నీ ఇల్లు బంగారం కానూ...
posted on Mar 20, 2021 @ 11:28AM
8.5 కిలోల బంగారం. 78 కేజీల వెండి. ఏ జ్యూవెల్లరీ షాపులో ఉన్న నగల లెక్కలు కావివి. ఒకే ఒక్క వ్యక్తికి చెందిన వెండి, బంగారు ఆభరణాల చి్ట్టా ఇది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత బీజేపీ నేత ఖుష్బూ ఇంట్లో ఉన్న బంగారు ఖజానా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఛెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఖుష్బూ. ఈ సందర్బంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన దగ్గర ఉన్న ఆభరణాలు, ఆస్తుల చిట్టా ప్రకటించారు.
తన దగగ్ర 8.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. ఆ నగల విలువ 3.42 కోట్లు ఉంటుందని తెలిపారు. ఎనిమిదిన్నర కిలోల బంగారంతో పాటు 78 కిలోల వెండి కూడా ఉన్నట్టు అఫిడవిట్‌లో ఉంది. ఖుష్బూ దగ్గర ఏకంగా ఓ జ్యువెల్లరీ షాపునకు సరిపడా ఆభరణాలు ఉంటే.. ఆమె భర్త సుందర్ దగ్గర మాత్రం దాదాపు అర కిలో బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్టు వెల్లడించారు. ఎంతైనా లేడీస్ లేడీసే కదా!
ఇక ఖుష్బూకి భారీగా స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. 34.56 కోట్ల స్థిరాస్తులు, 6.39 కోట్ల చరాస్తులు సహా మొత్తం 40.96 కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిపారు. తన
వార్షిక ఆదాయం 1.50 కోట్లు అని.. అయితే, బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం కేవలం 2.15 లక్షల నగదు మాత్రమే ఉందని తెలిపారు. 40 లక్షల విలువ చేసే రెండు లగ్జరీ కార్లు కూడా ఖుష్బూ దగ్గర ఉన్నాయట.
అయితే, ఇంత ఆస్తులు, ఇన్ని వెండిబంగారు ఆభరణాలు ఉన్న ఖుష్బూ.. చదువుకుంది మాత్రం కేవలం ఎనిమిదో తరగతి వరకే.