షర్మిల పార్టీలోకి అజర్, సానియా!
posted on Mar 19, 2021 @ 3:07PM
మాజీ క్రికెటర్, హెచ్.సి.ఎ. అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ షర్మిల పార్టీలో చేరబోతున్నారా? టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సైతం షర్మిలకు జై కొడతారా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. షర్మిల ఎంట్రీతో తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు, వివిధ రంగాల ప్రముఖులు షర్మిలను కలిసి తమ సంఘీభావం తెలుపుతున్నారు. యుద్ధనౌక గద్దర్ నుంచి యాంకర్ శ్యామల వరకు ఇప్పటికే షర్మిలతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న షర్మిల పార్టీలో చేరేందుకు అనేకులు ఆసక్తి కనబరుస్తున్నారు. లేటెస్ట్‌గా లోటస్ పాండ్‌లో ఓ సెలబ్రెటీ జంట షర్మిలను కలిశారు. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్.. సానియా మిర్జా సోదరి ఆనం మిర్జా.. దంపతులు షర్మిలతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ సమావేశం జరిగిందని బయటకు చెబుతున్నా.. వారు త్వరలోనే షర్మిల పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, అసదుద్దీన్, ఆనం మిర్జాలు మాత్రమే చేరుతారా? లేక, అజారుద్దీన్, సానియా మిర్జాలకు ప్రతినిధులుగా వారు షర్మిల దగ్గరకు వచ్చారా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్ చాలా కాలంగా ఆ పార్టీతో అంటీముట్టనట్టే ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు మంచి ప్లాట్‌ఫామ్ కోసం ఎదురు చూస్తున్న అజారుద్దీన్.. షర్మిల పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.
అజర్ కుమారుడు అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనం మిర్జాలు గతేడాది వివాహ బంధంతో ఏకమయ్యారు. రెండు క్రీడా కుటుంబాలకు చెందిన ఈ జంట తాజాగా షర్మిలను కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త దంపతులు మాత్రమే పార్టీలో చేరుతారా? లేక, అజర్, సానియాలు సైతం షర్మిలతో చేతులు కలుపుతారా? అనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది.