మాల్స్, స్కూల్స్ క్లోజ్.. మళ్లీ రాత్రి కర్ఫ్యూ..
posted on Mar 19, 2021 @ 6:18PM
మార్చి 31 వరకూ విద్యా సంస్థలన్నీ మూత. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకూ రాత్రిపూట కర్ఫ్యూ అమలు. ఆదివారం.. సినిమా థియేటర్స్, మాల్స్, మల్టీఫ్లెక్స్, రెస్టారెంట్స్ క్లోజఓ్. సోషల్ గ్యాదరింగ్‌పై నిషేధం. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే పర్మిషన్. 50శాతం సామర్థ్యంతో థియేటర్లకు అవకాశం. శనివారం నుంచి కొత్త కరోనా ఆంక్షలు అమలులోకి రానున్నాయి.
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర తర్వాత పంజాబ్ పాజిటివ్ కేసుల్లో ముందుంది. దీంతో.. పంజాబ్ సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. శనివారం నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు.
మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నీ మూసివేయనున్నారు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌పైనా పరిమితులు విధించారు. థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించారు. ప్రజలంతా రెండు వారాల పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో మాత్రం ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చినప్పటికీ 20మందికి మించి హాజరు కావొద్దని సూచించారు. ఆయా జిల్లాలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు తెలిపారు. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, మాల్స్ మాత్రం ఆదివారం పూర్తిగా మూసే ఉంచాలని ఆదేశించారు. పరిశ్రమలు, అత్యవసర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి.