ఓటేయలేదని వైసీపీ నేతల దాడి!కృష్ణా జిల్లాలో  అరాచకం 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఆగడాలు కొనసాగుతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా.. ఎన్నికల వేడి మాత్రం చల్లారడం లేదు. ఎన్నికలకు తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు అధికార పార్టీ నేతలు. టీడీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కృష్ణా మచిలీపట్నంలో అధికార పార్టీ నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి.  టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచినందుకు టీడీపీ వర్గీయుల ఇంటిపై దాడి చేస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్ భర్త చీలి చక్రపాణి, అనుచరులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు అసభ్యకరమైన పదజాలంతో దూషణలకు దిగారు. వైసీపీ నేతల దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  వైసీపీ కార్యకర్తల దాడుల్లో  ధ్వంసమైన ఇండ్ల పరిసరాలను మాజీ మంత్రి కొల్లురవీంద్ర పరిశీలించారు. ఘటనను కొల్లు రవీంద్ర పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల దాడుల నుంచి టీడీపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరారు. 

నల్గొండలో పల్లా మెజార్టీ 49, 362 

తెలంగాణలో రాజకీయ కాక రేపిన వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుది ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 49,362 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపునకు అవసరమైన 1,83,167 మార్కును ఎవరూ చేరుకోకపోవడంతో..  నిభందనల ప్రకారం రెండో స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నను అధికారులు ఎలిమినెట్ చేశారు. మల్లన్నకు వచ్చిన ప్రథమ ప్రాధాన్యత బ్యాలెట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా.. పల్లాకు 36,556 ఓట్లు పోలయ్యాయి. దీంతో 71వ రౌండ్‌లో గెలుపు కోటాను దాటారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఎలిమినేషన్‌తో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓట్లు 1,61,811కు చేరాయి. మల్లన్న ఎలిమినేషన్‌తో ఆ సంఖ్య 1,98,367కు చేరింది. దీంతో కోదండరామ్‌ ఎలిమినేషన్‌ అప్పుడు 12,806గా ఉన్న పల్లా మెజారిటీ 49,362కు పెరిగింది. మొత్తంగా పల్లాకు 1,10,840ల మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, 87,527 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. .  తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్ధతిలో తదుపరి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తొలి ప్రాధాన్యతలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరుగా ఎలిమినేట్‌ చేస్తూ వారి బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎవరికి వస్తే వారికి పంచుతూ వచ్చారు. మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 70 మంది ఎలిమినేట్‌ అయ్యారు. బరిలో నిలిచిన 62 మంది స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి మొత్తం 5,966 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మిగిలిన 9 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు 3,60,377 ఓట్లు వచ్చాయి.

బడుల్లో కరోనా పంజా! ప్రభుత్వానిదే పాపమా? 

తెలుగు రాష్ట్రాల్లో కరోాన మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వేగంగా విస్తరిస్తూ అలజడి రేపుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం స్కూల్స్, కాలేజీలు వైరస్ కు హాట్ స్పాట్లుగా మారాయి. వందలాది కేసులు నమోదవుతున్నాయి. తిరుమల వేద పాఠశాలలో  63 మంది విద్యార్థులకు, నలుగురు టీచర్లకు కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. విజయవాడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో 15 మంది విద్యార్థులు కరోనా సోకింది.  కర్నూలు జిల్లా పత్తికొండ, మద్దికెర, మహానంది, ఆదోని మండలాల్లో 20 మంది విద్యార్థులకు కరోనా నిర్దారణ అయింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ హైస్కూల్‌ టీచర్‌కు పాజిటివ్‌ వచ్చింది.  రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. నిరంతరంగా మాస్కులు ధరించలేక చిన్నపిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భౌతిక దూరమూ పాటించడం లేదు. తరగతి గదుల్లో ఒక్కో బెంచ్‌కి నలుగురైదుగురిని కూర్చోబెడుతున్నారు. శానిటైజేషన్‌ చేయడం లేదు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఎక్కువగా అపార్ట్‌మెంట్లలో నడుస్తున్నాయి. ఇరుకు గదుల్లో ఒక్కో బెంచీపై ఎక్కువమంది విద్యార్థులను కూర్చోబెట్టడం వల్ల ఒకరి నుంచి మరొకరికి లక్షణాలు వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం.  శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచకపోవడం, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచకపోవడం వల్ల విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. వందలాది మంది విద్యార్థులకు రెండు, మూడు మరగుదొడ్లు ఉండటం.. అవి కూడా అస్తవ్యస్థంగా ఉండటం వల్లే కరోనా వేగంగా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. చాలా స్కూళ్లలో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల చేతులు కడుక్కోవడం కష్టమవుతోంది. వందలాది విద్యాసంస్థల్లో విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు  బయటకు పొక్కకుండా గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం.  నాడు నేడు పథకంలో భాగంగా స్కూళ్లలో వందలాది కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించామని జగన్ సర్కార్ చెబుతున్నా.. ఎక్కడా అది కనిపించడం లేదు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గతంలో అప్రమత్తంగా ఉన్న విద్యాశాఖ .. ఇప్పుడు కొవిడ్‌ నిబంధనల అమలు తీరును పర్యవేక్షించటం లేదు. విద్యాసంస్థల్లో ఎక్కడా టెస్టులు నిర్వహించడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో ఎక్కడా శానిటైజేషన్‌ చేయడం లేదు. విద్యార్థులను గాలికి వదిలేశారు. దీంతో స్కూళ్లలో కరోనా పంజా విసురుతుందని చెబుతున్నారు. 

నోముల భగత్ కే సాగర్ టీఆర్ఎస్ టికెట్!

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయంతో త్వరలో జరగనున్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు సీఎం కేసీఆర్. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సాగర్ ను సవాల్ గా తీసుకంటున్నారు టీఆర్ఎస్ అధినేత. వరుస విజయాలు, పార్టీలోకి జోరందుకున్న వలసలతో బీజేపీ దూకుడు మీదుంది. సాగర్ లోనూ జెండా పాతాలని ప్రణాళికలు రచిస్తోంది. తమకు గట్టి పట్టున్న నాగార్జున సాగర్ లో గెలిచి తిరిగి ఫాంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది సాగర్ ఉప ఎన్నిక.  తమకు సవాల్ గా మారిన సాగర్ ఉప ఎన్నిక కోసం గతంలో ఎప్పుడు లేనంతగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక కోసం ఆయన చర్చలమీద చర్చలు జరిపారు. ఈ నెల 23న సాగర్​ బైపోల్​ షెడ్యూల్​ విడుదల కానున్న నేపథ్యంలో.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భగత్​ను అక్కడి నుంచి పోటీ చేయించాలని టీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయించిందని సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. భగత్​కు టికెట్​ ఇచ్చే విషయంపై ఇప్పటికే నల్గొండ జిల్లా లీడర్లకు టీఆర్​ఎస్​ పెద్దలు సమాచారం అందించారట.  నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత సాగర్​ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఉప ఎన్నిక జరగనుంది. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని టీఆర్​ఎస్​ భావించింది. నాగార్జున సాగర్ అభ్యర్థి విషయంలో అనేక చర్చలు జరిపారు కేసీఆర్. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భగత్ తో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అభ్యర్థి ఎంపిక కోసం సాగర్ లో కేసీఆర్ అనేక సర్వేలు చేయించారని తెలుస్తోంది. పోలీస్ ఇంటలిజెన్స్ వర్గాల నుంచి వివరాలు తీసుకున్నారట. సాగర్​లో పార్టీపై పాజిటివ్​ ఒపీనియన్స్‌‌ ఉన్నాయని, అభ్యర్థి ఎవరైనా గెలిచే చాన్సుందని సర్వేల్లో తేలిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో భగత్​ను బరిలోకి దింపితే సెంటిమెంట్​ కలిసి వస్తుందని భావించిందని తెలుస్తోంది  నోముల భగత్ కు  టికెట్​ ఇచ్చే విషయంపైనా కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారని చెబుతున్నారు. దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డికి భార్యకు టికెట్ ఇవ్వడంతో అక్కడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయింది. పార్టీ ఓటమికి అభ్యర్థే కారణమనే చర్చ జరిగింది. దీంతో సాగర్ లో ఎలా ఉంటుందన్న ఆందోళన పార్టీ పెద్దల్లో వచ్చిందని చెబుతున్నారు. అందుకే భగత్ తో పాటు యాదవ కులానికి చెందిన ఇతర నేతల పేర్లనూ పరిశీలించింది. నోముల కుటుంబానికి టికెట్ ​ఇవ్వకపోతే దుబ్బాకలో ఓ న్యాయం, సాగర్​లో మరో న్యాయమా అన్న విమర్శలు వస్తాయన్న చర్చ జరిగింది.  దీంతో నోముల భగత్​ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కేసీఆర్.. నల్గొండ జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికల బాధ్యతలను పల్లా రాజేశ్వర్​రెడ్డికి అప్పగించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత.. సామాజిక వర్గాల ఆధారంగా అభ్యర్థిని పోటీలో పెట్టే ఆలోచనలో కమలం నేతలు ఉన్నారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యాంగా రెండో స్థానంలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించిన తీన్మార్ మల్లన్న.. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే.. సాగర్ సమరం మరింత రంజుగా మారనుంది.

సాగర్ బరిలో తీన్మార్ మల్లన్న! యుద్ధం ఇంకా మిగిలే ఉంది..

తీన్మార్ మల్లన్న... అలియాస్ చింతపండు నవీన్ కుమార్... సామాన్య జర్నలిస్ట్ ఇప్పుడు జనాల గుండెల్లో హీరోగా మారిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటంతో సామున్యుల మనుసులు గెలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామన్‌మేన్‌లా సింగిల్‌గా వచ్చారు మల్లన్న. సింహంలా గాండ్రించాడు. పులిలా పంజా విసిరాడు. దుమ్ము రేపాడు. ఆయన గెలవకున్నా.. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కి గట్టి ఝలక్ ఇచ్చాడు. తెలంగాణ ఉద్యయ సారథి కోదండరాం సార్‌కు సైతం షాకిచ్చారు. ఈ ఒక్క మగాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొనగాడిలా నిలిచాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి వరకు పోరాడిన.. తీన్మార్ మల్లన్న ఫలితాల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. యుద్ధం ఇంకా మిగిలే ఉందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ ను ఫాంహౌజ్ ను పంపించేంత వరకు విశ్రమించబోననని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న. సామాన్యుల గొంతుకై ప్రజా పోరాటం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోీటీపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు తీన్మార్ మల్లన్న. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మల్లన్న పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పోటీ చేసే విషయంపై ఆయన దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నాగార్జున సాగర్ లో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే.. సమరం మరింత రంజుగా మారనుంది. ఇప్పటికే సాగర్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ , మాజీ మంత్రి జానారెడ్డి బరిలోకి దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బలమైన క్యాండిడేట్ కోసం ఆ పార్టీలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంజా విసిరిన తీన్మార్ మల్లన్న.. సాగర్ లో పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయని భావిస్తున్నారు. సాగర్ పరిధిలో బీసీ వర్గాల ఓట్లు ఎక్కువగా. బీసీ నినాదంతో మల్లన్న రంగంలోకి దిగితే.. అన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో మల్లన్నపై జనాల్లో మరింత క్రేజీ పెరిగింది. ఇది తప్పకుండా సాగర్ లో ప్రభావం చూపిస్తుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న పోరాటంపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతోంది. ఏ రాజకీయ పార్టీ అండదండలు లేవు.. అతడికి ఏ యూనియన్ మద్దతు లేదు.. సినీ గ్లామర్ లేదు. కోట్ల కొద్దీ ఆస్తులు లేవు. ఒక సాధారణ మధ్యతరగతి మనిషి. కేవలం  యూట్యూబ్ ఛానల్ లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వ్యక్తికి ఇంత ఫాలోయింగా? అన్న చర్చ జనాల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను తుర్పారా పెట్టే ఓ సామాన్యుడికి ఇంత క్రేజా? రాజకీయ పార్టీల అభ్యర్థులు దరిదాపుల్లో లేరు. వంద కోట్ల రూపాయలు కుమ్మరించి గెలవాలనుకుంటున్న పార్టీకి చెమటలు పట్టిస్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న  సంచలనంగా మారారు.  సర్కారును ఎప్పటికప్పుడు చీల్చి చెండాడమే తీన్మార్ మల్లన్న పని. రోజూ అధికార పార్టీని ప్రశ్నించడమే. నేతల తీరును నిప్పులతో కడిగి నిగ్గదీసి అడగడమే. జెండా లేకున్నా ఎజెండా మాత్రం క్లియర్. అది.. కేసీఆర్‌పై దండయాత్ర. రేవంత్‌రెడ్డి తర్వాత ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో కడిగేసే ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్నే. అదే జనాలకు నచ్చింది. ఆ దూకుడే వారిని ఆకట్టుకుంది. ఆ దమ్ము.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ము రేపిందని చెబుతున్నారు. మామూలు మనిషి మల్లన్న.. ఇంతటి హేమాహేమీలను పడగొట్టడం మామూలు విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మల్లన్నకే సాధ్యమంటున్నారు. ఎమ్మెల్సీగా మల్లన్న గెలిచాడా లేదా అన్నది తర్వాత.. మల్లన్న  ఓడినా గ్రేటే. సింగిల్‌గా.. సామాన్యుడిగా.. అంత పెద్ద పార్టీలకు.. అంత పెద్ద నేతలకు.. ముచ్చెమటలు పట్టించడం నిజంగా గ్రేటాది గ్రేట్ అంటున్నారు.   

నీది కాపు.. నాది కాపు! బీజేపీలో ఎమ్మెల్సీ చిచ్చు

పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. తమ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్-రంగారెడ్జి- మహబూబ్ నగర్ స్థానంలో రెండో స్థానంలో నిలవగా.. నల్గొండ-వరంగల్- ఖమ్మం సీటులో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. నల్గొండ స్థానంలో  బీజేపీ కంటే స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అధినేత కోదండరామ్ ముందు నిలిచారు. నల్గొండ స్థానానికి తొలి ప్రాధాన్యతలో 2 లక్షల 86 వేల ఓట్లు పోలయితే..  బీజేపీ అభ్యర్థికి ప్రేమేందర్ రెడ్డికి కేవలం 40 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీకి తొలి ప్రాధాన్యతలో కేవలం 13 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా ఉద్యోగులు, విద్యావంతులే. ఈ వర్గం ఓటర్లు మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా ఉంటారు. ప్రస్తుతం కేసీఆర్  సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు టీఆర్ఎస్ పేరు వింటేనే మండిపోతున్నారు. ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నందు వల్లే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి షాకిచ్చింది బీజేపీ.ఈ నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా టీఆర్ఎస్ నేతలుఎవరూ ముందుకు రాలేదు. యువత ప్రభుత్వంపై కోపంగా ఉండటంతో ఓడిపోతామనే భయంతోనే పోటీకి గులాబీ నేతలు భయపడ్డారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమనే అంతా అనుకున్నారు. కాని ఇప్పుడు ఫలితాల్లో మాత్రం సీన్ రివర్సైంది. అనూహ్యంగా  హైదరాబాద్ సిట్టింగు సీటును కోల్పోయిన బీజేపీ.. నల్గొండలో అయితే దారుణమైన ఓట్లు సాధించింది. ఇదే ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది. పార్టీ నేతల ఆధిపత్య పోరు, స్వ ప్రయోజనాల కోసం వేసిన ఎత్తుల వల్లే ఈ ఫలితాలు వచ్చాయనే చర్చ కమలం నేతల్లో జరుగుతోంది. నల్గొండ బీజేపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తనకు సహకరించకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితో కుమ్మక్కు కావడం వల్లే ఫలితాల్లో బీజేపీ వెనుకబడింది అని ప్రేమేందర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారని చెబుతున్నారు.ఉద్యోగస్తులు, టీచర్లు, లాయర్లు బీజేపీకి అండగా ఉన్నారని, అయినా ఓటింగ్ లో మాత్రం ఆ ఓట్లలో అధిక శాతం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ అయ్యాయి.. దీని వెనుక ఒక సామాజిక కుట్ర దాగి ఉందని ప్రేమేందర్ రెడ్డి కొందరితో అన్నారని తెలుస్తోంది. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని కొందరు నేతలు బలిపెట్టాడని, తన సామాజిక వర్గాన్ని పెంచి, ఇతర సామాజిక వర్గాలను తొక్కాలని బండి సంజయ్ చూస్తున్నారని గుజ్జుల ఆరోపించారట. హైదరాబాద్ స్థానంలోనూ పార్టీ ఓటమికి నేతల మధ్య వర్గపోరే కారణమనే ఆరోపణలు కమలం నేతల నుంచే వినిపిస్తున్నాయి. రామచంద్రరావుకు సంజయ్ వర్గం సరిగా సహకరించలేదనే విమర్శలు వస్తున్నాయి. రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సపోర్టుగా ఉంటారని.. అందువల్లే సంజయ్ వర్గం ఆయనను పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  అది కనిపించిందని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్.. తూతూమంత్రంగానే ప్రచారం నిర్వహించారని, పార్టీ నేతలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోలేదని రామచంద్రరావు అనుచరులు చెబుతున్నారు.  మొత్తంగా వరుస విజయాలతో దూకుడుగా వెళుతున్న బీజేపీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రేక్ వేశాయనే చర్చ జరుగుతోంది. వరుస విజయాలు, పార్టీలోకి వలసలు పెరగడంతో... బీజేపీ కూడా అతి విశ్వాసానికి పోయిందని, అందుకే ఫలితాలు ఇలా వచ్చాయనే  వాదన కూడా రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.  

90 గంటల రికార్డ్ కౌంటింగ్ 

తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రహసనంలా సాగింది. మారథాన్ లా నాలుగు రోజుల పాటు నానా స్టాప్ గా కౌంటింగ్ జరిగింది. రోజులు గడుస్తున్నా ఫలితం తేలకపోవడంతో.. ఫలితాల కోసం ఎదురుచూసిన జనాలు కూడా ఏం జరుగుంతుందోనని ఆందోళన పడాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడు లేనంతగా లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది.  హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సరూర్ నగర్  ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన  లెక్కింపు ప్రక్రియ.. శనివారం సాయంత్రం ముగిసింది. దాదాపు తొంభై గంటలపాటు  నిర్విరామంగా సాగిన ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఓ రికార్డుగా చెప్పవచ్చు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన ఓట్ల లెక్కింపు నల్గొండలో జరిగింది, ఇక్కడ హైదరాబాద్ కంటే ఐదారు గంటలు ఎక్కవే అయింది ప్రక్రియ ముగిసేందుకు. నల్గొండ ఫలితం శనివారం అర్ధరాత్రికి వచ్చింది.  హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్, ఎమ్మెల్సీ  రిటర్నింగ్ అధికారితో   ప్రియాంకతో పాటు,  50 మంది సీనియర్ అధికారులు నిరంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో  పాల్గొన్నారు.  ఎన్నికల సంఘం అబ్జర్వర్ హరి ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఓట్ల లెక్కింపులో  ప్రతి రోజు 3 షిఫ్టులుగా,  ప్రతి షిఫ్ట్‌కు ఎనిమిది వందల మంది కౌoటింగ్ సిబ్బంది ఎనిమిది హాళ్ళలో రోజుకు 2400 మంది చొప్పున నాలుగు రోజులపాటు 9600 మంది నేరుగా పాల్గొన్నారు.  వీరితో పాటు సహాయ రిటర్నింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ, రెవిన్యూ, సీనియర్ అధికారులు  నిర్విరామంగా తమ సేవలను అందించారు. నల్గొండకు రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. నల్గొండలో కూడా మూడు షిప్టుల్లో సిబ్బంది పని చేశారు.  జంభో బ్యాలెట్ బాక్స్‌లను స్థాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హల్ కు తరలించడం, తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించడంలో ఉద్యోగులు కష్టపడ్డారు.దాదాపు పదివేల మందికి కనీస సౌకర్యాలను, టీ, టిఫిన్, భోజనంతో పాటు లెక్కింపు కేంద్రం పరిశుభ్రంగా ఉంచడంలో లోకల్ మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది విశేష సేవలoదించారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, నల్గొండలో ఎస్పీ రంగనాథ్  నేతృత్వంలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. మొత్తానికి  సుదీర్ఘ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏ విధమైన వివాదాలు లేకుండా ముగించిన సిబ్బందిని రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలు అభినందిస్తున్నారు.

ఆ హోంమంత్రి టార్గెట్ నెలకు 100 కోట్లు!

ముంబైలో కలకలం రేపిన ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అనేక మలుపులు తిరుగుతోంది.  ఈ కేసు ఇప్పటికే మహారాష్ట్ర పోలీస్ శాఖను షేక్ చేస్తుండగా..తాజాగా రాజకీయ నేతలు, పోలీసు అధికారులకు మధ్య వార్ జరుగుతోంది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో సరిగా విచారణ చేపట్టని కారణంగా ప్రభుత్వం బదిలీ చేసిన మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ బాంబ్ పేల్చారు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆయన  సంచలన ఆరోపణలు చేశారు.  ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాసిన పరమ్ బీర్ సింగ్.. దిమ్మతిరిగే విషయాలు చెప్పారు.  అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన సచిన్ వాజేను ప్రతి నెలా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వాలని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని చెప్పారు. రెస్టారెంట్లు, హోటళ్లు తదితరాల నుంచి లంచాలు వసూలు చేసి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని అడిగేవారన్నారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారన్నారు పరమ్ బీర్ సింగ్. వంద కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గాలను కూడా మంత్రి సూచించారని సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ముంబైలో 1,750 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయని, ఒక్కో దాని నుంచి రూ. 2-3 లక్షలు వసూలు చేసినా నెలకు రూ. 40-50 కోట్లు అవుతుందని, మిగతా మొత్తాన్ని ఇతర వనరుల ద్వారా సేకరించాలని వాజేను మంత్రి ఆదేశించారని వివరించారు.  అయితే పరమ్ బీర్ సింగ్ ఆరోపణలను మంత్రి దేశ్‌ముఖ్  ఖండించారు. ముకేశ్ అంబానీ, మన్‌సుఖ్ హిరెన్ కేసులో సచిన్ వేజ్ పాత్ర ఉందని దర్యాప్తులో తేలిందని, ఈ కేసులో లింకులన్ని సింగ్ వైపే దారి తీస్తున్నాయని అన్నారు. వాటి నుంచి బయటపడేందుకే సింగ్ తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి దేశ్‌ముఖ్ తెలిపారు.  

మంటల్లో తెలంగాణ భవన్

టీఆర్‌ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్‌లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ప- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించారు. దీంతో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చారు. కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి బాణాసంచా కాల్చారు. బాణాసంచా నిప్పు రవ్వలు తెలంగాణ భవన్‌ పై పడ్డాయి. దీంతో పైకప్పు  తగలబడింది. తెలంగాణ భవన్‌లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. తెలంగాణ భవన్ లో ఓ అంతస్తు దగ్ధవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన తెలంగాణ భవన్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమించారు.  కార్యకర్తల అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి తన సమీప ప్రత్యర్థి రాంచందర్ రావుపై నెగ్గారు. 

ఉత్తమ పార్లమెంటేరియన్ గా రామ్మోహన్ నాయుడు 

శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ కీలక నేత రామ్మోహన్ నాయుడుకు అరుదైన అవార్డు లభించింది. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ పార్లమెంటేరియన్-2021 అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు తమ విధి నిర్వహణ, ప్రసంగాలలో చూపించే ప్రతిభ, సమర్ధత, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ‘ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్‌’ ఈ అవార్డులను ప్రకటించింది. ఈ సంస్థ ఏటా అవార్డులను ప్రకటిస్తుంది. గతంలో పార్లమెంటులో మంచి పనితీరు కనబరిచిన ఎంపీలకు ఇచ్చే ‘సంసద్‌ రత్న’ అవార్డును రామ్మోహన్‌ నాయుడు దక్కించుకున్నారు. పిన్న వయసులో ఈ అవార్డు పొందిన పార్లమెంటు సభ్యునిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రైమ్ పాయింట్ అవార్డు అందుకున్నందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.  దేశానికి, ఏపీకి మంచిపేరు తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు. శ్రీకాకుళం లోక్‌సభ నుంచి రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమారుడు. ఎర్రన్నాయుడు మృతి తర్వాత రామ్మోహన్ రాజకీయాల్లోకి వచ్చారు. 

కోదండ రాం..రాం..

ప్రొఫెసర్ కోదండరాం సార్. తెలంగాణ ఉద్యమ కాలంలో ఫుల్ క్రేజ్. కేసీఆర్‌కు సమస్థాయి, సమఉజ్జీ. ఆ రోజుల్లో.. ఆయన జోరు అదో తీరు.  ఉద్యమం ముగిసింది. కేసీఆర్‌తో చెడింది. ఇక అంతే. అప్పటి వరకూ ఓ వెలుగు వెలిగిన ప్రొఫెసర్.. అప్పటి నుంచి ఆయన ప్రభ మసక బారిపోయింది. పాపం.. పెద్ద సారు. పెద్దల ఆటలో అరటిపండు అయ్యారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.    తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ప్రొఫెసర్ కోదండరాం. ఖమ్మం- నల్లగొండ- వరంగల్‌ పట్టభద్రుల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రధాన పోటీ దారుగా భావించారు అంతా. కానీ, మల్లన్నను సైతం చేరుకోలేక మూడో స్థానినికి పడిపోయారు. అయితే, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను అధిగమించడం చిన్న విషయమేమీ కాదు.  ఎన్నికలు ఎదుర్కోవడం కోదండరాంకు కొత్తే. రాజకీయ ఎత్తులు, ప్రచార జిత్తులు, పోల్ మేనేజ్‌మెంట్‌లాంటి విషయాల్లో ఆయన పెద్దగా ఆరి తేరలేకపోయారు. కొంతకాలం క్రితం తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించినా ఆ పార్టీ ఇప్పటి వరకూ ఉనికే చాటుకోలేకపోయింది. 2018లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ కూటమితో కలిసి పోటీ చేసినా.. ఏ ఒక్క చోటా బోణీ కొట్టలేదు. టీజేఎస్‌ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన కోదండరాంకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. పట్టాభద్రుల నియోజక వర్గం కావడం.. ఉన్నత విద్యావంతుల్లో ప్రొఫెసర్ కోదండరాంకు ఆదరణ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం.. ఉద్యమ ఖిల్లాలైన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో పోటీ చేస్తుండటంతో.. కోదండరాంకు విజయావకాశాలు ఎక్కువగానే ఉంటాయనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఓ మోస్తారు ఓట్లు సంపాదించి.. మూడో స్థానం దగ్గరే ఆగిపోయారు. మధ్యలో మల్లన్న కనుక లేకపోయి ఉంటే.. కోదండరాం సార్‌దే విజయం అంటున్నారు అంతా.  తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానెల్‌తో నిత్యం ప్రభుత్వంపై పోరాడుతుండటం, కేసీఆర్‌ను ఎప్పటికప్పుడు నిప్పులతో కడిగేస్తుండటంతో జనాల్లో మల్లన్నకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కోదండరాం విషయంలో అలా జరగడం లేదు. మల్లన్న మాస్ లీడర్ అయితే.. కోదండరాం క్లాస్ పొలిటిషియన్. మల్లన్న మాటల్లో వాడీ వేడీ సూటి పోట్లు ఉంటే.. కోదండరాం స్పీచ్‌ మేథావి మాటల్లా.. నీట్‌గా క్లాస్‌గా ఉంటాయి. అంత మంచి, మర్యాదకరమైన విమర్శలు ఇప్పటి జనాలను అంత ఈజీగా ఆకట్టుకోవు. మరోవైపు, గతంలో కోదండరాం కాంగ్రెస్‌తో జతకట్టడం.. టీడీపీతో చేతులు కలపడం కూడా ప్రజలకు నచ్చలేదంటున్నారు. కోదండరాం సార్ అంటే తెలంగాణ ఉద్యమ సమయంలోని సంఘటనలే గుర్తుకొస్తుంటాయి కానీ.. తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్‌పై, ప్రజా సమస్యలపై ఆ స్థాయిలో పోరాడిన సందర్భాలు తక్కువనే అంటున్నారు. అందుకే, కోదండరాం రాజకీయం ఓటర్లను అంతలా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఆయన నిబద్దతను, చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ తప్పుబట్టక పోవచ్చు. సార్ అంటే ఇప్పటికీ చాలా మందికి గౌరవమే. అందుకే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకంటే కోదండరాంకే ఎక్కువ ఓట్లు వేసి మూడో స్థానంలో నిలబెట్టారు. మధ్యలో మల్లన్న లేకపోతే.. కోదండరామే ఎమ్మెల్సీ అయ్యే వారేమో...  

హైదరాబాద్ ఎమ్మెల్సీగా వాణిదేవీ విజయం

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న పరిస్థితుల్లో జరిగిన  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాన్ని సాధించింది. హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తైంది. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలిమినేషన్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి... తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై 11 వేల 703 ఓట్ల లీడ్ లో ఉన్నారు. చివరి ఎలిమినేషన్ కూడా పూర్తి కావడంతో వాణిదేవి విజయం సాధించారు.  సురభి వాణిదేవికి తొలి, రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి లక్షా 49 వేల 269 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు లక్షా 37 వేల 566 ఓట్లు వచ్చాయి. బుధవారం ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ లో తొలి రౌండ్ నుంచి వాణిదేవి లీడ్ సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లను ఏడు రౌండ్లలో లెక్కించగా.. అన్ని రౌండ్లలోనూ బీజేపీ కంటే ఆమెకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యతలోనూ వాణిదేవికి ముందు నుంచి లీడ్ రాగా... హర్షవర్ధన్, చిన్నారెడ్డి ఎలిమినేషన్ లో మాత్రమే రామచంద్రారావుకు లీడ్ వచ్చింది. చివరి నాగేశ్వర్ ఎలిమినేషన్ లో మాత్రం వాణిదేవికి భారీగా ఓట్లు రావడంతో ఆమె విజయం ఖరారైంది.  హైదరాబాద్- రంగారెడ్డి మహబూబ్ నగర్  ఎన్నికల్లో సురభి వాణిదేవి విజయం సాధించడంతో టీఆర్ఎస్  భవన్ లో  సంబరాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబరాల్లో పాల్గొన్నారు. పఠాకులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు  టీఆర్ఎస్ కార్యకర్తలు.

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా.. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా..

అప్పుడెప్పుడో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా వచ్చిందని విన్నాం. ఆ తర్వాత అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు సైతం కొవిడ్ పాజిటివ్ వచ్చింది. లేటెస్ట్‌గా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు కరోనా సోకింది. రెండు రోజుల క్రితమే వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నారు పాక్ ప్రధాని. ఇంకా రెండో రోజు వేసుకోక ముందే ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది.  ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా వైరస్ సోకినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ వెల్లడించారు. ప్రధాని ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఏకంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కే కొవిడ్ సోకడం పాకిస్తాన్‌లో పాజిటివ్ కేసుల తీవ్రతకు నిదర్శనం.  పాకిస్తాన్‌లో పాజిటివిటీ రేటు 9.4 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 6,23,135 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 40 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 13,799కి పెరిగింది. ఇప్పటి వరకు 5,79,760 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఏకంగా దేశ ప్రధానికే కరోనా సోకడంతో పాక్ ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. 

హెల్మెట్‌ మాకేనా..పోలీసులకు ఉండవా..?

ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు  అందరు సమానమే. అది పొలిటిషన్ అయినా, పోలీస్ అయినా , సామాన్యులైనా. చట్టానికి ఎవరు చుట్టాలు కారు. కొందరు అధికారులు తమకు చట్టాలు చుట్టాల భావిస్తుంటారు. అందుకే వాళ్ళు చేసే తప్పులు కనిపించవు. వాళ్ళు చేసింది తప్పని అడగడానికి దైర్యం చేయరు. కానీ ఖమ్మం లో ఒక్క యువకుడు పోలీసుల తీరును వ్యతిరేకించాడు. రూల్స్ మాకేనా మీకు ఉండవా అని ప్రశ్నించాడు ఆ యువకుడు.   హెల్మెట్‌ పెట్టుకోలేదని పోలీసులనే ప్రశ్నించాడు ఓ యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెల్మెట్‌ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే పోలీసులు ద్విచక్రవాహనాలపై హెల్మెట్‌ ధరించకుండా వచ్చిన విషయాన్ని గమనించిన ఓ యువకుడు ఇదేంటని ప్రశ్నించాడు. మీకు శిరస్త్రాణం పెట్టుకునే బాధ్యత లేదా అంటూ నిలదీశాడు. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ ఎందుకు హెల్మెట్‌ పెట్టుకోలేదని, మీరే నిబంధనలు పాటించనప్పుడు మాకెలా జరిమానాలు విధిస్తారని ఆ యువకుడు మండిపడ్డాడు.   

వైఎస్సార్ వల్లే రాష్ట్ర విభజన.. చంద్రబాబుకు తుళ్లూరు శాపం..

ఆంధ్రప్రదేశ్ విభజనకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డే కారకుడు. అప్పటి సీఎం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డిని గద్దె దించేందుకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది నాటి వైఎస్సారే. చెన్నారెడ్డితో మొదలైన ఉద్యమం ఉస్మానియాకు చేరింది. ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలోకి వెళ్లింది. ఇలా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర విభజనకు కారకుడు తన మిత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డే అన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. మౌనంగా ఉండడం ఇష్టం లేక నోరు విప్పుతున్నానంటూ చింతా మోహన్ చేసిన కామెంట్లు రాజకీయంగా ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.  దేశం, రాష్ట్రం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ సర్కార్ హామీ ఇచ్చిందని, తిరుపతిని రాజధాని చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరామన్నారు. తిరుపతి చూట్టూ లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా ఉందన్నారు చింతా మోహన్. తుళ్లూరు రాజధానిగా సాధ్యం కాదని, అది శపించబడిన స్థలమని చంద్రబాబుకు ముందే చెప్పానన్నారు. తుళ్లూరులో అడుగు పెట్టి చంద్రబాబు మటాస్ అయ్యారని, అంజయ్య, భవనం వెంకట్రామ్, ఎన్టీఆర్ పదవులు సైతం పోయాయన్నారు. తుళ్లూరులో అడుగుపెడితే పదవి గండం తప్పదన్నారు. జగన్‌కూ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ మునిగిపోయే నావా అని.. చంద్రబాబు చల్లని రూపాయని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. తిరుపతికి 14 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు.  ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని.. బోగస్ ఎన్నికలను నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. అమ్మ ఒడి వల్ల 5 లక్షల మంది ప్రైవేటు టీచర్స్ రోడ్డున పడ్డారన్నారు. 50 వేల ప్రైవేటు విద్యా సంస్థలు మనుగడ కోల్పోయాయన్నారు.  తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందన్నారు చింతా మోహన్. తిరుపతి బై పోల్ చంద్రబాబు, జగన్ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాదని.. దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలన్నారు. బ్యాంకులు, రైల్వే, ఎల్ఐసీ, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చింతా మోహన్ తప్పబట్టారు. బీజేపీ, వైసీపీకి తేడా లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. 

విమానంపై సోనూసూద్ ఫోటో.. 

సోనూసూద్ అంటే ఇండియాలో తెలియని వాళ్ళు ఉండరు. ‌అరుంధతి సినిమాలో వదల బొమ్మాలి వదలా అంటూ నెగిటివ్ పాత్ర పోషించిన  సోనూసూద్. నటుడిగా వచ్చి సేవకుడిగా మారి లాక్ డౌన్ లో ఎంతో మందికి సేవ చేసిన విషయం  దేశ ప్రజలందరికి తెలిసిందే.. తన సేవకు గౌరవంగా   దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అరుదైన గౌరవం అందించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన చేసిన విశేషమైన సేవలకు గౌరవంగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటో వేశారు. ‘ఆపద్బాంధవుడు సోనూసూద్‌కు సెల్యూట్‌’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.   స్పైస్‌జెట్‌ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూ ఆనందం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తాను చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని తెలిపారు. మరోవైపు, లాక్‌డౌన్‌లో సోనూసూద్‌, స్పైస్‌జెట్‌ కలిసి విదేశాల్లో చిక్కుకున్న ఎంతో మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.  

త్వరలో విశాఖకు టీ-మంత్రుల బ‌ృందం! కేటీఆర్, గంటా మిలాఖత్

విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు. అవసరమైతే విశాఖ వెళ్తానంటూ ప్రకటన. కట్ చేస్తే.. మంత్రి కేటీఆర్‌తో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భేటీ. ఉక్కు పోరాటానికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. విశాఖ రావలసిందిగా కోరారు. స్పందించిన కేటీఆర్.. విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, కుదిరితే అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులతో కలిసి బృందంగా విశాఖకు వస్తామని చెప్పారని తెలుస్తోంది.  తెలంగాణ శాసన సభ సమావేశాల బ్రేక్ సమయంలో మంత్రి కేటీఆర్‌ను ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. వారి మధ్య రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కేటీఆర్‌ను కలిసి మరింత మద్దతు కోరారు గంటా. గతంలోనే ఉక్కు ఉద్యమానికి సపోర్ట్ చేసిన కేటీఆర్.. విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గంటాకు చెప్పారు. 

కుక్కకు  డీఎన్‌ఏ టెస్ట్..  

ఆస్తుల కోసం అన్నదమ్ముల గొడవ పడడం వింటుంటాం. ఏదైనా వస్తువు కోసం గొడవ పడుతుంటారు. కానీ ఇద్దరు వ్యక్తులు ఒక కుక్క నాదంటే నాదంటూ గొడవ పడడం చూశారా.. చూసేవుంటారు కానీ ఈ కేసులో ఒక కొత్త కోణం ఉంది. అదేంటంటే... గత  ఏడాది  ఆగస్టులో ఓ లాబ్రాడర్‌ జాతి కుక్క.. తమదేనంటూ  షాదాబ్‌ ఖాన్, కార్తీక్‌ శివహరేలు గొడవ పడ్డారు. విషయం పెరిగి  పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇద్దరు వ్యక్తులు కుక్క  ఫిర్యాదు ఇవ్వడంతో కుక్క ఎవరితో తేల్చలేక పోలీసులు తలలు బాదుకున్నారు. ఎంతగా విచారణ చేసినా, అసలు యజమానెవరో పోలీసులు తేల్చలేకపోయారు. చివరకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.  ఎక్కడైనా ఒక వ్యక్తి ఎవరికి జన్మించాడో, తన పుట్టుపూర్వోత్తరాలేంటో తెలుసుకోవడానికి  డీఎన్‌ఏ టెస్ట్ చేస్తారు. కానీ ఈ కేసులో కుక్క  యజమాని ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ పరీక్ష చేశారు.  టెస్ట్ తర్వాత   కుక్క యజమానిని తేల్చారు ‌ పోలీసులు.  కుక్కను తాను పచ్‌మడీ ప్రాంతం నుంచి కొనుగోలు చేశానని షాదాబ్‌ తెలిపారు. దీంతో కుక్క నుంచి, కుక్క తల్లి నుంచి శాంపిళ్లను సేకరించి డిసెంబర్‌లో డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌ పంపారు. ఆ ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. కుక్క యజమాని షాదాబేనని తేలింది. డీఎన్‌ఏ పరీక్షల కోసం రూ.50 వేలు ఖర్చు పెట్టాను. చివరకు నా కుక్క నాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది అని షాదాబ్‌ ఖాన్‌ తెలిపారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ హోషంగాబాద్ లో జరిగింది. 

కలకలం రేపుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ ..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు, ట్రేడ్ యూనియన్ల నేతల దీక్షలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క ఈ నెల 25 నుండి స‌మ్మె చేయాల‌ని కార్మికులు నిర్ణ‌యించారు. యాజ‌మ‌న్యానికి నోటీసు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్య‌మంలో యాక్టివ్ గా ఉన్న శ్రీనివాసరావు అనే  స్టీల్ ప్లాంట్ ఉద్యోగి  ఈ  ప్రైవేటీకరణపై మనస్తాపం చెందుతూ రాసిన సూసైడ్ నోట్ తాజాగా సంచలనం రేపుతోంది. అయన రాసిన లేఖలో.. "ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో దీనిని ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి  5:49 నిమషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటానికి ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి’’ అంటూ సూసైడ్ నోట్ రాసి శ్రీనివాసరావు ఇవాళ ఉదయం నుండి అదృశ్యమయ్యారు.  దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.