గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న..
posted on Mar 20, 2021 8:22AM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. రెండు స్థానాల్లోనూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే లీడ్ లో ఉన్నా... రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండ-వరంగల్- ఖమ్మం ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. ఫస్ట్ ప్రియారిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆధిక్యత రాగా.. రెండో ప్రయారిటీలో మాత్రం తీన్మార్ మల్లన్న దూసుకుపోతున్నారు. రెండో ప్రయారిటీలో కోదండరామ్ కు ఎక్కువ ఓట్లు వస్తాయని అంతా భావించగా.. ఫలితాల్లో మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తీన్మార్ మల్లన్నకు భారీగా ఓట్లు పోలవుతున్నాయి.
నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 66 మంది ఎలిమినేషన్ పూర్తైంది. 66వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి లక్షా 17 వేల 386 ఓట్లు రాగా తీన్మార్ మల్లన్న 91 వేల 858 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ 79 వేల 110 ఓట్లు సాధించి మూడో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 42 వేల 15 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాములు నాయక్ కు 29 వేల ఓట్లు రావడంతో... ఈ రౌండ్ లో రెండో ఓటు ఎవరికి ఎక్కువగా వస్తుందన్నది ఆసక్తిగా మారింది
తొలి ప్రాధాన్యత ఓటులో పల్లాకు 27 వేల 550 ఓట్ల ఆధిక్యం రాగా... రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మాత్రం పల్లా వెనకబడ్డారు. ఆయన మూడో స్థానానికి పడిపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న పుంజుకోవడంతో... పల్లా లీడ్ క్రమంగా తగ్గుతోంది. 66 మంది ఎలిమినేషన్ అయ్యేసరికి పల్లా ఆధిక్యం 25 వేల 5 వందలకు పడిపోయింది. ఇప్పటికే రెండు వేల ఓట్ల లీడ్ తగ్గించారు తీన్మార్ మల్లన్న.ఇదే ట్రెండ్ కొనసాగితే.. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ వరకు వచ్చేసరికి పల్లాపై తీన్మార్ మల్లన్న లీడ్ లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోదండరామ్ కు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు భారీగానే వస్తున్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ కంటే 12 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ ఎలిమినేషన్ లో తనకు భారీగా ఓట్లు వస్తాయని కోదండరామ్ ఆశతో ఉన్నారు.