చీడపురుగుల్లా దోచుకుంటున్నారు.. మీరేం పీ*తున్నారు?
posted on May 28, 2021 @ 12:40PM
మంత్రి కొడాలి నాని మళ్లీ మండిపడ్డారు. నిత్యం ప్రతిపక్షాన్ని బూతులు తిట్టే నాని.. ఈసారి ప్రైవేట్ హాస్పిటల్స్‌పై విరుచుకుపడ్డారు. ఏపీలో కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయంటూ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల్లో చీడపురుగుల్లా దోచుకుంటున్నారని, శవాల మీద డబ్బులు ఏరుకుంటున్నారని విమర్శించారు.
ఇలాంటి ఆసుపత్రులను ఉపేక్షించినా, క్షమించినా భవిష్యత్ తరాలకు ద్రోహం తలపెట్టిన వాళ్లమవుతామని వ్యాఖ్యానించారు. కరోనా రోగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం అని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.సెకండ్ వేవ్ లో దయనీయ పరిస్థితులు ఏర్పడగా, కొందరు సంస్కారహీనుల్లా తయారై దోపిడీ చేస్తున్నారని, అలాంటి వారిని అధికారులు గుర్తుంచుకోవాలని తెలిపారు. రోగులను దోచుకునే ఆసుపత్రుల కథ ముగించేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
మంత్రి గారు భలే మాట్లాడారంటూ అధికారులు చప్పట్లు కొడితే.. ఇన్ని రోజుల తర్వాత.. ఇంత మంది ప్రాణాలు పోయాక.. ఇంత మంది దోపిడీకి గురయ్యాక.. ఈ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులకు తీవ్ర కొరత ఉండటంతో.. జనాలు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేరక తప్పని పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రైవేట్‌లో చికిత్స చేయించుకోవాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ.. మంత్రి నాని చెప్పినట్టే.. చీడపురుగుల్లా దోచుకుంటున్నారు.. శవాల మీద డబ్బులు ఏరుకుంటున్నారు. ఇదైతే వాస్తవమే. మరి, ఇంతా తెలిసి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? చికిత్స పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు హాస్పిటల్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? బూతులు మాట్లాడే మంత్రే.. వారి జోలికి వెళ్లాలంటే భయపడుతున్నారా? సీఎం జగన్‌రెడ్డి మీవాడే కదా.. ఆయనతో చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవచ్చుగా? అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలోనే మంచి సదుపాయాలు ఉంటే.. ప్రైవేటుకు ఎందుకు వెళతామంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఏపీలో మెరుగైన వైద్యం అందకపోవడం వల్లే కదా.. అంబులెన్సులు వేసుకొని హైదరాబాద్ వెళ్తుంటే.. సరిహద్దులో అక్కడి పోలీసులు అడ్డుకుని ఇబ్బంది పెట్టింది. అప్పుడు సైతం నోరెత్తకుండా మౌనంగా ఉన్నారీ పాలకులు. ఉచితంగా ఇస్తున్న ఆనందయ్య మందును సైతం ఈ ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఉంది ఏపీ సర్కారు తీరు. తాజాగా, స్వయానా మంత్రి కొడాలి నానినే.. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహమైతే వ్యక్తం చేశారు కానీ.. మరి, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.