కొండా కొత్త పార్టీ! రేవంత్ డైరెక్షన్ లోనే?
posted on Mar 19, 2021 @ 3:22PM
కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎంపీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అలోచనలో ఉన్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర రెడీ .. బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఆయన లాంటిదేమీ లేదని బహిరంగ లేఖ ద్వారా తెలిపారు కొండా. వాట్ నెక్స్ట్’ అనేది మూడు నెలల తర్వాతనే ప్రకటిస్తానని చెప్పారు. ఈ మూడు నెలల కోసం మూడు ఆప్షన్స్ ఇచ్చారు. బీజేపీలోకి వెళ్లాలా, టీజేఎస్‌లోకి వెళ్లాలా, అసలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలా అనేడి అధ్యయనం చేసి..దానిపై నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
తన భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం మరోసారి క్లారిటీ ఇచ్చారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వచ్చే రెండు మూడు నెలల్లో అందరినీ కలుస్తానని చెపుతూ గతంలో చెప్పిన మూడు ఆప్షన్స్’కు మరొకటి చేర్చారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి తాజా ఆలోచన ఆయన సొంతమా లేక రేవంత్ రెడ్డి ఆలోచనను ఆయన బయట పెట్టారా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ నుంచి బయటకు రావడంలోనూ రేవంత్ రెడ్డి పాత్ర ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో కొండా కొత్త పార్టీ ఆలోచన వెనక కూడా రేవంత్ పాత్ర, ప్రమేయం ఉందనే చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి తాత్కాలికంగానే కావచ్చు, కానీ చేజారి పోయింది. రేపో మాపో ప్రకటన ఉంటుందని అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీసీసీ పీఠానికి, నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ముడి పెట్టారు. ఢిల్లీలో చక్రం తిప్పారు. పీసీసీ నిర్ణయాన్ని హోల్డ్ ‘లో పెట్టారు. అప్పటి నుంచి త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కొంత ఉక్కపోతకు గురవుతున్న మాట వాస్తవం. ఈ నేపధ్యంలో కొత్త పార్టీ ఆలోచన సహా విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న ప్రకటనలు అన్నీ, ఆయన పలికిస్తున్న పలుకులేనా, అన్నది ప్రస్తుతానికి రహస్యం. అయితే రాజకీయ రహస్యాలు, ఇంకొకటి అట్టే కాలం దాగవు అంటారు. రేపో మాపో అంతా అదే తెలిసిపోతుంది. అంతవరకూ ...?