జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్! చంద్రబాబు సీఐడీ విచారణపై స్టే
posted on Mar 19, 2021 @ 5:12PM
అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు షాక్ తగిలింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. కేసు విచారణపైనా కోర్టు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. చంద్రబాబు, నారాయణపై కేసులో.. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆరేండ్ల క్రితం ఇచ్చిన జీవోపై ఇప్పుడు విచారణ ఏంటని చంద్రబాబు తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అలాగే నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏపీ హైకోర్టు... చంద్రబాబు సీఐడీ విచారణపై స్టే ఇచ్చింది.
అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించగా.. మాజీ మంత్రి నారాయణ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.
సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చెల్లదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కోర్టులో వాదించారు. ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాలని, అలాంటి ఆదేశాలు ఇక్కడ లేవని ఉన్నత న్యాయస్థానానికి న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఫిర్యాదులోని ఆరోపణలకు..పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. జీఓ విడుదలైన 35 రోజుల తర్వాత దానిని సీఎం ఆమోదించారని.. విచారణ నివేదికలోనే చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు సీఎంకు తెలిసి జీఓ ఇచ్చారని ఎలా చెబుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు చేయటం కుదరదని, ఇక్కడ నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందన్నారు.
మాజీ మంత్రి నారాయణ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జీఓను సవరించారని, జీవోకు సంబంధించిన చర్చలు, విడుదల చేసే ప్రక్రియలో గాని.. అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదని దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని, వ్యక్తిగతంగా వెళ్లి అసైన్డ్ రైతుల ల్యాండ్ తీసుకుని.. వారిని నష్టపరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయని దమ్మాలపాటి అన్నారు. ఒక జీవో ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం కల్పించి.. భూములు తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం భూములు తీసుకొనే సమయంలో.. అప్పటి ప్రభుత్వం అన్నివర్గాలకు లబ్ది చేకూర్చిందన్నారు. దాని ప్రకారమే భూములు సమీకరించారన్నారు.
చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతి రాజధాని ఏర్పాటు కోసం విజయవాడ చుట్టుపక్కల 2014, సెప్టెంబర్ 1న అప్పటి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుని, సెప్టెంబర్ 4న శాసనసభ ముందు ఉంచారు. దీంతో సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం రాజధాని గ్రామాల ప్రజలకు భూసమీకరణ విధానాన్ని తెలిపారు. భూసమీకరణ పథకాన్ని తీసుకొచ్చి, ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించారు. భూసమీకరణపై 2015, జనవరి 1న జీవో 1 జారీ, అసైన్డు భూముల హక్కుదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు 2016, ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయ్యాయి.
చట్ట నిబంధనల మేరకే ఆ జీవో జారీచేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దురుద్దేశంతో వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చంద్రబాబు పిటిషన్‌లో ఆరోపించారు. ఒకవేళ నిబంధనల పై అభ్యంతరాలు ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టులో సవాలు చేసుకోవచ్చని, అంతేగానీ, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు రూపొందించారనే కారణంతో తనను నేర బాధ్యుడిగా పేర్కొనడం అసంబద్ధమని చంద్రబాబు పిటిషన్ లో తెలిపారు.తాము నష్టపోయామని గ్రామస్థులుగానీ, భూ యజమానులుగానీ ఇన్నేళ్లుగా ముందుకు రాలేదని, ఇప్పుడు వారి తరఫున వైసీపీ నేత అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం చూస్తే ప్రత్యర్థి పార్టీపై అనుమానాలు కలుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈనెల 13న చంద్రబాబుపే సీఐడీ కేసులు నమోదు చేసింది. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్ విత్ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1), (ఎఫ్), (జీ), ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది.