ఆక్సిజన్ పెట్టుకొని వంట.. అమ్మకు వందనం..
posted on May 24, 2021 @ 6:04PM
వంటింట్లో అమ్మ. పిల్లల కోసం చపాతీలు చేస్తోంది. కర్రతో చపాతీలు చేస్తోంది. వాటిని పెనంపై కాలుస్తోంది. ఇంట్లో వాళ్లకి కమ్మగా వండి పెడుతోంది. నిజంగా ఆ అమ్మ చాలా గ్రేట్. అదేంటి.. చపాతీలు చేయడం మామూలు విషయమే కదా. చపాతీలు చేయడం గ్రేట్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? చపాతీలు చేయడం మామూలు విషయమే అయినా.. ఆ అమ్మ ఆరోగ్యం బాగా లేకపోయినా.. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పెట్టుకొని మరీ చపాతీలు చేస్తుండటమే ఆ అమ్మ గొప్పతనం.
కష్టంలో ఉన్న తల్లి వంటింట్లో వంట చేస్తున్న ఫొటో.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ అమ్మ ఎవరో.. అది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. ఈ ఫోటో మాత్రం అమ్మతనానికి మారుపేరుగా నిలుస్తోంది. ట్విటర్‌లో ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. The Great Indian Kitchen పేరుతో ఈ పిక్ ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతోంది.
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పెట్టుకొని ఓ తల్లి చపాతీలు చేస్తున్న ఫొటో ఇది. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పెట్టి ఉంది అంటేనే ఆమె ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. అలాంటి సమయంలో ఆమెకు విశ్రాంతి ఇవ్వకుండా.. వంట గదిలో ఎలా పని చేయిస్తారు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మన దేశంలో తల్లుల పరిస్థితి ఇలా తయారైంది. ఏది ఏమైనా వాళ్లు వంటిట్లోకి వెళ్లాల్సిందే.. వంట చేసి తనవాళ్లకు పెట్టాల్సిందే.. అంటూ అవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఆమె అంత కష్టపడుతుంటే.. అలా ఫొటో తీస్తూ ఉండకపోతే.. ఆమెను వంటగది నుంచి బయటకు తీసుకొచ్చి సాయం చేయొచ్చు కదా అని ఆ ఫొటో తీసిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు.
The Great Indian Kitchen అని ట్యాగ్ చేస్తున్నారు చాలామంది. ఇదో మలయాళ హిట్ సినిమా. మహిళలు, తల్లులు చేస్తున్న త్యాగం గురించి వివరించిన సినిమా అది. అందుకే ఈ ఫొటోకు ఆ ట్యాగ్ ఇస్తున్నారు. అయితే ఈ ఫొటోను ఫొటోషాప్ అంటూ కామెంట్ చేసేవాళ్లూ ఉన్నారు. అయితే ఈ ఫొటోలో నిజానిజాలు ఎంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇది నిజమే అయితే కచ్చితంగా ఖండించాల్సిన విషయమే.
ఈ ఫొటోలో ఉన్న మహిళ ఆరోగ్య పరిస్థితి ఎవరికీ తెలియదు. వాళ్లింట్లో ఎంతమంది ఉన్నారు.. వారి ఆరోగ్యం ఏంటి అనేది తెలియదు. అందరి పరిస్థితీ ఇలానే ఉన్పప్పుడు ఇలా వంట చేయక తప్పదు కదా అంటున్నారు మరికొందరు. ఎవరి ట్వీట్లు ఎలా ఉన్నా.. ఈ ఫోటోలో ఉన్న అమ్మకు మాత్రం అంతా వందనం చేస్తున్నారు.