గో కరోనా గో 2.0.. ఓం కరోనా ఫట్ స్వాహా..
posted on May 24, 2021 @ 7:49PM
గోమూత్రం తాగితే కరోనా దరి చేరదు. ఆవు పేడ రాసుకున్నా కరోనా ముప్పు తగ్గుతుంది. గో కరోనా గో అంటూ చప్పుళ్లు చేసినా కరోనా పారి పోతుంది. ఇవేవీ వర్కవుట్ కాకపోతే.. ఈ స్వామి దగ్గరికి వెళ్లండి. యజ్ఞం చేసి కరోనాను తరిమేస్తాడు. ‘‘ఓం కరోనా ఫట్, ఫట్, ఫట్.. స్వాహా’’ అంటూ బిగ్గరగా అరుస్తూ మంత్రాలు చదువుతాడు. దెబ్బకు వైరస్ పరార్. ఆ బాబా చేసిన యజ్ఞం ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే.. అసలేమాత్రం నవ్వాపుకోలేరు. ఆ నవ్వుకు తట్టుకోలేకైనా.. వైరస్ పారిపోవాల్సిందే. సీరియస్‌గా మంత్రాలు చదువుతూ కరోనాను తరిమేస్తున్న ఆ బాబా వీడియో చూసి తీరాల్సిందే.
దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను ఎలా తరిమికొట్టడమెలా? అని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే.. కొంతమంది బాబాలు మాత్రం వెరైటీ మంత్రాలతో కరోనా కట్టడి చేస్తామంటూ రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ఓ స్వామి వారు.. కరోనాను తరిమికొట్టడానికి ఏకంగా యజ్ఙం నిర్వహించి వార్తల్లో నిలిచాడు. ‘‘ఓం కరోనా ఫట్, ఫట్.. స్వాహా’’ అంటూ బిగ్గరగా అరుస్తూ మంత్రాలు జపించాడు. అతడు చేసిన యజ్ఞం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది.
యజ్ఞంతో కరోనా పోవడమేమో కానీ ఆయన మాత్రం ఈ వీడియోతో బాగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ వరిందర్ చావ్లా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశాడు. ‘గో కరోనా గో, వెర్షన్ 2.0’ అనే శీర్షికను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆ బాబా.. ‘ఓం కరోనా భాగ్ స్వాహా’ అంటూ బిగ్గరగా మంత్రాలు జపిస్తూ యజ్ఞం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ "దెబ్బకు కరోనా పరుగులు పెట్టింది. మీరు చాలా పవర్ఫుల్” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మరొక నెటిజన్ ‘‘మీ పూజతో ఇక కరోనా జాన్తా నై” అంటూ చమత్కరించాడు. ప్రజలు సైన్స్ కంటే ఇటువంటి బాబాలనే విశ్వసిస్తున్నారని, అందుకే ఇటువంటి వారు ఫేమస్ అవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి మంత్రాలు ప్రజల వెనుకబాటు తనాన్ని, మూడనమ్మకాల్ని గుర్తుచేస్తున్నాయని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కేవలం బాబాలు, పూజారులే కాదు కొంత మంది రాజకీయ నాయకులు సైతం ఇలాంటి మంత్రాలు జపిస్తుండటం చర్చనీయాంశమైంది. గతేడాది కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన ‘గో కరోనా గో’ నినాదం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక, కరోనా తొలినాళ్లలో కొంతమంది గుంపుగా ఏర్పడి.. గో కరోనా గో.. కరోనా భాగ్ జా.. అంటూ చేసిన నినాదాలు అప్పట్లో బాగా పాలపుర్ అయ్యాయి. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ బాబా చేసిన ‘‘ఓం కరోనా ఫట్, ఫట్, ఫట్.. స్వాహా’’ యజ్ఞం ట్రెండింగ్‌గా మారింది. ‘గో కరోనా గో వెర్షన్ 2.0’ అని గూగుల్ చేయండి.. మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోండి. భలే ఉంది ఆ వీడియో.