ఆయుష్ నివేదికే ఫైనల్! ఆనందయ్య మందుకు అనుమతిచ్చే ఛాన్స్...
posted on May 24, 2021 @ 5:19PM
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆనందయ్య మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే విషయంపై అధ్యయనం చేసేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందం కృష్ణపట్నం వస్తుందని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. కాని ఎవరూ రాలేదు. ఐసీఎంఆర్ నుంచి ఎవరూ కృష్ణపట్నం రావడం లేదని తెలుస్తోంది. ఐసీఎంఆర్ ఇక్కడికి వస్తే.. ఆనందయ్య మందు వినియోగించాలా వద్దా అనే విషయంపై క్లారిటీ వస్తుందని అంతా ఆశించారు. ఇప్పుడు ఐసీఎంఆర్ పర్యటన రద్దుతో ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్న జనాలు నిరాశ పడ్డారు.
ఆనందయ్య మందుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధ్యయన నివేదికను త్వరగా ఇవ్వాలని ఆయుష్ శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సోమవారమే రాత్రి వరకు ఆయూష్.. ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే ప్రకటించారు. అది ఆయుర్వేద మందు కాదని.. దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని… కాబట్టి ఇది అంత హానికరం కాదని కూడా ఆయుష్ కమిషనర్ స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్‌లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించారు. దీంతో ఆనందయ్య మందుకు ఆయుష్ విభాగం అనుమతి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాకు ఐసీఎంఆర్ అధికారులు రావడం లేదని, ఆయుష్ నివేదికనే ప్రభుత్వం ఫైనల్ చేసే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఆయుష్ నివేదిక రాగానే మందు పంపిణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆనందయ్య మందుపై సర్కార్ నుంచి సానుకూల నిర్ణయమే వచ్చే అవకాశం ఉందన్నారు. మందుకు అనుమతి రాగానే... పంపిణి కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు. జనాలెవరు కృష్ణపట్నం రావొద్దని... కావాల్సిన వారందరికి మందు అందేలా తాము చర్యలు తీసుకుంటామని కాకాణి తెలిపారు.
ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. అనుమతి రాకపోయినా ఇమ్యూనిటీ బూస్టర్లుగా వాడుతామన్నారు. ఆయుష్ శాఖ దీనికి ఆమోదముద్ర వేస్తే నరసింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో దీన్ని తయారుచేయవచ్చునని టీటీడీ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. తమ పరిశీలనలో మందు తయారీకి సంబంధించి ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ప్రకటించారు.
మరోవైపు ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున పిటిషన్ దాఖలు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని, ఈ మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేసిందని, దీనివల్ల అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. విచారణకు అనుమతించాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు.