వాణీ దేవి ధర్మాగ్రహం
posted on Mar 19, 2021 @ 7:42PM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ముందెన్నడూ లేనంతగా భారీ పోలింగ్ జరిగింది. చదువుకున్నోళ్ళు ఓటింగ్’కు రారు, ఓటేయరు అన్న అపవాదును తుడిచేసే విధంగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, డాక్టరేట్లు, ఇంకా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉద్యోగాల వేటలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులు పోలింగ్ లో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో సామాన్య ఓటర్లులా బారులు తీరి, ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు నియోజక వర్గాలలోనూ భారీగా పోలింగ్ జరిగింది. రంగా రెడ్డి-మహబూబ్ నగర్ – హైదరాబాద్ నియోజక వర్గంలో ఏకంగా 67 శాతం పోలింగ్ నమోదైంది. ఇదొక రికార్డు.
ఇంత ఉత్సాహంగా ఓటేసినా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెరాస అభ్యర్ధి, పీవీ కుమార్తె వాణీదేవికి ఓటర్ల మీద కోపమొచ్చింది. ఓట్ల మీద కోపం రావడం మాత్రమే కాదు, ఆమె మీద ఆమెకే జాలి లాంటిది ఎదో వేసింది. ఇంతకీ అందుకు కారణం ఏమంటే, చెల్లని ఓట్లు.ఆమె పోటీచేసిన నియోజకవర్గంలో ఏకంగా 20వేలకు పైగా ఓట్లు చెల్లక పోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. పట్టభద్రులు సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకో లేక పోవడం పట్ల బాధను వ్యక్తంచేస్తూ, ఇవేం చదువులు, మేము నేర్పిన చదువులు ఇవేనా అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు.
నిజమే కదా పట్టభద్రులకు ఓటు వేయడం రాక పోవడం పట్ల ఎవరికైనా ఆగ్రహం రావడం సహజమే కదా, అందునా ఉపాధ్యవృత్తిలో ఉన్న పీవీ కుమార్తెకు ఆగ్రహం రావడం సహజం.నిస్సందేహంగా ఆమెది అమెది ధర్మాగ్రహమే, అర్థం చేసుకోవచ్చును. అయితే, అదే పట్టభద్రుల ఎన్నికల్లోనూ కోట్లు ఖర్చు చేయడం,ప్రలోభాలకు గురి చేయడం, సాధారణ ఎన్నికల్లో కంటే ఎక్కువగా తాయిలాలు ఎరావేయడం వంటి, సకల అక్రమాలకు పాల్పడడం విషయంలోనూ ఆమె అదే ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తే ఆమె గౌరవం ఇంకొంచెం ఇనుమడించేది కదా ..