61పై ఆగ్రహం.. నిరుద్యోగులకు శాపం!
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61ఏళ్లు. దేశంలోని అనేక రాష్ట్రాల్లోకెల్లా ఇది అత్యధిక వయసు. కేంద్ర ఉద్యోగులకు సైతం 60ఏళ్లు. పీఆర్సీ కమిటీ సైతం 60 వరకే సిఫార్సు చేసింది. కేసీఆర్ మాత్రం 61ఏళ్లకు పెంచారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీ అంటూ.. ఎవరూ అడగకపోయినా.. బిస్వాల్ కమిటీ సిఫార్సు చేయకపోయినా.. ఈ నిర్ణయం తీసేసుకున్నారు. ఉద్యోగులంతా ఖుషీ ఖుషీ. ఎంచక్కా 61ఏళ్ల వరకూ ఉద్యోగం చేసుకోవచ్చు.. దండిగా జీతం తీసుకోవచ్చు అంటూ ఫుల్ హ్యాపీ.
రిటైర్మెంట్ ఏజ్ 58 నుంచి 61కి పెంచడంతో.. ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న వారు మరో మూడేళ్ల పాటు అదనంగా ఉద్యోగంలో ఉంటారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. మరి నిరుద్యోగుల సంగతి ఏంటి అనేది ప్రశ్న. తెలంగాణలో కొత్త ఉద్యోగాలనే మాటే మర్చిపోయి చాలా కాలమైంది. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఏళ్లుగా చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. అవసరమైతే నిరుద్యోగ భృతి అయినా ఇస్తాం కానీ, కొత్త ఉద్యోగం అడగొద్దు అనేలా ఉంది సర్కారు తీరు. ఇక, ప్రభుత్వ తాజా నిర్ణయంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన. మా కడుపు కొడుతున్నారంటూ మండిపాటు. అందుకే, పీఆర్సీ పెంపుతో ఉద్యోగులు కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం చేస్తే.. ఓయూ స్టూడెంట్స్ చెప్పులతో నిరసన తెలిపారు.
పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. ఉద్యోగులు రిటైర్ అవుతుంటే.. ఖాళీలు ఏర్పడి కొత్త ఉద్యోగాలు వస్తాయి. పదవి విరమణ వయసు మరో మూడేళ్లు పెంచడంతో.. ఇక ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్యోగులు తగ్గిపోతారు. ఖాళీలు ఏర్పడవు. కొత్త ఉద్యోగాలు రావు. నిరుద్యోగం మరింత పెరుగుతుంది. ఇప్పటికే ఏళ్లుగా జాబ్స్ లేక తీవ్ర అసంతృప్తి, అసహనంలో ఉన్న గ్రాడ్యుయేట్స్‌కి ఇది మరింత ఆశాపాతం. అందుకే, పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచడంపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పాలనలో ఇప్పుడంతా సాంకేతికత కమ్మేసింది. అంతా కంప్యూటరైజ్డ్ వర్క్. పదవీ విరమణ వయసు దగ్గర పడిన సీనియర్ మోస్ట్ ఎంప్లాయిస్.. ఈ కొత్త సాంకేతికతకు అంతగా అలవాటు పడటంలేదనేది ఓ ఆరోపణ. నిదానమైన పనితీరు, కంప్యూటర్ స్కిల్స్‌లో నైపుణ్యం లేకపోవడం వారికి మైనస్. రిటైర్మెంట్ ఏజ్ మరింత పెరిగితే.. అలాంటి సీనియర్ మోస్ట్ ఉద్యోగులు మరో మూడేళ్ల పాటు అదే సీటులో పాతుకుపోతారు. పని విధానమూ మరింత నెమ్మదిస్తుందని అంటున్నారు. అదే, కొత్త ఉద్యోగాలతో యువకులను ప్రభుత్వ శాఖల్లో తీసుకుంటే.. టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు ఉరిమే ఉత్సాహంతో మంచి పనితీరు కనిపిస్తుందనేది నిరుద్యోగుల వాదన. ఒక్కరికి ఉద్యోగం వస్తే.. వారి కుటుంబం అంతా సెటిల్ అవుతుందని.. సమాజమూ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్లేషిస్తున్నారు. పాత, కొత్త ఉద్యోగుల కలయికతో ప్రభుత్వ విభాగాలు సమతూకంతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అటు, సీనియర్ల అనుభవం, ఇటు యువకుల నైపుణ్యం రెండూ తోడైతే బాగుంటుంది కానీ, ఉన్న ఉద్యోగులనే మరింత కాలం కొనసాగిస్తే.. కొత్తదనం కరువవుతుందని అంటున్నారు.
ఇక, రిటైర్మెంట్ ఏజ్ పెంచడం ప్రభుత్వ ఖజానాపైనా ఆర్థిక భారం మోపుతుందని కొందరు అంటున్నారు. అప్పటికే సీనియర్లకు సుమారు లక్ష వరకూ శాలరీ వస్తుంటుంది. మరో మూడేళ్లు కొనసాగిస్తే.. జీతం లక్ష దాటిపోతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది సర్కారుకు పెను భారమే అంటున్నారు. ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్‌లో పని చేసే సీనియర్ టీచర్లకు 80వేలకు పైనే జీతం ఉంటుంది. చాలా స్కూల్స్‌లో 10 నుంచి 50 పిల్లలు మాత్రమే ఉంటారు. వారికి చెప్పేది కూడా.. అ, ఆ..లు, 1,2,3లు. కూడికలు, తీసివేతలు. ఇంత తక్కువ మంది పిల్లలకు.. అంత ఎలిమెంటరీ పాఠాలు చెప్పే సీనియర్ టీచర్లకు దాదాపు లక్ష వరకూ శాలరీ ఉంటుంది. అదే కొత్త టీచర్లైతే.. 20-30వేలకే వచ్చేస్తారు. అనుభవంలో తేడా ఉన్నా.. అప్పటికే వారంతా టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటారు కాబట్టి ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చనేది నిరుద్యోగుల వాదన. పదవీ విరమణ వయసు పెంపుతో కొత్త ఉద్యోగాలకు గండి పడినట్టే. అందుకే, రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ 61ఏళ్లకు పెంచడం దాదాపు 3లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయినా.. అంతకుమించి ఉన్న నిరుద్యోగులకు మాత్రం ఇది చేదువార్త.