ఒక్క పాయింట్ కోసం.. రెజ్లర్ రితిక ఫొగట్ సూసైడ్

ఒక్క పాయింట్. ఒకే ఒక్క పాయింట్. ఆమె ఓడిపోయేలా చేసింది. ఫైనల్‌లో ఒక్క పాయింట్ తేడాతో టైటిల్ కోల్పోవాల్సి వచ్చింది. తీవ్ర నిరాశకు లోనైన ఆ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోరాటానికి, గెలుపునకు మారు పేరైన ఫొగట్ ఫ్యామిలీలో ఈ విషాదం చోటు చేసుకోవడం బాధాకరం.  బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ దంగల్ గుర్తుందిగా. ఆ సినిమా మహావీర్ ఫొగట్ కుటుంబ నిజజీవిత కథ. ఆ గీతా, బబిత ఫొగట్‌ల కజిన్ సిస్టర్ రితిక ఫొగట్(17). ఆమె సైతం మంచి రెజ్లరే. మహావీర్‌ ఫొగాట్‌ అకాడమీలో రితిక ఐదేళ్లుగా రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. తాజాగా జరిగిన స్టేట్ లెవెల్ జూనియర్‌ ఉమెన్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో రితిక పోటీ పడింది. మంచి ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 14న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయింది. మహావీర్ ఫొగట్ ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. పోరాటానికి మారు పేరైన ఫొగట్ ఫ్యామిలీ మెంబర్.. ఇలా నిజజీవితంలో ఫైటింగ్ స్పిరిట్‌ను మరిచి సూసైడ్ చేసుకోవడం విషాదకరం. 

సీఐడీ నోటీసులపై హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 

అమరావతి అసెంబ్లీ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఆర్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో సవాల్ చేశారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఆయన  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులివ్వగా.. న్యాయసలహా తీసుకున్న అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 41A కింద నోటీసులు ఇచ్చి సోదాలు చేస్తున్నారని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది చట్ట, న్యాయ విరుద్ధమని, ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని కోర్టును న్యాయవాదులు కోరారు. శుక్రవారం ఉదయం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.  రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయించేలా దళితులపై ఒత్తిడి తెచ్చారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీలోని సెక్షన్ 41 (ఏ)(1) ప్రకారం నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిపింది సీఐడీ.  ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే కేసులో తన దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని సీఐడీ.. ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులకు ఆయన తన దగ్గరున్న వివరాలు అందించారు. 

తెలంగాణ బడ్జెట్ విశేషాలు..

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థికశాఖ మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టారు.  2021-22 ఏడాదికి సంబంధించిన రాష్ర్ట బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లుతో  మంత్రి హరీష్ రావు బడ్జెట్  ప్రవేశపెట్టారు. వార్షిక బడ్జెట్‌లో అభివృద్ధి , సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. రంగాల వారీగా బడ్జెట్ కేటాయిపు  రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లు బడ్జెట్‌లో ముఖ్యాంశాలు: వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు వైద్యారోగ్య శాఖ‌కు రూ. 6,295 కోట్లు విద్యుత్ రంగానికి రూ. 11,046 కోట్లు సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు హోంశాఖ‌కు రూ. 6,465 కోట్లు డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రూ. 11 వేల కోట్లు నూత‌న స‌చివాల‌యం నిర్మాణానికి రూ. 610 కోట్లు ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 11,728 కోట్లు క‌ల్యాణ‌ల‌క్ష్మి షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు స‌మ‌గ్ర భూ స‌ర్వే కోసం రూ. 400 కోట్లు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ. 2,363 కోట్లు సాంస్కృతిక ప‌ర్యాట‌క రంగాల‌కు రూ. 726 కోట్లు ఐటీ రంగానికి రూ. 360 కోట్లు మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు బడ్జేతేర నిధులతో కలిపి ఆర్టీసీకి రూ. 3000 కోట్లు అట‌వీశాఖ‌కు రూ. 1,276 కోట్లు దేవాల‌యాల అభివృద్ధి, అర్చ‌కులు, దేవాదాయ ఉద్యోగుల సంక్షేమ కోసం రూ. 720 కోట్లు ప‌శు సంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌శాఖ‌కు రూ. 1,730 కోట్లు విద్యారంగం: విద్యారంగ అభివృద్ధికి నూత‌న ప‌థ‌కం కోసం రూ. 4 వేల కోట్లు పాఠ‌శాల విద్య‌కు రూ. 11,735 కోట్లు ఉన్న‌త విద్యారంగానికి రూ. 1,873 కోట్లు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం: సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ. 1000 కోట్లు ఎస్సీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు బీసీల సంక్షేమం: నేత‌న్న‌ల సంక్ష‌మం కోసం రూ. 338 కోట్లు బీసీ కార్పొరేష‌న్‌, అత్యంత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ. 1000 కోట్లు బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 5,522 కోట్లు మైనార్టీ సంక్షేమం: మైనార్టీ గురుకులాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 561 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ. 1,606 కోట్లు మ‌హిళా, శిశు సంక్షేమం షీ టాయిలెట్ల‌కు రూ. 10 కోట్లు మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల కోసం రూ. 3 వేల కోట్లు మొత్తంగా మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు ప‌ట్ట‌ణాల అభివృద్ధి: ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి రూ. 500 కోట్లు ప‌ట్ట‌ణాల్లో వైకుంఠ‌ధామాల నిర్మాణానికి రూ. 200 కోట్లు ప్రతి పట్టణంలో గజ్వేల్ తరహా మోడల్ మార్కెట్. సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం రూ. 500 కోట్లు హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి: ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం రూ. 250 కోట్లు సుంకిశాల వ‌ద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు మూసీ న‌ది పున‌రుజ్జీవం కోసం, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 200 కోట్లు ఓఆర్ఆర్ ప‌రిధిలోని కాల‌నీల తాగునీటి స‌ర‌ఫరా కోసం రూ. 250 కోట్లు వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ. 250 కోట్లు ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ. 150 కోట్లు మొత్తంగా పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు ప‌రిశ్ర‌మ‌లు : ప‌రిశ్ర‌మ‌ల రాయితీ కోసం రూ. 2,500 కోట్లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 3,077 కోట్లు ర‌హ‌దారులు, భ‌వ‌నాల నిర్మాణం ఆర్ అండ్ బీ రోడ్ల‌కు రూ. 800 కోట్లు పంచాయ‌తీరాజ్ రోడ్ల‌కు రూ. 300 కోట్లు స‌మీకృత క‌లెక్ట‌రేల్లు, జిల్లా పోలీసు కార్యాల‌యాలు, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ల నిర్మాణానికి రూ. 725 కోట్లు ఆర్వోబీ, ఆర్‌యూబీల‌కు రూ. 400 కోట్లు మొత్తంగా రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌కు రూ. 8,788 కోట్లు ఇతరములు: రీజిన‌ల్ రింగ్ రోడ్డు భూసేక‌ర‌ణ‌కు రూ. 750 కోట్లు పౌర విమాన‌యాన అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు తొలిసారిగా రాష్ర్ట ప్ర‌భుత్వ బ‌డ్జెట్ నుంచి మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 500 కోట్లు ఇందులో జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 252 కోట్లు, మండ‌ల పరిష‌త్‌ల‌కు రూ. 248 కోట్లు పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ. 29,271 కోట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు గా కేటాయించారు. ఈ బడ్జెట్ పై   

అటెండర్‌ కోడలు మేయర్‌.. డ్రైవర్ డిప్యూటీ మేయర్..

తిరుపతి కార్పొరేషన్‌లో ఆసక్తికర విషయాలు. మాజీ అటెండర్ కోడలే ఇప్పుడు మేయర్. ఒకనాటి డ్రైవరే ప్రస్తుత డిప్యూటీ మేయర్. కాలచక్రం గిర్రున తిరగడంతో ఈ రాజకీయ సిత్రాలన్నీ సాధ్యమయ్యాయి.  తిరుపతి కార్పొరేషన్ తొలి మేయర్‌గా డాక్టర్ శిరీష ఎన్నికయ్యారు. అదే కార్పొరేషన్‌లో ఒకప్పుడు అటెండర్‌గా పని చేసిన మునెయ్య కోడలే ప్రస్తుత మేయర్ శిరీష. మునెయ్య  ముప్పై ఏళ్ల పాటు తిరుపతి మున్సిపల్‌ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పని చేశారు. దఫేదార్‌గా ఆరేళ్ల క్రితం రిటైర్‌ అయ్యారు. అటెండరుగా తాను పనిచేసిన సంస్థకు తన కోడలు డాక్టర్‌ శిరీష మేయరుగా ఎంపిక కావడంపై మునెయ్య ఆనందం వ్యక్తం చేశారు. స్తున్నారు.  మునెయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు డాక్టర్‌ మునిశేఖర్‌ భార్యే డాక్టర్‌ శిరీష. ఆమెది కడప జిల్లా కొర్రపాడు. 1980లో జన్మించిన శిరీష తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల నుంచి 2011లో డీజీవో కంప్లీట్ చేశారు. కొంతకాలం తిరుపతిలో గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. పీడియాట్రీషియన్‌ మునిశేఖర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనతో పాటు వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. కౌన్సిలర్‌గా గెలిచి తిరుపతి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ సైతం ఒక్కోమెట్టు ఎక్కుతూ రాజకీయంగా ఎదిగిన వారే. ఏడవ తరగతి వరకు చదువుకున్న ఆయన డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. 1985లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1994లో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చేశారు. 2002లో తిరుపతి మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున కౌన్సిలర్‌గా గెలిచారు. ప్రస్త్తుతం 14వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై.. డిప్యూటీ మేయర్‌గా మారారు.

మైదుకూరులో మెగా డ్రామా.. వైసీపీకే ఛైర్మెన్ గిరి..

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినా.. ఆ పార్టీకి అధికార దాహం తీరడం లేదు. టీడీపీ మెజార్టీ సీట్లు గెలిచిన మున్సిపాలిటీలను అడ్డదారుల్లో కైవసం చేసుకుంటోంది. సొంత సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలోని  మైదుకూరు  మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. మైదుకూరులో మొత్తం 24 వార్డులు ఉండగా.. టీడీపీ 12 వార్డులు గెలిచింది. వైసీపీ 12 వార్డులు గెలవగా.. జనసేన అభ్యర్థి ఒక వార్డులో గెలిచారు.  టీడీపీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించకుండా అడ్డదారులు తొక్కింది. టీడీపీ నుంచి ఆరో వార్డులో గెలిచిన షేక్ మహబూబి, జనసేన అభ్యర్థి బాబులు ప్రమాణ స్వీకార  ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. షేక్ మహబూబి రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. ఆమెను వైసీపీ నేతలే దాచి పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. జనసేన అభ్యర్థి కూడా ఓటింగ్ కు రాకుండా వైసీపీ నేతలు బెదిరించారని  తెలుస్తోంది. ఇద్దరు సభ్యుల గైర్హాజరుతో మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్నికకు 22 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే హాజరయ్యారు. దీంతో వైసీపీ బలం 13కు పెరగగా.. టీడీపీ 11కు పడిపోయింది. దీంతో  మైదుకూరు  చైర్మెన్ పీఠం వైసీపీ వశమైంది.  మైదుకూరు పురపాలక సంఘం ఛైర్మన్ గా మాచునూరు చంద్ర, వైస్ ఛైర్మన్గా మహబూబ్ షరీఫ్ ఎంపికయ్యారు. అయితే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా అక్రమ పద్దతుల్లో అధికార పార్టీ చైర్మెన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంపై జనాల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలను గెలుచుకున్నా... ఇలా అడ్డదారులు తొక్కడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.  

ఒకడేవొక్కడు మొనగాడు.. తాడిపత్రి మెచ్చిన తోపు..

12 కార్పొరేషన్లు. 75 మున్సిపాలిటీలు. అన్నిచోట్లా వైసీపీ స్వీప్. ఆ ఒక్కటి మినహా. అదే తాడిపత్రి. తామే తాడిపత్రి తోపులమంటూ.. తమనెవరూ టచ్ చేయలేరంటూ.. జేసీ బ్రదర్స్ తొడగొట్టి మరీ సవాల్ చేశారు. అనుకున్నట్టే అధికారపార్టీకి ఎదురొడ్డి మరీ తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేశారు. ఏపీ అంతటా ఒక లెక్క.. తాడిపత్రిలో మరోలెక్క అంటూ.. మీసం మెలేశారు జేసీ బ్రదర్స్. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఫలితాల తర్వాత తీవ్ర ఉత్కంఠను రేపిన తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తాడిపత్రిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదు. టీడీపీ అభ్యర్థులకు గాలం వేయడం, వారిని బెదిరింపులకు గురి చేయడం లాంటి కుతంత్రాలు జేసీ రాజకీయ చాణక్యం ముందు పని చేయలేదు. తాడిపత్రిలో టీడీపీ తరఫున 18మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఒక సీపీఐ, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఆ ఇద్దరూ టీడీపీనే మద్దతు ప్రకటించారు. మొత్తం 20మంది కౌన్సిలర్లతో టీడీపీ రహస్య శిబిరం కొనసాగించింది. వైసీపీ సైతం పోటీ శిబిరం ఏర్పాటు చేసి నువ్వా నేనా అంటూ రాజకీయం నెరిపారు. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డికి ఎక్స్‌అఫీషియో ఓటింగ్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడం.. వైసీపీకి రెండు ఎక్స్అఫీషియో ఓట్లు ఉండటంతో ఉత్కంఠ పెరిగింది. టీడీపీ కౌన్సిలర్లపై అధికార పార్టీ ఎంతగా ఒత్తిడి తెచ్చినా.. వారెవరూ జేసీని వీడలేదు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్లు, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి మున్సిపాలిటీని ఎలాగైనా సొంతం చేసుకొని సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. వరుస కేసులతో తనను వేధిస్తున్న అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని పంతం పట్టారు. అందుకే, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఈసారి కౌన్సిలర్‌గా బరిలో దిగారు. తనతో పాటు తన వారినీ గెలిపించుకొని.. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఓడిన చోటే మళ్లీ అందలం ఎక్కి.. తాడిపత్రిలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు జేసీ బ్రదర్స్. జేసీనా మజాకా...

బాక్స్ లో బాలుడు.. అయ్యో పాపం.. 

ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదంటారు. తల్లి త్యాగానికి వెలకట్టలేం అంటారు. తల్లి ప్రేమ ఆకాశమంత అంటారు. కానీ ఓ పసివాడి చావుకి కన్నా తల్లే కారణం అయింది. ఆ పసివాడు చేసిన పాపం ఆ తల్లి కడుపునా పుట్టమేనా? కొంత మంది ఐదు నిమిషాల సుఖం కోసం.. అసువులు బాస్తున్న ఎందరో పసికందులు.. తల్లి కడుపు ను జయించి విజేతలుగా పుట్టి.. అజేతలుగా అసువులు బాస్తున్నారు. పురిట్లోనే పసివాళ్లు ప్రాణాలు విడుస్తున్నారు.  ఏ తల్లి అయినా మూడు తన బిడ్డను గర్భంలో దాచుకుంటుంది. ఊయలలో వేసి జోల పడుతుంది. లేదంటే తల్లి వడిలో దాచుకుని పలు పడుతుంది. కానీ ఓ తల్లి మాత్రం అప్పుడే పుట్టిన పసికందును అట్టపెట్టెలో పెట్టి రోడ్డు మీద పడేసింది ఓ కసాయి తల్లి .. తొమ్మిది నెలలు తల్లి చీకటి గర్భంలో ఉన్న ఆ పసికందు వెలుగులోకి రాగానే ప్రాణాలు విడిచాడు.      అప్పుడే పుట్టిన పసికందును అట్టపెట్టెలో పెట్టి రోడ్డు పై వదిలి వెళ్లిన ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ డీఆర్ డీఎల్ శివాజీ చౌక్ వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అక్కడ ఉన్న స్థానికులు అట్టపెట్టలో పసికందును చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించగా ఆ శిశువు అప్పటికే మరణించాడు. ఆ పసిబిడ్డ చనిపోయాక అట్టపెట్టలో పెట్టి పారేశారా, లేక అట్టపెట్టలో పెట్టిన తరువాత చనిపోయాడా అనేది తెలియదు. ఆ పసికందు ఎలా చనిపోయాడు అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచంలో పుట్టుక చావు సహజం కానీ అభం శుభం తెలియని. పుక్కుపచ్చలారని పసికందులను చంపే హక్కు ఎవరు ఇచ్చారు. ఆజ్ఞనపు అందరకు పోకడగలు ఇంకెంత కాలం..    

విశాఖ వైసీపీలో చిచ్చు! జగన్ కు వ్యతిరేకంగా నిరసన 

విశాఖపట్నం కార్పొరేషన్ లో పాగా వేశామని సంబరపడుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు తగిలింది. జీవీఎంసీ  మేయర్ ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. మేయర్ రేసులో ముందు నుంచి ప్రచారంలో ఉన్న వంశికృష్ణ యాదవ్ కు కాకుండా మరో మహిళకు  అవకాశం ఇవ్వడం వైసీపీలో కలకలం రేపుతోంది. జీవీఎంసీ ఔట్ గేట్ వద్ద వంశీ కృష్ణ శ్రీనివాస్ అనుచర వర్గం ఆందోళనకు దిగింది. వంశీకి మేయర్ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మహిళలు కంటతడిపెట్టుకున్నారు.  సీఎం జగన్,  ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా వంశీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవీఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగడంతో  పరిస్థితి ఉద్రిక్తం మారింది.  విశాఖ మేయర్‎గా వైసీపీ మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్‌గా జీఎం శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  విశాఖ మేయర్ పదవి దక్కకపోవడంపై వంశీ కృష్ణ శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చిన తన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానొక  దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వెగానికి లోనయ్యారు. కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని చెబుతూ...నిరసన చేసిన అభిమానులను వంశీ కృష్ణ శ్రీనివాస్ ఓదార్చారు.

పోలీసులు పొరపాటున చంద్రబాబు సోదరి ఇంటికి వెళ్లారట...

ఏపీలో రాజధాని అమరావతి అస్సైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేయడంతో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క నిన్న ఇదే విషయంలో టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ నివాసాలలో సిఐడి దాదాపు ఏడు గంటలపాటు సోదాలు జరిపిన సంగతి తెల్సిందే. దీంతో ఎపుడు, ఎక్కడ పోలీసులు సోదాలు చేస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   ఇది ఇలా ఉండగా  చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు సోదరి హైమావతి ఇంటికి పోలీసులు వచ్చి ఫొటోలు తీయడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి తమను తాము పోలీసులమని కాపలాదారుకు చెప్పి ఇంటి ఆవరణలోకి వెళ్లారు. అయితే,ఆ ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉండడంతో బారు బయటకు వచ్చి పరిసరాలను ఫొటోలు తీశారు.   ఈ ఘటన తరువాత హైమావతి ఇంటి వద్ద కాపలాదారుగా ఉన్న రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుతో పాటు   సీసీటీవీ పుటేజీలను రవి పోలీసులకు అందించాడు. అయితే ఈ ఘటనపై సీఐ రామచంద్రారెడ్డి వివరణ ఇస్తూ.. నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని..  అయితే తమ సిబ్బంది పొరపాటున నారావారిపల్లెకు బదులుగా కందులవారి పల్లెకు వెళ్లారని వివరణ ఇచ్చారు. చంద్రబాబు సోదరి హైమావతి కుమార్తె పేరు కూడా సుచరిత కావడంతో పోలీసులు పొరపాటున ఆమె ఇంటికి వెళ్లారని సీఐ పేర్కొన్నారు. అయితే అదే పేరు కదా అని చెప్పి హోమ్ మంత్రి సుచరిత గారి ఇంటికి వెళ్ళలేదు..  ఇంకా నయం... అంటూ  తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేసున్నారు.  

భారత్ లో భారీగా కరోనా కేసులు

భారత్‌లో కరోనా మళ్ళీ పరుగులు తీస్తుంది. మహమ్మారి కరోనా మరోసారి తన పంజా విసురుతుంది. రోజు రోజుకి వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. క్రమంగా కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10.63లక్షల పరీక్షలు చేయగా.. 35,871 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,74,605 కి చేరింది. కొత్తగా 17,741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,63,025కు చేరి.. రికవరీ రేటు 96.65శాతం నుంచి 96.56శాతానికి తగ్గింది.   మరోవైపు కరోనా మరణాలు మంగళవారంతో పోలిస్తే గత రోజు కొంతమేర తగ్గాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 188 మరణాలు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 172మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,216కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  2,52,364 కి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 20లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా వేసిన వారి సంఖ్య  3,71,43,255  కి చేరింది.     

టీడీపీ, జనసేన మళ్లీ పొత్తు!

తెలంగాణలో బీజేపీతో కటీఫ్. తిరుపతి పోటీ నుంచి విత్‌డ్రా. ఏదో తేడాగా ఉందంటున్నారు విశ్లేషకులు. జనసేన స్ట్రాటజీ మారిందా? బీజేపీకి రాంరాం చెప్పేందుకు రెడీ అవుతోందా? కమలంతో కయ్యానికి జనసైన్యం ముహూర్తం చూసుకుంటోందా? పాత మిత్రుడు చంద్రబాబుతో మళ్లీ చేయి కలిపేందుకు సన్నద్ధమవుతోందా? అంటే కావొచ్చనే సమాధానమే వస్తోంది. వరుస పరిణామాలను నిశితంగా గమనిస్తే.. జనసేన పొలిటికల్ లైన్ మారిందని.. టీడీపీకి దగ్గర అవుతోందని అంటున్నారు.  తెలంగాణ బీజేపీ తమను అవమానించిందంటూ జనసేనాని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. తెలంగాణలో కమలం పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇక, ఏపీలోనూ ఇదే రిపీట్ అవుతుందని అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంత‌ృప్తితో ఉన్నారు. తిరుపతిలో పోటీకి ఎంతగా ప్రయత్నించినా.. బీజేపీ నుంచి సహకారం అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతిలో బీజేపీ కంటే జనసేన-బీఎస్పీ కూటమికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా, తిరుపతి సీటును జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ అస్సలు అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే తిరుపతి సీటును వదులుకునేందుకు పవన్ అంగీకరించారట. బీజేపీ తీరుతో విసిగి వేశారిన జనసేనాని.. తెలంగాణలో మాదిరే ఏపీలోనూ కటీఫ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో, పాత మిత్రుడు, నమ్మదగిన నాయకుడైన చంద్రబాబుతో జత కట్టే దిశగా ఆలోచన చేస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీలు అవగాహనతో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాయి.  మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్న అనలిస్టులు కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అధికార పార్టీకి ఇంతటి ఫలితాలు వచ్చేవి కావంటున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య లక్ష ఓట్ల తేడా ఉంది. ఈ జిల్లాలో జనసేనకు 50వేలకు పైగా ఓట్లు వచ్చాయి. నగరంలో 16 డివిజన్లలో జనసేన పార్టీ టీడీపీ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందని లెక్కలు వేస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన ఫలితం తారుమారయ్యేదని అంటున్నారు. విశాఖపట్నం జిల్లాలో  ఓట్ల లెక్క లు చూస్తే.. ఈ జిల్లాలో వైసీపీకంటే ప్రతిపక్షాలకు ఎక్కు వ ఓట్లు లభించాయి. విశాఖపట్నం జిల్లాలో వైసీపీ 4.64 లక్షల ఓట్లు సాధించింది. టీడీపీ 3.87 లక్షల ఓట్లు తెచ్చుకుంది. జనసేనకు 82 వేలు దక్కాయి. అంటే... ఈ రెండు పార్టీల ఓట్లను కలిపితే... వైసీపీకంటే ఎక్కువే అవుతాయి. బీజేపీకి 35 వేలు దక్కాయి. ఓట్లు చీలిపోవడంతో వైసీపీకి విజయం దక్కింది. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిలి పోటీ చేస్తే విశాఖ, కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ఫలితాలు వచ్చేవని లెక్కలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తున్న జనసేన నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారట.  అయితే.. ఎన్నికలు, గెలుపు మాత్రమే తమ లక్ష్యం కాదని.. మార్పే అంతిమమనేది జనసేన సిద్ధాంతం. అయితే.. అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి.. ఈ లోగా అధికార వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలన్నా.. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై నిలదీయాలన్నా.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో స్నేహబంధం ఎంతైనా అవసరమని జనసేనకు రాజకీయ మేథావులు సూచిస్తున్నారట. ఇప్పటికే ఏపీకి కేంద్రం మోసం చేస్తుందనే ఆగ్రహంతో ఉన్నారు ఆంధ్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో వెళ్లడం కంటే... పాత మిత్రపక్షం టీడీపీతో పొత్తు పెట్టుకుంటనే బెటరని కొందరు జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.

కూతురు కావాలంటూ.. తల్లికి వార్నింగ్ .

బస్టాండ్ అడ్డాగా వాళ్ళ స్నేహం. పరిచయం అయినా కొంత కాలానికే చాటింగ్ మొదలు పెట్టారు. అమ్మాయి స్నేహం అనుకుంది. అబ్బాయి మాత్రం ప్రేమ అనుకున్నాడు.. తన మనసులో మాట అమ్మాయి కి చెప్పాడు.. అందుకు అమ్మాయి అంగీకరించలేదు.  హైదరాబాద్ లోని బైరామల్ గూడకు చెందిన గుజ్జ శ్రీధర్ రెడ్డి అనే యువకుడికి 2012వ సంవత్సరంలో బస్టాప్ లో ఓ ఇంటర్ చదివే యువతి పరిచయం అయింది. పలుమార్లు బస్టాప్ లోనే కలవడంతో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. వారిద్దరూ ఫోన్ నెంబర్లను ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహంగా భావించి ఆమెతో మాట్లాడుతూ ఫొటోలు, వీడియోలను గ్యాదర్ చేశాడు. అయిదేళ్ల పాటు స్నేహం నటించాడు. 2017వ సంవత్సరంలో ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్ పెట్టాడు. దీంతో ఆ యువతి అతగాడి ప్రపోజల్ ను తిరస్కరించింది. అతడి నిజస్వరూపం తెలియడంతే అతడి ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఆమెతో మాట్లాడటం కుదరకపోవడంతో శ్రీధర్ కు పిచ్చెక్కినట్టయింది. అతను ఎలాగోలా ఆమె తల్లి ఫోన్ నెంబర్ ను తెలుసుకుని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు నేరుగా వాట్సప్ లో  నీ కూతురు నన్నే ప్రేమించాలి. కాదని ఇంకెవరిని ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా, దాని పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి. నా దగ్గర మీ అమ్మాయి ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతా. మీ పరువు తీస్తా. నన్ను కాదంటే మీ అమ్మాయికి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా‘ యువకుడు బెదిరింపు మెసేజ్ ను పంపాడు. ఆ మెసేజ్ ను చూసిన ఆమె కంగుతింది. కూతురిని అడిగి అసలు విషయం కనుక్కుంది. ఆ తర్వాత రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు శ్రీధర్ ను అరెస్ట్ చేశారు. అతగాడి వద్ద ఉన్న ఫొటోలు, వీడియో ఆధారాలను ధ్వంసం చేశారు. అతడిని రిమాండ్కు పంపించారు.  ప్రేమిస్తే పేమించాలి గానీ నన్ను ప్రేమించకపోతే పరువు తీస్తా.. చంపేస్తా అనడం ఎందుకు..ఈ మధ్య కాలం లో ఫ్యాషన్ అయిపోయిందని. ఇలాంటి దారుణాలు మరి ఎక్కువ అవుతున్నాయని.. ఒక అమ్మాయి ప్రేమించకపోతే వదిలెయ్యని కానీ ఇలా టార్చెర్ చేయడం సరికాదని. అమ్మాయి  ప్రేమించలేదని ప్రాణాలు తీసుకోవం. ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం అని స్థానికులు అంటున్నారు.    

బ్యాలెట్ బాక్సుల్లో జై శ్రీరాం,  జై పీఆర్సీ..  

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో మూడు రౌండ్లు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో రెండు రౌండ్ల లెక్కింపు పూర్తైంది.  పట్టభద్రుల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు వస్తున్నాయి. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో దాదాపు 6 శాతం ఓట్లు చెల్లకుండాపోయాయి. నల్గొండ స్థానంలో  లక్షా 70  వేల ఓట్లు లెక్కించగా.. అందులో దాదాపు 10 వేల ఓట్లు చెల్లలేదు. హైదరాబాద్ స్థానంలో లక్షా 12 వేల ఓట్లు చెల్లించగా.. దాదాపు 6 వేల ఓట్లు చెల్లలేదు.  పట్టభద్రుల ఓట్లు చెల్లకుండా పోవడం చర్చగా మారింది.  పట్టభద్రులు ఓటింగులో చాలా తప్పులు చేశారని తెలుస్తోంది . కొందరు నెంబర్ కు బదులుగా టిక్ కొట్టారు. ఇంకొందరు ఒకటే నెంబర్ ను ఇద్దరు, ముగ్గురికి వేశారు. ఇంకొందరు ఎన్నికల సిబ్బంది ఇచ్చిన మార్కర్ కాకుండా.. తమ సొంత పెన్నులతో టిక్ పెట్టారు. ఇవి కాకుండా కొందరు ఓటర్లు అత్యుత్సాహం కూడా .. వాళ్ల ఓటు చెల్లకుండాపోవడానికి కారణమైందని తెలుస్తోంది. కొందరు పట్టభద్రులు బ్యాలెట్ పేపరుపై జై శ్రీరాం.. జై హనుమాన్.. జై పీఆర్సీ నినాదాలు రాశారు. ఎన్నికల రూల్స్ ప్రకారం బ్యాలెట్ పేపర్ పై నెంబర్ కాకుండా ఎలాంటి రాతలు ఉండకూడదు. దీంతో అలాంటి ఓట్లన్ని చెల్లనవిగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. జై శ్రీరాం అని రాసి ఉన్న ఓట్లన్ని బీజేపీ సానుభూతిపరులవిగా భావిస్తున్నారు. ప్రస్తుతం దేశమంతా శ్రీరామ జపం వినిపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదంతో ముందుకు పోతున్నారు. అయితే పార్టీ పట్ల అభిమానం చూపేందుకు అత్యుత్సాహంతో చేసిన పనితో.. వాళ్ల పార్టీకి నష్టం కల్గిందనే చర్చ జరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ జై హనుమాన్ నినాదం ఎత్తుకుంది. బీజేపీ జై శ్రీరాంకు పోటీగా టీఆర్ఎస్ జై హనుమాన్ స్లోగన్ ను వినిపిస్తోంది. దీంతో జై హనుమాన్ అని బ్యాలెట్ పై రాసిన వారంతా గులాబీ పార్టీ మద్దతుదారులు అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.  తెలంగాణ ఉద్యోగులు పీఆర్సీ కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. కేసీఆర్ సర్కార్ కూడా ఇస్తాం ఇస్తాం అంటూనే మూడేండ్లుగా పీఆర్సీపై సాగదీస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నారు. సర్కార్ పై ఉన్న కోపాన్ని కొందరు ఉద్యోగులు బ్యాలెట్ పేపర్లపై చూపించారని తెలుస్తోంది. అయితే జై పీఆర్సీ అని రాయడంతో వారి ఓట్లు చెల్లకుండా పోయాయి.  మొత్తానికి విద్యావంతులు చెల్లని ఓట్లు వేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.  

పిల్లకాయలకు ఇస్కూళ్ళు బంద్... మళ్ళీ ఆన్ లైన్ క్లాసులే ..!

లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి నుంచి దాదాపు 10 నెలల పాటు తెలంగాణలో బడులు మూసి ఉన్న సంగతి తెల్సిందే. మరోపక్క కొన్ని రోజుల క్రితం వరకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గడచిన నెల ఫిబ్రవరి 1 వ తేదీ నుండి 9, 10 తరగతి విద్యార్థులకు ఆఫ్ లైన్ లోనే  (తరగతి గదిలో) క్లాసులు జరపాలని నిర్ణయించింది. దీంతో అప్పటి నుండి 9 వ తరగతి పైబడిన విద్యార్థులందరూ స్కూళ్లకు వెళుతున్నారు. తరివాత అదే నెల 24వ తేదీ నుండి 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు కూడా ఆఫ్ లైన్ క్లాసులకు సర్కార్ అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే  అయితే ప్రాథమిక తరగతుల విద్యార్థుల క్లాసులకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో స్కూళ్లు, గురుకులాలు ఓపెన్ కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా బడి బాట పట్టారు.    అయితే కొద్దిరోజులుగా పలు విద్యా సంస్థల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండడంతో.. . ఈ ప్రత్యక్ష తరగతులను నిలిపేయాలని తెలంగాణ సర్కార్ పునరాలోచనలో పడింది. మరీ ముఖ్యంగా బడులలో  కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల్లో పలు విద్యాసంస్థల్లో 150కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోపక్క పొరుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం కూడా దీనిపై హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రాలు పూర్తీ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ బుధవారం జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలను కోరారు. దీంతో 6 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలను మూసివేసి మళ్ళీ ఆన్ లైన్ క్లాసులనే కొనసాగించాలని నిర్ణయించినట్టుగా  తెలుస్తోంది. అంతేకాకుండా  ఈ తరగతుల విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని కూడా డిసైడ్ అయినట్లు గా సమాచారం. దీంతో కేవలం 9 , 10వ తరగతి విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించడానికి అనుమతివ్వాలని భావిస్తోంది. అంతేకాకుండా పదో తరగతి పరీక్షల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరిన్ని కోవిడ్ జాగ్రత్తల మధ్య వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది  

పెళ్లి ఒకరితో.. గర్భం ప్రియుడితో.. 

ఒకరిని ప్రేమించింది. మరొకరిని పెళ్లి చేసుకుంది. అయినా ఆమె వక్ర బుడ్డి మానుకోలేదు. పెళ్లి తర్వత కూడా ప్రియుడితో టచ్ లో ఉంది. ఆ విషయం భర్తకు కూడా తెలుసు. తరుచు భర్త ను ప్రియుడితో పోల్చి అవమానించేది. అయినా ఆ భర్త ఓర్చుకున్నాడు. ఆ బాధని తనలోనే దాచుకున్నాడు. ఏ మగాడైనా బరించేంత వరకు భరిస్తాడు. అది అవమానంగా, ఆవేదన అయినా, కానీ తన ప్రియుడి వల్లే నేను గర్భం దాల్చను అని చెపితే ఒక భర్తకు అంత కంటే అవమానం ఏముంటుంది చెప్పండి.  ఎవరు ఎన్ని మాటలు అన్నా, తిట్టినా, అవమానించినా మగాళ్లు తట్టుకోగలరు. కానీ కట్టుకున్న భార్య నుంచే వేధింపులు మొదలైతే మాత్రం భర్త భరించలేడు. ప్రియుడి మోజులో పడి సూటి పోటు మాటలంటూ అవమానిస్తే తట్టుకోలేడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాలకుచెందిన అట్టపెల్లి రాజు అనే 30 ఏళ్ల యువకుడికి గొల్లపెల్లి మండలం బొంకూరుకు చెందిన ఓ యువతితో ఏడాది క్రితం పెళ్లయింది. అయితే పెళ్లికి ముందే ఆ యువతి గొల్లపెల్లి మండలంలోని తుంగూరుకు చెందిన సప్ప రాజేందర్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఏ కారణం వల్లనో ఏమో కానీ రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం రాజుకు తెలిసి తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ భార్య తీరులో మార్పులేదు. అంతేకాకుండా ప్రతీ విషయంలోనూ భర్తను, ప్రియుడిని పోల్చుతూ కామెంట్స్ చేసేది. అవమానించేది. ఇదే క్రమంలో ఆమె ఇటీవల గర్భం దాల్చింది. ఈ గర్భం వచ్చింది నీ వల్ల కాదు. దీనికి కారణం నువ్వు కాదు. నా ప్రియుడి వల్లే నేను గర్భవతిని అయ్యా‘ అంటూ భర్త రాజుతో తేల్చిచెప్పింది. ఆ తర్వాత తల్లిగారింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. అంతటితో ఆగకుండా ఆ భార్య వేధింపులను మరింత పెంచింది. ఆమె తన ప్రియుడితో కలిసి రాజును మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది. ’నీ బతుకు ఎందుకు. ఎందులోనైనా దూకి చచ్చిపోరాదు. నీదీ ఒక బతుకేనా?’ అంటూ ఫోన్లు చేసి వేధించసాగారు. దీంతో మనో వేధనకు గురైన ఆ భర్త మంగళవారం మల్యాల మండలం నూకపెల్లి శివారులోని వరద కాలువ క్రాస్ రెగ్యులేటర్ గేట్ల వద్ద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య, ఆమె ప్రియుడి గురించి వివరాలు ఆరా తీస్తున్నారు.  

గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా కల్పలత

గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కల్పలత విజయం సాధించారు. ఈ స్థానం నుంచి మొత్తం 19 మంది పోటీ చేశారు. 12,554 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం  ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా చెల్లని ఓట్లను తీసేసిన అనంతరం అభ్యర్థి విజయానికి 6,153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి 50 శాతానికిపైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో కల్పలత 6,153 ఓట్లు సాధించిన వెంటనే సమీప అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. విజయం సాధించిన అనంతరం కల్పలత మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.

ఎమ్మెల్సీ కౌంటింగ్.. టీఆర్ఎస్ అభ్యర్థుల లీడ్

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల వరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో రెండు రౌండ్లు పూర్తి కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో ఒక రౌండ్ ముగిసింది. నల్గొండ స్థానంలో రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 7 వేల871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లలో కలిపి లక్షా 12 వేల ఓట్లు లెక్కింపు పూర్తైంది. ఇందులో దాదాపు 6 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు 31987 , తీన్మార్ మల్లన్నకు  24116, కోదండరామ్ కు 18528, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 13284 ఓట్లు వచ్చాయి.  తొలి రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి  16 130, తీన్మార్ మల్లన్నకు 12046, కోదండరామ్ కు 9080, బీజేపీకి  6615, కాంగ్రెస్ కు 4354 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో పల్లాకు తీన్మార్ మల్లన్న కంటే 4084 ఓట్లు ఎక్కువ వచ్చాయి. రెండో రౌండ్ లో పల్లాకు 15857, తీన్మార్ కు 12070, కోదండరామ్ కు 9448, బీజేపీకి  6669, కాంగ్రెస్ కు 3244 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 3 వేల 780 ఓట్ల ఆధిక్యం వచ్చింది.  ఇక హైదరాబాద్ సీటులో తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీ స్వల్ప ఆధిక్యం సాధించారు. తొలి రౌండ్ లో 56 వేల ఓట్లను లెక్కించగా.. 3 వేల ఓట్లు చెల్లించకుండా పోయాయి. మిగిలిన 53 వేల ఓట్లలో  సురభి వాణిదేవీకి 17 429, బీజేపీ అభ్యర్థి రాంచంద్రరాావుకు 16 385, ఇండిపెండెంట్ అభ్యర్థి నాగేశ్వర్ కు 8357, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డితి 5501 ఓట్లు వచ్చాయి, తొలి రౌండ్ లో వాణిేదేవీకి 1044 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

లీడ్ ఉన్నా టీఆర్ఎస్ గెలుపు కష్టమే!

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల వరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో రెండు రౌండ్లు పూర్తి కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో ఒక రౌండ్ ముగిసింది.నల్గొండ స్థానంలో రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 7 వేల 871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్ సీటులో తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీకి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కంటే వెయ్యి 44 ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు లీడ్ వచ్చినా... వాళ్ల అభ్యర్థులు విజయం సాధించడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భిన్నంగా ఉంటుంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తేనే గెలిచినట్లు. లేదంటే రెండో ప్రాధాన్యత.. అందులోనూ తేలకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో వెనకబడిన అభ్యర్థులు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన సందర్భాలున్నాయి.  నల్గొండ స్థానంలో రెండు రౌండ్లలో కలిపి ఇప్పటివరకు లక్షా 12 వేల ఓట్లు లెక్కింపు పూర్తైంది. ఇందులో దాదాపు 6 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు 31 987 , తీన్మార్ మల్లన్నకు  24116, కోదండరామ్ కు 18528, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 13284 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ కు 50 శాతం ఓట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారనుంది.  ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో లీడ్ లో ఉన్నా పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చిన ఓట్లు కేవలం 31శాతమే. అంటే ఇప్పుడొస్తున్న ట్రెండ్స్ ప్రకారమే మిగితా రౌండ్లలో పల్లాకు లీడ్ వచ్చినా... రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు మరో 20 శాతం ఓట్లు రావాల్సి ఉంది. హైదరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీకి 33 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమెకు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లలో భారీగా ఓట్లు రావాల్సి ఉంది. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ ను కలవరపరుస్తోంది.  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించిన రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అధికార టీఆర్ఎస్ పార్టీకి రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. అందుకే తొలి ప్రాధాన్యత ఓట్లపైనే గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలోనూ టీఆర్ఎస్ నేతలు తొలి ప్రాధాన్యత గురించే ప్రచారం చేశారు. అయితే లెక్కింపులో వాళ్లకు తొలి ప్రాధాన్యత ఓటు కేవలం 30 శాతంగానే ఉండటంతో... గెలుపుపై నమ్మకం కోల్పోతున్నారని తెలుస్తోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు 40 శాతం ఓట్లు సాధిస్తే తప్ప.. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని చెబుతున్నారు. 

నిమ్మగడ్డ, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేది. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై గవర్నర్, హైకోర్టుకు నివేదించాలి. ఇవి ఏపీ సీఎం జగన్‌రెడ్డి స్టేట్‌మెంట్స్. ఒక్క నెలలో ఎంత తేడా? ఎంత మార్పు?. మొన్నటి దాకా ఎన్నికలకు ససేమిరా అన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎలక్షన్‌ జరిపేదే లేదంటూ భీస్మించుకు కూర్చున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అన్నిచోట్లా చేతులు కాల్చుకున్నాక.. ఎన్నికలు జరిపారు. విజయఢంకా మోగడంతో మొనగాడిలా.. మిగిలిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలంటూ పట్టుబడుతున్నారు సీఎం జగన్.  ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైర్ అయ్యేలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి సైతం నిమ్మగడ్డపై తమకు ఎలాంటి వ్యక్తిగత ధ్వేషం లేదంటూ వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రి, చీఫ్ విప్.. ఇలా నేతల వరుస ప్రకటనలు చూస్తుంటే.. నిమ్మగడ్డతో వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ జరుగుతున్న ప్రచారం నిజమేననే అభిప్రాయం కలుగుతోంది. కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా రెండున్నర ఏళ్ల పాటు హనీమూన్ పీరియడ్ ఉంటుందని అంటారు. పాలనలో మొదటి సగ భాగం అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వంపై అసలైన అభిప్రాయం ఏర్పడుతుంది. మొదటి రెండేళ్లు సంక్షేమ పథకాలతో జనాలను మభ్యపెడుతున్న జగన్ సర్కారుపై ఎలాగూ సదభిప్రాయమే ఉంటుంది. ఆ తర్వాతే అభివృద్ధి, పరిశ్రమలు, ఆదాయంలాంటి అసలైన అంశాలు చర్చకు వస్తాయి. ఏపీలో ఇప్పుడు అలాంటి అభివృద్ధి ఛాయలేవీ లేవనే నిజాన్ని ప్రజలు కాస్త ఆలస్యంగానైనా తెలుసుకుంటారు. ఆ సమయంలో కనుక ఎన్నికలు జరిగితే.. ప్రజా వ్యతిరేకత బయటపడేది. హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం అధికార పార్టీకి అనుకూలంగా మారింది. వైసీపీకి, ఎస్ఈసీ లోపాయికార ఒప్పందం జరిగిందని.. బయటకు మాత్రం నిమ్మగడ్డ చంద్రబాబు మనిషంటూ ప్రచారం చేశారని.. ఇదంతా అధికార పార్టీ మైండ్ గేమ్‌లో భాగమని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే ఆ విషయం వాస్తవమే అనిపిస్తోంది. ఏడాదిగా కరోనా కారణంతో ప్రతిపక్షం పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేకపోయింది. అధికార పార్టీ దూకుడుగా ఉండి.. విపక్షం ఉదాసీనంగా ఉన్న సమయంలో.. ప్రభుత్వానికి హానీమూన్ పిరియడ్ నడుస్తున్న టైమ్‌లో కావాలనే హడావుడిగా స్థానిక ఎన్నికలు జరిపారని కొందరు అంటున్నారు. ఇదంతా.. సర్కారు, ఎస్ఈసీ కలిసి చేసిన కుట్ర అంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు.. నిమ్మగడ్డ, చంద్రబాబును ఒకే కులం గాటున కట్టేసి.. ఆయన ఆయన మనిషేనంటూ ముద్రేసి.. సర్కారు స్వకార్యం సైలెంట్‌గా పూర్తి చేసుకుందని అనుమానిస్తున్నారు.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలంటూ సీఎం జగన్ అభిప్రాయపడటం.. ఆ ఎలక్షన్ కూడా కంప్లీట్ చేసి రిటైర్ కావాలంటూ మంత్రి పెద్దిరెడ్డి కోరడం.. నిమ్మగడ్డపై ఎలాంటి వ్యక్తిగత ధ్వేషం లేదంటూ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి చెప్పడం.. ఇవన్నీ అంతా ఆ తాను ముక్కలే అనడానికి నిదర్శణమంటున్నాయి విపక్షాలు.