మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్.. కారణం అదేనా?
posted on May 28, 2021 @ 10:32AM
ఉన్నట్టుండి సీఎం నుంచి ఫోన్ వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ టైమ్‌లో కేసీఆర్ ఫోన్ చేయడం ఏంటి? ఎప్పుడూ లేనిది ఇప్పుడు సడెన్‌గా ఆయన నాకెందుకు ఫోన్ చేశారు? కారణం ఏమై ఉంటుంది? ఏదో పెద్ద విషయమే ఉండిఉంటుందా? లేకపోతే ఆ పెద్దాయన నాకు ఫోన్ చేయడమేంటని.. వారంతా గుబులు పడ్డారు. భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేశారు. అటునుంచి కేసీఆర్ వాయిస్.. హలో అంటే.. ఇదీ విషయం...
తెలంగాణలో లాక్‌డౌన్ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఈ నెల 30న మంత్రిమండలి సమావేశం ఉండగా.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు సీఎం స్వయంగా ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మీ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? లాక్‌డౌన్ ఎలాంటి ప్రభావం చూపింది? వివిధ వర్గాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఆంక్షలు, సడలింపులను ఎలా చూస్తున్నారు? పోలీసుల పనితీరు ఎలా ఉంది? తదితర వివరాలను సీఎం అడిగారని తెలిసింది.
తెలంగాణలో మే 12 నుంచి మొదలైన లాక్‌డౌన్.. ఈ నెల 30తో ముగియనుంది. అందుకే, లాక్‌డౌన్ పొడిగించాలా? ఆంక్షలు సడలించాలా? అనే అంశంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. 30న జరిగే కేబినెట్ భేటీ ఎజెండాలో లాక్‌డౌన్‌పై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ఆ మేరకు ప్రజాప్రతినిధుల నుంచి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎంక్వైరీ చేస్తున్నారు. వారు సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సీఎం సూచించారు. అయితే, ఏ నిర్ణయమైనా సొంతంగా, ఎవరితో చర్చించకుండా తనకుతానే తీసుకునే కేసీఆర్.. లాక్‌డౌన్ పరిస్థితులపై ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి విషయం అడగడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిలో ఈ మార్పు ఏంటని నేతలే అవాక్కవుతున్నారు.
రాష్ట్రంలో వానాకాలం పంటల సీజన్‌తో పాటు ప్రజలకు, సూపర్ స్ప్రెడర్లకు టీకాల కార్యక్రమం మొదలవుతున్నందున లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయం కీలకమని, ప్రజల మనోభావాల మేరకే ముందుకుసాగుదామని ఈ సందర్భంగా సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలను సైతం రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఈ నెల 29కల్లా సీఎం కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మే 30న లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.