనా ఆంక్షలు అమలులోకి రానున్నాయి.  దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజ‌ృంభిస్తోంది. మహారాష్ట్ర తర్వాత పంజాబ్ పాజిటివ్ కేసుల్లో ముందుంది. దీంతో.. పంజాబ్ సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. శనివారం నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు.  మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నీ మూసివేయనున్నారు. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పైనా పరిమితులు విధించారు. థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించారు. ప్రజలంతా రెండు వారాల పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.  కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో మాత్రం ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చినప్పటికీ 20మందికి మించి హాజరు కావొద్దని సూచించారు. ఆయా జిల్లాలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు తెలిపారు. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌ మాత్రం ఆదివారం పూర్తిగా మూసే ఉంచాలని ఆదేశించారు. పరిశ్రమలు, అత్యవసర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. 

ఈడీ పై కేరళ పోలీసుల రివర్స్ కేసు..

ఎక్కడైనా దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కేసులు బుక్ చేయడం.. అవసరమైతే వారిని పిలిచి విచారిస్తారన్న సంగతి తెల్సిందే. అయితే కేరళలో మాత్రం సీన్ రివర్స్  అయింది. కెరళలో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరై విజయన్ హస్తం కూడా ఉందని కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అసాధారణ రీతిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై కేసు నమోదు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ చేత ఈడీ అధికారులు  బలవంతంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరును చెప్పించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసారు. దీనికి సంబందించిన ఎఫ్ఐఆర్ ను ఎర్నాకుళం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో దాఖలు చేశారు. గోల్డ్ స్కాంలో భాగంగా హవాలా కేసుపై ఈడీ ప్రతుతం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను ఈడీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ప్రశ్నించారని ఈ ఎఫ్ఐఆర్ లో క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఈ కేసులో సీఎం  పినరయి విజయన్‌ను ఇరికించే ఉద్దేశంతో ఆయన పేరును చెప్పే విధంగా స్వప్నను బెదిరించారని ఆ ఎఫ్ఐఆర్ లో  పేర్కొంది. ఈ విషయంలో ఈడీ అధికారులు కుట్ర, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. సీఎం కు హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు దస్తావేజును తయారు చేశారని ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.   మరోపక్క స్వప్నకు సంబంధించినదిగా చెప్తున్న ఒక ఆడియో క్లిప్‌పై అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిజుమోన్ గతంలో దర్యాప్తు చేశారు. ఆ క్లిప్ పై ఆయన సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. సీఎం విజయన్ కి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని తనను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని స్వప్న చెప్పినట్లు ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే వ్యవహారంపై కొందరు మహిళా పోలీసులు కూడా ఈడీ అధికారులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ కేసులో సీఎం విజయన్ పాత్ర ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని స్వప్నను ఈడీ అధికారులు నిర్బంధించారని ఆ మహిళా పోలీసులు సాక్ష్యం చెప్పారు. దీంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో. వేచి చూడాలి.  

జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్! చంద్రబాబు సీఐడీ విచారణపై స్టే

అమరావతి అసైన్డ్ భూముల కేసులో  ఆంధ్రప్రదేశ్  సర్కార్ కు షాక్ తగిలింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. కేసు విచారణపైనా కోర్టు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. చంద్రబాబు, నారాయణపై కేసులో.. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆరేండ్ల క్రితం ఇచ్చిన జీవోపై  ఇప్పుడు విచారణ ఏంటని చంద్రబాబు తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అలాగే నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏపీ హైకోర్టు... చంద్రబాబు సీఐడీ విచారణపై స్టే  ఇచ్చింది.  అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించగా.. మాజీ మంత్రి నారాయణ తరపున  దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.  సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చెల్లదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్‌ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవని  చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా  కోర్టులో వాదించారు. ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాలని, అలాంటి ఆదేశాలు ఇక్కడ లేవని ఉన్నత న్యాయస్థానానికి న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఫిర్యాదులోని ఆరోపణలకు..పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. జీఓ విడుదలైన 35 రోజుల తర్వాత దానిని సీఎం ఆమోదించారని.. విచారణ నివేదికలోనే చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు సీఎంకు తెలిసి జీఓ ఇచ్చారని ఎలా చెబుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు చేయటం కుదరదని, ఇక్కడ నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందన్నారు.  మాజీ మంత్రి నారాయణ తరపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు జీఓను సవరించారని, జీవోకు సంబంధించిన చర్చలు, విడుదల చేసే ప్రక్రియలో గాని.. అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదని దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని, వ్యక్తిగతంగా వెళ్లి అసైన్డ్‌ రైతుల ల్యాండ్‌ తీసుకుని.. వారిని నష్టపరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయని దమ్మాలపాటి అన్నారు. ఒక జీవో ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం కల్పించి.. భూములు తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం భూములు తీసుకొనే సమయంలో.. అప్పటి ప్రభుత్వం అన్నివర్గాలకు లబ్ది చేకూర్చిందన్నారు. దాని ప్రకారమే భూములు సమీకరించారన్నారు.  చంద్రబాబు హైకోర్టులో వేసిన  పిటిష‌న్‌లో తెలిపిన వివ‌రాల ప్రకారం.. అమ‌రావ‌తి రాజధాని ఏర్పాటు కోసం విజయవాడ చుట్టుపక్కల 2014, సెప్టెంబర్ 1న అప్ప‌టి ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుని, సెప్టెంబర్‌ 4న శాసనసభ ముందు ఉంచారు. దీంతో సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంత‌రం రాజధాని గ్రామాల ప్రజలకు భూసమీకరణ విధానాన్ని తెలిపారు. భూసమీకరణ పథకాన్ని తీసుకొచ్చి, ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించారు. భూసమీకరణపై 2015, జనవరి 1న జీవో 1 జారీ, అసైన్డు భూముల హక్కుదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు 2016, ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయ్యాయి.   చట్ట నిబంధనల మేరకే ఆ జీవో జారీచేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత దురుద్దేశంతో వైసీపీ నేత‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా త‌న‌పై తప్పుడు కేసు నమోదు చేశారని చంద్ర‌బాబు పిటిష‌న్‌లో ఆరోపించారు. ఒక‌వేళ‌ నిబంధనల పై అభ్యంతరాలు ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టులో సవాలు చేసుకోవచ్చని, అంతేగానీ, గ‌త ప్రభుత్వ హయాంలో నిబంధనలు రూపొందించారనే కారణంతో త‌న‌ను నేర బాధ్యుడిగా పేర్కొనడం అసంబద్ధమ‌ని చంద్ర‌బాబు పిటిషన్ లో తెలిపారు.తాము నష్టపోయామని గ్రామస్థులుగానీ, భూ యజమానులుగానీ ఇన్నేళ్లుగా ముందుకు రాలేదని, ఇప్పుడు వారి తరఫున వైసీపీ నేత అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం చూస్తే ప్ర‌త్య‌ర్థి పార్టీపై అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈనెల 13న చంద్రబాబుపే సీఐడీ కేసులు నమోదు చేసింది. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. 

వేడి అన్నం కోసం అత్తాకోడళ్ల గొడవ

అత్తతో కోడలు గొడవ. తట్టుకోలేక పోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాకీలు హడావుడిగా ఆమె ఇంటికి వచ్చారు. గొడవేంటి అని అడిగారు. కోడలు చెప్పిన కారణం విని పోలీసులు షాక్ అయ్యారు. ఇదేంటీ ఈ విషయానికే ఫిర్యాదు చేశావా అంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ అత్తాకోడళ్లకు గొడవెందుకు అయిందో తెలిసి అంతా అవాక్కయ్యారు. వేడి ఆహారం కోసం వాళ్లిద్దరూ గొడవ పడ్డారు. రోజూ కోడలికి చల్లారిన ఫుడ్ పెడుతోందట ఆ అత్త. అది తినీ తినీ తన ఆరోగ్యం పాడవుతోందని అత్తతో తగువు పెట్టుకుంది కోడలు. రోజంతా టీవీ చూస్తూ తనను అసలు పట్టించుకోవడం లేదంటూ పోలీసులకు చెప్పింది.  అయితే.. కోడలు చేసిన ఆరోపణలను అత్త తప్పుబట్టింది. కోడలు అబద్దాలు చెబుతుందని పోలీసులకు చెప్పింది. తన కోడలు ఎప్పుడు చూసినా ఫోన్‌తోనే టైంపాస్ చేస్తుందని ఆరోపించింది. వంట చేసేటప్పుడు తనకు సాయం చేయడం లేదని.. తిరిగి తన మీదే పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని ఆ అత్త మండిపడింది.  అత్తాకోడళ్ల వాదనలు విన్న పోలీసులు.. ఇంటి విషయాలు మీరు మీరు పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒప్పించారు. ఇలాంటి పనికిరాని ఫిర్యాదులు చేయవద్దని ఆ కోడలిని హెచ్చరించారు. పోలీసుల స‌మ‌యం వృథా చేస్తే క‌ఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌, గోరఖ్‌పూర్‌లోని మజ్గావన్ గ్రామంలో జరిగింది. 

భర్తను చంపిన భార్య.. అల్లుడిని చంపిన మామ 

అనుమానంతో భార్యను చంపినా భర్త. ప్రియుడి మోజులో పడి భర్తను చంపినా భార్య, అంటూ రోజు ఏదో ఒక వార్త వింటుంటాం. మరి కొంత మంది అయితే అనుమానం పెంచుకుని చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి చంపుకోవం ఫ్యాషన్ అయిపొయింది ఈ రోజులల్లో. అదే తరహా అనుమానం మరో భర్త మరణానికి కారణం అయింది. అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. నిజానికి ప్రతి మనిషికి అనుమానం సహజం.  తాజాగా విశాఖపట్నంలో భర్తపై అనుమానంతో భార్య రోకలిబండతో అతి దారుణంగా కొట్టి చంపింది. ఈ ఘటన ఏవీఎన్‌ కాలేజీ ద్వారం వీధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. భార్యభర్తల  మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు. ఆ గొడవలే వివాదంగా మారి హత్యకు దారి తీసి ఉంటుందంటున్నారు. . పోలీసుల వివరాల ప్రకారం భర్త పుండరీ కాక్షయ్య పిల్లలను చంపేస్తాడనే భయంతోనే భర్తను హత్య చేసినట్లు భార్య పుణ్యవతి అంటోంది అంటున్నారు. హత్య గురించి తెలిసిన వెంటానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహిటిన  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు మాత్రం కేవలం క్షణికావేశంలోనే ఆమె భర్తను హత్య చేసిందా. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం ప్రతి నిత్యం వారి ఇంట్లో గొడవలు జరుగుతుండేవి అని అంటున్నారు. అయితే కేవలం పుణ్యవతి  మాత్రమే హత్య చేసిందా? భర్తను హత్య చేయమని ఎవరైనా ప్రోత్సహించారా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.. మద్యం మత్తులో అల్లుడిని చంపినా మామ..  విశాఖలోనే మరో దారుణం చోటు చేసుకుంది.  పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో  మద్యం మత్తులో అల్లుడిని మామ కొట్టి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మామ శంకర్‌, అల్లుడు చిన్నా మధ్య మద్యం మత్తులో మాటకు మాటా పెరిగి.. గొడవకు దారి తీసింది. దాంతో  కోపోద్రేకంలో రాడ్‌తో కొట్టి అల్లుడు చిన్నను మామ శంకర్‌ హత్య చేశాడు. అలాగే హత్య చేసిన మామ శంకర్ తో  పాటు ఆ గొడవకు కారణమైన బావ మరిది అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం మద్యం సేవించి ఉండడం వల్లే  హత్య చేశాడా?  లేదంటే రెండు కుటుంబాల మధ్య పాత వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

స్వచ్ఛందంగానే భూములిచ్చాం.. అమరావతి రైతుల వాంగ్మూలం 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ విచారణకు హాజరైన పలువురు రైతులు.. రాజధాని కోసం స్వచ్ఛందంగానే ఇచ్చామని చెప్పారని తెలుస్తోంది. తమ వద్ద నుంచి భూములను ఎవరూ లాక్కొలేదని, తమను ఎవరూ బెదిరించలేదని కూడా రాజధాని రైతులు చెప్పారని సమాచారం. భూములు ఇచ్చినందుకు ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పరిహారం కూడా అందిందని సీఐడీ అధికారులకు రైతులు తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు.అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారించారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఈనెల 12న సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు.  ‘‘ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంది. మీకు(ఏ1) మాత్రమే తెలిసిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అందువల్ల... ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు  విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్‌ ఆఫీసుకు వ్యక్తిగతంగా హాజరు కావలెను’’ అని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అమరావతి దళిత జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు పెట్టడమంటే.. ఎస్టీ, ఎస్సీ చట్టాలను దుర్వినియోగం చేసినట్లేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 41 జీవో ద్వారా చంద్రబాబు దళితుల అభివృద్ధికి పాటుపడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ హక్కు ప్రకారం ఎస్టీ, ఎస్సీ కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను వెనక్కితీసుకోవాలని లేని పక్షంలో ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు. అమరావతి రాజధానిలో దళితులకు చోటు లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఓట్లు గల్లంతుతో కలకలం! ఎమ్మెల్సీ కౌంటింగ్ నిలిపివేత

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠగా మారింది. హోరాహోరీ పోరు సాగుతుండటంతో జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే  రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగా గందరగోళం నెలకొనడంతో హైదారాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ నిలిచిపోయింది.  రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన చివరి ఎనిమిది మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియలో 50 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఎన్నికల అధికారులు దీన్ని గుర్తించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చేశారు. ఓట్ల గల్లంతుపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విపక్షాల ఆందోళనతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేశారు ఆర్వో.  హైదరాబాద్ స్థానంలో మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు, బీజేపీ కేండిడేట్ రామచంద్రారావుకు 1,04,668.. వామపక్షాలు బలపరిచిని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. రేసులో ముందున్న మొదటి ఇద్దరు అభ్యర్థులకు స్వల్ప తేడా మాత్రమే. దీంతో వాణీదేవి, రామచంద్రారావులో ఎవరు గెలుస్తారనేది మాత్రం నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు వచ్చిన రెండో ప్రాధాన్యతా ఓట్లే డిసైడ్ చేస్తాయి. 

ఛైర్‌పర్సన్ దొంగ ఓటు.. పదవికి ఎసరు?

ఆమె తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్. పేరు తాటికొండ స్వప్న. మార్చి 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. అంత వరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే వివాదం మొదలైంది. పట్టాభద్రుల కోటాలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్నకు అసలు ఓటు హక్కు లేనేలేదు. అయినా.. ఆమె ఓటు ఎలా వేశారనేదే వివాదం.  బూత్ నెంబర్ -283. ఓటరు సీరియల్ నెంబర్ 528. పేరు తాటికొండ స్వప్న. అయితే, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న వేరు.. ఓటరు లిస్ట్‌లో ఉన్న స్వప్న వేరు. ఆ ఇద్దరూ ఒకరు కాదు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న భర్త పేరు పరిమళ్. 528 సీరియల్ నెంబర్లో ఉన్న స్వప్న భర్త పేరు తాటికొండ అశ్విన్. ఆ ఇద్దరు స్వప్నలు తోటికోడళ్లు. అందుకే, తోటికోడలు స్వప్న పోలింగ్ చీటీతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్న దొంగ ఓటు వేశారు. ఈ విషయం పోలింగ్ బూత్‌లో ఉన్న కాంగ్రెస్ ఏజెంట్ గుర్తించారు.  ఛైర్‌పర్సన్ స్వప్న దొంగ ఓటు వేశారంటూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. ఆమె దొంగ ఓటు వేసినట్టు తేల్చారు. తోటికోడలు పేరుతో నమోదైన ఓటును తన ఓటుగా చూపించి దొంగ ఓటు వేశారని తేల్చారు.  తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంగ ఓటు వేశారని తేలడంతో స్వప్న రాజీనామా చేయాలంటూ బల్దియా ఆఫీసు ముందు విపక్షాల ఆందోళనకు దిగాయి. దొంగ ఓటు వేయడం చట్టరిత్యా నేరమని.. ఛైర్‌పర్సన్ హోదాలోని వ్యక్తే దొంగ ఓటు వేస్తే.. సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నైతిక బాధ్యత వహిస్తూ.. వెంటనే తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి తాటికొండ స్వప్న రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

కొండా కొత్త  పార్టీ! రేవంత్ డైరెక్షన్ లోనే?

కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు,  చేవెళ్ల మాజీ ఎంపీ, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అలోచనలో ఉన్నారా.. అంటే  అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర రెడీ .. బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి.  ఆయన లాంటిదేమీ లేదని బహిరంగ లేఖ ద్వారా తెలిపారు కొండా.  వాట్ నెక్స్ట్’ అనేది మూడు నెలల తర్వాతనే ప్రకటిస్తానని చెప్పారు. ఈ మూడు నెలల కోసం  మూడు ఆప్షన్స్ ఇచ్చారు. బీజేపీలోకి వెళ్లాలా, టీజేఎస్‌లోకి వెళ్లాలా, అసలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలా అనేడి అధ్యయనం చేసి..దానిపై నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పారు.  తన భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం మరోసారి క్లారిటీ ఇచ్చారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వచ్చే రెండు మూడు నెలల్లో అందరినీ కలుస్తానని చెపుతూ గతంలో చెప్పిన మూడు ఆప్షన్స్’కు మరొకటి చేర్చారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే  కొండా విశ్వేశ్వర రెడ్డి  తాజా ఆలోచన ఆయన  సొంతమా లేక రేవంత్ రెడ్డి ఆలోచనను ఆయన బయట పెట్టారా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ నుంచి బయటకు రావడంలోనూ రేవంత్ రెడ్డి పాత్ర ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ  నేపధ్యంలో కొండా  కొత్త పార్టీ ఆలోచన వెనక కూడా రేవంత్ పాత్ర, ప్రమేయం ఉందనే చర్చ జరుగుతోంది.   రేవంత్ రెడ్డికి  పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి తాత్కాలికంగానే కావచ్చు, కానీ  చేజారి పోయింది. రేపో మాపో ప్రకటన ఉంటుందని అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీసీసీ పీఠానికి, నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ముడి పెట్టారు. ఢిల్లీలో  చక్రం తిప్పారు. పీసీసీ నిర్ణయాన్ని హోల్డ్ ‘లో పెట్టారు. అప్పటి నుంచి త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్న రేవంత్ రెడ్డి..  కాంగ్రెస్ పార్టీలో కొంత ఉక్కపోతకు గురవుతున్న మాట వాస్తవం. ఈ నేపధ్యంలో కొత్త పార్టీ ఆలోచన సహా విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న ప్రకటనలు అన్నీ, ఆయన పలికిస్తున్న పలుకులేనా, అన్నది ప్రస్తుతానికి రహస్యం. అయితే  రాజకీయ రహస్యాలు, ఇంకొకటి  అట్టే కాలం దాగవు అంటారు. రేపో మాపో అంతా అదే తెలిసిపోతుంది. అంతవరకూ ...? 

19 ఏళ్లకే.. 3 హత్యలు.. 

పెద్దలే కాదు పిల్లలు కూడా క్రైమ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని వారిని హత్యలు చేస్తున్నాడు. సినిమాల ప్రభావమే తాము పెరిగిన వాతావరణమో లేక తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన అలవాటులో తెలియదు గానీ.. ఓ పిల్లవాడు మరి క్రూరంగా మారాడు. 19 ఏళ్ళ వయసులోనే ముగ్గుర్నిచంపేశాడు.  వాడు మగడు..కానీ మగాలపైనా కన్నేసిన కిరాతకుడు.. చిన్నవయసులోనే క్రూరత్వాన్ని అక్షరాభ్యాసంగా చేసుకున్నాడు. తోటి బాలురపై కన్నేయడం కిడ్నాప్ చేసి వారిపై లైంగిక దాడి చేయడం వాడి వృత్తిగా మార్చుకున్నాడు. అది వాడికి చిన్నప్పటి వెన్నతో పెట్టిన అలవాటుగా మారింది. ఇక అంతే 14 ఏళ్ల వయసుకే ఆ ఊరిలో అందరికి స్పైడర్ చూపించాడు. చివరికి తన స్నేహితుడ్నే చంపేశాడు. ఇలా ఐదేళ్లలో ముగ్గురిపై అఘాయిత్యానికి పాల్పడి వారి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.  ఈ సంఘటన  ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, మెల్లంపూడి గ్రామాల్లో నెలరోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. మెల్లంపూడి గ్రామంలో ఈనెల 14న భార్గవతేజ అనే బాలుడు అదృశ్యమై హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘాతుకానికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపయ్య అలియాస్ గోపీ అనే 19 యువకుడిగా గుర్తించారు. అనుమానంతో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా.. పోలీసులకే షాకిచ్చే నిజాలు వెల్లడించాడు. ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవతేజకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్ళీ కాళ్లు చేతులు కట్టేసిభార్గవతేజ లైంగిగ దాడి జరిపినట్లు తెలిపాడు. లైంగిక దాడి తర్వాత అతడ్ని తీవ్రంగా కొట్టి హత్య చేశానని, ఆ తర్వాత మృతదేహం కాళ్లు, చేతులు విరిచినట్లు.. ముఖాన్ని చెక్కేసి సమీపంలోని సమీపంలోని అరటితోటలో పడేశానని పోలీసుల ముందు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.  గతంలో ఇదే తరహాలో మరో నేరం : గత నెల 11వ తేదీవ వడ్డేశ్వరం గ్రామానికి చెందిన మరియదాసు, మీనాక్షిల కుమారుడు అఖిల్ మధ్యాహ్నం సమయంలో అదృశ్యమయ్యాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసినా అఖిల్ ఆచూకీ లభించలేదు. దీంతో ఆకేసు గురించి కూడా గోపీని ఆరా తీయగా.. తానే కిడ్నాప్ చేసి లైంగిక వాంఛ తీర్చుకొని చంపేసినట్లు అంగీకరించాడు. నిందితుడు గోపీలో  సైకో లక్షణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు 14ఏళ్ల వయసులోనే తన ఫ్రెండ్ ని సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లి.. మధ్యలోనే బయటకు తీసుకొచ్చిఅతడిపై లైంగిక దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని రేవేంద్రపాడు బ్రిడ్డిపై నుంచి కాలువలో పడేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో వివాదం ఎందుకులే అని స్థానికులు వదిలేసినట్లు తెలుస్తోంది. గోపీ తండ్రిది కూడా నేర ప్రవృత్తేనని గ్రామస్తులు చెబుతున్నారు. అతడు మొదటి భార్యను హత్య చేసిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

షర్మిల పార్టీలోకి అజర్, సానియా!

మాజీ క్రికెటర్, హెచ్.సి.ఎ. అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ షర్మిల పార్టీలో చేరబోతున్నారా? టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సైతం షర్మిలకు జై కొడతారా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. షర్మిల ఎంట్రీతో తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు, వివిధ రంగాల ప్రముఖులు షర్మిలను కలిసి తమ సంఘీభావం తెలుపుతున్నారు. యుద్ధనౌక గద్దర్ నుంచి యాంకర్ శ్యామల వరకు ఇప్పటికే షర్మిలతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.   ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న షర్మిల పార్టీలో చేరేందుకు అనేకులు ఆసక్తి కనబరుస్తున్నారు. లేటెస్ట్‌గా లోటస్ పాండ్‌లో ఓ సెలబ్రెటీ జంట షర్మిలను కలిశారు. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్.. సానియా మిర్జా సోదరి ఆనం మిర్జా.. దంపతులు షర్మిలతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ సమావేశం జరిగిందని బయటకు చెబుతున్నా.. వారు త్వరలోనే షర్మిల పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, అసదుద్దీన్, ఆనం మిర్జాలు మాత్రమే చేరుతారా? లేక, అజారుద్దీన్, సానియా మిర్జాలకు ప్రతినిధులుగా వారు షర్మిల దగ్గరకు వచ్చారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్ చాలా కాలంగా ఆ పార్టీతో అంటీముట్టనట్టే ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు మంచి ప్లాట్‌ఫామ్ కోసం ఎదురు చూస్తున్న అజారుద్దీన్.. షర్మిల పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.  అజర్ కుమారుడు అసదుద్దీన్‌, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనం మిర్జాలు గతేడాది వివాహ బంధంతో ఏకమయ్యారు. రెండు క్రీడా కుటుంబాలకు చెందిన ఈ జంట తాజాగా షర్మిలను కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త దంపతులు మాత్రమే పార్టీలో చేరుతారా? లేక, అజర్, సానియాలు సైతం షర్మిలతో చేతులు కలుపుతారా? అనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

ఓయూ హాస్టల్ లో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. స్కూళ్లు , కాలేజీలు వైరస్ కు హాట్ స్పాట్లుగా మారిపోయాయి. వారం రోజులుగా విద్యాసంస్థల్లో  కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని  వేర్వేరుచోట్ల 86 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గురుకులాలు, ఉన్నత పాఠశాల్లో వైరస్ విస్తరిస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. తాజాగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలోనూ కరోనా కలకలం రేగింది. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో ఇద్దరూ  పీజీ విద్యార్థినులకు కరోనా సోకింది. కరోనా నిర్దారణ అయిన ఇద్దరు విద్యార్థినులను కింగ్ కోటి హాస్పిటల్ కు తరలించారు. కరోనా సోకిన స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ లో  మొత్తం 400 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓయూ హాస్టల్ రూమ్ లను సానిటైజ్ చేయిస్తున్నారు  అధికారులు. కరోనా సోకిన విద్యార్థినులతో క్లోజ్ కాంటాక్టులో ఉన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించేందుకు ఓయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.