స్వచ్ఛందంగానే భూములిచ్చాం.. అమరావతి రైతుల వాంగ్మూలం
posted on Mar 19, 2021 @ 4:27PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ విచారణకు హాజరైన పలువురు రైతులు.. రాజధాని కోసం స్వచ్ఛందంగానే ఇచ్చామని చెప్పారని తెలుస్తోంది. తమ వద్ద నుంచి భూములను ఎవరూ లాక్కొలేదని, తమను ఎవరూ బెదిరించలేదని కూడా రాజధాని రైతులు చెప్పారని సమాచారం. భూములు ఇచ్చినందుకు ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పరిహారం కూడా అందిందని సీఐడీ అధికారులకు రైతులు తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు.అప్పటి గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారించారు.
అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అసైన్డ్ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఈనెల 12న సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. ‘‘ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంది. మీకు(ఏ1) మాత్రమే తెలిసిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అందువల్ల... ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్ ఆఫీసుకు వ్యక్తిగతంగా హాజరు కావలెను’’ అని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అమరావతి దళిత జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు పెట్టడమంటే.. ఎస్టీ, ఎస్సీ చట్టాలను దుర్వినియోగం చేసినట్లేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 41 జీవో ద్వారా చంద్రబాబు దళితుల అభివృద్ధికి పాటుపడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ హక్కు ప్రకారం ఎస్టీ, ఎస్సీ కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను వెనక్కితీసుకోవాలని లేని పక్షంలో ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు. అమరావతి రాజధానిలో దళితులకు చోటు లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.