పార్లమెంట్ లో మహిళా ఎంపీకి వార్నింగ్! 

మహారాష్ట్రలో ప్రకంపనలు స్పష్టిస్తున్న ముకేష్ అంబానీ కేసు సెగలు పార్లమెంట్ ను తాకాయి. అంబానీ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరిన మహిళా ఎంపీని శివసేన ఎంపీ బెదిరించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్.. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌లోనే తనను ఆయన బెదిరించారని ఆమె ఆరోపించారు. ‘‘మీరు మహారాష్ట్రలో ఎలా తిరుగుతారో నేనూ చూస్తా. మిమ్మల్ని కూడా జైలులో వేసేస్తాం.’’ అంటూ శివసేన ఎంపీ అరవింద్ బెదిరించారని ఎంపీ నవనీత్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  మన్సుఖ్ హిరేన్ హత్య, సచిన్ వాజే వ్యవహరంపై ఉద్ధవ్ సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన బెదిరింపులకు దిగుతున్నారని నవనీత్ కౌర్ ఆరోపించారు. ‘‘ఈ రోజు శివసేన ఎంపీ నన్ను బెదిరించారు. ఈ అవమానం నాకే కాదు. మొత్తం మహిళా లోకానికే అవమానం. అందుకే వీలైనంత తొందరగా ఎంపీ అరవింద్ సావంత్‌ వ్యాఖ్యలపై పోలీస్ దర్యాప్తు చేయించాలి.’’ అని నవనీత్ కౌర్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా నవనీత్ కౌర్ పంపించారు.  అయితే నవనీత్ కౌర్ చేసిన ఆరోపణలపై శివసేన ఎంపీ అరవింద్ స్పందించారు. ‘‘ఆమెను నేనెందుకు భయపెడతాను? నేను బెదిరించే సమయంలో ఆమె చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చెప్పండి. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమాత్రం బాగోలేదు.’’ అని అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు.  అంబానీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఉద్దవ్ థాకరే సర్కార్ పై ఒత్తడి పెరుగుతోంది. మరోవైపు తన పార్టీకి చెందిన హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను మరోసారి వెనకేసుకొచ్చారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. 

తెలంగాణలో స్కూల్స్ క్లోజ్! 

కరోనా విజృంభణతో తెలంగాణలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వైరస్ వ్యాప్తికి ఇవి వాహకాలుగా మారుతున్నాయని భావిస్తున్న వైద్యాధికారులు ఈ సూచన చేశారు. వైద్యశాఖ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నిజానికి పిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో వారికి వైరస్ సంక్రమించినా లక్షణాలు బయటపడవు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతే సరైన పరిష్కారమని చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్ డౌన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని తెలుస్తోంది. పూర్తి స్థాయికి లాక్ డౌన్ అమలుకు అవకాశం లేకపోయినా.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.   

సూర్యాపేటలో కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ.. 100 మందికి గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 2 వేల మంది గ్యాలరీ కూర్చున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చున్న కారణంగానే కూలినట్లు తెలుస్తున్నది. క్రీడాపోటీలను వీక్షించేందుకు స్టేడియంలో మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. మరికాసేపట్లో పోటీలు ప్రారంభకానుండగా ఊహించని ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను 108 సిబ్బంది, పోలీసులు, స్థానికులు అందుబాటులో ఉన్న వాహనాల్లో హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. బాధితులను పరామర్శించేందుకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట ఏరియా దవాఖానకు వెళ్లారు.

ఎమ్మెల్యే ఆర్కే పాపం ఊరికే పోదు...!

గంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇవాళ ప్రభుత్వం చేపట్టిన  ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇరుపక్కల గల నివాసాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసారు. అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికారులు పొక్లెయిన్‌ల సాయంతో కూల్చేశారు. బాధితులు ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారీగా మోహరించిన పోలీసులు బాధితులను పక్కకు నెట్టి వేసి అక్కడ ఉన్న కట్టడాలను పడగొట్టారు. మరోపక్క ఈ విషయంపై బాధితులు గతంలోనే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాగా వారు వేసిన పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ ప్రారంభానికి ముందే  బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక్కడ తాము 40 ఏళ్లుగా ఉంటున్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించకుండా తమ కట్టడాలను ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నించారు. అయితే అధికారులు వారి వాదనను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో టీడీపీ, వాపక్ష నేతలు అక్కడకు భారీగా చేరుకుని బాధితులకు అండగా నిలిచి.. అధికారులను నిలదీశారు. బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాకే ఖాళీ చేయించాలని.. అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అధికారులకు, బాధితులకు అండగా నిలబడిన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం, అధికారుల వ్యవహరించిన తీరుపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. లోకేష్ గెలిస్తే మంగళగిరి లో పేదల ఇళ్లు కూల్చేస్తాడు అని ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసారని.. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదు అని లోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా..  ఎమ్మెల్యే చేసిన ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కట్టని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరిగే వరకూ వారికి టీడీపీ అండగా పోరాడుతుంది లోకేష్ స్పష్టం చేశారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పై కేంద్ర మంత్రి క్లారిటీ..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మికులు, అటు ప్రజలు వివిధ స్థాయిలలో ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. మరోపక్క విశాఖ ఉక్కు నష్టాలను తగ్గించడానికి మిగులు భూములుగా ఉన్న 7 వేల ఎకరాలను అమ్మాలని ఎపి సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్రం నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా స్టీల్‌ప్లాంట్ మిగులు భూములపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది ఇవాళ  లోక్‌సభలో మిగులు భూముల విషయంపై  వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ సమాధానం ఇచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ మిగులు భూములను ప్రైవేట్‌పరం చేసే విషయాన్నికేంద్రం పరిశీలిస్తోందని కేంద్రమంత్రి ఠాకూర్‌ చెప్పారు. అవసరమైన మేరకు స్టీల్‌ప్లాంట్ భూములను ప్రైవేట్‌పరం చేస్తామని అయన ఈ సందర్భంగా చెప్పారు. మిగిలిన వాటిని ఏం చేయాలో ఆ తర్వాత పరిశీలిస్తామని ఠాకూర్ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని అయన అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వేస్తామని అయన స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో మొత్తం 7 వేల ఎకరాల మిగులు భూములు ఉన్నాయని కేంద్రమంత్రి ఠాకూర్‌ తెలిపారు. మొత్తానికి ఇటు ఎపి సీఎం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒకే బాటలో నడుస్తుండడం గమనార్హం.  

మౌనమేలనోయి..? కొండంత కిరికిరి!

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. రెండు చోట్లా కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ప్రతిపక్షాలన్నీ టీఆర్ఎస్‌ను తిట్టి పోస్తున్నాయి. అరాచకాలతో ఎమ్మెల్సీలు గెలిచారంటూ దెప్పిపొడుస్తున్నాయి. రాజకీయంగా ఇంత హడావుడి ఉంటే.. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్‌రెడ్డి మాత్రం పత్తా లేకుండా పోయారు. కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. వారం రోజులుగా వార్తల్లో కనిపించడం లేదు. సమయం, సందర్భం లేకుండా గులాబీ బాస్‌ను ఏకిపారేసే రేవంత్.. కీలక సమయంలో సైలెంట్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.  మొన్నటి వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు రేవంత్. నియోజక వర్గ పరిధిలో పర్యటిస్తూ.. సర్కారు దుమ్ముదులిపారు. చిన్నారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఇలా ప్రచారం ముగిసిందో లేదో.. అలా మాయమైపోయారు. సుదీర్ఘంగా సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్ సమయంలోగానీ, ఫలితాలు వచ్చాక గానీ.. రేవంత్ గొంతు ఎక్కడా వినిపించలేదు. మనిషీ కనిపించలేదు. అసలు రేవంత్ విషయంలో ఏం జరగింది? ఏం జరుగుతోంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సరళితో కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్‌రెడ్డి ముందే గ్రహించారని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఎంత ఎగిరినా ప్రయోజనం లేదనే భావనకు వచ్చారంటున్నారు. తనను పీసీసీ చీఫ్‌ చేసేందుకు అధిష్టానం వెనకాడుతుండటం.. పార్టీలోని సీనియర్లు ఆయనను అస్సలు పట్టించుకోకపోవడం.. వరుస ఓటమిలు.. ఇలా కాంగ్రెస్‌లో ఉంటే ఇంతే అనే వేదాంత ధోరణికి రేవంత్ వచ్చారంటున్నారు.  నిన్నా మొన్నటి వరకు రేవంత్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరగ్గా.. తాజాగా మరో కొత్త టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీలో ఉండటం, చేరటం ఎందుకని.. తానే సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు బలం చేకూరేలా.. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొండా మూడునెలలు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయనే ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తీర్థం తీసుకుంటారంటూ టాక్ నడిచింది. అయితే, సడెన్‌గా ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న పార్టీలో చేరాలా? లేక, కొత్త పార్టీ పెట్టాలా? అనే ఆలోచన చేస్తున్నట్టు స్వయంగా కొండానే క్లారిటీ ఇచ్చారు. దీంతో.. ఆ కొత్త పార్టీ రేవంత్‌రెడ్డిదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, రేవంత్‌కు నమ్మదగిన అనుచరుడు కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్‌ డైరెక్షన్‌లోనే కొండా రాజకీయ ముందడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే రేవంత్ ప్రధాన అనుచరుడు కూనా శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌ను వీడటం, ఆ తర్వాత కొండా హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం సడెన్‌గా జరిగినవి కావని.. వీరిద్దరూ రేవంత్ రాజకీయ పావులంటూ చర్చ జరుగుతోంది. అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు.. తిరిగి అంతా కలిసి రేవంత్ పెట్టబోయే కొత్త పార్టీలో చేరుతారని అంచనా వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారని.. త్వరలోనే ఆ విషయం ప్రకటిస్తారని లీకులు వస్తున్నాయి. అందుకే, ఎలాగూ వదిలేసే పార్టీలో అంతగా హడావుడి చేయడం ఎందుకనే ధోరణితోనే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఆయన మౌనం వెనుక అనేక అర్థాలు ఉన్నాయంటూ.. ఎవరి తోచిన ఊహాగానం వారు చేస్తున్నారు. రేవంత్ మౌనం వీడితేనే.. ఆయన మనసులో మాటేంటో తెలిసేది. అప్పటి వరకూ.. కమాన్ గుసగుస...

నోటీస్ పాలి..ట్రిక్స్! టీడీపీ ఆర్థిక మూలాలే టార్గెట్ 

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ప్రతిపక్ష నేతకు సీఐడీ నోటీసులు. మాజీ ముఖ్యమంత్రిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది జగన్ రెడ్డి సర్కార్. అది కూడా హైకోర్టు గతంలోనే క్లీన్‌చీట్ ఇచ్చిన అమరావతి భూముల కేసులోనే. చంద్రబాబుపై పెట్టిన కేసు చెల్లదని న్యాయ నిపుణులు, టీడీపీ నేతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అయినా హడావుడి చేసిన ఏపీ సీఐడీ.. హైదరాబాద్ వెళ్లీ మరీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని కూడా నోటీసులో హెచ్చరించింది. చంద్రబాబు కేసు, నోటీసుల అంశం తీవ్ర దుమారం రేపింది. అయితే అందరు అనుకుంటున్నట్లే చంద్రబాబుపై పెట్టిన పసలేని  సీఐడీ కేసు విచారణపై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు.       బలం లేదని తెలిసినా చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం వెనక జగన్ రెడ్డి సర్కార్ పెద్ద స్కెచ్చే ఉందనే చర్చ జరుగుతోంది. పక్కా పొలిటికల్ వ్యూహం దాగుందని అంటున్నారు. టీడీపీ ఆర్థిక వనరులను దెబ్బ తీయడం, ఏపీ సర్కార్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లీంచడం, ప్రభుత్వ భూములను అమ్మేయడం, రాజధాని తరలింపు వంటి కీలక అంశాలు దీని వెనుక దాగున్నాయంటున్నారు. చంద్రబాబుకు, టీడీపీ ప్రధాన బలం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలే. అమరావతి పరిధిలోనే చంద్రబాబు సన్నిహితుల వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబుపై కేసు పెట్టడం ద్వారా.. టీడీపీ అనుకూల వ్యాపారులను భయపెట్టి వారి బిజినెస్ దెబ్బ తీయడం ప్రధాన లక్ష్యమంటున్నారు. చంద్రబాబే ఇబ్బందులు పడుతున్నారు ఇక మనమెంత అనే అలోచనకు వచ్చి టీడీపీ మద్దతు వ్యాపారులంతా పక్కకు తప్పుకునేలా చేయాలనే కుట్ర ఉందంటున్నారు.  ప్రకాశం జిల్లాలో ప్రధాన ఆదాయ వనరుగా  ఉన్న మైనింగ్ లీజులన్ని ప్రస్తుతం చంద్రబాబు అనుకూల వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. వాళ్లందరిని భయపెట్టి.. అక్కడి నుంచి పంపించి.. రెడ్డి వర్గానికి చెందిన వారికి మైనింగు లీజులు  అప్పగించాలనే కుట్ర ఉందంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు తెస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు సేకరించిందని కేంద్ర ఆర్థికశాఖ కూడా ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అయినా రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైన పనులకు అడ్డగోలుగా ఖర్చులు చేస్తోంది సర్కార్. అందుకే ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు జగన్ సర్కార్ కొత్త స్కెచ్ వేసిందని, భూములను అమ్మాలని నిర్ణయించిందని తెలుస్తోంది. చంద్రబాబుపై కేసు, నోటీసులతో రాజకీయాన్ని వేడెక్కించి.. జనాలనంతా అటువైపు ఫోకస్ చేసేలా చేసి..  సర్కార్ భూములను గుట్టు  చప్పుడు కాకుండా విక్రయించాలని జగన్ సర్కార్ ప్లాన్ చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే కర్నూల్ అంతరాత్జీయ ఎయిర్ పోర్టు నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అది అమలు సాధ్యం కాదని తెలిసినా... దాని పేరుతో అక్కడి భూముల రేట్లు పెంచి సర్కార్ భూములను అమ్మేయాలన్నది వైసీపీ వ్యూహమనే ప్రచారం జరుగుతోంది.  మూడు రాజధానుల పేరుతో విశాఖ, కర్నూల్ లో తాము అనుకున్నది చేసుకునేందుకు జగన్ రెడ్డి సర్కార్ పక్కా ప్రణాళికలు వేసిందంటున్నారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు రాత్రికి రాత్రి షిఫ్ట్ చేసేందుకు.. చంద్రబాబుకు సీఐడీ నోటీసుల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. రాజధానిని  అమరావతి నుంచి విశాఖకు మార్చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. రాజధాని మార్పు అంశం ఇప్పటికే హైకోర్టులో ఉంది. ఫైనల్ తీర్పు వచ్చే వరకూ అమరావతి నుంచి ఇటుక కూడా కదిలించలేరని రైతులు హెచ్చరిస్తున్నారు. కేపిటల్ మార్పు విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్న సర్కారు.. దాన్ని అమలు చేయలేక అడుగు ముందుకు వేయలేకపోతోంది. హైకోర్టు కేసులు, రైతుల నుంచి నిరసనలు, చంద్రబాబు పోరాటంతో సందిగ్థంలో పడింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాభిప్రాయం తమవైపే ఉందంటూ రాజధాని మార్పుపై జగన్‌రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచబోతోందని తెలుస్తోంది.   చంద్రబాబుకు సీఐడీ నోటీసులతో ప్రతిపక్ష నేతను ముందస్తుగా కట్టడి చేయడం.. విపక్షాన్ని డిఫెన్స్‌లో పడేయడం.. అమరావతి రైతులను భయబ్రాంతులకు గురి చేయడం.. ఇదంతా టాపిక్ డైవర్షన్ స్కీమ్‌లో భాగమే అంటున్నారు విపక్ష నేతలు. టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, సర్కార్ భూములను అమ్మడానికి, అమరావతిని విశాఖకు షిఫ్ట్ చేయడానికి సర్కారు ఆడుతున్న మైండ్ గేమ్ అని అనుమానిస్తున్నారు. ఇదంతా సర్కారు ఆడుతున్న డైవర్షన్ డ్రామాలో భాగమంటూ భగ్గుమంటున్నాయి విపక్షాలు. 

తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్! అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన? 

తెలంగాణలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. స్కూల్స్, కాలేజీలు కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయి. ఏ స్కూల్ లో పరీక్షలు నిర్విహంచినా పదుల సంఖ్య వైరస్ బాధితులు బయటపడుతున్నారు. కరోనా విజృంభణతో కేసీఆర్ సర్కార్ అప్రత్తమైంది. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో వైద్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టాలా వద్దా అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వీకెండ్స్‌లో లాక్‌డౌన్  విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారని, సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైనా మహారాష్ట్రలో కరోనా తీవ్రత భారీగా ఉండటంతో.. ఇక్కడి ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హడలిపోతున్నారు. మరో నెలన్నర రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు సందిగ్ధత ఏర్పడింది.ఇప్పటికే 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్ని పైతరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మంగళవారం అసెంబ్లీలో కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసులతో పాఠశాలల మూసివేతకు సర్కార్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో, ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ‌లను అమలు చేస్తున్నాయి.  మరోవైపు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 337 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1671కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,958 ఉండగా.. వీరిలో 1,226 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 91 కేసులు ఉన్నాయి.

రైతుల పంటకు నిప్పు..  

చేతికి వచ్చిన పంట నోటికాడి రాకముందే.. పంటకు నిప్పు అంట్టించారు.  పాత కక్ష్యలు మనసులో పెట్టుకుని  పంటకు నిప్పు అంట్టించారంటూ బాధితులు గొల్లుమని ఏడ్చారు. గుంటూరు జిల్లా వినుకొండలో పంటలను తగలబెట్టడం కలకలం రేపుతోంది. రెండు రోజులలో  జరిగిన రెండు ఘటనలపై పోలీసులు దృష్టి  పెట్టారు. మందా వెంకటేష్ అనే రైతు రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని అప్పు చేసి మరి  మిరపపంట సాగు చేశాడు. పంట బాగా రావడంతో తన అప్పులన్నీ తీరిపోతాయని భావించాడు. తొలి కోతలోనే 30 క్వింటాల వరకు పంట వచ్చింది. కోసిన మిరప పంటను అంత  పొలంలోనే ఆరబోసాడు. కల్లంలో ఉన్న పంటను కొనడానికి కొందరు వ్యాపారాలు వచ్చి  క్వింటాను రూ. 14,500లకు కొనేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీంతో ప్రత్యర్థులు రైతుపై ఈర్ష్య పడ్డారు. పాత కక్ష్యలను మనసులో పెట్టుకుని మిర్చి పంటకు నిప్పు అంటించారు. అప్పు తీరుందనుకున్న రైతు పంట మొత్తం తగలబడి ముడ్డిదైయింది. ఈ ఘటనతో రైతు వెంకష్ కుటుంబం కుంగిపోయి, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.   అలాగే నరగాయ పాలెంలో రైతు ఎర్రంరెడ్డి అంజిరెడ్డికి చెందిన 9 ఎకరాలు జామాయిల్ తోటకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో తోట పూర్తిగా తగలబడిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.  పోలీసులు అనుమానితుల వివరాలను బాధిత రైతుల నుంచి అడిగి తెలుసుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్ష్యలతోనే రైతుల పంటలను దగ్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు.  

రామా..రావా..? పొలిటికల్ కంత్రీ!

సీఎం. సీఎం. ఇన్నాళ్లూ జగన్‌, పవన్‌ ఫ్యాన్స్‌కే పరిమితం ఈ స్లోగన్. ఇప్పుడు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులూ ఈ నినాదం అందిపుచ్చుకున్నారు. 'తెల్లవారితే గురువారం' ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో జరిగిందీ హడావుడి. జగన్, కల్యాణ్‌ల లెక్క వేరు. జూనియర్ పరిస్థితి వేరు. సీఎం, సీఎం అంటూ అభిమానులు అరుస్తుంటే.. జగన్, పీకేలు మౌనంగా ఉండేవారు. ఒకరకంగా ఆ స్లోగన్స్‌ను ఎంకరేజ్ చేసేవారు. కానీ, ఎన్టీఆర్ అలా కాదు. ఆగండి బ్రదర్.. అంటూ ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యారు. పదాలు ఎక్కువగా వాడకున్నా.. ఆయన ముఖంలో, ఆ మాటలో కోపం కొట్టొచ్చినట్టు కనిపించింది.  తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఆ సెగ తగిలింది. బాబు కుప్పం పర్యటనలో టీడీపీ శ్రేణులు జూనియర్‌ను రాజకీయాల్లో దింపాలంటూ అధినేత సమక్షంలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటి నుంచి రామారావు రాకపై ఆసక్తి నెలకొంది. కట్ చేస్తే.. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో నేరుగా ఎన్టీఆర్‌నే పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు జర్నలిస్టులు. ఇది సమయం కాదంటూ అప్పుడు మాట దాటేశారు జూనియర్. ఈసారి మాత్రం మరింత సీరియస్ అయ్యారు. అప్పుడు మీడియా కాబట్టి కాస్త రెస్పెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చిన బుడ్డోడు.. ఇప్పుడు తన అభిమానులను ఒక్క డైలాగ్‌తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి నోరు మూయించారు. జూనియర్ రియాక్షన్ చూస్తుంటే ఆయనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం అసలే మాత్రం ఇష్టం లేనట్టే కనిపిస్తోంది. అక్కడ జరిగేది సినిమా ఫంక్షన్ కాబట్టి ఫ్యాన్స్‌ను వారించాలంటే అంత ఆగ్రహంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టే.. తనను పదే పదే సీఎం సీఎం అంటుంటే అంత అసహనానికి లోనయ్యారని అంటున్నారు. ఆ విషయాన్ని ఇక్కడితోనే ముగిస్తే మంచిదని.. మౌనంగా ఉంటే ముందుముందు మరింత ముదురుతుందని జూనియర్ భావించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే.. జగన్, పవన్‌ల మాదిరి కాకుండా.. ఫ్యాన్స్ సీఎం సీఎం అనగానే సీరియస్‌గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.  టీడీపీ ప్రాభవం తగ్గినా.. ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించేదేమీ ఉండకపోవచ్చు. చంద్రబాబు ఇంకో పదేళ్లయినా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగలరు. ఆయన వారసులుగా లోకేవ్, బాలకృష్ణలు ఉండనే ఉన్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయనకు వెండితెరపై మరింత మంచి భవిష్యత్ ఉంది. అర్జెంట్‌గా పొలిటికల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. అంతలా సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే.. మరో పది, పాతికేళ్ల తర్వాత రాజకీయ ఆలోచన చేయొచ్చు. అందుకే.. ఆలూ లేదు సూలూ లేదు.. హడావుడిగా సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్‌కు చిర్రెత్తుకొచ్చి.. అలా కోపంగా.. ఆగండి బ్రదర్స్ అంటూ అదుపు చేశారని అంటున్నారు. అభిమానులు రామారావును రాజకీయాల్లోకి రా..రా.. అంటుంటే.. జూనియర్ మాత్రం రానురాను నేనురాను ఒగ్గేయమంటూ.. తప్పించుకుంటున్నారు. 

తాండూర్ ఎమ్మెల్యేది దొంగ ఓటే! 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా వికారాబాద్ జిల్లాలో ఓట్ల పంచాయతీ కొనసాగుతోంది. తాండూర్‌లో దొంగ ఓట్ల వ్యవహారం మరింత ముదురుతోంది.మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న ఓటు వ్యవహారంలో దుమారం రేగుతుండగానే తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా దొంగ ఓటు వేశాడని   కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. అమెరికాలో పైలెట్ శిక్షణ పొందిన రోహిత్ రెడ్డి... మన దేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ అర్హత లేని చదువుతో ఓటు వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది కూడా దొంగ ఓటేనన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దొంగ ఓట్లు వేసిన తాండుర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తను పట్టభద్రురాలు కాదని తెలిసి దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నను పదవి నుంచి బర్తరప్ చేయాలని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు.. అధికారులను ప్రలోభాలకు గురి చేయడంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారన్నారు. అమె దొంగ ఓటు వేడయడం నేరమని.. స్వప్నపై కఠిన చర్యలు తీసుకొవాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. 

జగన్ కు వెన్నుపోటు తప్పదా?

ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్షాలకు A2. జగన్మోహన్‌రెడ్డి తర్వాత వైసీపీలో నెంబర్ 2. జగన్‌కు కావలసిన పనులన్నీ.. జగన్‌తో కాని పనులన్నీ.. చేసేది, చేయించేది విజయసాయినే. ఢిల్లీలో పార్టీ తరఫున చక్రం తిప్పేది.. వ్యవహారం చక్కబెట్టేది ఆయనే. పార్లమెంట్ లాబీలో ప్రధాని మోదీనే ఆగి మరీ.. రెడ్డి గారూ బాగున్నారా? అని పలకరించేటంత పాపులారిటీ. జగన్ హస్తిన పర్యాటన ఖరారు చేసేది.. కేంద్ర పెద్దలతో సమావేశాలు సెట్ చేసేది విజయసాయిరెడ్డే. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌లో తెర వెనుక కార్యకలాపాలు చక్కబెట్టేది, సెటిల్మెంట్లు చేసేది నెంబర్ 2నే. జీవీఎమ్సీ ఎన్నికల్లాంటి లోకల్ పాలిటిక్స్‌లోనూ ఆయనదే కీరోల్. ఇదంతా పైకి కనిపిస్తున్న సంగతి. కానీ, లోలోన విజయసాయి సైతం రాజకీయ చదరంగంలో రాజుకు చెక్ పెట్టే పావే అంటున్నారు. కేంద్ర పెద్దలతో అత్యంత సన్నిహితం. ప్రధాని మోదీకి సైతం ఎంతో హితం. మంత్రులందరి దగ్గర చొరవ. ఈ గౌరవమంతా జగన్‌రెడ్డిని చూసి కాదని.. విజయసాయికే అంత ప్రాధాన్యత అని అంటున్నారు. ఎందుకంటే.. ఆయన వైసీపీ నేతకంటే కూడా బీజేపీకి బినామీ లీడర్ అని చెబుతున్నారు. అవును, విజయసాయి బీజేపీ మనిషేనట. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఆయనపై ఉన్న కేసులతో ఇప్పటికే విజయసాయిని దారికి తెచ్చుకున్నారట బీజేపీ పెద్దలు. అవసరం వచ్చినప్పుడు వాడుకునేలా  వ్యూహం సిద్ధం చేశారని చెబుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీలో ఉంటూనే రెబెల్‌గా లౌడ్ వాయిస్‌తో రెచ్చిపోతుండటం బీజేపీ ప్లాన్‌లో భాగమే. అదే.. విజయసాయి విషయం వచ్చే సరికి మరో రకమైన వ్యూహం అమలు చేస్తోంది కాషాయం పార్టీ. జగన్ వెన్నంటే ఉంటూ.. జగన్‌కు నమ్మినబంటులా, నమ్మశక్యంగా వ్యవహరిస్తూ.. సమయం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడిచేలా.. టైంబాంబు సెట్ చేసిందని అంటున్నారు.  యావత్ దేశం కాషాయమయం చేయాలనేది బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక. ఉత్తరాదిన మాంచి ఊపుమీదున్న కమలదళం.. దక్షిణాదిలో మాత్రం బాగా ఇబ్బంది పడుతోంది. ప్రాంతీయ పార్టీల పట్టు ఎక్కువగా ఉండటంతో.. ఒక్కో స్టేట్‌లో ఒక్కో రకమైన గేమ్ ప్లాన్ అమలు చేస్తోంది. తెలంగాణలో టగ్ ఆఫ్ వార్ ఫైట్ చేస్తూ కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తుంటే.. ఏపీలో మాత్రం వేచి చూసే స్ట్రాటజీ అమలు చేస్తోంది. ముందు స్నేహం. ఆ తర్వాత వైరం. అందులో భాగంగా ముందు వైసీపీతో కాస్త స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. ప్రజల్లో బీజేపీపై సానుకూల వైఖరి వచ్చాక.. సరైన సమయంలో.. సరైన రీతిలో జగన్‌ను తొక్కేసేలా స్కెచ్ రెడీ చేసిందట. తప్పించుకోలేని రీతిలో.. కేసులపై కేసులతో.. పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిన జగన్మోహన్‌రెడ్డికి ఉచ్చు బిగించడం చాలా సింపుల్ అని కమలం నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.  అయితే బీజేపీనే అలా చేసిందనే అపవాదు రాకుండా విజయసాయిరెడ్డితో మైండ్ గేమ్ ఆడిస్తోందని ఢిల్లీ వర్గాల సమాచారం. విజయసాయిని అప్రూవల్‌గా మార్చేసుకొని.. ఆయన్ను ముందుంచి.. వైసీపీని చీల్చేసి.. జగన్‌ను తప్పించాలన్నదే.. బీజేపీ ఎత్తుగడ అంటున్నారు. అందుకే, విజయసాయిరెడ్డికి ఢిల్లీలో అంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఆయన జగన్మాయ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికైతే విజయసాయి జగన్ మనిషే.. మరి, ముందుముందు జగన్‌ను ముంచే మనిషి కావడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

మ్యాట్రి మోనీలో ఫేక్ ప్రొఫైల్..  30 లక్షలు మోసం.  

పూర్వం పెద్దలు పెద్దలు తెచ్చిన సంబంధాన్ని తల వంచుకుని మనుమడేవాళ్లు .. పెళ్లి సంబంధం కాయం చేయడం అంటే.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు. ఒక సామెత కూడా ఉంది. కాలం మారింది. పెళ్లి చేసుకునే వాళ్ళ ఆలోచనలు మారాయి. సాంప్రదాయ బంధంగా చేసుకోవాల్సిన పెళ్లి చూపులు సైట్, స్కైప్ లలో చేసుకుంటున్నారు. పద్ధతులు, పచ్చని తోరణాలు, పది మంది మధ్యలో జరగాల్సిన పెళ్లిళ్లు  ఫంక్షన్ హాల్స్ లకు పరిమితం చేశారు. అమ్మ నాన్నల్ని నమ్ముకుని పెళ్లి చేసుకునే వాళ్ళు సైట్లను నమ్ముకుని మోసపోతున్నారు.  సాఫ్ట్ వేర్ ఇంజినీర్  నంటూ మ్యాట్రి మోనీ వెబ్ సైట్ ద్వారా అమ్మాయి కుటుంబంతో సంబంధం కలుపుకొని... అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలకు అబ్బాయి ప్రొఫైల్ నచ్చడంతో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. కట్నం కిందికి భారీగానే కోరాడు మనోడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాబట్టి మా కూతురు హ్యాపీ ఉంటుందని అందరి తల్లి దండ్రులు ఆలోచించినట్లే ఆలోచించారు ఆ తల్లీదండ్రులు.. అతను అడిగిన మొత్తానికి కట్నం గా ఒప్పుకున్నారు. ఇక అంతే పెళ్లి అవ్వక ముందుకే అతని పంట పండింది. సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందే మొత్తం డబ్బులు తీస్కుని మండపం నుంచి పరారైయ్యాడు ఘరానా పెళ్లి కొడుకు.  చెందిన నిందితుడు రాజు  ( పేరు మార్పు) మ్యాట్రి మోనీ వెబ్ సైట్ ద్వారా అమ్మాయిలను వలలో వేస్తూ.. వారి కుటుంబంతో పెళ్లి మాటామంతి కలిపి కట్నం డబ్బులు చేతిలో తళుక్కుమనగానే అక్కడి నుంచి జంపుజిలానీ చేసిన దాఖలాలు అనేకం. అయితే తాజాగా బాధితురాలు హారిక సింగ్ (పేరు మార్పు) కుటుంబంతో మ్యాట్రి మోనీ వెబ్ సైట్ ద్వారా తన కూతురుకి సంబంధాలు వెతుకుతుండగా, నిందితుడు రాజు తన ఫేక్ ప్రొఫైల్ తో  వారికి పరిచయం అయ్యాడు. తానొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, ఉన్నత కుటుంబానికి చెందిన వాడినంటూ వారందరినీ నమ్మించాడు. తనకు కట్నకానుకల కింది 30 లక్షల నగదు, బంగారం కావాలని డిమాండ్ చేశారు. మంచి సంబంధం అని నమ్మిన అమ్మాయి తల్లిదండ్రులు సంబంధం ఓకే చేసుకొని నిశ్చితార్థం చేశారు.  ఇంకే ముంది రాజుకి ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అనుకున్నాడు.. కట్నం కింద డబ్బు..  నిశ్చితార్థం కింద హారిక దొరకడంతో చెట్టాపట్టాలు వేసుకొని సినిమాలు, షికార్లు అంటూ హారికతో ఫుల్ ఎంజాయ్ లో  మునిగి తేలాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ, తనకు కట్నం డబ్బులు కావాలని హారిక ఫ్యామిలీని బలవంత పెట్టాడు. దాంతో వాళ్ళు పెళ్లికి ఒక రోజు ముందు మొత్తం నగదు ఇస్తామని హారిక తల్లిదండ్రులు చెప్పారు. పెళ్లి ముందు రోజు రాత్రి జరిగిన వేడుకల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు మొత్తం రూ.30 లక్షల నగదును రాజు చేతిలో పెట్టారు. ఏదైతేనేమి కూతురికి మంచి సంబంధం, సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉన్న మొగుడు దొరికారాని అనుకున్న ఆ తల్లి దండ్రులు సంతోషాన్ని తెల్లవారితే లేకుండా చేశాడు. తెల్లవారితే పెళ్లి అని ఎవరి పనులోవాళ్ళు మునిగి ఉండగా. పొద్దునే రాజు మొత్తం డబ్బులు తీస్కుని. మారువేషంలో పెళ్లి మండపం నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. 

ప్రగతి భవన్ కు ఈటల.. కేటీఆర్ రాయబారం

తన సొంత నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్ పై  ఈటల తిరుగుబాటు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకునే రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీసీ ఎజెండాతో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఈటల ఉన్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈటల వ్యాఖ్యలు అసెంబ్లీలోనూ హాట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీతో పాటు విపక్ష సభ్యులంటూ దీని గురించి మాట్లాడుకోవడం కన్పించింది.  ఈటల వ్యాఖ్యలతో టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైందని తెలుస్తోంది. TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అసెంబ్లీ నుంచి మంత్రి ఈటెల రాజేందర్ ను వెంట బెట్టుకొని ప్రగతి భవన్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.ఆదివారం వీణవంక దగ్గర ఈటెల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతుండటంతో  ఆయన నుంచి వివరణ కోసం KCR.. ఈటలను పిలిపించి ఉంటారని కథనం వినిపిస్తోంది. ఈ వివాదానికి తెర దించడానికి స్వయంగా KTR రంగంలోకి దిగి  రాయబారం నడుపుతున్నట్టుగా కూడా చెబుతున్నారు.  ఆదివారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఈటల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదంటూ ఈటల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా మనసు మార్చుకోలేదని.. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ మరింత మంట రాజేశారు రాజేందర్. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారన్నారు. మరి, అంత ఎత్త్తు నుంచి ఈటలను సడెన్‌గా కిందకు పడేసింది ఎవరు? వరుసగా ఆయన చేస్తున్న కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్  ఎవరిని ఉద్దేశించి? ఈటల పార్టీ వీడతారని.. కొత్త పార్టీ పెడతారనే ప్రచారంలో నిజమెంత? ఇలా ఈటల విషయంలో రాజకీయ మంట ఎగిసిపడుతోంది.  కేసీఆర్‌కు, ఈటలకు చెడిందని.. మంత్రి రాజేందర్‌ను ముఖ్యమంత్రి పూర్తిగా పక్కన పెట్టేశారని అంతా అంటున్నారు. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఈటలకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలకు కూడా ఆయన్ను పిలవలేదు. కొత్త పార్టీ పెట్టడం పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదంటూ గతంలో గులాబీ బాస్ చేసిన కామెంట్లు సైతం ఈటలను ఉద్దేశించే అంటున్నారు. గులాబీ జెండాకు అసలైన ఓనర్లం మేమేనంటూ గతంలో ఈటల చేసిన హాట్ కామెంట్స్‌పై ఇంకా హాట్ హాట్ డిష్కషన్ జరుగుతోంది. తాజాగా, ఎమ్మెల్సీ ఫలితాలు తర్వాత మరోసారి ధర్మం, న్యాయం, కులం, డబ్బు అంటూ రాజేందర్ పేల్చిన డైలాగులు దుమ్మురేపుతున్నాయి.   

తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు అయినట్లేనా ....!

ఏపీలో తిరుపతి ఉపఎన్నిక హడావిడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించగా జనసేన బీజేపీ కూటమి తరుఫున బీజేపీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో ఈ ఎన్నిక కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్న బీజేపీ మాత్రం తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారికీ కేంద్రంలో మంత్రి పదవి గ్యారంటీ అంటూ  పార్టీ ఏపీ ఇన్చార్జి సునీల్ దేవ్ ధర్  ప్రకటన కూడా చేసేసారు. ఈ విహాయన్ని పార్టీ శ్రేణులు ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. అయితే ఇప్పటివరకు తమ అభ్యర్థి పేరును మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇది ఇలా ఉండగా  తిరుపతి అభ్యర్థి కోసం పలువురు రిటైర్డ్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఐతే ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి  దాసరి శ్రీనివాసులు ను అభ్యర్థిగా రంగంలోకి  దింపుతారని కూడా ప్రచారం జరిగింది. ఇంతలో  ఏమైందో ఏమో కానీ.. కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరు తాజాగా పరిశీలనకు వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం వీరిద్దరితోపాటు మరి కొంతమంది పేర్లతో ఒక లిస్ట్ ను  అధిష్టానానికి పంపిందని ఇక దీనిపై బీజేపీ అధిష్టానం త్వరలో ఒక  నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి  రత్నప్రభ పేరు ఖరారు అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.    

కేసీఆర్ కు ఇక తీన్మారేనా.. ఏకమవుతున్న బీసీ నేతలు! 

అధికార పార్టీ ఖాతాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు. ఆ ఆనందం ఎక్కువ సేపు ఉంచకుండానే మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్లు. అటు ఎమ్మెల్సీగా ఓడి గెలిచిన తీన్మార్ మల్లన్న జోరు. వరుస పరిణామాలు అనుకోకుండా జరిగాయా? అంతా వ్యూహాత్మకమా? అనే అనుమానం. రాజకీయాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే.. అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీసీ నినాదంతో తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందా? మంత్రి ఈటల,  బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యలతో పాటు  అన్ని పార్టీలకు చెందిన అసంతృప్తులు ఒకే జెండా కిందకు రాబోతున్నారా? వారందరి ఏకైక ఎజెండా కేసీఆర్‌ను గద్దె దించడమేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీసీ నేతలకు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. వీళ్లంతా బడుగు, బలహీనవర్గాల అజెండాతో ముందుకు రాబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓడినా.. ఆయనలో జోష్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఉత్సాహం మరింత పెరిగింది. యూట్యూబ్ నుంచి స్టేట్ పాలిటిక్స్‌ను యూటర్న్ తిప్పేంత ఛరిష్మా వచ్చింది. మల్లన్నకు వచ్చిన ఓట్లు.. ఆయనకు లభించిన ఆదరణ.. రాజకీయ పార్టీలకు నమ్మశక్యం కానిది. వారికి సైతం అసాధ్యమైనది. ఈమధ్య కాలంలో ఇంతటి క్రేజ్ మరే నేతకు వచ్చి ఉండకపోవచ్చు. ఆ ఉప్పెనలాంటి వెల్లువను.. సునామీలా మార్చి.. సర్కారును అమాంతం ముంచేయాలని ఎత్తుగడలు వేస్తున్నారు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఓటమి తర్వాత విజయోత్సవంతో మల్లన్న చేసిన స్టేట్‌మెంట్స్ సైతం అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని.. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే వరకూ.. సామాన్యుడు సీఎం సీట్లో కూర్చొనే వరకూ పోరాటం ఆపేది లేదంటూ గర్జించారు. మరి.. ఆ సామాన్యుడు ఎవరు? తీన్మార్ మల్లనే..నా?  ఒకవైపు మల్లన్న గర్జన కొనసాగుతుండగానే.. అదే టైమ్‌లో అల్లంత దూరాన.. మంత్రి ఈటల రాజేందర్ మరింత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈటల వ్యాఖ్యలు ఈమధ్య కాలంలో రొటీనే అయినా.. ప్రస్తుత సమయం, సందర్భంతో రాజకీయంగా మరింత కలకలం. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదంటూ ఈటల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా మనసు మార్చుకోలేదని.. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ మరింత మంట రాజేశారు రాజేందర్. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారన్నారు. మరి, అంత ఎత్త్తు నుంచి ఈటలను సడెన్‌గా కిందకు పడేసింది ఎవరు? వరుసగా ఆయన చేస్తున్న కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్  ఎవరిని ఉద్దేశించి? ఈటల పార్టీ వీడతారని.. కొత్త పార్టీ పెడతారనే ప్రచారంలో నిజమెంత? ఇలా ఈటల విషయంలో రాజకీయ మంట ఎగిసిపడుతోంది.  కేసీఆర్‌కు, ఈటలకు చెడిందని.. మంత్రి రాజేందర్‌ను ముఖ్యమంత్రి పూర్తిగా పక్కన పెట్టేశారని అంతా అంటున్నారు. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఈటలకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలకు కూడా ఆయన్ను పిలవలేదు. కొత్త పార్టీ పెట్టడం పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదంటూ గతంలో గులాబీ బాస్ చేసిన కామెంట్లు సైతం ఈటలను ఉద్దేశించే అంటున్నారు. గులాబీ జెండాకు అసలైన ఓనర్లం మేమేనంటూ గతంలో ఈటల చేసిన హాట్ కామెంట్స్‌పై ఇంకా హాట్ హాట్ డిష్కషన్ జరుగుతోంది. తాజాగా, ఎమ్మెల్సీ ఫలితాలు తర్వాత మరోసారి ధర్మం, న్యాయం, కులం, డబ్బు అంటూ రాజేందర్ పేల్చిన డైలాగులు దుమ్మురేపుతున్నాయి. తీన్మార్ మల్లన్న, ఈటల రాజేందర్.. ఆర్ కృష్ణయ్య  ఈ ముగ్గురు బీసీలకు రాజ్యాధికారం తీసుకురావడమే లక్ష్యంగా కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈటల పార్టీ పెడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. మల్లన్న మేటర్ ఇప్పుడు కొత్తగా జత కలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు వచ్చిన ఓట్లు చూసి ఆయనలో కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగింది. ప్రజా మద్దతుతో వెయ్యేనుగుల బలం వచ్చినట్టైంది. దీంతో.. మరో పార్టీలో చేరి మామూలు లీడర్‌గా ఓ మూలన పడుండే బదులు.. సొంత పార్టీ పెట్టుకొని కింగ్‌లా కొనసాగడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. కేసీఆర్‌ లాంటి కొండను ఢీకొట్టాలంటే.. సింగిల్‌గా కాకుండా ఓ పార్టీగా.. ఓ జెండాతో ప్రజల్లోకి వెళితే మరింత మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే, కుదిరితే తానే సొంతంగా పార్టీ పెట్టడమో.. లేదంటే, టీఆర్ఎస్ అసంతృప్తి నేత ఈటల రాజేందర్‌తో కలిసి.. బీసీ ఎజెండాతో కొత్త పార్టీతో.. ప్రజలను సమీకృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఎలా చూసినా.. త్వరలోనే తెలంగాణ గడ్డ మీద కొత్త పార్టీ పొద్దు పొడవడం ఖాయమే.. 

ఊరించి.. విసిగించి.. కడుపు మండించి.. పీఆర్సీ పాలిటిక్స్! 

ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ. సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగులు హర్షం. ఇది రొటీన్. పైకి కనిపిస్తున్నది ఇదే. కానీ, వాస్తవంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈ పీఆర్సీని మనస్పూర్తిగా ఆనందించ లేకపోతున్నాడు. హమ్మయ్య ఇప్పటికైనా ఎంతో కొంత పీఆర్సీ వచ్చిందంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు అంతే. డౌట్ ఉంటే.. మీ పక్కనున్న ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగినైనా కదిపి చూడండి. మీకే తెలుస్తుంది వారి మనోగతం. పీఆర్సీ ప్రకటించినా ఉద్యోగులు ఇంత డల్‌గా ఉండటానికి అనేక రీజన్స్.  ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్ ఇప్పటిది కాదు. రెండేళ్లుగా నాన్చుతూ వచ్చిన వేతన పెంపు ఇప్పటికిలా కొలిక్కివచ్చింది. గత టర్మ్ తుది దశలోనే.. త్వరలో పీఆర్సీ అంటూ ఉద్యోగులను ఊరించారు కేసీఆర్. ఆ తర్వాత సడెన్‌గా అసెంబ్లీ రద్దు చేయడం.. పీఆర్సీ ప్రకటించకుండానే.. ఎన్నికలకు వెళ్లడంతో అప్పటి నుంచి కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు ఉద్యోగులు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.. ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయనే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం జరిగింది. అయితే, అసెంబ్లీ ఎలక్షన్‌లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలవడంతో.. అప్పటి నుంచి ఉద్యోగులు పీఆర్సీపై నోరు మెదపలేని పరిస్థితి. కాలం గిర్రున తిరిగి.. దుబ్బాక, జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి షాక్ తగలడంతో కేసీఆర్ డిఫెన్స్‌లో పడ్డారు. ప్రజా వ్యతిరేకతతో పాటు ఉద్యోగుల కడుపు మంటను ఆలస్యంగానైనా గుర్తించారు. అంతకు ముందు.. పీఆర్సీ కమిటీ సిఫార్సు విషయంలో పెద్ద పొలిటికల్ డ్రామానే నడిపారు ముఖ్యమంత్రి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మొదట్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలే వీచాయి. రెండు సీట్లలోనూ ఓడిపోతామనేంతగా గులాబీ బాస్‌లో భయం పుట్టింది అంటారు. అందుకే, ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ పేరుతో విభజించి, కన్ఫ్యూజ్ చేసి.. సీఎం కేసీఆర్ ఓట్లు దండుకునే స్ట్రాటజీ అప్లై చేశారని అంటారు.  అధికార పార్టీకి చెందిన మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు వేరు, ఉపాధ్యాయులు వేరు అంటూ వరుస కథనాలు ప్రచురించి, ప్రచారం చేసి టీచర్లను డిఫెన్స్‌లో పడేశారు. ఆ కన్ఫ్యూజన్ కొనసాగుతుండగానే 7 శాతం పీఆర్సీ కమిటీ రిపోర్డు ఇవ్వడం మరింత కలకలం రేపింది. కావాలనే, అతి తక్కువగా 7శాతం మంటూ ఉద్యోగులను భయాందోళనలకు గురి చేశారని చెబుతారు. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గర పడటంతో మరో రకమైన బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కూడా నడిచాయి. అవంతా ఆఫ్ ది రికార్డ్. ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాల నేతలను సీఎం కేసీఆర్ పిలిపించుకున్నారట. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో గనుక టీఆర్ఎస్ ఓడిపోతే.. పీఆర్సీ మరింత లేట్ చేస్తామని.. అది కూడా 7శాతం మాత్రమే ఇస్తామని.. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఫిట్మెంట్ ప్రకటిస్తామని డీల్ కుదుర్చుకున్నారట. ఈ విషయం అప్పట్లో ఉద్యోగ సంఘాల వాట్సప్ గ్రూపుల్లో తెగ వైరల్ అయిందని చెబుతున్నారు. ఉద్యోగులంతా అధికార పార్టీకే ఓటు వేసేలా సంఘం నేతలు ఒత్తిడి తెచ్చారని అంటారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు టీఆర్ఎస్‌కి ఓటు వేశారో లేదో తెలీదు కానీ, ఎలా గోలా అతికష్టం మీద రెండు ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీ గెలుచుకోవడంతో కేసీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. అందుకే, ఫలితాలు వచ్చిన వెంటనే ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్  ప్రకటించి.. రిటైర్‌మెంట్ వయసు పెంచి.. ఉద్యోగులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. ముందుముందు నాగార్జున సాగర్ బై పోల్‌తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ సైతం ఉండటంతో ఉద్యోగులతో పెట్టుకుంటే.. మరీ తెగేదాక లాగితే.. అసలుకే ఎసరు వస్తుందని భావించిన కేసీఆర్.. పీఆర్సీ ప్రకటనతో నష్ట నివారణ చర్యలు చేపట్టారనేది ఉద్యోగుల భావన. అయితే.. ఎంప్లాయిస్ 45శాతానికి పైగా పీఆర్సీ డిమాండ్ చేస్తే.. కమిటీ 7శాతం సిఫార్సు చేస్తే.. మధ్యస్థంగా 30శాతంతో సరిపెట్టారు సీఎం కేసీఆర్. అందుకే, పెరిగిన పీఆర్సీపైనా ఉద్యోగులు అంత సంతృప్తిగా లేరంటున్నారు. రెండేళ్లు ఊరించి.. విసుగు పుట్టించి.. కడుపు మండించి.. చివరాఖరికి ఇంత ఆలస్యంగా.. ఎంతో కొంత పెంచిన ముఖ్యమంత్రిపై ఇప్పటికీ ఉద్యోగులు ఆగ్రహంగానే ఉన్నారని అంటున్నారు.

వదినను చంపిన మరిది.. ఎందుకంటే..?

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. సొంత వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తులకు నా అనుకున్న వాళ్లపైనే యమా పాశాలుగా మారుతున్నారు కొందరు దుండగులు. నిత్యం  ఎక్కడో ఒక చోట ఇలాంటి  సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్‌లో ఓ మహిళను సొంత మరిది కొబ్బరి బొండాల కత్తితో హతమార్చాడు.  వివరాల్లోకి వెళితే జహీరాబాద్ మండలం పస్తాపూర్ పంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు షబానాబేగం.  భర్త జహంగీర్ సోదరులైన యాకూబ్, ఖాజాల మధ్య ఆదివారం రాత్రి భూ వివాదం గొడవ జరిగింది. వారిద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఖాజా.. కొబ్బరి బొండాలు నరికే కత్తితో బేగంపై దాడి చేసి. మెడపై కత్తి పడటంతో షబానా అక్కడికి అక్కడే కుప్పకూలి పడిపోయింది.  కత్తి వేటుకు గాయపడిన షబానాను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.  మార్గం మధ్యలోనే  షబానా మృతిచెందింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎస్‌ఐ వెంకటేశ్ ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు. 

25 ఏళ్ళ యువతి.. పిల్లవాడిని టెర్రస్ పై..  

కాలం సైన్స్, టెక్నాలజీ అంటూ ముందుకు వెళ్తుంటే. కాలంతో ఆలోచించాల్సిన మనిషి ఆలోచన మాత్రం ఇంకా మంత్రాలు విష్వవాసాల దగ్గరే ఉన్నాయి. ఇంకా అనాగరిక   సమాజంలోనే బతుకుతున్నారు. ఇంకా పాత చింకాకాయ పచ్చడి అనే నాటి మూఢనమ్మకాలనే ఇప్పటికి నమ్ముతూ మూర్ఖంగా బతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో  చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ ఉన్నత విద్య వంతుల కుటుంబం మూఢనమ్మకాల బారిన పడి తమ కుటుంబాన్నిసర్వనాశనం చేసుకున్న విషయం తెలిసిందే. విద్యాబుద్ధులు చెప్పే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తమ కుమార్తెలను మూఢ నమ్మకాల పేరుతో  కడతేర్చారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆ సంఘటన మరుగున పడకముందే  తాజాగా మరో మూఢ సంఘటన వెలుగులోకి వచ్చింది. తనకు పిల్లలు పుట్టడం లేదంటూ ఓ మహిళా ఓ బాబాను ఆశ్రయించింది. వైద్యులను కలిసి ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన ఆమె, మూఢనమ్మకాల వలలో చిక్కుకుపోయి. దారుణానికి పాల్పడి చివరకు చెరసాల  పాలయింది. ఆమెకు సంతానం కాలేదు. అందుకు పక్కింటి  పసివాడి ప్రాణాలు తీసింది. ఆమెకు 25 ఏళ్ళు.  2013వ సంవత్సరంలో పెళ్లయింది. పెళ్లయి ఎనిమిదేళ్లవుతున్నా ఆమె అమ్మ అనే పిలుపుకు నోచుకోలేదు. ఈ విషయం పై అతింట్లో తీవ్ర ఒత్తిడిని ఆమె ఎదురుకుంది.  ఏంచేయాలనే ఆలోచనే ఆమెను తరిమింది. దాంతో  ఏం చేయాలో ఆమెకు తోచలేదు. తెలిసిన వాళ్ల సలహాతో నాలుగేళ్ల క్రితం అదే నగరంలోని ఓ తాంత్రికుడిని కలిసింది. తన సంతానం సమస్య గురించి వివరించి మొరపెట్టుకుంది. తనకు త్వరగా సంతాన భాగ్యం కలిగేలా చూడామణి మాంత్రికుడిని కోరింది. దీనికి అతడు బాగా ఆలోచించి అందుకు ఒకే ఒక్క మార్గం ఉందని హితబు పలికాడు.  ఎవరైనా చిన్న పిల్లాడిని బలి ఇచ్చి అమ్మవారికి రక్త తర్పణం చేస్తే త్వరగా సంతానం కలుగుతుందని. తనకు ఉన్న శని తొలగిపోవడానికి ఇదొక్కటే మార్గం. అంటూ మాయమాటలు చెప్పాడు. అంతే ఈ విషయం పై మొదట్లో ఆమె భయపడింది. పిల్లలు లేకున్నా పర్లేదులే, పసి ప్రాణాన్ని తీయడం ఎందుకని అనుకుంది. కానీ, ఇటీవల సంతానం గురించి అత్తారింట్లోనూ,  అటు ఇరుగు పొరుగు వారితో వస్తున్న ఒత్తిళ్లను ఆమె భరించలేకపోయింది. ఇక అంటే మాంత్రికుడు చెప్పిన పథకానికి సిద్ధం అయింది. తన పక్కింట్లోనే ఉండే మూడేళ్ల పిల్లాడిని ఎవరూ చూడకుండా ఇంటి పైకి తీసుకెళ్లింది. అక్కడే ఆ పిల్ల వాడిని  చంపేసి. ఆ తర్వాత శవాన్ని ఓ బ్యాగులో పెట్టి మూట కట్టింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లవాడి  శవాన్ని మాయం చేయాలని భావించింది. కానీ ఈ లోపే ఆ బాలుడి తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి చుట్టుపక్కల వెతకడం మొదలు పెట్టారు. పక్కింటి టెర్రస్ పై ఓ బ్యాగు ఉండటంతో అనుమానంతో ఆ బ్యాగును ఓపెన్ చేస్తే అసలు విషయం బయట పడింది. పోలీసుల ఎంట్రీతో ఆమె గుట్టు రట్టయింది. ఆమెతోపాటు, ఆ తాంత్రికుడిని కూడా పోలీసులు కటకటాల్లోకి నెట్టేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ నగరంలో  జరిగింది.