తెలంగాణ బడ్జెట్ బరువు పెరిగింది
అనుకున్నట్లుగానే, అన్నట్లుగానే తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి, రూ.2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో రాష్ట్ర బడ్జెట్’ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు.గత బడ్జెట్’ కంటే ప్రస్తుత బడ్జెట్, రూ. 48వేల కోట్ల మేర బరువు పెరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయం లక్షా 69 వేల, 383.44 కోట్ల రూపాయలుగా, క్యాపిటల్ వ్యయం 29 వేల 46.77 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. రెవెన్యూ మిగులు 6 వేల 743 కోట్ల రూపాయలుగా.... అలాగే ఆర్ధిక లోటును 45 వేల 509 కోట్ల రూపాయలుగా ఆర్ధికమంత్రి అంచనా వేశారు. ఆర్థిక లోటురూ. 45,509.60కోట్లుగా చూపించారు. అదే విధంగా బడ్జెట్’లో కరోనా కోతలు ఉండవని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఆర్థిక మంత్రి నిలబెట్టారు. వివిధ పద్దుల క్రింద సంక్షేమానికి భారీగానే నిధులు కేటాయించారు, ఆసరా పించన్లకు రూ.11,728కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి రూ.2, 75౦ కోట్లు, ఎస్సీల ప్రత్యేక ప్రగతి కోసం రూ.12,304 కోట్లు, బీసీల సంక్షేమానికి 5,522 కోట్లు ఇలా వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి ఆర్థిక మంత్రి లేదనకుండా, కాదన కుండా నిధులను ప్రతిపాదించారు. అలాగే, వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలు చేయని రైతు రుణమాఫీకి రూ.౫,225 కోట్లు, రైతు బందుకు రూ.14,800 కోట్లు, అలాగే ఇతర వ్యవసాయ పద్దుల కింద ప్రాధాన్యతా క్రమంలో నిధులు ప్రతిపాదించారు.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి రాష్ట్రం గత ఆరున్నరేళ్లుగా సాధించిన ప్రగతిని వివరించారు. సకల జనుల సంక్షేమం ప్రాతిపదికగా చేపట్టిన పలు చర్యలు విజయవంతం అయ్యాయని పేర్కొంటూ.... అట్టడుగు స్దాయిలో, ఆఖరి వ్యక్తి వరకు, ప్రగతి ఫలాలను అందించేలా ఈ బడ్జెట్ లో చర్యలను ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో, ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్రం వృద్ధిని సాధించగలిగిందని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకోగలమని, బలమైన విశ్వాసం కలిగినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రి దళిత సాధికార కార్యక్రమాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
రాష్ట్రంలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరించేందుకు 4 వేల కోట్ల రూపాయలతో సరికొత్త విద్యా పథకాన్ని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. వచ్చే రెండేళ్ళలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడతామని, ఫర్నిచర్, టాయిలెట్ల వంటి వసతులు కల్పిస్తామని, ఆధునిక సాంకేతిక విజ్నానంతో తరగతి గదులను అనుసంధానిస్తామని వివరించారు. పాఠశాల విద్యకు 11 వేల 735 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యా రంగానికి 1873 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
వ్యవసాయ రంగానికి 25 వేల కోట్ల రూపాయలను ఆర్ధిక మంత్రి వచ్చే ఏడాది ఖర్చు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో వ్యవసాయ యాంత్రీకరణకు 15 వందల కోట్లు, రైతుబంధ పథకానికి 14 వేల 800 కోట్లు, రైతు రుణమాఫీకి 5 వేల 225 కోట్లు, రైతుబీమాకు 1200 కోట్ల రూపాయలను మంత్రి ప్రతిపాదించారు. వచ్చే ఏడాది కొత్త లిఫ్టుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వీటి ప్రాజెక్టు నివేదికలు త్వరలో సిద్ధమవుతాయని చెప్పారు. సాగునీటి రంగానికి 16 వందల 931 కోట్లు, సామాజిక పింఛన్లకు 11 వేల 728 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు.
కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలు కోసం 2 వేల 750 కోట్లు, ప్రతిపాదించారు. శాసనసభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 5 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో వీటికి మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పారు. ఇందుకోసం 800 కోట్ల రూపాయలను కేటాయించారు.
షెడ్యుల్డు కులాల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21 వేల 306 కోట్ల రూపాయలు, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం 12 వేల 304 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 5 వేల 522 కోట్ల రూపాయలను కేటాయించారు.
మైనారిటీ సంక్షేమానికి 1606 కోట్ల రూపాయల కేటాయింపుల్ని మంత్రి ప్రకటించారు.
మహిళా శిశు సంక్షేమం కోసం 1702 కోట్ల రూపాయలను, రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం పథకం కోసం 11 వేల కోట్ల రూపాయలను, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల కింద 15 వేల 30 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదించారు. కాగా కరోనా కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని చెబుతూ వైద్య ఆరోగ్య శాఖకు 6 వేల 295 కోట్ల రూపాయలను కేటాయించారు.
విద్యుత్ రంగానికి 11 వేల 46 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ఆర్ధిక మంత్రి రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వం అండదండలు అందిస్తోందని చెబుతూ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 3 వేల కోట్ల రూపాయల నిధులను ఆర్టీసీకి సమకూర్చనున్నట్లు చెప్పారు.
అటవీశాఖకు 1276 కోట్ల రూపాయలు, నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి 610 కోట్ల రూపాయలు కేటాయించారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు అవసరమైన భూసేకరణకు 750 కోట్లు, రాష్ట్రంలో పలుచోట్ల ఎయిర్ స్ట్రిప్పుల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఆహార భద్రతకు 2 వేల 363 కోట్ల రూపాయలు, సాంస్కృతిక పర్యాటక రంగాలకు 726 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు