తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా? 

తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా.. రాత్రిపూట కర్ఫ్యూ పెట్టబోతున్నారా అంటే వైద్య శాఖ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. 15 రోజుల నుంచి రోజుకు 3 వందలకుపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఏకంగా 4 వందలు క్రాస్ అయ్యాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు గురుకులాల్లలోనే వచ్చాయి. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో  రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. కేసుల సంఖ్య తగ్గాలంటే లాక్ డౌన్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో ఇప్పటికే మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. లాక్ డౌన్ అంశంపైనే చర్చించారని తెలుస్తోంది. దీంతో దీంతో తెలంగాణలో కూడా  లాక్ డౌన్. లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్క‌రోజే కరోనాతో ముగ్గురు చనిపోయారు. అదే సమయంలో 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,867కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,042 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,674గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3,151 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,285 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 103 మందికి క‌రోనా సోకింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.  కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖపై మంత్రి  సమీక్ష నిర్వహించారు. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు.  వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు మంత్రి ఈటల. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, నిర్లక్ష్యం కూడదని అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని మంత్రి రాజేందర్ అన్నారు.  

ఒకే కాలేజీలో 163 మందికి వైరస్.. ఏపీలో కరోనా కల్లోలం 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఫిబ్రవరిలో అదుపులోనికి వచ్చినట్లుగా కనిపించిన వైరస్... గత రెండు వారాలుగా మళ్లీ కోరలు చాస్తోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ  కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కల్లోలం రేపింది. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఉన్న ఓ కాలేజీలో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆ కాలేజీలో రెండు రోజులుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మొదటి రోజు కొందరు విద్యార్థులను టెస్ట్ చేస్తే 13 కేసులు బయటపడ్డాయి. రెండో రోజు 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గిందని భావించారు.  తాజాగా సోమవారం చేసిన టెస్టుల్లో ఏకంగా 140 కరోనా కేసులు బయటపడటంతో కాలేజీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 700 మంది విద్యార్థుల నుంచి నమూనాలను యాజమాన్యం సేకరించింది. వీటిల్లో 140 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ కాలేజీలో 163 మంది కరోనా సోకినట్లైంది. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఒకే క్యాంపస్ లో ఉంచి ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్ గా చేశామని అధికారులు వెల్లడించారు. నెగిటివ్ వచ్చిన 450 మందిని వేరే హాస్టల్ కు తరలించినట్టు వివరించారు. ఈ పరిణామంతో తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థుల్లో కరోనా కేసులు రావడంతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.

మందుబాబులకు సుప్రీం కోర్టు గట్టి షాక్..

మద్యం సేవించిన తరువాత మందుబాబులు చేసే గలభా అంతా ఇంతా కాదు. ఆ హడావుడిలో వీరు అయితే తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం.. లేదంటే ఎదుటి వాడి ప్రాణాలు తీయడం కూడా చూస్తున్నాం. ఇక మందుబాబులు తాగి వాహనాలు డ్రైవ్  చేస్తే జరిగే అనర్ధాలు అనేకం మనం చూసాం. ఇక సోమవారం నాడు జరిగిన ఒక కేసు విచారణ సందర్భంలో ఇటువంటి మందుబాబులకు సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అతిగా మద్యం సేవించి చనిపోతే వారి కుటుంబానికి బీమా చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప బాధిత కుటుంబానికి ఎటువంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక స్పష్టమైన తీర్పు చెప్పింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి 1997లో మరణించాడు. అతిగా వర్షాలు కురవడంతోపాటు, విపరీతమైన చలి కారణంగానే అతడు మరణించాడని అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ వ్యక్తి అతిగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా అతడు ప్రమాదంలో మరణించలేదు కాబట్టి పరిహారం చెల్లించేందుకు బీమా సంస్థ నిరాకరించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడ వారికి తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో బీమా కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా..  విచారించిన ఫోరం బీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, పరిహారం మాత్రం అటవీ సంస్థ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో ఈ తీర్పును అటవీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారించిన జస్టిస్ ఎంఎం శాంతన్ గౌండర్, జస్టిస్ వినిత్ శరణ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతిగా మద్యం సేవించి  చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎవరైనా వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే బీమా వర్తిస్తుందని.. అయితే అతిగా మద్యం సేవించి చనిపోతే మాత్రం ఇది వర్తించదని ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందని.. ధర్మాసనం తేల్చి చెప్పింది.  

పనిమనిషి, డైలీ లేబర్ మహిళకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్లు

దేశవ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.  అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అందరికి షాకిచ్చింది. బుద్వాన్ జిల్లా అస్‌గ్రామ్‌ ఎస్సీ  రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఓ పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. కలితా మాజీ అనే పని మనిషిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడంతో స్థానిక బీజేపీ కార్యకర్తలే  ఆశ్చర్యపోయారు. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు.  అయితే బీజేపీ టికెట్ సాధించిన కలిత.. ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నారు.నెల రోజులపాటు తన పనికి సెలవు పెట్టి, ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కలితా భర్త సుబ్రతా మాజీ.. ఓ ప్లంబర్‌. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు. ప్రచారంలో నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి... ‘‘మోకాలి గాయంతో ఎన్నికల ఆటను మమత ఎలా ఆడతారు’’ అంటూ వ్యంగ్యాస్తాల్రు సంధించారు.    బీజేపీ మరో అసెంబ్లీ స్థానంలో రోజువారి కూలీ చేసుకునే మహిళను రంగంలోకి దిపింది. బంకురా జిల్లాలోని సల్ తోరా స్థానాన్ని చంద్ర బౌరికి కేటాయించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చంద్ర బౌరీనే పేదరాలు. ఆమె భర్త కూడా రోజువారీ కూలీనే. రోజుకు 4 వందల రూపాయలు సంపాదిస్తూ జీవనం గడుపుతున్నారు. కూలీ పనుల్లో భర్తకు సాయం ఉంటోంది చంద్ర బౌరీ. ఆమె జిల్లా బీజేపీలో యాక్టివ్ కార్యకర్త కావడంతో టికెట్ ఇచ్చినట్లు బీజేపీ నేతలు చెప్పారు. 

శానిటైజర్ తాగి 8 మంది మృతి.. ఈ పాపం ఎవరిది?

ఎవరైనా దాహం వేస్తే నీళ్లు తాగుతారు, లేదంటే కూల్ డ్రింక్ తాగుతారు. వేడి చేస్తే మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతారు. వీకెండ్ అయితే లైట్ గా మందు తాగుతారు. వీళ్ళు మాత్రం మద్యం ధరలు పెరిగాయని శానిటైజర్ తాగారు. కొన్నీ శానిటైజర్ బాటిల్స్ కూడా సేమ్ లిక్కర్ బాటిల్ లాగే ఉంటాయి. మరి మధ్య మత్తులో ప్యాకెట్ లో ఉన్న శానిటైజర్ బాటిల్ ని మందు అనుకుని తాగారో ఏమో గానీ మొత్తానికి వాళ్ళు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు .   విజయవాడ వన్‌టౌన్‌‌కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ అనే వ్యక్తులు శానిటైజర్ తాగి  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మరణం స్థానికుల్లో కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగడం వల్లే వారు చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో  రిక్షా కార్మికులు, కూలీలు శానిటైజర్‌ను కూల్ డ్రింక్‌లో కలుపుకుని సేవించారు. మృతి చెందారు అని కొందరు అంటున్నారు. కాగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఇదెక్కడి గోల.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా పాజిటివ్..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రజలు మళ్ళీ ఏడాది క్రితం ఉన్న పరిస్థితులు వస్తాయేమోనని భయపడుతున్నారు. మరోపక్క  ప్రభుత్వాలు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి, ఇది ఇలా ఉండగా ఢిల్లీ పరిధిలోని ఒక సర్కార్ దవాఖానాలో పనిచేస్తున్న నర్సు నిర్ణీత సమయంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా బారినపడ్డారు. ఈ నర్సు జనవరి 18న తొలిడోసు వ్యాక్సిన్ తీసుకోగా..  ఫిబ్రవరి 17న రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా ఆమె కరోనా గుప్పిట్లో చిక్కుకున్నారు. ఎప్పటిలానే ఆమె ఆసుపత్రిలో డ్యూటీ చేస్తుండగా.. ఆమెకు కొన్ని లక్షణాలు కనిపించడంతో..  వెంటనే ఆమె కోవిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకోగా కరోనాకు గురైనట్టు నిర్ధారణ అయింది. మరోపక్క యూపీ రాజధాని లక్నోలోనూ ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి ఎస్‌పీఎం సివిల్ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా ఆయనకు కూడా కరోనా సోకింది. సివిల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నితిన్ మిశ్రా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నతరువాత కూడా వైరస్ బారిన పడ్డారు. అయన ఫిబ్రవరి 15న తొలి డోసు, మార్చి 16న కోవ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్నారు. ఆ తరువాత ఆయనకు అనారోగ్యంగా అనిపించడంతో.. కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వైరస్ సంక్రమించిన ఘటన యూపీలో ఇదే మొదటిదని యూపీ మెడికల్ హెల్త్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీఎస్ నేగి తెలిపారు. కరోనా బారినపడిన వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు నిపుణులు మాత్రం.. మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న 28 రోజులకు రెండో డోసు వేసుకోవాలని.. ఆ తరువాత 14 రోజులకు (అంటే మొదటి డోసు వేసుకున్న 42  రోజులకు) మనలో కరోనాపై పోరాడే శక్తి వస్తుందని.. దీంతో కరోనా నుండి రక్షణ లభిస్తుందని చెపుతున్నారు. అయితే ఈ తాజా ఘటనలతో ప్రజలలో కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది.  

అంగన్ వాడీ కేంద్రంలో 40 పాములు 

చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు, చీమలు పెట్టిన పుట్టలలోనే కాదు. మనిషి కట్టుకున్న ఇళ్లల్లోనూ, అప్పుడప్పుడు ఆఫీస్ లోనూ పాములు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ అంగన్‌వాడీ కేంద్రం లో పాములకు నిలయమైయింది.  మహాబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రతి రోజు లాగే చిన్నారులతో పాటు గర్భిణులకు సరకులు పంచేందుకు అంగన్ వాడి కేంద్రం తెరవడంతో కుప్పలు కుప్పలుగా పాములు  కనిపంచాయని అంగన్‌వాడీ సిబ్బంది తెలిపారు. అంగన్ వామీ కేంద్రంలో ఏకంగా 40 పాము పిల్లలు, 2 తేళ్లు కనిపించడంతో అంగన్‌వాడీ సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.  శిథిలావస్థలో ఉన్న భవనంలో అంగన్ వాడీ కేంద్రం నడపడం వల్లే ఇలా పాములు, తేళ్లు వస్తున్నాయని సిబ్బంది, స్థానికులు తెలిపారు. అయితే అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంగన్ వాడీ సిబ్బంది, గ్రామస్తులు  ఊపిరి పీల్చుకున్నారు.   

పార్లమెంట్ లో మహిళా ఎంపీకి వార్నింగ్! 

మహారాష్ట్రలో ప్రకంపనలు స్పష్టిస్తున్న ముకేష్ అంబానీ కేసు సెగలు పార్లమెంట్ ను తాకాయి. అంబానీ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరిన మహిళా ఎంపీని శివసేన ఎంపీ బెదిరించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్.. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌లోనే తనను ఆయన బెదిరించారని ఆమె ఆరోపించారు. ‘‘మీరు మహారాష్ట్రలో ఎలా తిరుగుతారో నేనూ చూస్తా. మిమ్మల్ని కూడా జైలులో వేసేస్తాం.’’ అంటూ శివసేన ఎంపీ అరవింద్ బెదిరించారని ఎంపీ నవనీత్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  మన్సుఖ్ హిరేన్ హత్య, సచిన్ వాజే వ్యవహరంపై ఉద్ధవ్ సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన బెదిరింపులకు దిగుతున్నారని నవనీత్ కౌర్ ఆరోపించారు. ‘‘ఈ రోజు శివసేన ఎంపీ నన్ను బెదిరించారు. ఈ అవమానం నాకే కాదు. మొత్తం మహిళా లోకానికే అవమానం. అందుకే వీలైనంత తొందరగా ఎంపీ అరవింద్ సావంత్‌ వ్యాఖ్యలపై పోలీస్ దర్యాప్తు చేయించాలి.’’ అని నవనీత్ కౌర్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా నవనీత్ కౌర్ పంపించారు.  అయితే నవనీత్ కౌర్ చేసిన ఆరోపణలపై శివసేన ఎంపీ అరవింద్ స్పందించారు. ‘‘ఆమెను నేనెందుకు భయపెడతాను? నేను బెదిరించే సమయంలో ఆమె చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చెప్పండి. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమాత్రం బాగోలేదు.’’ అని అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు.  అంబానీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఉద్దవ్ థాకరే సర్కార్ పై ఒత్తడి పెరుగుతోంది. మరోవైపు తన పార్టీకి చెందిన హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను మరోసారి వెనకేసుకొచ్చారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. 

తెలంగాణలో స్కూల్స్ క్లోజ్! 

కరోనా విజృంభణతో తెలంగాణలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వైరస్ వ్యాప్తికి ఇవి వాహకాలుగా మారుతున్నాయని భావిస్తున్న వైద్యాధికారులు ఈ సూచన చేశారు. వైద్యశాఖ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నిజానికి పిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో వారికి వైరస్ సంక్రమించినా లక్షణాలు బయటపడవు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతే సరైన పరిష్కారమని చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్ డౌన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని తెలుస్తోంది. పూర్తి స్థాయికి లాక్ డౌన్ అమలుకు అవకాశం లేకపోయినా.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.   

సూర్యాపేటలో కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ.. 100 మందికి గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 2 వేల మంది గ్యాలరీ కూర్చున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చున్న కారణంగానే కూలినట్లు తెలుస్తున్నది. క్రీడాపోటీలను వీక్షించేందుకు స్టేడియంలో మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. మరికాసేపట్లో పోటీలు ప్రారంభకానుండగా ఊహించని ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను 108 సిబ్బంది, పోలీసులు, స్థానికులు అందుబాటులో ఉన్న వాహనాల్లో హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. బాధితులను పరామర్శించేందుకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట ఏరియా దవాఖానకు వెళ్లారు.

ఎమ్మెల్యే ఆర్కే పాపం ఊరికే పోదు...!

గంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇవాళ ప్రభుత్వం చేపట్టిన  ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇరుపక్కల గల నివాసాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసారు. అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికారులు పొక్లెయిన్‌ల సాయంతో కూల్చేశారు. బాధితులు ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారీగా మోహరించిన పోలీసులు బాధితులను పక్కకు నెట్టి వేసి అక్కడ ఉన్న కట్టడాలను పడగొట్టారు. మరోపక్క ఈ విషయంపై బాధితులు గతంలోనే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాగా వారు వేసిన పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ ప్రారంభానికి ముందే  బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక్కడ తాము 40 ఏళ్లుగా ఉంటున్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించకుండా తమ కట్టడాలను ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నించారు. అయితే అధికారులు వారి వాదనను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో టీడీపీ, వాపక్ష నేతలు అక్కడకు భారీగా చేరుకుని బాధితులకు అండగా నిలిచి.. అధికారులను నిలదీశారు. బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాకే ఖాళీ చేయించాలని.. అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అధికారులకు, బాధితులకు అండగా నిలబడిన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం, అధికారుల వ్యవహరించిన తీరుపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. లోకేష్ గెలిస్తే మంగళగిరి లో పేదల ఇళ్లు కూల్చేస్తాడు అని ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసారని.. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదు అని లోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా..  ఎమ్మెల్యే చేసిన ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కట్టని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరిగే వరకూ వారికి టీడీపీ అండగా పోరాడుతుంది లోకేష్ స్పష్టం చేశారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పై కేంద్ర మంత్రి క్లారిటీ..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మికులు, అటు ప్రజలు వివిధ స్థాయిలలో ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. మరోపక్క విశాఖ ఉక్కు నష్టాలను తగ్గించడానికి మిగులు భూములుగా ఉన్న 7 వేల ఎకరాలను అమ్మాలని ఎపి సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్రం నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా స్టీల్‌ప్లాంట్ మిగులు భూములపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది ఇవాళ  లోక్‌సభలో మిగులు భూముల విషయంపై  వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ సమాధానం ఇచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ మిగులు భూములను ప్రైవేట్‌పరం చేసే విషయాన్నికేంద్రం పరిశీలిస్తోందని కేంద్రమంత్రి ఠాకూర్‌ చెప్పారు. అవసరమైన మేరకు స్టీల్‌ప్లాంట్ భూములను ప్రైవేట్‌పరం చేస్తామని అయన ఈ సందర్భంగా చెప్పారు. మిగిలిన వాటిని ఏం చేయాలో ఆ తర్వాత పరిశీలిస్తామని ఠాకూర్ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని అయన అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వేస్తామని అయన స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో మొత్తం 7 వేల ఎకరాల మిగులు భూములు ఉన్నాయని కేంద్రమంత్రి ఠాకూర్‌ తెలిపారు. మొత్తానికి ఇటు ఎపి సీఎం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒకే బాటలో నడుస్తుండడం గమనార్హం.  

మౌనమేలనోయి..? కొండంత కిరికిరి!

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. రెండు చోట్లా కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ప్రతిపక్షాలన్నీ టీఆర్ఎస్‌ను తిట్టి పోస్తున్నాయి. అరాచకాలతో ఎమ్మెల్సీలు గెలిచారంటూ దెప్పిపొడుస్తున్నాయి. రాజకీయంగా ఇంత హడావుడి ఉంటే.. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్‌రెడ్డి మాత్రం పత్తా లేకుండా పోయారు. కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. వారం రోజులుగా వార్తల్లో కనిపించడం లేదు. సమయం, సందర్భం లేకుండా గులాబీ బాస్‌ను ఏకిపారేసే రేవంత్.. కీలక సమయంలో సైలెంట్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.  మొన్నటి వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు రేవంత్. నియోజక వర్గ పరిధిలో పర్యటిస్తూ.. సర్కారు దుమ్ముదులిపారు. చిన్నారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఇలా ప్రచారం ముగిసిందో లేదో.. అలా మాయమైపోయారు. సుదీర్ఘంగా సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్ సమయంలోగానీ, ఫలితాలు వచ్చాక గానీ.. రేవంత్ గొంతు ఎక్కడా వినిపించలేదు. మనిషీ కనిపించలేదు. అసలు రేవంత్ విషయంలో ఏం జరగింది? ఏం జరుగుతోంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ సరళితో కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్‌రెడ్డి ముందే గ్రహించారని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఎంత ఎగిరినా ప్రయోజనం లేదనే భావనకు వచ్చారంటున్నారు. తనను పీసీసీ చీఫ్‌ చేసేందుకు అధిష్టానం వెనకాడుతుండటం.. పార్టీలోని సీనియర్లు ఆయనను అస్సలు పట్టించుకోకపోవడం.. వరుస ఓటమిలు.. ఇలా కాంగ్రెస్‌లో ఉంటే ఇంతే అనే వేదాంత ధోరణికి రేవంత్ వచ్చారంటున్నారు.  నిన్నా మొన్నటి వరకు రేవంత్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరగ్గా.. తాజాగా మరో కొత్త టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీలో ఉండటం, చేరటం ఎందుకని.. తానే సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు బలం చేకూరేలా.. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొండా మూడునెలలు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయనే ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తీర్థం తీసుకుంటారంటూ టాక్ నడిచింది. అయితే, సడెన్‌గా ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న పార్టీలో చేరాలా? లేక, కొత్త పార్టీ పెట్టాలా? అనే ఆలోచన చేస్తున్నట్టు స్వయంగా కొండానే క్లారిటీ ఇచ్చారు. దీంతో.. ఆ కొత్త పార్టీ రేవంత్‌రెడ్డిదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, రేవంత్‌కు నమ్మదగిన అనుచరుడు కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్‌ డైరెక్షన్‌లోనే కొండా రాజకీయ ముందడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే రేవంత్ ప్రధాన అనుచరుడు కూనా శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌ను వీడటం, ఆ తర్వాత కొండా హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం సడెన్‌గా జరిగినవి కావని.. వీరిద్దరూ రేవంత్ రాజకీయ పావులంటూ చర్చ జరుగుతోంది. అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు.. తిరిగి అంతా కలిసి రేవంత్ పెట్టబోయే కొత్త పార్టీలో చేరుతారని అంచనా వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారని.. త్వరలోనే ఆ విషయం ప్రకటిస్తారని లీకులు వస్తున్నాయి. అందుకే, ఎలాగూ వదిలేసే పార్టీలో అంతగా హడావుడి చేయడం ఎందుకనే ధోరణితోనే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఆయన మౌనం వెనుక అనేక అర్థాలు ఉన్నాయంటూ.. ఎవరి తోచిన ఊహాగానం వారు చేస్తున్నారు. రేవంత్ మౌనం వీడితేనే.. ఆయన మనసులో మాటేంటో తెలిసేది. అప్పటి వరకూ.. కమాన్ గుసగుస...

నోటీస్ పాలి..ట్రిక్స్! టీడీపీ ఆర్థిక మూలాలే టార్గెట్ 

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ప్రతిపక్ష నేతకు సీఐడీ నోటీసులు. మాజీ ముఖ్యమంత్రిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది జగన్ రెడ్డి సర్కార్. అది కూడా హైకోర్టు గతంలోనే క్లీన్‌చీట్ ఇచ్చిన అమరావతి భూముల కేసులోనే. చంద్రబాబుపై పెట్టిన కేసు చెల్లదని న్యాయ నిపుణులు, టీడీపీ నేతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అయినా హడావుడి చేసిన ఏపీ సీఐడీ.. హైదరాబాద్ వెళ్లీ మరీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని కూడా నోటీసులో హెచ్చరించింది. చంద్రబాబు కేసు, నోటీసుల అంశం తీవ్ర దుమారం రేపింది. అయితే అందరు అనుకుంటున్నట్లే చంద్రబాబుపై పెట్టిన పసలేని  సీఐడీ కేసు విచారణపై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు.       బలం లేదని తెలిసినా చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం వెనక జగన్ రెడ్డి సర్కార్ పెద్ద స్కెచ్చే ఉందనే చర్చ జరుగుతోంది. పక్కా పొలిటికల్ వ్యూహం దాగుందని అంటున్నారు. టీడీపీ ఆర్థిక వనరులను దెబ్బ తీయడం, ఏపీ సర్కార్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లీంచడం, ప్రభుత్వ భూములను అమ్మేయడం, రాజధాని తరలింపు వంటి కీలక అంశాలు దీని వెనుక దాగున్నాయంటున్నారు. చంద్రబాబుకు, టీడీపీ ప్రధాన బలం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలే. అమరావతి పరిధిలోనే చంద్రబాబు సన్నిహితుల వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబుపై కేసు పెట్టడం ద్వారా.. టీడీపీ అనుకూల వ్యాపారులను భయపెట్టి వారి బిజినెస్ దెబ్బ తీయడం ప్రధాన లక్ష్యమంటున్నారు. చంద్రబాబే ఇబ్బందులు పడుతున్నారు ఇక మనమెంత అనే అలోచనకు వచ్చి టీడీపీ మద్దతు వ్యాపారులంతా పక్కకు తప్పుకునేలా చేయాలనే కుట్ర ఉందంటున్నారు.  ప్రకాశం జిల్లాలో ప్రధాన ఆదాయ వనరుగా  ఉన్న మైనింగ్ లీజులన్ని ప్రస్తుతం చంద్రబాబు అనుకూల వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. వాళ్లందరిని భయపెట్టి.. అక్కడి నుంచి పంపించి.. రెడ్డి వర్గానికి చెందిన వారికి మైనింగు లీజులు  అప్పగించాలనే కుట్ర ఉందంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు తెస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు సేకరించిందని కేంద్ర ఆర్థికశాఖ కూడా ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అయినా రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైన పనులకు అడ్డగోలుగా ఖర్చులు చేస్తోంది సర్కార్. అందుకే ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు జగన్ సర్కార్ కొత్త స్కెచ్ వేసిందని, భూములను అమ్మాలని నిర్ణయించిందని తెలుస్తోంది. చంద్రబాబుపై కేసు, నోటీసులతో రాజకీయాన్ని వేడెక్కించి.. జనాలనంతా అటువైపు ఫోకస్ చేసేలా చేసి..  సర్కార్ భూములను గుట్టు  చప్పుడు కాకుండా విక్రయించాలని జగన్ సర్కార్ ప్లాన్ చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే కర్నూల్ అంతరాత్జీయ ఎయిర్ పోర్టు నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అది అమలు సాధ్యం కాదని తెలిసినా... దాని పేరుతో అక్కడి భూముల రేట్లు పెంచి సర్కార్ భూములను అమ్మేయాలన్నది వైసీపీ వ్యూహమనే ప్రచారం జరుగుతోంది.  మూడు రాజధానుల పేరుతో విశాఖ, కర్నూల్ లో తాము అనుకున్నది చేసుకునేందుకు జగన్ రెడ్డి సర్కార్ పక్కా ప్రణాళికలు వేసిందంటున్నారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు రాత్రికి రాత్రి షిఫ్ట్ చేసేందుకు.. చంద్రబాబుకు సీఐడీ నోటీసుల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. రాజధానిని  అమరావతి నుంచి విశాఖకు మార్చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. రాజధాని మార్పు అంశం ఇప్పటికే హైకోర్టులో ఉంది. ఫైనల్ తీర్పు వచ్చే వరకూ అమరావతి నుంచి ఇటుక కూడా కదిలించలేరని రైతులు హెచ్చరిస్తున్నారు. కేపిటల్ మార్పు విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్న సర్కారు.. దాన్ని అమలు చేయలేక అడుగు ముందుకు వేయలేకపోతోంది. హైకోర్టు కేసులు, రైతుల నుంచి నిరసనలు, చంద్రబాబు పోరాటంతో సందిగ్థంలో పడింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాభిప్రాయం తమవైపే ఉందంటూ రాజధాని మార్పుపై జగన్‌రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచబోతోందని తెలుస్తోంది.   చంద్రబాబుకు సీఐడీ నోటీసులతో ప్రతిపక్ష నేతను ముందస్తుగా కట్టడి చేయడం.. విపక్షాన్ని డిఫెన్స్‌లో పడేయడం.. అమరావతి రైతులను భయబ్రాంతులకు గురి చేయడం.. ఇదంతా టాపిక్ డైవర్షన్ స్కీమ్‌లో భాగమే అంటున్నారు విపక్ష నేతలు. టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, సర్కార్ భూములను అమ్మడానికి, అమరావతిని విశాఖకు షిఫ్ట్ చేయడానికి సర్కారు ఆడుతున్న మైండ్ గేమ్ అని అనుమానిస్తున్నారు. ఇదంతా సర్కారు ఆడుతున్న డైవర్షన్ డ్రామాలో భాగమంటూ భగ్గుమంటున్నాయి విపక్షాలు. 

తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్! అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన? 

తెలంగాణలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. స్కూల్స్, కాలేజీలు కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయి. ఏ స్కూల్ లో పరీక్షలు నిర్విహంచినా పదుల సంఖ్య వైరస్ బాధితులు బయటపడుతున్నారు. కరోనా విజృంభణతో కేసీఆర్ సర్కార్ అప్రత్తమైంది. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో వైద్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టాలా వద్దా అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వీకెండ్స్‌లో లాక్‌డౌన్  విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారని, సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైనా మహారాష్ట్రలో కరోనా తీవ్రత భారీగా ఉండటంతో.. ఇక్కడి ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హడలిపోతున్నారు. మరో నెలన్నర రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు సందిగ్ధత ఏర్పడింది.ఇప్పటికే 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్ని పైతరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మంగళవారం అసెంబ్లీలో కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసులతో పాఠశాలల మూసివేతకు సర్కార్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో, ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ‌లను అమలు చేస్తున్నాయి.  మరోవైపు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 337 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1671కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,958 ఉండగా.. వీరిలో 1,226 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 91 కేసులు ఉన్నాయి.

రైతుల పంటకు నిప్పు..  

చేతికి వచ్చిన పంట నోటికాడి రాకముందే.. పంటకు నిప్పు అంట్టించారు.  పాత కక్ష్యలు మనసులో పెట్టుకుని  పంటకు నిప్పు అంట్టించారంటూ బాధితులు గొల్లుమని ఏడ్చారు. గుంటూరు జిల్లా వినుకొండలో పంటలను తగలబెట్టడం కలకలం రేపుతోంది. రెండు రోజులలో  జరిగిన రెండు ఘటనలపై పోలీసులు దృష్టి  పెట్టారు. మందా వెంకటేష్ అనే రైతు రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని అప్పు చేసి మరి  మిరపపంట సాగు చేశాడు. పంట బాగా రావడంతో తన అప్పులన్నీ తీరిపోతాయని భావించాడు. తొలి కోతలోనే 30 క్వింటాల వరకు పంట వచ్చింది. కోసిన మిరప పంటను అంత  పొలంలోనే ఆరబోసాడు. కల్లంలో ఉన్న పంటను కొనడానికి కొందరు వ్యాపారాలు వచ్చి  క్వింటాను రూ. 14,500లకు కొనేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీంతో ప్రత్యర్థులు రైతుపై ఈర్ష్య పడ్డారు. పాత కక్ష్యలను మనసులో పెట్టుకుని మిర్చి పంటకు నిప్పు అంటించారు. అప్పు తీరుందనుకున్న రైతు పంట మొత్తం తగలబడి ముడ్డిదైయింది. ఈ ఘటనతో రైతు వెంకష్ కుటుంబం కుంగిపోయి, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.   అలాగే నరగాయ పాలెంలో రైతు ఎర్రంరెడ్డి అంజిరెడ్డికి చెందిన 9 ఎకరాలు జామాయిల్ తోటకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో తోట పూర్తిగా తగలబడిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.  పోలీసులు అనుమానితుల వివరాలను బాధిత రైతుల నుంచి అడిగి తెలుసుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్ష్యలతోనే రైతుల పంటలను దగ్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు.  

రామా..రావా..? పొలిటికల్ కంత్రీ!

సీఎం. సీఎం. ఇన్నాళ్లూ జగన్‌, పవన్‌ ఫ్యాన్స్‌కే పరిమితం ఈ స్లోగన్. ఇప్పుడు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులూ ఈ నినాదం అందిపుచ్చుకున్నారు. 'తెల్లవారితే గురువారం' ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో జరిగిందీ హడావుడి. జగన్, కల్యాణ్‌ల లెక్క వేరు. జూనియర్ పరిస్థితి వేరు. సీఎం, సీఎం అంటూ అభిమానులు అరుస్తుంటే.. జగన్, పీకేలు మౌనంగా ఉండేవారు. ఒకరకంగా ఆ స్లోగన్స్‌ను ఎంకరేజ్ చేసేవారు. కానీ, ఎన్టీఆర్ అలా కాదు. ఆగండి బ్రదర్.. అంటూ ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యారు. పదాలు ఎక్కువగా వాడకున్నా.. ఆయన ముఖంలో, ఆ మాటలో కోపం కొట్టొచ్చినట్టు కనిపించింది.  తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఆ సెగ తగిలింది. బాబు కుప్పం పర్యటనలో టీడీపీ శ్రేణులు జూనియర్‌ను రాజకీయాల్లో దింపాలంటూ అధినేత సమక్షంలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటి నుంచి రామారావు రాకపై ఆసక్తి నెలకొంది. కట్ చేస్తే.. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో నేరుగా ఎన్టీఆర్‌నే పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు జర్నలిస్టులు. ఇది సమయం కాదంటూ అప్పుడు మాట దాటేశారు జూనియర్. ఈసారి మాత్రం మరింత సీరియస్ అయ్యారు. అప్పుడు మీడియా కాబట్టి కాస్త రెస్పెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చిన బుడ్డోడు.. ఇప్పుడు తన అభిమానులను ఒక్క డైలాగ్‌తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి నోరు మూయించారు. జూనియర్ రియాక్షన్ చూస్తుంటే ఆయనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం అసలే మాత్రం ఇష్టం లేనట్టే కనిపిస్తోంది. అక్కడ జరిగేది సినిమా ఫంక్షన్ కాబట్టి ఫ్యాన్స్‌ను వారించాలంటే అంత ఆగ్రహంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టే.. తనను పదే పదే సీఎం సీఎం అంటుంటే అంత అసహనానికి లోనయ్యారని అంటున్నారు. ఆ విషయాన్ని ఇక్కడితోనే ముగిస్తే మంచిదని.. మౌనంగా ఉంటే ముందుముందు మరింత ముదురుతుందని జూనియర్ భావించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే.. జగన్, పవన్‌ల మాదిరి కాకుండా.. ఫ్యాన్స్ సీఎం సీఎం అనగానే సీరియస్‌గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.  టీడీపీ ప్రాభవం తగ్గినా.. ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించేదేమీ ఉండకపోవచ్చు. చంద్రబాబు ఇంకో పదేళ్లయినా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగలరు. ఆయన వారసులుగా లోకేవ్, బాలకృష్ణలు ఉండనే ఉన్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయనకు వెండితెరపై మరింత మంచి భవిష్యత్ ఉంది. అర్జెంట్‌గా పొలిటికల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. అంతలా సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే.. మరో పది, పాతికేళ్ల తర్వాత రాజకీయ ఆలోచన చేయొచ్చు. అందుకే.. ఆలూ లేదు సూలూ లేదు.. హడావుడిగా సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్‌కు చిర్రెత్తుకొచ్చి.. అలా కోపంగా.. ఆగండి బ్రదర్స్ అంటూ అదుపు చేశారని అంటున్నారు. అభిమానులు రామారావును రాజకీయాల్లోకి రా..రా.. అంటుంటే.. జూనియర్ మాత్రం రానురాను నేనురాను ఒగ్గేయమంటూ.. తప్పించుకుంటున్నారు. 

తాండూర్ ఎమ్మెల్యేది దొంగ ఓటే! 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా వికారాబాద్ జిల్లాలో ఓట్ల పంచాయతీ కొనసాగుతోంది. తాండూర్‌లో దొంగ ఓట్ల వ్యవహారం మరింత ముదురుతోంది.మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న ఓటు వ్యవహారంలో దుమారం రేగుతుండగానే తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా దొంగ ఓటు వేశాడని   కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. అమెరికాలో పైలెట్ శిక్షణ పొందిన రోహిత్ రెడ్డి... మన దేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ అర్హత లేని చదువుతో ఓటు వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది కూడా దొంగ ఓటేనన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దొంగ ఓట్లు వేసిన తాండుర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తను పట్టభద్రురాలు కాదని తెలిసి దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నను పదవి నుంచి బర్తరప్ చేయాలని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు.. అధికారులను ప్రలోభాలకు గురి చేయడంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారన్నారు. అమె దొంగ ఓటు వేడయడం నేరమని.. స్వప్నపై కఠిన చర్యలు తీసుకొవాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. 

జగన్ కు వెన్నుపోటు తప్పదా?

ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్షాలకు A2. జగన్మోహన్‌రెడ్డి తర్వాత వైసీపీలో నెంబర్ 2. జగన్‌కు కావలసిన పనులన్నీ.. జగన్‌తో కాని పనులన్నీ.. చేసేది, చేయించేది విజయసాయినే. ఢిల్లీలో పార్టీ తరఫున చక్రం తిప్పేది.. వ్యవహారం చక్కబెట్టేది ఆయనే. పార్లమెంట్ లాబీలో ప్రధాని మోదీనే ఆగి మరీ.. రెడ్డి గారూ బాగున్నారా? అని పలకరించేటంత పాపులారిటీ. జగన్ హస్తిన పర్యాటన ఖరారు చేసేది.. కేంద్ర పెద్దలతో సమావేశాలు సెట్ చేసేది విజయసాయిరెడ్డే. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌లో తెర వెనుక కార్యకలాపాలు చక్కబెట్టేది, సెటిల్మెంట్లు చేసేది నెంబర్ 2నే. జీవీఎమ్సీ ఎన్నికల్లాంటి లోకల్ పాలిటిక్స్‌లోనూ ఆయనదే కీరోల్. ఇదంతా పైకి కనిపిస్తున్న సంగతి. కానీ, లోలోన విజయసాయి సైతం రాజకీయ చదరంగంలో రాజుకు చెక్ పెట్టే పావే అంటున్నారు. కేంద్ర పెద్దలతో అత్యంత సన్నిహితం. ప్రధాని మోదీకి సైతం ఎంతో హితం. మంత్రులందరి దగ్గర చొరవ. ఈ గౌరవమంతా జగన్‌రెడ్డిని చూసి కాదని.. విజయసాయికే అంత ప్రాధాన్యత అని అంటున్నారు. ఎందుకంటే.. ఆయన వైసీపీ నేతకంటే కూడా బీజేపీకి బినామీ లీడర్ అని చెబుతున్నారు. అవును, విజయసాయి బీజేపీ మనిషేనట. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఆయనపై ఉన్న కేసులతో ఇప్పటికే విజయసాయిని దారికి తెచ్చుకున్నారట బీజేపీ పెద్దలు. అవసరం వచ్చినప్పుడు వాడుకునేలా  వ్యూహం సిద్ధం చేశారని చెబుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీలో ఉంటూనే రెబెల్‌గా లౌడ్ వాయిస్‌తో రెచ్చిపోతుండటం బీజేపీ ప్లాన్‌లో భాగమే. అదే.. విజయసాయి విషయం వచ్చే సరికి మరో రకమైన వ్యూహం అమలు చేస్తోంది కాషాయం పార్టీ. జగన్ వెన్నంటే ఉంటూ.. జగన్‌కు నమ్మినబంటులా, నమ్మశక్యంగా వ్యవహరిస్తూ.. సమయం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడిచేలా.. టైంబాంబు సెట్ చేసిందని అంటున్నారు.  యావత్ దేశం కాషాయమయం చేయాలనేది బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక. ఉత్తరాదిన మాంచి ఊపుమీదున్న కమలదళం.. దక్షిణాదిలో మాత్రం బాగా ఇబ్బంది పడుతోంది. ప్రాంతీయ పార్టీల పట్టు ఎక్కువగా ఉండటంతో.. ఒక్కో స్టేట్‌లో ఒక్కో రకమైన గేమ్ ప్లాన్ అమలు చేస్తోంది. తెలంగాణలో టగ్ ఆఫ్ వార్ ఫైట్ చేస్తూ కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తుంటే.. ఏపీలో మాత్రం వేచి చూసే స్ట్రాటజీ అమలు చేస్తోంది. ముందు స్నేహం. ఆ తర్వాత వైరం. అందులో భాగంగా ముందు వైసీపీతో కాస్త స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. ప్రజల్లో బీజేపీపై సానుకూల వైఖరి వచ్చాక.. సరైన సమయంలో.. సరైన రీతిలో జగన్‌ను తొక్కేసేలా స్కెచ్ రెడీ చేసిందట. తప్పించుకోలేని రీతిలో.. కేసులపై కేసులతో.. పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిన జగన్మోహన్‌రెడ్డికి ఉచ్చు బిగించడం చాలా సింపుల్ అని కమలం నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.  అయితే బీజేపీనే అలా చేసిందనే అపవాదు రాకుండా విజయసాయిరెడ్డితో మైండ్ గేమ్ ఆడిస్తోందని ఢిల్లీ వర్గాల సమాచారం. విజయసాయిని అప్రూవల్‌గా మార్చేసుకొని.. ఆయన్ను ముందుంచి.. వైసీపీని చీల్చేసి.. జగన్‌ను తప్పించాలన్నదే.. బీజేపీ ఎత్తుగడ అంటున్నారు. అందుకే, విజయసాయిరెడ్డికి ఢిల్లీలో అంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఆయన జగన్మాయ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికైతే విజయసాయి జగన్ మనిషే.. మరి, ముందుముందు జగన్‌ను ముంచే మనిషి కావడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.