యుగానికి ఒక్కడే.. అది ఎన్టీవోడే..
posted on May 27, 2021 @ 9:08PM
మే 28.. ఆ మహానుభావుడు జన్మించిన రోజు... తెలుగు తమ్ముళ్లకు పండగ రోజు... భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు.. గిడుతుంటారు... కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతారు.. అలాంటి చిరస్మరణీయుడే నందమూరి తారక రామారావు... ఎన్.టి.ఆర్... కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు.. తెలుగుజాతి నిండుగౌరవం.. తెలుగుదేశానికి తారకమంత్రం.
వెండితెరపై విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.. రాజకీయ తెరపై కొమ్ములు తిరిగిన కాంగ్రెస్‌ను మట్టికరిపించిన అనితర సాధ్యుడు.. తెలుగు జాతి సత్తా ఢిల్లీకి తెలుసొచ్చేలా చేసిన మొనగాడు.. మనందరి అన్న గారు.. వెండితెర ఇలవేల్పుగా వెలుగొందుతున్న రోజుల్లోనే.. అనూహ్యంగా ఆ తారకరాముడు రాజకీయ అరంగేట్రం చేశారు.. తెలుగుదేశం పార్టీ స్థాపించారు.. ఆనాడే ఆయన ఊహించారు అది ఇలా తెలుగునాట వటవృక్షంగా ఎదుగుతుందని. కొందరిలా కేవలం అందలం ఎక్కడానికో.. అడ్డంగా దోచుకోడానికో.. పెట్టిన పార్టీ కాదు.. "ఈ తెలుగుదేశం పార్టీ.. శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది.. కార్మికుడి- కరిగిన కండరాలలో నుంచి వచ్చింది.. రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది.. నిరుపేదల కన్నీటిలో నుంచి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి" అంటూ 1982 మార్చి 29న పార్టీని ప్రకటించారు అన్న ఎన్టీఆర్.
ఆనాడు ఆ ప్రకటన తెలుగునాట ప్రభంజనం సృష్టించింది. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ప్రకటించిన ‘తెలుగు దేశం’ పార్టీ.. ఆ తర్వాత తెలుగునేలను దశాబ్దాల పాటు పాలించింది. మొదట ఎన్టీఆర్.. ఆ తర్వాత చంద్రబాబు.. ఇద్దరు అధినేతల చేతిలో పార్టీ పటిష్టంగా, చెక్కుచెదరకుండా ఉంది... ఉంటుంది... తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఢిల్లీ దద్దరిల్లింది. ఐరన్‌లేడీ ఇందిరాగాంధీ గుండెదడ పెరిగింది. పాత వ్యానును.. చైతన్యరథంగా మార్చి అన్న గారు తెలుగువీధుల్లో తిరుగుతుంటే.... నా సామిరంగ.... ఆ రాముడే.. ఆ కృష్ణుడే... వెండితెర వీడి మన మధ్యకి వచ్చాడంటూ జనం నీరాజనం పలికారు. ఎన్టీవోడు ఎక్కడికెళ్లినా.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఆకాశానికి చిల్లుపడిందా.. భూదేవి ఈనిందా.. అనేంతగా.. జన ప్రభంజనం...
"తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!! అంటూ అన్న గారు పిలుస్తుంటే.. ప్రజలు పూనకం వచ్చిన వారిలా చైతన్యరథం వెంట పరుగులు పెట్టేవారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల్లో టీడీపీ ప్రకంపణలు.. ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు.. ఫలితం.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే టీడీపీకి అధికారం.. 199 స్థానాలతో తెలుగుదేశం విజయకేతనం.. అప్పటికి 97 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం.
1983 జనవరి 9న ముఖ్యమంత్రి పీఠం చేపట్టారు రామారావు. అందలమెక్కాక.. ఇప్పటి నేతల్లా విర్రవీగలేదు. అధికార బలంతో దౌర్జన్యాలకు తెగబడలేదు. ‘పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం’ అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజా క్షేమమనే దీక్ష పూనారు. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో నిరంతరాయంగా పోరాడారు. ట్యాంక్‌బండ్ నిర్మాణం, ప్రముఖుల విగ్రహాలతో హైదరాబాద్‌కు కొత్త సొగబులు అద్దారు.
ఎవరి దిష్టి తగిలిందో కానీ.. కాంగ్రెస్, ఇందిరాగాంధీ కుట్రలతో.. నాదెండ్ల భాస్కర్‌రావు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. 1984లో ఆగష్టు సంక్షోభం తీసుకొచ్చారు. ఎన్టీఆర్ అల్లుడు, తన రాజకీయ కుడి భుజమైన చంద్రబాబు సహకారంతో రాష్ట్రపతి స్థాయిలో పోరాడి అధికారాన్ని తిరిగి తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే జాతీయ స్థాయి పరపతి పొందారు. 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. బహ్మాండమైన మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చారు.
పాలనలో దూకుడు స్వభావంతో 1989 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్ కూర్పుతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు ఎన్టీఆర్. ప్రతిపక్ష నేతగా శాసనసభలో పరభవాలు ఎదురైనా.. వెనుదిరగలేదు. వెనక్కితగ్గలేదు. 1994లో రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో.. అఖండ విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు నందమూరి తారక రామారావు. లక్ష్మీపార్వతి ఎంట్రీ.. ఎన్టీఆర్ పదవీచ్యుతులవడం.. ఆయన మరణం.. అదంతా చరిత్ర.
నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగుదేశం పార్టీ’ అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన శక్తిగా నిలబడిందంటే.. అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులు.. ఆ పునాదుల మీద చంద్రబాబు నిర్మించిన రాజకీయ సౌధమే కారణం. ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ.. చంద్రబాబు సైతం పార్టీని మరింత శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లారు. తెలుగుదేశాన్ని ప్రజల పక్షాన నిలబెట్టారు. అప్పుడు తల్లి కాంగ్రెస్‌తో ఎన్టీఆర్ పోరాడితే.. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్‌తో చంద్రబాబు ఫైట్ చేస్తున్నారు. రాజ్యం ఎన్ని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నా.. ఎన్టీఆర్ స్పూర్తితో.. కుట్రలు,కేసులకు ఎదురొడ్డి నిలుస్తున్నారు చంద్రబాబు. తెలుగు తమ్ముళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.
ఎన్టీఆర్ జన్మదినం మే 28.. సందర్భంగా మహానాడును ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ఉన్నప్పుడే ప్రారంభమైన ఈ వేడుక.. ఇప్పటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతోంది. ప్రతి ఏడాది మే 27 నుంచి 29 వరకు.. మూడు రోజుల పాటు మహానాడు జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు, వివిధ ఏజెండాలు, ప్రజా సమస్యలపై తీర్మాలను ప్రకటిస్తారు. ఆ కార్యక్రమంతా వేడుకగా సాగుతుంది. అందుకే, మహానాడు అంటే పసుపు పండుగ. తెలుగు తమ్ముళ్ల జాతర. ప్రస్తుత కరోనా కల్లోల సమయాన.. ఆన్‌లైన్ వేదికగా.. వర్చువల్ విధానానికే మహానాడు పరిమితమైంది. మళ్లీ మంచి రోజులు వస్తాయి.. జన సందోహంతో మహానాడు మరింత వైభవంగా జరిగే రోజులు తప్పక వస్తాయి.. ఆ రోజు కోసమే ఎదురుచూస్తూ.. జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం.. జై ఎన్టీఆర్.. జై చంద్రబాబు...