రాష్ట్రాలకు యూఎస్ ఫార్మా షాక్! కొవిడ్ వ్యాక్సిన్ కు దారేది...
posted on May 24, 2021 @ 3:23PM
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్ మరణాలు రోజు 4 వేలకు పైగానే నమోదవుతున్నాయి. కొత్త బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ మాయదారి వైరస్, ఫంగస్ ల నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో దేశంలోనూ వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపట్టేందుకు కేంద్రం కార్యాచరణ ప్రకటించింది. కాని వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. సరిపడా టీకాలు అందుబాటులో లేకపోవడంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దేశంలో ప్రస్తుతం రెండు కొవిడ్ వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. కొవాగ్జిన్ నెలకు కోటీ డోసులు తయారవుతుండగా.. కోవిషీల్డ్ టీకాలు నెలకు ఐదు కోట్ల వరకు ఉత్పత్తి అవుతున్నాయి. మన డిమాండ్ కు ఇవి ఎంత మాత్రం సరిపోవడం లేదు.
ఇటీవల కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు నేరుగా టీకాలు కొనుగోలు చేయవచ్చు. దేశంలో టీకాల కొరత ఉండటంతో పలు రాష్ట్రాలు విదేశీ సంస్థల టీకా కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఐదారు రాష్ట్రాలు కొవిడ్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించాయి. గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 4కోట్ల వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10మిలియన్ డోసులు సేకరించాలని భావించింది. బిడ్‌ల గడువు జూన్ 4వరకు గడువు విధించింది. కేవలం ఆరు నెలల్లో 10మిలియన్ డోసులు పంపిణీ చేయాలని కండీషన్ కూడా విధించింది. పంజాబ్ ,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.
వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు పిలుస్తున్న రాష్ట్రాలకు షాకిచ్చాయి అమెరికాలోని ఫైజర్, మోడెర్నా ఫార్మా కంపెనీలు. రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు సరఫరా చేయబోమని స్పష్టం చేశాయి. కంపెనీల పాలసీ ప్రకారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తామని క్లారిటీ ఇచ్చాయి. దీంతో గ్లోబల్ టెండర్లకు పిలిచిన పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఫైజర్, మోడెర్నా కంపెనీల నిర్ణయంతో గ్లోబల్ టెండర్లకు వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది బీహార్ ప్రభుత్వం.
ఫైజర్, మోడెర్నా ప్రకటనతో వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని భావించిన రాష్ట్రాల ఆశలపై నీళ్లుచల్లినట్టయింది. వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు కేంద్రం మీదే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
కేంద్రం నేరుగా అమెరికా సంస్థలతో మాట్లాడి వ్యాక్సిన్ కోసం ఒప్పందాలు చేసుకుంటేనే టీకాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది కీలకంగా మారింది. లేదంటే దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.