షాకింగ్.. అక్కడ బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి పశువుల మేత..!
posted on Mar 20, 2021 @ 10:09AM
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు చేరిక పెంచడానికి... అలాగే పేద విద్యార్థులకు కనీసం ఒక పూట ఆహారం అందించడం కోసం దేశ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న సంగతి తెల్సిందే. ఈ పథకానికి ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూరుస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. పేద విద్యార్థులకు అందించే ఆహారం ఇదా అని తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
మహారాష్ట్రలోని పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో కూడా ఇక్కడ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఆహార పదార్థాలను నేరుగా పిల్లలకు ఇంటివద్దకే అందిస్తున్నారు. స్థానిక కార్పొరేషన్ అధికారులు దీనికి సంబంధించిన పనులను పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం విద్యార్థులకు అందించమని చెపుతూ కొన్ని ఆహార పదార్థాలు పూణెలోని స్కూలు నెంబర్ 58కి చేరుకున్నాయి. అయితే వాటిని విప్పి చూసినవారు షాక్ తిన్నారు. ఎందుకంటే అవి మనుషులు తినే ఆహార పదార్థాలు ఎంతమాత్రం కావు. అవి కేవలం పశువులకు ఆహారంగా పెట్టే పదార్థాలు. అయితే వీటిని పిల్లలకు పెట్టండంటూ స్కూళ్లకు సరఫరా చేయడంపై ఇటు విద్యార్థి సంఘాలు, అటు తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా కొంతమంది స్థానికులు వీటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రంగంలోకి దిగి ఈ ఆహార పదార్థాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై పూణె మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్పందిస్తూ.. ఎక్కడో తప్పు జరిగి ఉంటుందని.. కేవలం సమాచార లోపం వల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు అంతేకాకుండా దీనిపై ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైందని.. బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు. తాజాగా ఈ ఘటనను ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు అధికారపక్షంపై విరుచుకుపడుతున్నాయి