కబ్జా లీడర్ మనకెందుకు! బీజేపీలో ఈటల చిచ్చు..
posted on May 27, 2021 @ 8:11PM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ వచ్చేస్తోంది. సొంత పార్టీ పెడుతారని ప్రచారం సాగినా... ఇప్పుడు మాత్రం సీన్ మారింది. ఈటల రాజేందర్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేతలతో పాటు తెలంగాణ నాయకులతో ఈటల చర్చలు ఫలవంతం అయ్యాయని చెబుతున్నారు. బీజేపీ హైకమాండ్ టైం ఇచ్చిన వెంటనే ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి కాషాయ కండువా కప్పుకుంటారని పక్కాగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే సంకేతమిచ్చారు.
కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నా అటు వెళ్లనీయకుండా... కొత్త పార్టీ పెట్టాలని భావించిన ఈటలను తమ పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యామనే సంతోషంలో ఉన్న తెలంగాణ బీజేపీకి.. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఈటల రాజేందర్ చేరిక బీజేపీలో సెగలు రేపుతోంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కమలం నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జిల్లాకు చెందిన తమకు సంప్రదించకుండానే ఈటలను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇంత కాలం రాజేందర్ తో పోరాటం చేస్తున్న తమను పట్టించుకోకుండా హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్. ఆ నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి పెద్ది రెడ్డి... ఇప్పుడు బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన పెద్దిరెడ్డి... హుజురాబాద్ నుంచి పలుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఏడాది క్రితం పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. కమలం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. ఇటీవలే జరిగిన గ్రేటర్ వరంగల్ సహా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు మోశారు. ఎన్నికల తర్వాత కోవిడ్ సోకడంతో తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. హుజురాబాగ్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డిని కూడా ఈటల విషయంలో పార్టీ పెద్దలు సంప్రందించలేదట. ఇదే ఇప్పుడు బీజేపీలో సెగలు రేపుతోంది.
సీనియర్ నేత పెద్దిరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈటల కోసం తమ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కామెంట్ చేశారు. అంతేకాదు తాను కబ్జాలు చేయలేదని, ఆలయ భూముల్లో గౌడౌన్లు కట్టలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఈటల టార్గెట్ గానే చెప్పినట్లు భావిస్తున్నారు. ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు కేసీఆర్. ఇప్పుడు బీజేపీ నేత పెద్దిరెడ్డి కూడా ఆ ఆరోపణలే చేయడం కమలనాధుల్లో కలవరం రేపుతోంది. ఈటలకు మాత్రం ఆత్మ గౌరవం ఉంటుందా.. మాకు ఉండదా అంటూ రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు పెద్దిరెడ్డి. పార్టీ నేతల తీరు మారకపోతే తాము కూడా సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెద్దిరెడ్డే కాదు హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.
సీనియర్ నేత పెద్దిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీలో కలవరం రేపుతున్నాయని అంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను.. అవి తేలకముందే పార్టీలో చేర్చుకోవడం సరికాదనే వాదన మరికొందరు నేతల నుంచి కూడా వస్తుందట. ముఖ్యంగా దేవరయాంజల్ ఆలయ భూములు కబ్జా చేశారనే ఆరోపణలు రాజేందర్ పై ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన భూముల పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన బీజేపీ నేతలు.. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పార్టీలో చేరుకుంచే జనంలోకి రాంగ్ మెసెజ్ వెళ్లే అవకాశం ఉందని కూడా కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారట. మొత్తానికి ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ బీజేపీలో ముసలం ముదురుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.